29, జనవరి 2023, ఆదివారం

వస్త్రాల ఉప్పెనలో మునిగితేలుతున్న ప్రపంచం - 68



 వస్త్రాల ఉప్పెనలో మునిగితేలుతున్న ప్రపంచం - 68

మేము హైదరాబాద్ వచ్చేవరకూ బట్టలు కుట్టడానికి బయట ఇవ్వడం అనేది అసలు తెలియదు. ఎందుకంటే మా చిన్నప్పుడు అమ్మ పిల్లలందరి బట్టలు కుట్టాలంటే చాలా అయిపోతుందని పక్కరోడ్డులో ఉన్న ఒక ఆడ టైలర్ దగ్గిరకి వెళ్ళి టైలరింగ్ నేర్చుకుంది. 300 రూపాయలు పెట్టి ఉషా మిషన్ కొనిపించుకుని మా అందరి బట్టలు తనే కుట్టేది.

అమ్మ ఉద్యోగం చెయ్యకపోయినా అమ్మచేసిన పనికి చాలా ఖర్చు కలిసొచ్చినట్టే... మరి. ఎంత ఆస్థాన పనిమనిషి, ఆస్థాన చాకలి దాదాపు 25 సంవత్సరాలు మానకుండా చేసినవాళ్ళు ఉన్నప్పటికీ... పిల్లలందరి సంగతీ చూసుకోవడం అనేదే పెద్దపని వుండేవి. టైమ్ మేనేజ్ మెంట్ ఎలా వుండేదో మరి.

ఇంక హైదరాబాదు వచ్చాక మాటి మాటికీ వూరెళ్ళి అక్కడ నుంచి కుట్టించుకుని తెచ్చుకోవాలంటే డబ్బులు చూసుకోవాలి. ఉద్యోగాల్లో శలవు కావాలి. మెహదీపట్నంలో ఉండగా ఇంటి వెనక వైపున ఒక టైలర్ వుండేవాడు. మామూలుగా అంటే ఏదో ఒకలాగా కుట్టడానికి 70 పైసలు. చాలా బాగా కుట్టాలంటే రు. 2 తీసుకునేవాడు.

అదేం తేడానో అర్థమయితే కదా... రెండు రూపాయలు తీసుకుంటే జాగ్రత్తగా కుడతాడనమాట. కానీ అమ్మో 2 రూపాయలా అనుకునేవాళ్ళం. తప్పనిసరయితే 70 పైసలు పెట్టి కుట్టించుకునేవాళ్ళం. నేను యూసఫ్ గూడాలో పనిచేసినప్పుడు నన్ను ఇబ్బందులు పెట్టిన ఆ హీరోయిన్ కూడా కుట్టించి పెట్టమంటే ఒకటి బాగా కుట్టాడు. మురిసిపోయింది. మరో నాలుగు ఇచ్చింది. తగలేసి పెట్టాడు.

అడుగు పెడితే బట్టల షాపులు లేవు. ఏవైనా కొనుక్కోవాలంటే కోఠీ వెళ్ళాల్సిందే. అప్పుడప్పుడే చీరలు ఒకళ్ళో ఇద్దరో ఇన్స్టాల్ మెంట్స్ లో అమ్మేవారు. రు. 20 చీరకి 5 సార్లు ఇచ్చేవాళ్ళం. అవీ ఎక్కువ రాజ్ కమల్ లాంటి కాటన్ చీరలు వుండేవి.

కోఠీ వెడితే కుప్పలు పోసి రు.20 లేదా 30కి అమ్మేవారు. చూసుకోకుండా తీసుకున్నామంటే దాన్ని ఒక గుమ్మానికి కర్టెన్ గానో, లేకపోతే దాన్ని ఇంకో రకంగానో ఉపయోగించుకోవాల్సిందే. హడావుడి పనికిరాదు. ఇలా కొనుక్కున్న వాటికి అంచులో, జాకెట్లో కుట్టించుకోవాలంటే టైలర్ ని వెతుక్కోవలసిన పరిస్థితి. ఎవరో ఎక్కడో టైలర్ వున్నారంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళచేత కుట్టించుకునే వాళ్ళం. వాళ్ళు తీసుకున్నది రు. 4. రోజులు మారుతున్నకొద్దీ...! సంపాదన పెరుగుతున్నకొద్దీ ఖర్చుకూడా అంతే...!

పంజాగుట్ట మీద నుంచీ బస్ వెళ్ళేటప్పుడు Muntaz Boutique అని ఒక బోర్డు కనిపిస్తూ వుండేది. ఎత్తైన గోడలున్న పేద్ద ఇల్లు. లోపలంతా చెట్లు కనిపిస్తూ వుండేవి. బాగా డబ్బున్నవాళ్ళిల్లు లాగే వుండేది. అసలు ఆ Boutique అంటే ఏమిటో తెలియదు. ఎవర్ని అడిగినా ఎవరైనా చెప్తే కదా... అందరూ నాలాంటి వాళ్ళే... అవునా మేం చూడలేదే అనేవారు. అయినా అంటే ఏంటో మాకూ తెలియదు అన్నారు.

నాకు ఏదైనా కనిపిస్తే దాన్ని గురించి తెలుసుకోవాలని ఆత్రం ఎక్కువ. ఒకసారెప్పుడో అక్కడ బస్ దిగినప్పుడు ఆ ఇంటి గేటు వరకు వెళ్ళి ఇక్కడ ఎవరుంటారు? ఏం చేస్తారు? అని అడిగాను. అక్కడున్న సెక్యూరిటీ అతనికి హిందీ తప్ప తెలుగు రాదు. నాకు హిందీ రాదు. సగం తెలుగు, సగం వచ్చీరాని హిందీలో మాట్లాడాను. మొత్తానికి అర్థం చేసుకున్నాడు. కపడా... మేమ్ సాబ్ టైలర్... అన్నాడు. థాంక్స్ చెప్పేసి వచ్చేశాను. అబ్బో బట్టలు కుట్టడానికి కూడా ఇలాంటి బోర్డు పెట్టుకుంటారా....!!! అనుకున్నాను. పోనీలే నా సందేహం తీరింది అమ్మయ్య అనుకున్నాను. తర్వాత ఆలోచిస్తే దీనికి ఇంత ఆత్రపడడం ఎందుకు? అమ్మయ్య అనుకోవడం ఎందుకు? అనిపించింది. ఓ కొత్త విషయం తెలుసుకున్నాను.

అయిపోయిందా.... ఇంక మెల్లి మెల్లిగా రోజులు పెరుగుతున్నకొద్దీ... టైలర్లు పెరగడం మొదలు పెట్టారు. నేను మా అమ్మ దగ్గిర కొన్ని బట్టలు కుట్టడం నేర్చుకున్నాను. కొంత తెలుసుకదా అని, మా అమ్మాయి పుట్టినప్పుడు తనని మా అత్తగారికి అప్పచెప్పి, మహిళామండలి వాళ్ళు నేర్పిస్తుంటే నేర్చుకుందామని వెళ్ళాను. నేను ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ నేర్చుకోవడానికి వచ్చిన ఐదారుగురు అమ్మాయిలు వుండేవారు కానీ... నేర్పేవాళ్ళు ఎప్పుడూ కనిపించలేదు.

మొత్తానికి ఎక్కడో ఎంతో దూరంలో ఎవరో ఒకరు టైలర్ దొరికేవారు. తర్వాత్తర్వాత ఒక జాకెట్ కి 15 రూపాయలు, 20 రూపాయలు తీసుకునేవారు. టైలర్లు మాత్రం చాలా తక్కువ. ఇన్నిరకాల బట్టలు అప్పుడు లేనేలేవు.

ఇప్పుడు చూస్తే అడుగు పెడితే బట్టల షాపులు. టైలర్ షాపులు. రెడీమేడ్ షాపులు. అప్పటికప్పుడు ఏదైనా వూరెళ్ళాలంటే... షాపింగ్ కి వెళ్ళిపోయి రెడీమేడ్ తెచ్చేసుకుని రెడీ అయిపోవడమే.

ఆన్ లైన్ ఒకటి ఎక్కువైపోయింది. వాళ్ళు పెట్టే ఫోటోలు ఒకటి. పంపించేవి ఒకటి. కొన్నయితే ఎంత దారుణంగా వుంటాయో... అసలయితే మనకి ఏవి కావాలన్నా చెప్పేస్తే కుట్టేసి కొరియర్ లో పంపించేస్తారు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రపంచం గుప్పిట్లోకి వచ్చేసింది. ఏమూల ఎవరు ఎక్కడ ఏం బిజినెస్ చేస్తున్నారో నిమిషాల్లో తెలుసుకుంటున్నారు.

ఏం చేసినా జరిగే మోసాలు జరుగుతున్నాయి.

ఈమధ్య మాకొక కొరియర్ వచ్చింది. అది ఢిల్లీలో ఎక్కడో పెద్ద మార్కేట్ నుంచి వచ్చింది. 700 రూపాయలు కట్టి తీసుకోమని. కొరియర్ తెచ్చినతను డబ్బులు అడుగుతున్నాడు. ఎవరు పంపించారో తెలియదు. లోపల ఏదో క్లాత్ లాగా మెత్తగా వుంది. చింపితే డబ్బులు ఇవ్వాలి. అతన్ని అక్కడ ఉండమని.... మా అమ్మయిని, అబ్బాయిని, ఇంకా మా దగ్గిర వాళ్ళందరినీ మీరు పంపారా..?. మీరు పంపారా...? అని అడిగాం. ఈలోపున కొరియర్ అతను అటూ ఇటూ తిరిగేస్తున్నాడు. ఎవరూ పంపలేదనేసరికి తిప్పి పంపెయ్యమని చెప్పాం. మాకు మళ్ళీ ఎటువంటి ఫోన్ కానీ, మెసేజ్ కానీ రాలేదు. ఇలా వుంటాయి.

ఇప్పుడు ఒక జాకెట్ కుట్టాలంటే ఎవరో ఎక్కడో 250 తీసుకుంటారు. కొంచెం పేరున్న షాపుకి వెడితే మినిమమ్ 550 రూపాయలు. చీర రేటు తక్కువయినా ఎక్కువయినా అంతే... ఉద్యోగాలు చేసేటప్పుడు ఉన్న బట్టలతోనే నీట్ గానే వెళ్ళేవాళ్ళం. ఇప్పటి వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి ఎన్ని రకాల బట్టలో.... బుడ్డి బుడ్డి పిల్లలకి కూడా ఎలాంటివి కొనుక్కోవాలో తెలుసు.

ఆస్ట్రేలియాలో ఉన్న మా మనవరాలయితే నాలుగో సంవత్సరం వచ్చింది. డ్రెస్ మీదకి అన్నీ మాచింగ్ కావాలి.

అబ్బో బట్టల గురించి చెప్పాలంటే చాలా కథే వుంటుందని అందరికీ తెలుసు. ఇది ఇంటింటి రామాయణం.

2 కామెంట్‌లు:

  1. వ్యాపార సంస్కృతి బాగా కమ్మేసింది కదా సమాజాన్ని. జనాల అభిరుచుల్ని కూడా వ్యాపారులే ప్రభావితం చేస్తున్నారు. అందువల్లే పరిస్ధితి ఇలా తయారయింది

    రిప్లయితొలగించండి