5, జులై 2022, మంగళవారం

ఎదురీతలో నేను - 30 ఆఫీసులో మారుతున్న మనుషులు, కొత్తపనులు

 ఎదురీతలో నేను  - 30   ఆఫీసులో మారుతున్న మనుషులు, కొత్త పనులు


మా చెల్లెలు ప్రభావతి, నేను కలిసి ఆఫీసుకి వెడుతున్నాం. తనకి చాలా వరకు వర్కు నేర్పించేశాను. లక్ష్మణరావు గారు మానెయ్యడంతో శివప్రసాద్ గారి బంధువు నాగేశ్వరరావుగారు ఆర్టిస్టులుగా చేరారు. అంటే ప్రింట్ కి పేజీలు తయారు చెయ్యడం, కరక్షన్స్ ఉంటే కటింగ్, పేస్టింగ్ చెయ్యడం చేసేవారు. ఆర్టిస్టులు తయారు చేసినవి నెగెటివ్స్ తియ్యడానికి పెద్ద కెమేరాతో సెపరేట్ రూం వుండేది.


*** అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ***
*** మొదట మాకు గురువులయిన ప్రొఫెసర్లు ***


ఓపెన్ యూనివర్సిటీ కొత్తగా పెట్టడంతో వాళ్ళు డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పుస్తకాలు ప్రింటింగ్ కి మా ఆఫీస్ కి వచ్చారు. ఇంక వర్కు చాలా ఎక్కువైంది.
డా. రామచంద్రయ్య కెమిస్ట్రీ, డా. శివకుమార్ బోటనీ, డా. వెంకటనారాయణ – ఈ ముగ్గురూ వర్కు చేయించుకోవడానికి మా దగ్గిరకి వచ్చారు. వాళ్ళకీ ఈ వర్కు కొత్తే. కెమిస్ట్రీ, ఫిజిక్స్ రెండూ ఈక్వేషన్స్ తో సహా మేము చెయ్యగలిగేవాళ్ళం. వెంకటనారాయణ గారి మాథ్స్ మాకు టైము సరిపోయేది కాదు. చాలా బతిమాలేవారు. అది మాత్రం మేము చెయ్యలేదు.
డా. రామచంద్రయ్యగారు మనిషి ఎంత ఆప్యాయంగా మాట్లాడేవారో, వర్కు విషయంలో అంత కఠినంగా వుండేవారు. ప్రూఫ్ రీడింగ్ లో ఆయన చాలా పట్టుదల గల వ్యక్తి. పైగా అప్పుడు ఇప్పటిలాగా కంప్యూటర్ లోనే కరక్షన్స్ చేసేసి ఫైనల్ చెయ్యడం వుండేది కాదని చెప్పాను కదా. ఒక పేరాలో ఏదైన మార్పులు చేస్తే ఆ పేరాని మాత్రమే ఇస్తే పాత పేరా ప్లేస్ లో కొత్తదాన్ని పేస్ట్ చేసేవారు. చిన్న కామాలు, ఫుల్ స్టాప్ లతో సహా కట్ పేస్ట్ చేయించేవారు.
ఆయన పెట్టే ప్రెజర్ తట్టుకోలేక శివప్రసాద్ గారు “మీరు జిడ్డు చంద్రయ్యగారు. చెప్పిన మాట వినండి సర్. చిన్న చిన్నవి అయితే పెన్ తో పెట్టేద్దాం సర్, కంప్యూటర్ ఆపరేటర్లు ఇంత చిన్నచిన్నవి చేసి డెవలప్ చేసి ఇవ్వాలన్నా కష్టమే” అని బతిమాలుతుండేవారు.
రామచంద్రయ్యగారు మాత్రం ఏమాత్రం తొణకకుండా “నువ్వు ఏమైనా పిలవ్వయ్యా నన్ను, నాకేం అభ్యంతరం లేదు. నాకు మాత్రం ఒక్క తప్పు కూడా ఉండకూడదు. పిల్లలకి వెళ్ళే పుస్తకాలు ఇవి. ఒక పని చేద్దాం. వేస్టయిన బ్రోమైడ్ లు వుంటాయి కదా నేను వాటిల్లోంచి కామాలు, ఫుల్ స్టాప్ లు, ఏవైనా అక్షరాలు కట్ చేసి ఇస్తాను, నువ్వు పేస్ట్ చెయ్యి” అని చెప్పారు. ఏం చేస్తారు అలా పని పూర్తి చేశారు. కానీ ఆయన చాలా మంచి వ్యక్తి. మధ్యలో తినడానికి ఏమైనా తెప్పిస్తుండేవారు.
మాకు కూడా punctuation marks నేర్పింది ఆయనే. మేటర్ మధ్యలో *** - ; *** ఎందుకు పెడతారు అన్నది ఆయన దగ్గరే నేర్చుకున్నాం. పెద్ద పెద్ద వాక్యాలు రాసినప్పుడు చివరికి వెళ్ళేసరికి మొదటిది మర్చిపోయే అవకాశం వుంటుంది. కొన్ని వాక్యాలు చిన్నవిగా రాయలేం. అలాంటప్పుడు, ఇంకా కొన్ని చోట్ల - ; లతో బ్రేక్ చెయ్యగలుగుతాం. ఆశ్చర్యార్థకం ఎక్కడ పెడతారో కూడా తెలియని వాళ్ళున్నారు. మాకు వర్కుతోపాటు చాలా విషయాలు నేర్పించారు. అప్పట్లో ఫోటోలు తీసుకోవడానికి ఇలాంటి ఫోన్లు లేవు.
ఈ మధ్యన రామచంద్రయ్యగారి గురించి అడిగితే ఆయన ప్రపంచానికి దూరమయ్యారని తెలిసింది. కొంతమంది అలా గుర్తుండిపోతారు.
ఇక బోటనీ డా. శివకుమార్ గారు చాలా సున్నితంగా తనకి కావలిసినట్లు వర్కు చేయించుకునేవారు. ఆయన టాలెంట్ అది. ఆయన గురించి కూడా ట్రై చేశాం. బెంగుళూరులో ఉండచ్చు అని తెలిసింది.
*** విరామంలో పాటలు***
అప్పుడప్పుడు రామచంద్రయ్యగారు “శివప్రసాద్ ఓ రెండు పాటలు పాడవయ్య నాకూ బావుంటుంది. నీకూ నా మీద కోపం పోతుంది” అనేవారు. శివప్రసాద్ గారు గొంతెత్తి పాటలు పాడేవారు. పాతపాటలన్నీ అడిగిపాడించుకునేవారు. అప్పుడప్పుడు మమ్మల్ని పిలిచి పాడమంటే నాకు సినిమా పాటలు రావు. నేను ఎంకిపాటలు పాటలు, జానపద గేయాలు పాడేదాన్ని. ఆఫీసులో అకౌంటెంట్ నీరజ చిరంజీవులు సినిమాలో పి. లీల పాడిన ‘తెల్లవార వచ్చె తెలియక నా సామి’ పాట చాలా బాగా పాడింది. చాలా హాయిగా వుంటుంది. నేను భానుమతి అనుకున్నాను. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు ఒక జానపద గేయం మూలంగా తీసుకుని రాసిన పాట ఇది. ఆ పాట కూడా చాలా బావుంటుంది.
ఇలా మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ మా వర్కు కూడా చాలా బాగా చెయ్యగలిగేవాళ్ళం.

2 కామెంట్‌లు:

  1. మీరు పని చేసిన ఆ ఆఫీసు గవర్నమెంటుదా? సెక్రటేరియట్ నుండి, ఓపెన్ యూనివర్శిటీ నుండి ప్రింటింగ్ కోసం గవర్నమెంట్ ప్రెస్ కు వెళ్ళకుండా మీ వద్దకు వచ్చేవారు అంటే సందేహం వచ్చి అడుగుతున్నాను.

    “తెల్లవార వచ్చె” పాట ఆపాతమధురం. అద్భుతమైన పాట.

    రిప్లయితొలగించండి
  2. సర్ నమస్కారం.

    మా ఆఫీస్ ఎపిఐడిసి జాయింట్ వెంచర్. లిమిటెడ్ కంపెనీ... పైగా మా ఎం.డి. విజయపాల్ గారి ఫాదర్ ప్రతాప్ రెడ్డిగారు అప్పట్లో బాగా పేరున్న క్రిమినల్ లాయర్. చాలా గవర్నమెంట్ వర్క్స్ మా దగ్గిరకి వచ్చేవి ఏ కారణంగానో నాకు తెలియదు.

    తెల్లవార వచ్చె పాట చాలా అద్భుతమైనది సర్

    రిప్లయితొలగించండి