15, నవంబర్ 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 29 - దెయ్యాల భయం

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు 29 - దెయ్యాల భయం



దెయ్యాల భయం


అలా ఏలూరు నుంచి చిట్టి చెల్లాయిని చూసి వచ్చినప్పుడు పెద్దక్క ఒక్కత్తే ఇంట్లో వుంది. అక్క ఫ్రెండు రాజేశ్వరి సాయం వుంటానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. మేము రావడం లేటవుతోందని తెలిసి వెళ్ళిపోయింది.

అక్కని అదేమిటి అలా వెళ్ళిపోయిందని అడిగితే...

ఏమీలేదు గెరటరాజు గారి అబ్బాయి ఆరుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు కదా... వాళ్ళింటికి వెళ్ళే కాలవవడ్డున స్మశానంలోనే వాళ్ళని దహనం చేశారు కదా... రాత్రి పూట వాళ్ళ ఆత్మలు కాలవ ఒడ్డున కూచుంటాయిట. గజ్జెల చప్పుళ్ళు బాగా వినిపిస్తాయిట. అందుకని వెళ్ళిపోయిందని చెప్పింది.

***ఇంతకీ అసలు కథ ఏమిటంటే... గెరటరాజుగారని మా వూళ్ళో ఓ పెద్దమనిషి వున్నాడు. ఆయనకి 11 మంది పిల్లలు. వాళ్ళలో ఒకబ్బాయి సుబ్బారాయుడు పేట అని అక్కడ వుండేవాడు. ఆయనకి ఐదుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆయన బాగా డ్రింక్ చేసేవాడు.  బాగా అప్పులపాలయ్యాడుట. ఒక కంసాలి దగ్గిరకి వెళ్ళి సైనైడ్ తెచ్చుకుని నిద్రపోతున్న పిల్లలందరికీ వాసన చూపించి, తన కుక్కకి కూడా చూపించి, భార్యకి వాసన చూపించిన తర్వాత, ఫోన్ తీసి ఎదురగా వుండే బాబ్జీ అనే పేరున్న  ప్లీడరుకి  ఫోన్ చేసి మాట్లాడుతూ తనూ వాసన చూశాడుట. ఆవతల ఆయన ఫోన్ తీసేసరికి ఏమీ శబ్దం లేదు.

మర్నాడు పొద్దున్న పనిమనిషి వచ్చి తలుపు కొడితే ఎవరూ తియ్యలేదు. కిటికీలోంచి చూసి ఆ బాబ్జీ గారిని తీసుకుని వచ్చింది. ఆ తర్వాత కథ పోలీసులు, గోల అంతా మామూలే.... ***

ఇదీ సంగతి.

సరే మేమున్న పక్క వాటాలో లివింగ్ స్టన్ అని ఒక డాక్టరు వుండేవారు. ఆయనకి ఒక క్లినిక్ వుండేది. రోజూ వెళ్ళి వస్తుండేవారు. ఆయన అందరితో బాగా మాట్లాడేవారు. వాళ్ళావిడ మరియమ్మ గారెలు బాగా చేసేది. వాళ్ళు వేసకున్నప్పుడల్లా మాకు ఇచ్చేవారు. వాళ్ళకి ములక్కాడలు అంటే చాలా ఇష్టం. వెనకవైపు పెరడు బాగా వుండేది. అక్కడ కుర్చీలు వేసుకుని టిఫిన్ లా తింటూ వుండేవారు.

ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే.... కొంత కథ చెప్పాలి కదా... ఈ ఇంటి కథ ఇంకా కొంచెం వుంది అది చెప్పేసి అసలు కథలోకి వెడతాను.

2 కామెంట్‌లు: