19, మే 2022, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 14


జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 14


ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ – బాలచంద్రిక

అప్పుడప్పుడు అక్కతోబాటు ఆఫీసుకి వెళ్ళేదాన్ని. నాకు ఏమీ తోచేది కాదు. నాకు సిటీ కొత్త. పక్కింట్లో ఉన్న గాయత్రి నాకన్నా చాలా చిన్నది. కాలేజీలో ఇంటర్ చదువుతోంది. తనకి శలవులని అక్క సిటీ చూపించమంది. గాయత్రికి పాస్ వుంది. కానీ నన్ను కూడా పాస్ అని చెప్పమంది. నాకు సిటీ గురించి అసలేం తెలియదు. తను చెప్పమన్నట్టు చెప్పేదానిని. రెండేసి స్టాపులకోసారి బస్ ఎక్కడం, దిగడం అక్కడ దగ్గరలో వున్నవి చూడడం. నాకు పబ్లిక్ గార్డెన్స్, వాళ్ళ కాలేజీ, చార్మినార్, మ్యూజియం ఇలా చాలా చూపించింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. నాకు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు. నన్ను చూస్తే నాకే వింతగా అనిపించేది.

ఒకరోజు చివరింట్లో ఉండే ముసలావిడ ఏడుపు వినిపించింది. ఏమైందో అని చాలా కంగారు పడ్డారు అందరూ... ఎక్కిళ్ళు బయటికి వినిపిస్తున్నాయి. వాళ్ళబ్బాయి ఆఫీసుకి వెళ్ళాడు. అందరం ఇంటి ముందుకు వెళ్ళేసరికి, ఆవిడ ఒళ్ళో పుస్తకం వుంది. "ఏమైందండీ... ?" అని అందరూ అడిగారు.

ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ చెప్పిన సమాధానం - "కథలో రాధని అత్తగారు చాలా కష్టాలు పెడుతోంది. పాపం పిచ్చిపిల్ల ఎవరితో చెప్పుకోలేకపోతోంది. ఆ బాధ చూడలేక నాకు ఏడుపు వచ్చింది" అని చెప్పింది.

అప్పుడు అందరూ "అంతేనా.... ఇంకా ఏమైందో అని కంగారు పడ్డాం. కథే కదా... ఏడవకండి మామ్మగారూ..." అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆవిడకి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. ఇంక అందులో లీనమైపోతే ఇలాగే వుంటుంది.

 ***

అక్క ప్రైవేట్ జాబ్ చేస్తూనే రకరకాల పోటీ పరీక్షలకి వెడుతూవుండేది. రైల్వేలో, ఎజి ఆఫీసులో, స్టేట్ బ్యాంక్ లో ఒకేసారి ఇంటర్వ్యూలు అయ్యాయి. అన్నింట్లో విజయం. కానీ తను స్టేట్ బ్యాంక్ నే ఎంచుకుంది. అక్క చాలా తెలివైనది. కథలు రాస్తుంది. కవితలు ఆశువుగా చెప్తుంది. పద్యాలు ఛందోబద్ధంగా రాస్తుంది.

అక్కకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నారాయణగూడాలో బ్రాంచ్ లో ఫస్ట్ అప్పాయింట్ మెంట్ వచ్చింది. ఆ బ్యాంక్ కి వచ్చిన గ్రేట్ మెజీషియన్ చొక్కాపు వెంకట రమణగారు తనకి పరిచయం అయ్యారు. వాళ్ళ ఆఫీసుకి నన్ను తీసుకురమ్మని చెప్పారట.

ఒకరోజు నన్ను బరకత్ పూరాలో వున్న ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీకి తీసుకుని వెళ్ళింది. రమణ గారిని నాకు పరిచయం చేసి తను ఆఫీసుకి వెళ్ళిపోయింది.

రమణగారు బాలచంద్రిక సంపాదకులు. నాతో మాట్లాడుతూ మీరు మా బాలచంద్రికకి కథలు రాస్తారా అన్నారు. రాస్తాను అని చెప్పాను. అప్పటివరకూ ఎప్పుడూ కథలు రాసిన అలవాటు లేదు. ఏదీ రాదని చెప్పకూడదని అమ్మ అనేది. ఆ ప్రకారమే సరే అని చెప్పేశాను.

సరే రండి మా డైరెక్టర్ గారికి పరిచయం చేస్తాను అని - అప్పటి డైరెక్టర్ బుడ్డిగ సుబ్బరాయన్ గారికి పరిచయం చేశారు. ఆయన బాలచంద్రికకి కథలు రాయడానికి ప్రోత్సహించారు. రోజూ రమ్మన్నారు. అది టెంపరరీ అని నాకు తెలుసు. కానీ చాలా సంతోషంగా అనిపించింది. మొదటిసారి అలా ఇద్దరు ప్రముఖ వ్యక్తులతో పరిచయం అయ్యింది.









అప్పటి నుంచి రోజూ బాలచంద్రిక ఆఫీసుకి వెళ్ళి అక్కడ కూచుని కొన్ని చిన్న చిన్న పిల్లల కథలు రాసిచ్చేదాన్ని. సహసంపాదకుడు రూప్ సింగ్ అని వుండేవారు. ఆయన కొన్ని ఇంగ్లీషు కథల పుస్తకాలు ఇచ్చి అందులో కథలు అనువదించమని చెప్పారు. పొద్దుటి నుంచీ సాయంత్రం వరకు ఉండేదాన్ని. అలా నా కథలు బాల చంద్రికలో వచ్చేవి. కొన్నిసార్లు నా పూర్తి పేరు పెట్టేవారు కాదు.

వాళ్ళకి వేరే వాళ్ళ నుంచి వచ్చిన కథలు కూడా ఎడిట్ చేసి మళ్ళీ రాసిపెట్టేదాన్ని. అప్పట్లో కంప్యూటర్ లేదు కాబట్టి మళ్ళీ రాసుకోవల్సి వచ్చేది.

అప్పుడప్పుడు సుబ్బరాయన్ గారు వాళ్ళ వర్కషాప్స్ కి రమ్మని చెబితే వెళ్ళేదాన్ని. అక్కడ చాలామందితో పరిచయం అయ్యింది.

రూప్ సింగ్ గారు నాకు ఎలా రాయాలో చెప్పేవారు. అవడానికి సింగ్ కానీ తెలుగు బాగా వచ్చు. అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాగా మాట్లాడేవారు.

అతనికి కొన్నాళ్ళకి పెళ్ళి అయ్యింది. ఏం గొడవలయ్యాయో తెలియదు కానీ, భార్యాభర్తా ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు. నా జీవితంలో ఇలాంటి విషాద సంఘటన వినడం మొదటిసారి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి