5, మార్చి 2021, శుక్రవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 16

 మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 16

ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళేవాళ్ళు ఒక నూట యాభైమంది గ్రూప్ గా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు.  ఆస్ట్రేలియన్ హై కమీషన్ ఇండియాలో వుండిపోయిన ఉన్నవాళ్ళందరి సమాచారం సేకరించారు. మొత్తానికి 29 ఏప్రిల్, 2020 కి టికెట్లు బుక్కయ్యాయి. 

మా అమ్మాయి వాళ్ళతో మాట్లాడటం ఈ హడావుడి సరిపోయింది. మొత్తానికి ఇండియానుంచి ఫ్లైట్ ఏర్పాటు చేశారు. మా అందరికీ ఒకటే గుబులు. అంత పసిపిల్లని వేసుకుని ఎలా వెళ్తుందా అని. తన ధైర్యమే తనకి రక్ష అయ్యింది.  శేఖర్ కి తను వచ్చేస్తే బాగుండును అనే ఆరాటం. ఎలా వస్తుందో అని దిగులు.

 వీణాకి 6 నెలల పాపతో మూడురోజుల సాహస యాత్ర అయ్యింది.

హైదరాబాద్ నుంచి చెన్నై 17 గంటలు

చెన్నై నుంచి దోహా 5 గంటలు

దోహా నుంచి పెర్త్, ఆస్ట్రేలియా 11.5 గంటలు

అసలు హైదరాబాద్ నుంచి పెర్త్ కి ప్రయాణం 9.30 గంటలు మాత్రమే.

చెన్నై, కలకత్తా, ఢిల్లీ, బొంబాయిల నుంచి విమాన సర్వీసులు దోహా మీదుగా ఆస్ట్రేలియాలో వివిధ ప్రాంతాలకి ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలకి చేరడానికి దగ్గరలో వున్న ప్రాంతాల నుంచి ఇంక్రెడిబుల్ ఇండియా బస్ లు ఏర్పాటు చేశారు.





మా అమ్మాయి హైదరాబాద్ నాంపల్లిలో 28వ తేదీ ఉదయం బస్ ఎక్కింది. మా అబ్బాయి ఎక్కించడానికి వెళ్ళాడు. వాడు ఎక్కించాడన్నమాటే కానీ ఒకటే టెన్షన్ పడుతున్నాడు ఎలా వెడుతుందోనని. 

అంతా సవ్యంగానే జరుగుతోంది అనుకోగానే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఆటంకం. ఇంకేవో పర్మిషన్లు కావాలని నాలుగు గంటలు ఆపేశారు.

అక్కడ నుంచి వీళ్ళు చెన్నై చేరేసరికి అర్థరాత్రి అయ్యింది. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి హోటల్ రూం లో రెస్ట్ తీసుకోమన్నారు.

29 ఉదయం పది గంటల నుంచి అందరికీ టెంపరేచర్ చూసి, మధ్యాహ్నం చెన్నై నుంచి దోహా ఫ్లైట్ ఎక్కించారు. 5 గంటలు ప్రయాణం. ప్రయాణంలో పాప ఆటలతో బాగా సహకరించింది.

రాత్రి 8 గంటలకి దోహాలో ఫ్లైట్ దిగాక లాంజ్ లో 8 గంటలు బ్రేక్. అక్కడ మళ్ళీ 30 తెల్లవారుజామున 4 గంటలకి పెర్త్ విమానం ఎక్కారు. 11.5 గంటలు ప్రయాణం. పాప చాలాసేపు నిద్రపోవడం, ఆడుకోవడంతో ఎక్కువ ఇబ్బంది అవలేదు.

మొత్తానికి పెర్త్ చేరేసరికి 30వ తేదీ సాయంత్రం 8 గంటలు అయ్యింది. అక్కడ మళ్ళీ టెంపరేచర్ చూసి నోవాటెల్ హోటల్ లో రూంకి రాత్రి 11.30 కి క్వారంటైన్ కి పంపించారు.

మొత్తానికి ఆ గడ్డ మీద అడుగుపెట్టారు. ఇదీ ఇంతవరకు జరిగిన కథ. 

ఇక 14 రోజుల క్వారంటైన్ లో మరో సాహసం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి