2, జులై 2022, శనివారం

ఎదురీతలో నేను - 29 కొంచెం అప్రమత్తంగానే వున్నా

ఎదురీతలో నేను  - 29   కొంచెం అప్రమత్తంగానే వున్నా

***మళ్ళీ బస్సులో మరో.... సంఘటన***


ఆఫీస్ కి వెళ్ళడానికి మెహదీపట్నంలో బస్ ఎక్కాను. లిబర్టీ వరకు వచ్చాక ఒకతను ఎక్కాడు. ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను. పదే పదే అతన్నే చూస్తున్నాను. గుర్తు రావట్లేదు. తర్వాత ఢిల్లీ అక్కావాళ్ళ మరిది మల్లిలా ఉన్నాడు కదా అనుకున్నాను. బావగారు వాళ్ళు అమ్మకి చుట్టాలే.

బావగారి తమ్ముడు అంటే బంధువే కదా అనుకున్నాను. అతను డ్రైవర్ దగ్గిరగా నిలబడ్డాడు. బస్ అంత రష్ లేదు. ఎందుకో వెనక్కి తిరిగి చూశాడు. నేను చూడ్డం చూసి నవ్వాడు. నేను మొదట్లో చెప్పినట్లు హైదరాబాద్ వచ్చిన కొత్తలో వెనకసీటాయన నవ్వు అర్థం కాలేదు కదా...! ఈసారి పొరపాటు పడకూడదు అనుకున్నాను.

“నేను మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు?” అన్నాను.

“నేను ఇక్కడే వుంటున్నాను” అతని సమాధానం.

ఓహో! అనుకుని, “ఎక్కడ వుంటున్నారు?” అన్నాను. వెంటనే జేబులోంచి విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాడు. అది చూడగానే కామ్ అయిపోయాను. విజిటింగ్ కార్డ్ లో ఆర్. వెంకట్రావు, వెంకటేశ్వరా ఎలక్ట్రికల్స్ అని వుంది. ఇంక మాట్లాడకుండా ఏటో చూస్తూ కూచున్నాను.

అతనే మళ్ళీ “మీ ఆఫీస్ ఎక్కడ, ఎక్కడికి వెడుతున్నారు?” అన్నాడు. నేను వెంటనే “మా ఆఫీసు సికింద్రాబాద్ లో, హిమాయత్ నగర్ లో మా మామయ్యగారింటికి వెడుతున్నాను (అబద్ధం చెప్పాను)” అన్నాను.

“అవునా... అయితే హిమాయత్ నగర్ గాయత్రీ భవన్ లో కాఫీతాగుదాం. అదయ్యాక మీరు వెడుదురుగానీ” అన్నాడు.

“నేను కార్తీకమాసం ఉపవాసం ” అన్నాను.

“పోనీ జ్యూస్” తాగుదాం.

“నేను ఇవాళ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను” అన్నాను.

మాటల్లో నేను దిగాల్సిన బస్ స్టాప్ దాటి నెక్ట్స్ బస్ స్టాప్ వచ్చింది. వెనక్కి కూడా చూడకుండా బస్ దిగిపోయాను. గబగబా ఆఫీస్ కి వెళ్ళి. అక్కడ మా రూం దగ్గిరకి అప్పుడే తెచ్చి ఇస్తున్న నీళ్ళు, టీ తాగేసి అమ్మయ్య అనుకున్నాను.

అమ్మబాబోయ్ చాలా జాగ్రత్తగా వుండాలి అనుకున్నాను. అతనెవరో కొంచెం మంచివాడు అయివుంటాడు. లేకపోతే మీ వాళ్ళింటివరకూ వస్తాను అంటే నా పనయ్యేది. ఇంక అన్నీ ఆలోచించడం మానేసి పనిలో పడ్డాను.
---
మనుషుల్ని పోలిన మనుషుల్ని చాలామందిని చూస్తుంటాము. నేను హైదరాబాద్ వచ్చాక దాదాపు 30 మంది దాకా నన్ను – మిమ్మల్ని చూస్తే ఎవరినో బాగా తెలిసిన వాళ్ళని చూసినట్టుంది అని, మీరు అక్కడ ఉండేవారా, ఇక్కడ ఉండేవారా అని అడిగారు.
---
పెళ్ళయ్యాక సంజీవరెడ్డి నగర్ లో ఉండేవాళ్ళం. ఒకరోజు ఒకతను “ఏమండీ మీరు రోజూ హడావిడిగా బస్ స్టాప్ కి వెళ్ళిపోతుంటారు. ఒక విషయం అడుగుదామని ఏడాది నుంచీ చూస్తున్నాను. ఇవాళ మీరు కొంచెం హడావుడి లేకుండా వున్నారు. మీరు రాజమండ్రి కాలేజీలో చదివారా...?” అన్నాడు.
నేను “లేదని” చెప్పాను.
అతను ఆశ్చర్యంగా “అవునా... పోనీ ఎవరైనా మీ బంధువులు ఉన్నారా…?” అన్నాడు.
నేను "లేదండీ ఎవరూ లేరు. అక్కడ మాకెవరూ తెలియద"ని చెప్పాను.
అతను "ఒక అమ్మాయి అసలు పూర్తిగా మీలాగే వుంటుంది. అస్సలు రూపురేఖల్లో ఏమీ తేడా లేదు" అని ఒక గ్రూప్ ఫోటో చూపించి ఆ అమ్మాయిని నాకు చూపించాడు. ఆశ్చర్యపోవడం నావంతయ్యింది. ఇంత పోలికలా... నాకూ... ఎవరికో... అనుకుంటూండగానే....

అతను "సారీ అండీ ఏమీ అనుకోకండి" అనేసి వెళ్ళిపోయాడు.

మరోసారి మా చిన్నప్పటి స్నేహితురాలు “మా అబ్బాయి పెళ్ళి - ఎక్కుమందిని పిలవట్లేదు సింపుల్ గా చేస్తున్నాం. తప్పకుండా రా” అంటే వెళ్ళాం. అక్కడ ఒక 25 సంవత్సరాల అబ్బాయి "ఆంటీ పెళ్ళికి వచ్చినప్పటి నుంచీ మిమ్మల్నే చూస్తున్నాను. మిమ్మల్ని ఎక్కడో బాగా చూసినట్టుంది. మీరు కాకినాడలో ఉండేవారా?" అన్నాడు.

ఏమిటో... మరి ఈ పోలికలు ???
*** చెల్లెలికి గురువునయ్యాను ***

తాడేపల్లి గూడెం నుంచి మా చెల్లెలు ప్రభావతి నా దగ్గిరకి వచ్చింది. తను “సాయంత్రం 6 గంటల లోపున ఆఫీసు దగ్గిరకి వస్తాను ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేద్దాం. నాకు ఆఫీసు చూడాలని వుంది” అంది. "సరే!" అన్నాను.

తను ఆఫీసుకి వచ్చి పైన మా రూం బయట నుంచుంది. ఏదో వర్కు గురించి మాట్లాడడానికి వచ్చిన విజయపాల్ గారు ఎవరికోసం వచ్చావని అడిగితే నా పేరు చెప్పినట్లుంది.

ఆయన నా దగ్గిరకి వచ్చి “మీ కోసం ఎవరో చిన్న అమ్మాయి వచ్చింది. బయట నిలబడింది” అన్నారు.

నేను ఆయన వర్కు గురించి చెప్పినవి విని, బయటకి వచ్చి ఆయనతో “మా చెల్లెలు సర్. డిగ్రీ పూర్తయ్యింది. జాబ్ కోసం ట్రై చేస్తోంది. ఊరికే మన ఆఫీసు చూడ్డానికి వచ్చింది” అన్నాను.

“అవునా ఇంత చిన్న పిల్ల డిగ్రీ చదివిందా” అని ఆశ్చర్యపోయారు. చూడ్డానికి చిన్నపిల్లలా వుండేది.
ఆయనే మళ్ళీ “ఎక్కడో ఎందుకు మీరు ట్రైనింగ్ ఇవ్వండి. మీకు తోడుగా వుంటుంది. రేపటి నుంచి రమ్మనండి” అన్నారు.

అలా తను నాతోబాటు ఆఫీసుకి రావడం, ట్రైనింగ్ తీసుకోవడం మొదలయ్యింది.

4 కామెంట్‌లు:

  1. మళ్ళీ సిటీబస్ సంఘటనా 🙂? ఆ అనుభవాలే మీరొక చిన్నపుస్తకంలా వ్రాయచ్చేమో 🙂?

    // “ ఏమిటో... మరి ఈ పోలికలు ??? “ //
    మొత్తం ఏడుగురు అవుతారేమో చూడండి 🙂🙂.

    రిప్లయితొలగించండి
  2. అవును సర్ నిజంగానే నా సిటీబస్సు అనుభవాలతో ఒక పుస్తకం రాయొచ్చు. ఇంకా చాలా వున్నాయి.

    ఈ పోలికల సంగతి నాకు చాలా ఆశ్చర్యమే వేస్తుంది. ఎందుకంటే నన్ను చాలామంది ఎ.పి. బాలసుబ్రహ్మణ్యం సోదరి శైలజ మీకు బంధువులా అని అడిగారు. నాకు, ఆవిడకి చాలా పోలికలు వున్నాయిట.

    ఆ మాట ఏమోకానీ పెళ్ళయ్యాక ఎ.పి. బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ తల్లిగారు మా అత్తగారికి చెల్లెలు అని తెలిసింది. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం అది.

    మనుషుల్ని పోలిన మనుషులు చాలామందే వుంటారు కదా...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూ “షా” రా మరి 🙂.
      మీ పెళ్లికి ఎస్.పి. గారు వచ్చారా ? దగ్గర చుట్టరికమే కదా.

      తొలగించండి
  3. మా పెళ్ళి అయ్యాక తెలిసింది సర్. జూన్ 3న నన్ను చూస్తే.. జూన్ 19న పెళ్ళి. మా ఇంట్లో మొదటగా సిటీలో జరిగింది నా పెళ్ళే... మంచి కుటుంబం అని మాత్రం తెలుసుకున్నాం. సిటీలో ఏమీ తెలియకుండా చెయ్యడంలో కొంచెం టెన్షన్ పడ్డాం. అలాగే పెళ్ళి హడావుడిలో పడ్డాం. అందుకని అంతకన్నా వివరాలు తెలుసుకోలేదు.

    ముందు ముందు నా పెళ్ళి గురించి కూడా చెప్తున్నాను.

    రిప్లయితొలగించండి