26, నవంబర్ 2021, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 31 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -2

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 31  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -2 

అమ్మ చిన్నపాపని తీసుకుని ఏలూరు నుంచి ఈ కొత్త ఇంటికి వచ్చింది. అమ్మమ్మ కూడా కొన్నాళ్ళు అమ్మకి తోడు వచ్చింది. వరసగా మూడు గదులు. వెనక కిందకి వున్న వంటగది. నాన్నగారు వున్నప్పుడు అందరం మంచాల మీద పడుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ఇంట్లో మంచాలు వేసుకోవడానికి కొంచెం  ఇబ్బందిగానే వుండేది. మంచాలన్నీ బయట ఒక సందుంటే అందులో పెట్టి, ఒక పెద్ద మంచం మాత్రం ఇంట్లో వేసుకున్నాం. 

అమ్మమ్మ కొన్ని రోజులు వుండి (నర్సాపురం దగ్గర వున్న) పెనుగొండకి వెళ్ళిపోయింది. ఇక చిన్న పాప బాగా ఏడుస్తూ వుండేది. అమ్మకి పాపం నాన్న పోయి బాధలో పాపని అసలు పట్టించుకునేది కాదు. అంటే మళ్ళీ ఎత్తుకుని ముద్దులు పెట్టుకునేది. పాలిచ్చేది. ఇంట్లో పనికి పనిమనిషి, బట్టలకి చాకలి వున్నా... అమ్మకి వంటపని సరిపోయేది. ఇల్లంతా ఎప్పుడూ నీట్ గా పెట్టేది. 34 సంవత్సరాలకి నాన్న చనిపోతే అమ్మ పరిస్థితి ఎలావుండేదో అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అంత చిన్న వయసులో ఎంత క్షోభపడిందో అని. 

మేమందరం భగవద్గీత నేర్చుకున్నామని చిన్న చెల్లెలుకి గీతాభవాని అని పేరు పెట్టాం. గీతా గీతా అని పిలిచేవాళ్ళం. అది ఏడుస్తుంటే నేను (కుడి నుంచి రెండు), మూడో అక్క ఉమ్మ (ఎడమ నుంచి రెండు)  ఇద్దరం దుప్పటీలో పడుకోపెట్టి అటూ ఇటూ వూపుతూ పాటలు పాడేవాళ్ళం. అది నిద్రపోయేది.  తర్వాత అమ్మ తీసుకెళ్ళి లోపల పడుకోపెట్టేది.

అక్క నాన్నగారు చేసిన ఆంధ్రాబ్యాంక్ లోనే పనిచేసేది కాబట్టి,   మేము ఆ ఇంటికి వచ్చాక అక్కకి బ్యాంక్ దగ్గరైంది. అక్క అప్పటి వరకూ చదువులోనే వుంది కాబట్టి సంసారం ఖర్చులు ఎక్కువ తెలిసేవి కాదు. ఉద్యోగం చేసి వచ్చి అలిసిపోయిందని అమ్మ ఏ పని చెప్పేది కాదు. అక్కంటే మా అందరికీ ప్రేమతో కూడిన భయం వుండేది. తన మాటకి ఎదురు చెప్పేవాళ్ళం కాదు.  రెండో అక్క అమ్మకి ఇంట్లో పనుల్లో సాయం చేసేది. ఇంక నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు చిన్నవాళ్ళు.  నేను, మూడో అక్కా బజారు పనులన్నీ చూసుకునేవాళ్ళం. ప్రతి ఆదివారం సంతకి వెళ్ళి కూరలు కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం. 

సంతలో అందరి దగ్గరా కూరలు చీప్ గానే వుండేవి కానీ, ఒకతని దగ్గరమాత్రం చాలా రేట్లు ఎక్కువ వుండేవి. ఎవరి దగ్గర దొరకని కూరలు  అతని దగ్గర దొరికేవి.  నాన్నగారు లేని లోటు తప్ప మిగిలిన విషయాల్లో అందరం ఆనందంగానే గడిపాం.

ఏదైనా సినిమా ఉంటే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. నాన్నగారు ఉన్నప్పుడు అక్కలని హిందీ పరీక్షలకి కట్టించి హిందీ రావాలని హిందీ సినిమాలకి తీసుకుని వెళ్ళేవారు.  అలా వాళ్ళకి హిందీ సినిమాలు అలవాటు అయ్యాయి. 


2 కామెంట్‌లు:

  1. // “ మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు” // ….. మీ జ్ఞాపకాలకు సరైన పేరు పెట్టారు.
    మనిషి పోయిన బాధ, విచారం జీవితాంతం ఉంటాయి కానీ మళ్ళీ ప్రాపంచిక వ్యవహారాల్లో పడాలి కదా. లేకపోతే జీవనం కష్టమయిపోతుంది. Life goes on. అంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకొచ్చిన మీ అమ్మగారు, మీ పెద్దక్క గారూ సమర్థురాళ్ళు 🙏.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారాలు, ధన్యవాదాలు సర్ మీకు. అందరి జీవితాల వెనక ఒకో కథ వుంటుంది కానీ, నాన్న, అమ్మ తప్ప మరో లోకం తెలియని మేము ఒక్కసారి విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టి, అందులో అందరం ఆడపిల్లలం - మేము మా జీవితం గడిపిన తీరు చెప్పాలనిపించింది సర్.

    రిప్లయితొలగించండి