19, జూన్ 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 17 - తాడేపల్లిగూడెం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 17 -  తాడేపల్లిగూడెం  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు


ఒక్కసారి బాల్యంలోకెడితే…......?

 

బాల్యంలో మనం గడిపిన ఇల్లు చూస్తే.... ఆనందమే... ఆనందం...

 

ఓ మేడ కథ.  రాస్తే పెద్ద పుస్తకమే....

 



జూలై 30న తణుకులో పెళ్ళి వుంది. అయితే నాతో వచ్చిన మా అబ్బాయికి, మా అక్క కోడలికి మేము పెరిగిన, చదివిన ఊరు తాడేపల్లిగూడెం చూపించాలని ముందు అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎన్ని జ్ఞాపకాలో..... ! ! !

 

నేను పుట్టింది వరంగలైనా ఆంధ్రా బ్యాంక్ లో చేసే నాన్నగారి ఉద్యోగరీత్యా తాడేపల్లి గూడెం వెళ్ళాము. అక్కడ ముందు కాలవకి అవతలి గట్టున బ్రాహ్మణ వీధిలో వుండేవాళ్ళం.

 

నేను 4వ తరగతి వరకూ అక్కడ గవర్నమెంట్ స్కూలు (పాకబడి)లో చదివాను. అయితే అక్కలు హైస్కూలు చదువుకి వచ్చారు. నాన్నగారి బ్యాంక్ కూడా కాలవ మీద ఉన్న చిన్నవంతెన దాటి, రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాల్సి వచ్చేది. ఒకవేళ గూడ్సు రైలు ఆగి వుంటే దానికింద నుంచి దూరి వెళ్ళేవాళ్ళు.

 

నాన్నగారు ఇదంతా పెద్ద రిస్క్ పిల్లలు ఇబ్బంది పడతారని బ్యాంకుకి, అక్కల స్కూలుకి దగ్గరలో ఒక మేడ అద్దెకి తీసుకున్నారు. అప్పట్లో బ్యాంకు ఉద్యోగస్తులన్నా, మేడ ఇంట్లో ఉండడం అన్నా చాలా గొప్పగా వుండేది.


నేను మూడుసార్లు తాడేపల్లిగూడెం వెళ్ళాను కానీ మా చిన్నప్పటి ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూడాలన్న కోరిక తీరలేదు.  ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నా కోరిక నెరవేరింది. ఇంటి తలుపులు తెరిచి వున్నాయి. లోపలికి వెళ్ళాము. అక్కడ కింద రూములలో అద్దెకున్నవారి అనుమతి తీసుకుని మెట్లెక్కి పైకి వెళ్ళాం. అబ్బా ఎంత సంతోషం వేసిందో.... ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోయాను.


నేను నా అధీనంలో లేను. నాకు 9 సంవత్సరాలప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాము. అక్కడ నాన్నగారు ఏ కిటికీ దగ్గర మంచం వేసుకుని పడుకునే వారో, ఆ కిటికీ దగ్గర నుంచుని వాళ్ళ స్నేహితులు రోడ్డుమీద వెడుతుంటే ఎలా మాట్లాడేవారో కళ్ళముందుకొచ్చింది

(ఇంకా వుంది)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి