29, జూన్ 2022, బుధవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 27 *** కొత్త పరిచయాలు, కొత్త విషయాలు***

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 27   *** కొత్త పరిచయాలు, కొత్త విషయాలు***



ఒకరోజు ICRISAT నుంచి అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిస్ట్ సిన్హా, ఆయన PA ప్రసన్నలక్ష్మి వచ్చారు. విజయపాల్ గారు నన్ను పిలిచి వాళ్ళని పరిచయం చేసి “వర్కు చూడండి” అన్నారు. వాళ్ళు పిలిచారు. ఇంగ్లీష్ వర్కు కాబట్టి కొంత వరకు ఫర్వాలేదు. అది ఆ సంవత్సరానికి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్. అసలే కొత్తవర్కు. దాన్నిండా టేబుల్స్ చాలా వున్నాయి. గుండెగుభేల్ మంది. వర్కు రాదంటే నామోషీ. (***ఒకటి మాత్రం గుర్తుకు వచ్చింది - అమ్మ ఇది నాకు రాదు అంటే ఊరుకునేది కాదు. ***) నేను తీసుకుని సరే చేస్తానని చెప్పాను.
ICRISAT అనగానే ఒక్కసారి నాకు పటాన్ చెరు రూటు గుర్తుకు వచ్చింది. నేను పటాన్ చెరులో పనిచేసినప్పుడు నాకు దారిలో ICRISAT కనిపిస్తూండేది. చుట్టుపక్కల అసలు ఏమీ వుండేవి కాదు. ఇది 1972లో ప్రారంభించారు. అయితే నాకు రోజూ *** గరాటు*** లాంటి వింత పరికరాన్ని చూస్తుంటే అర్థమయ్యేది కాదు. బస్ కండక్టర్ ICRISAT అని అరవగానే చాలా ఆత్రుతగా చూసేదాన్ని. అదేమిటో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా వుండేది. చుట్టుపక్కల అంతా పొలాలు కనిపించేవి. కానీ అది మనసులోనే వుండిపోయింది. ఇంక ఆ రూటులోంచి వెళ్ళడం మానేశాక కొన్నాళ్ళు మర్చిపోయాను. మళ్ళీ ICRISAT వచ్చిన వీళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపించింది.




మొత్తానికి ఆత్రుత పట్టలేక వాళ్ళని *** గరాటు*** ఆకారాన్ని గురించి అడిగాను. వాళ్ళు నవ్వి – ఇది నీటిని ఆదా చేసే పరికరం అని చెప్పారు. అది రోజుకి 1,00,000 లీటర్ల నీటిని ఆదా చేస్తుందిట. 2000 మంది ఉన్న ఒక ఏరియాలో 86 సంవత్సరాలకి దాహం తీరుస్తుందని చెప్పారు. ఇది గ్రామీణాభివృద్ధి కోసం వ్యవసాయ పరిశోధన చేసే అంతర్జాతీయ సంస్థ, పటాన్చెరులో హెడ్ ఆఫీస్ అని - పంటల మీద రిసెర్చి చెయ్యడానికి వీళ్ళ ఆఫీసు ప్రాంగణంలోనే రకరకాల చిరు ధాన్యాలు, వేరుశనగ మొదలైనవన్నీ వేసి పరిశోధన చేస్తుంటామని చెప్పారు.

“మా వర్కు చేసి పెట్టెయ్యండి ఒకసారి మా ఆఫీసుకి వద్దువుగాని” అన్నారు. ఒక పెద్ద సైంటిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ అసలు ఎటువంటి గర్వం లేకుండా నేను అడిగిన వాటన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. నాకు ఏదైనా కొత్తది వుంటే దాని గురించి తెలుసుకోందే నిద్రపట్టదు.

వాళ్ళు “మాకు మంచి కాఫీ ఇప్పిస్తావా” అన్నారు. అప్పటి వరకూ ఒక పెద్ద కప్పుతో రాములు ఇచ్చే ఇంటి టీ తాగడం అలవాటయింది. విజయపాల్ గారి వాళ్ళింట్లో కాఫీ ఎప్పుడూ తాగలేదు. రాములుకి చెప్పాను – వెంటనే దగ్గరలోనే ఉన్న గాయత్రీ భవన్ కి వెళ్ళి వాళ్ళడిగిన మంచి కాఫీ తెచ్చి ఇచ్చాడు. వాళ్ళు చాలా సంతోషించారు. మేము మళ్ళీ వస్తాం. వర్కు మొదలు పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయారు.

వర్కు మొదలుపెట్టాను. టేబుల్స్ చెయ్యడం అదే మొదలు. మొత్తానికి నాలుగైదు పేపర్లు నాశనం చేసి, మొత్తానికి టేబుల్ ఎలా చెయ్యాలో కనిపెట్టాను. టేబుల్ వస్తే సరిపోయిందా... వాటికి పైన, కింద, కాలమ్స్ ని డివైడ్ చేస్తూ గీసే గీతలు వాటిని కూడా ప్రాక్టీస్ చేసి మొత్తానికి టేబుల్ ఎలా సెట్ చెయ్యాలో తెలుసుకున్నాను. అంత పెద్ద డబ్బా లాంటి ప్రింటర్ లో గీతలు గీసేటప్పుడు చక్కటి అందమైన శబ్దం వచ్చేది. అందులో అది నిలువు గీతలు గీస్తోందో, అడ్డ గీతలు గీస్తోందో అర్థమయ్యేది. ప్రింట్ అవడం అయిపోగానే ఒక్క విజిల్ వేసి ఆగిపోయేది.

మొత్తానికి వాళ్ళ యాన్యువల్ రిపోర్టు విజయవంతంగా పూర్తిచేశాను. అయితే ప్రింట్స్ వచ్చాక- వాటిల్లో చిన్న చిన్న తప్పులుంటే ఆ అక్షరాలు, పదాలు మాత్రం అక్కడ టైపు చేసి, ప్రింట్ తీసుకుని ఆ ప్లేస్ లో పేస్ట్ చేసుకునేవారు. అది ప్రింటింగ్ కి కూడా వెళ్ళిపోయి, పుస్తకం చాలా బాగా వచ్చింది.

ఈ కాలంలో టేబుల్స్ రన్నింగ్ మేటర్ కన్నా కొంచెం టైం పడుతుంది కానీ, చాలా తేలికైన పనే అనే చెప్పుకోవాలి.


*** ఓ పిట్టకథలాంటి చిన్న సంఘటన ***

అప్పుడు స్టాఫ్ ఇంకా కొద్దిమందిమే వున్నాం. ఒకరోజు అందరం కలిసి సెకండ్ ఫ్లోర్ లో కూచుని మాట్లాడుకుంటున్నాం. ఇంతలోకే ఉన్నట్టుండి ఢమ ఢమా కొన్ని డబ్బాలు కింద పడిపోయాయి. అందరిలోనూ అలజడి. ఓ డబ్బాలో వేసి కుదిపినట్లు అయ్యింది. ఉన్నట్టుండి ఎవరో “భూకంపం” అన్నారు. అంతే అందరం ఒక్కటే పరుగు కిందకి. కిందకి వెళ్ళిపోయాక రవీంద్రనాథ్ “నాగలక్ష్మీ! రెండు నిమిషాల్లో బలే కిందకి వచ్చేశావు. మమ్మల్ని ఎవరినీ దిగనివ్వకుండా ముందర నువ్వే పరుగు పెట్టావు. నీ దొక్కటే ప్రాణమా...” అని నవ్వుతూ అన్నాడు. అప్పటి వరకూ నేను అంత స్పీడుగా దిగానని నాకే తెలియదు. అవునా అని సారీ చెప్పి నవ్వాను.

అందరం రోడ్డు మీద నిలబడ్డాం. మేం తప్ప ఎవరూ బయటికి రాలేదు. అంటే పైన ఉన్నాం కాబట్టి మాకు బాగా తెలిసింది. తలుచుకుంటే ఇప్పటీ నవ్వు వస్తుంది.

2 కామెంట్‌లు:

  1. మరి ICRISAT వారు మిమ్మల్ని వాళ్ళ ఆఫీసు చూడడానికి తీసుకువెళ్ళారా?

    రిప్లయితొలగించండి
  2. అవును సర్ వెళ్ళాము. అప్పట్లో సెల్ ఫోన్ లు లేవు కాబట్టి ఫోటోలు తీసుకోలేకపోయాం. ఓ పెద్ద సైంటిస్ట్ తో వెళ్ళడం మాకు గొప్పగానే అనిపించింది. అదీ వాళ్ళ ఆఫీసు కారులో... మా ఎం.డి. కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైనా అవసరం వస్తే వెళ్ళచ్చని. చాలా బావుంది వాళ్ళ ఆఫీసు.

    రిప్లయితొలగించండి