6, జూన్ 2023, మంగళవారం

*** మా అమ్మాయి వీణ 6 నెలల పాపతో మూడురోజుల సాహస యాత్ర *** - 88

 




*** మా అమ్మాయి వీణ 6 నెలల పాపతో మూడురోజుల సాహస యాత్ర ***  - 88


హైదరాబాద్ నుంచి చెన్నై 17 గంటలు


చెన్నై నుంచి దోహా 5 గంటలు

దోహా నుంచి పెర్త్, ఆస్ట్రేలియా 11.5 గంటలు

అసలు హైదరాబాద్ నుంచి పెర్త్ కి ప్రయాణం 9.30 గంటలు మాత్రమే.


పాపని తీసుకుని అందరితో ఆనందంగా గడపాలని ఇండియా వచ్చింది. రెండున్నర నెలలు తెలియకుండా రోజులు గడిచిపోయాయి. మధ్యలో వచ్చిన కరోనా లాక్ డౌన్ ఎన్ని రోజులు వుంటుందో తెలియదు. మళ్ళీ ఆస్ట్రేలియా తిరిగి వెళ్ళాలని గుబులు. అతలాకుతలం అవుతోంది.


పంపించాలంటే మాకూ టెన్షనే. వెళ్ళకపోతే అక్కడ జాబ్ పోతుందని భయం. అక్కడికి వెళ్ళిపోతే ఈ టైమ్ లో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంత ఆర్థిక సాయం వుంటుంది. సరే దూకాలా వద్దా... దూకాలా వద్దా... అనుకునే కన్నాదూకేస్తే తరవాత సంగతి తర్వాత. నేను మా పిల్లలకి అదే చెప్పేదాన్ని. అది ఇక్కడ మా అమ్మాయి ఉపయోగించుకుంది.


ఈలోపున ఆస్ట్రేలియన్ హై కమీషన్ ఇండియాలో వుండిపోయిన ఉన్నవాళ్ళందరి సమాచారం సేకరించారు.

చెన్నై, కలకత్తా, ఢిల్లీ, బొంబాయిల నుంచి విమాన సర్వీసులు దోహా మీదుగా ఆస్ట్రేలియాలో వివిధ ప్రాంతాలకి ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలకి చేరడానికి దగ్గరలో వున్న ప్రాంతాల నుంచి ఇంక్రెడిబుల్ ఇండియా బస్ లు ఏర్పాటు చేశారు.

మా అమ్మాయి హైదరాబాద్ నాంపల్లిలో 28వ తేదీ ఉదయం మా అబ్బాయి బస్ ఎక్కించి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచీ వాడు ఒకటే బాధపడిపోవడం. ఎలా వెడుతుందో అనే టెన్షన్ మరి.  

అంతా సవ్యంగానే జరుగుతోంది అని బస్సు బయల్దేరి ఆంధ్రప్రదేశ్ చేరింది.  ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఆటంకం. ఇంకేవో పర్మిషన్లు కావాలని నాలుగు గంటలు ఆపేశారు. పిల్లలతో ఉన్నారని జాలి కూడా చూపించకుండా ఆపేశారు.


అక్కడ నుంచి వీళ్ళు చెన్నై చేరేసరికి అర్థరాత్రి అయ్యింది. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి హోటల్ రూం లో రెస్ట్ తీసుకోమన్నారు. అయితే వీళ్ళగురించి ఎప్పటికప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కేర్ తీసుకోవడం మొదలుపెట్టింది.

29 ఉదయం పది గంటల నుంచి అందరికీ టెంపరేచర్ చూసి, మధ్యాహ్నం చెన్నై నుంచి దోహా ఫ్లైట్ ఎక్కించారు. 5 గంటలు ప్రయాణం. ప్రయాణంలో పాప ఆటలతో బాగా సహకరించింది.

 

రాత్రి 8 గంటలకి దోహాలో ఫ్లైట్ దిగాక లాంజ్ లో 8 గంటలు బ్రేక్. అక్కడ మళ్ళీ 30 తెల్లవారుజామున 4 గంటలకి పెర్త్ విమానం ఎక్కారు. 11.5 గంటలు ప్రయాణం. పాప చాలాసేపు నిద్రపోవడం, ఆడుకోవడంతో ఎక్కువ ఇబ్బంది అవలేదు.  అమ్మయ్య అనుకుంది పాపం.

 

మొత్తానికి పెర్త్ చేరేసరికి 30వ తేదీ సాయంత్రం 8 గంటలు అయ్యింది. అక్కడ మళ్ళీ టెంపరేచర్ చూసి నోవాటెల్ హోటల్ లో రూంకి రాత్రి 11.30 కి క్వారంటైన్ కి పంపించారు. మొత్తానికి మా అల్లుడు శేఖర్ ఊపిరి పీల్చుకున్నాడు.


మొత్తానికి ఆ గడ్డ మీద అడుగుపెట్టారు. ఇదీ కథ.

 

15 రోజులు 6 నెలల పాపతో రూంలోంచి బయటికి వెళ్ళకుండా క్వారంటైన్ లో ఎలా వుందో మళ్ళీ చెప్తాను.

6 కామెంట్‌లు:

  1. ఈ కథనం చదివాక, మా శ్రీమతి శారద మొదటి అమెరికా ప్రయాణం గుర్తుకు వచ్చింది. నేను అమెరికా వెళ్ళాక కొద్ది నెలలకు తాను ఒంటరిగా బయలుదేరి హైదరాబాదు నుండి ఫీనిక్స్ వచ్చింది. అంతకు ముందు ఒంటరిగా ఎన్నడూ‌ ఎక్కడికీ ప్రయాణం చేసిందే లేదు - అలాంటిది మొదటి ప్రయత్నమే ఖండాలు దాటి అమెరికాకు ప్రయాణం చేయటం. అమెను లాస్‌ ఏంజలిస్ ఎయిర్ పోర్టులో నేను రిసీవ్ చేసుకొని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు తీసుకొని రాగానే మాకోసం మామిత్రులు సిధ్ధంగా ఉన్నారు. ఫీనిక్స్‌లో ఇంటికి చేరుకోగానే తక్షణం శారద చేసిన మొదటిపని మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చిన నామిత్రులకు అతిథిసత్కారాలు చేయటం!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణ: "రిసీవ్ చేసుకొని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు తీసుకొని రాగానే" అని వ్రాసాను. పొరపాటు. "రిసీవ్ చేసుకొని ఫీనిక్స్‌ తీసుకొని రాగానే" అని ఉండాలి. గమనించ గలరు.

      తొలగించండి
  2. బావుందండీ... ఇలాంటి అనుభవాలు గుర్తు చేసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శారదగారికి బాగా ధైర్యమే అనుకుంట. ఆవిడ అతిథి సత్కారాలు అందివ్వడం ఆవిడ గొప్పతనం.

    రిప్లయితొలగించండి
  3. మీ అమ్మాయి ఆస్ట్రేలియా పౌరురాలా? ఆస్ట్రేలియన్ ప్రభుత్వం అంత శ్రద్ధ తీసుకున్నదంటే తమ దేశపౌరులకు మాత్రమే చేస్తుంది కదా?

    అవునూ, ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళడానికి వయా దోహా ఏమిటండీ? ఆశ్చర్యంగా ఉందే. సరే ఆ సమయంలో ఏదో ఒక ఏర్పాటు చేశారులే అని తృప్తి పడాలి.
    మా అమెరికా పర్యటనల్లో ఒక సారి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మినియాపోలిస్ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేస్తే రూట్ విచిత్రంగా ఇచ్చాడు. ఫ్రిస్కో నుంచి diagonal గా పైకి చూస్తే ఉత్తరాన మినియాపోలిస్ ఉంటుంది. రూట్ అలా ఇస్తే వాడు అమెరికాలో ఎయిర్ లైన్స్ వాడెందుకవుతాడు. ఫ్రిస్కో నుంచి కింద దక్షిణాన ఉన్న అట్లాంటా కు దింపాడు. అక్కడ కొంత సమయం తరువాత అక్కడి నుంచి పైకి ఎక్కి ఉత్తరాన ఉన్న మినియాపోలిస్ తీసుకువెళ్ళాడు. ఎయిర్ లైన్స్ లీలలు 🙂.

    రిప్లయితొలగించండి
  4. అవును సర్. మా అమ్మాయి, మనవరాలు అక్కడే పుట్టింది కాబట్టి ఆస్ట్రేలియా పౌరురాలు. మామూలుగా ఆస్ట్రేలియా వయా సింగపూర్ వెళ్ళాలి. అప్పుడు సింగపూర్ ఎయిర్ లైన్స్ అటు క్లోజ్ చేసింది. మహా అయితే 10 గంటల ప్రయాణం. కానీ దోహా మీద నుంచి తప్ప గతిలేదు అప్పుడు. మలేసియా మీద నుంచి కూడా వెళ్ళచ్చు కానీ... మరి ఆ రూట్ లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో తెలియదు. ఆ సమయంలో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మూడు నాలుగు విడతలుగా వాళ్ళ పౌరులని తిరిగి రప్పించుకుంది. ఫస్ట్ బ్యాచ్ లో మా అమ్మాయి వెళ్ళిపోయింది. అదృష్టమనే అనుకోవాలి. తర్వాత చాలామంది ఇండియాలో వుండిపోయి ఎప్పుడో వెళ్ళారు. రకరకాల సమస్యల వల్ల.

    మీరు అమెరికా రూట్ గురించి చెప్తుంటే ఇవన్నీ తెలుసుకోగలిగుతున్నాను అనిపించింది. నాకు కొన్ని రూట్ లు మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడూ వెళ్ళలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారీ మా అమ్మాయి సిటిజన్. మనవరాలు అక్కడే పుట్టింది. నేను రాసినది సరిగా లేదు.

      తొలగించండి