25, జులై 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 22 - తాడేపల్లిగూడెం - మేడ మెట్లు, మెట్ల కింద గదులు - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 6

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 22 -  తాడేపల్లిగూడెం  - మేడ మెట్లు, మెట్ల కింద గదులు  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు  - 6  


ఇదిగో ఈ కనిపిస్తున్న మెట్లపక్కన దిగడానికి ఉన్న గోడమీద నేను మా చెల్లెలు ప్రభావతి ఎన్నోసార్లు జారుడుబల్లలాగా పై నుంచి కింద వరకూ జారేవాళ్ళం.  అప్పట్లో ఇవే ఆటలు.


ఈ మెట్ల పైన కూచుని మా చిన్న చెల్లెలు గాయత్రికి ఎక్కాలు నేర్పించేవాళ్ళం. అది ముద్దు ముద్దుగా చెప్తుంటే విని ఆనందించేవాళ్ళం.

మాకు అప్పట్లో పైకి నీళ్ళు వచ్చేందుకు పైపు లైన్లు వుండేవి కాదు.  నర్సింహులు అనే అతను మా నాన్నగారికి నమ్మిన బంటు. కాలవ నుంచి కావిడితో మోసుకుని, ఈ మెట్లన్నీ ఎక్కి వచ్చి నీళ్ళు తొట్లనిండా నింపేవాడు. ఇంటికి కావలసిన నీళ్ళన్నీ పోసేవాడు. అంత కష్టపడతాడని నాన్నగారికి చాలా జాలిగా వుండేది. సాయంత్రం బ్యాంకి నుంచి వచ్చాక అమ్మ ఏదైనా తినడానికి పెడితే నర్సింహులు కోసం సగం తీసి పెట్టేవారు.

ఇంక మెట్లు దిగాక పొడుగ్గా కనిపిస్తున్న వరండా లో మూడు రూములున్నాయి. పెద్దక్క బియస్సీ చదువుతోంది. అక్క చదువుకుంటుందని  నాన్నగారు చివరగా ఉన్న రూము ఖాళీగా వుంటే తీసుకున్నారు.  అక్క రోజూ రాత్రి, పగలు అక్కడ కూచుని చదువుకునేది. తినడానికి, పడుకోవడానికి మాత్రమే పైకి వచ్చేది.

 

ఇప్పుడు కింద రూములు ఎవరికో అద్దెకి ఇచ్చారు. వాళ్ళిలా వాడుకుంటున్నారు


ఇలా మా ఇంటి గుమ్మం నుంచి రోడ్డు మీద నుంచి మా వెనక కనిపిస్తున్న గేటులోకి వెళ్ళాల్సి వచ్చేది.

అంతా బాగానే వుంది కానీ మాకు నెంబర్ 2కి వెళ్ళాలంటే ఈ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో   వుండేది. దానికి వేరే గేటు వుండేది. మా ఇంటి మెయిన్ డోర్ నుంచి రోడ్డు మీంచీ వెళ్ళి ఆ గేటు తాళం తీసుకుని వెళ్ళాల్సి వచ్చేది. ఇది చాలా ఇబ్బందిగా వుండేది. 



ఇది మెట్లపక్కన రూము  వెనకవైపుకి దారి

అయితే మెట్లపక్కనే వున్న రూములో అజ్జరపు బ్రదర్స్ అనే కిరాణాషాపు ఆయన వాళ్ళ షాపుకి సంబంధించిన సరుకులన్నీ స్టాకు పెట్టుకునేవారు. అప్పుడప్పుడు వచ్చి లెక్కలు రాసుకునేవారు. ఆ రూముకి అవతలి స్థలానికి  వెళ్ళడానికి వేరే గుమ్మం వుండేది.  నాన్నగారు ఆయన్ని బతిమాలి ఆయన్ని చివరి రూములోకి మారమని,  మెట్లపక్క రూము అక్కకోసం తీసుకున్నారు. ఇప్పుడు సమస్య పరిష్కారం అయ్యింది.  మేము కూడా రోడ్డు మీంచి తిరిగి వెళ్ళక్కరలేకుండా. ఈ రూములోంచి అటువైపుకి వెళ్ళడానికి వీలుకలిగింది.


అజ్జరపు బ్రదర్స్ కిరాణాషాపు ఆయన మాకోసం సబ్బుల అడ్వర్ టైజ్ మెంట్ పేపర్లు, వేరే అడ్వర్ టైజ్ మెంట్ పేపర్లు వుంటే అవన్నీ పుస్తకాలకి అట్టలు వేసుకోవడానికి ఇచ్చేవారు. ఒకసారి ఆయన రూములో ఏదో పని చూసుకుంటున్నారు. నాకు, మా చెల్లెలు ప్రభావతికి మెట్ల పక్కన బొగ్గుల బస్తామీద మాకు ఏవేవో పేపర్లు కనిపించాయి. ఇద్దరం కలిసి అవి తీసుకుని మేడమీదకి వెళ్ళి మా పెద్దక్కకి అవి దొరికాయని చూపించాం. అక్క అవి చూసి అయ్యయ్యో ఇవన్నీ ఆయన బిల్లులు పొండి పొండి ఇచ్చేసి రండి అని అంది. ఇద్దరం అవన్నీ తీసుకుని కిందకి వెళ్ళేసరికి ఆయన పాపం అంతా వెతికేసుకుంటూ తిరిగేస్తున్నారు. ఇద్దరం మాట్లాడకుండా అక్కడ పెట్టేసి వచ్చేశాం.  అప్పుడు చాలా చిన్నపిల్లలం, ఇప్పటి పిల్లలంత తెలివితేటలు లేవు.  తల్చుకుంటే - అయ్యో ఇలా ఎలా చేశాం. పాపం ఆయన ఏమనుకున్నారో అనిపిస్తుంది.

 

ఇంక ఆ రూమ్ తీసుకున్నాక అక్క రాత్రి 12 నుంచి 1 వరకు రూములో కూచుని చదువుకుంటూ వుండేది.  నాన్నగారు మధ్యలో వెళ్ళి పూర్ణమ్మా ఇంక పడుకో అనేవారు.  కాసేపటికి అక్క పైకి వచ్చి పడుకునేది.  మేము 8 గంటలకల్లా నిద్రపోయేవాళ్ళం.

(ఇంకా వుంది)

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి