3, మార్చి 2021, బుధవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 15

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 15



రాత్రి పూట ఎగరేస్తూ... అరుస్తూ ఆటలు ఆడించేవాళ్ళం.  మా అబ్బాయికి పిల్లలంటే చాలా ఇష్టం. వాడు దాన్ని అస్సలు వదిలిపెట్టేవాడు కాదు. లాక్ డౌన్ టైం కాబట్టి అందరం ఇంట్లోనే వుండి పాపతో బాగా గడిపాం. 





మా చెల్లెలు కంప్యూటర్ మీద వర్క్ ఫ్రం హోం చేసుకుంటుంటే సోఫాలో మా ఒళ్ళో కూర్చున్నది కాస్తా గబగబా ఒళ్ళోంచి జారిపోయేది.  తను ఎత్తుకుని కంప్యూటర్లో పిల్లల పాటలు పెడితే చూస్తూ అగిపోతే కాలుతో ఒక తన్ను తన్నేది. 

అందర్ని చూసీ బాగా నవ్వడం నేర్చుకుంది. ఒళ్ళో కూచోపెట్టుకుంటే కూచునేది. పిల్లలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళవంకే చూసుకుంటూ అరుపులు మొదలు పెట్టేది.  తాతతో బాగా ఆడేది. 

ఒకరోజు బాగా ఏడుస్తూనే వుంది. ఎందుకో అర్థం కాలేదు. చేతిలో వాళ్ళ అత్తగారూ వాళ్ళ కారు వుంది కాబట్టి మా అబ్బాయి దగ్గరుండి రెయిన్ బౌ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాడు.  ఎందుకో హాస్పిటల్ నాలుగో నెలలోనే హాస్పిటల్ వాతావరణం గుర్తుపట్టి బాగా ఏడ్చింది.  అందరూ చిన్న డాక్టర్లు వున్నారు. వాళ్ళు ఎంతకీ ఏదీ చెప్పలేదు. నేను వెళ్ళి గట్టిగా అడిగితే ఎవరో పెద్ద డాక్టర్ ని పిలుచుకుని వచ్చారు. ఆవిడ చూసి తల్లిపాలు కదా మీరు తిన్నది ఏదైనా తేడా వస్తే కూడా ఏడుస్తారు అని ఏవో మందులు ఇచ్చింది. 

ఆ మందులు వేశాక కొంచెం ఫర్వాలేదు. ఏడుపు తగ్గింది. కానీ ఆర్ణ చాలా వరకు అన్ని పరిస్థితులకి తట్టుకుని వుండగలిగేది.  

ఆస్ట్రేలియాలో శేఖర్ ఒకటే టెన్షన్ పడుతూ వుండేవాడు. నేను ఇప్పుడప్పుడే నిన్నూ, పాపని చూస్తానో లేదో అని బెంగ పెట్టేసుకునేవాడు. అంత పెద్ద ఇంట్లో ఒక్కడూ వుండలేక వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో మధ్యమధ్యలో వుంటూ వుండేవాడు.  అతని బాధ చూడలేక మా అమ్మాయి ఏమయినా సరే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. 

మా అందరికీ బాగా అలవాటయిపోయింది. పాపని తీసుకుని ఎలా వెడతావు... అని మేము చెప్పాము. కానీ కూతురికి పెళ్ళయ్యాక వాళ్ల సంసారం వాళ్ళకి వచ్చాక మనం ఏమీ చెయ్యలేం. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి