26, ఏప్రిల్ 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 15 మారేడుమిల్లి (తూ.గో.జిల్లా) - ఆనందకరమైన మారేడుమిల్లి ప్రయాణం

 

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 15  మారేడుమిల్లి  (తూ.గో.జిల్లా)

ఆనందకరమైన మారేడుమిల్లి ప్రయాణం

మట్టి పొయ్యి మీద వండిన రుచికరమైన శాఖాహార భోజనం మరచిపోలేని అనుభూతి

 



రంపచోడవరం నుంచి మధ్యాహ్నం 12 గంటలకి మారేడుమిల్లి వెళ్ళాం. వెళ్ళేదారంతా చాలా అందంగా వుంది. మనం తలపైకెత్తి చూసిన కనిపించని చెట్లతలలు. అటూ ఇటూ ఎత్తైన చెట్లమధ్య దారి వుంది. దట్టమైన అడవులు. ఒక అద్భుతమైన ప్రయాణం.

మాకు అక్కడికి వెళ్ళేముందే అందరూ చెప్పారు మీకు అక్కడ వెజిటేరియన్ భోజనం ఏమీ దొరకదు.  మీరు మళ్ళీ బయటికి వచ్చి ఎక్కడైనా తినాల్సిందే అన్నారు. మాకు ఎప్పుడూ తిండి గురించి ఆరాటం లేదు. తిండి కోసం ఆగితే అన్నీ చూడలేమని భయం.  ఎక్కడికి వెళ్ళినా స్నాక్స్ లాంటివి వేసుకుని వెళ్ళిపోతాం.  దానివల్ల బాగా తిరగగలుగుతాం.

ఇంతకీ అక్కడ ఏం దొరుకుతుందంటే వెదుబొంగులలో కాల్చిన చికెన్ ఫామస్ ట. మేము వెడుతుంటే దారంతా అవే షాపులు. సరేలే దొరకకపోతే ఏదో ఒకటి చూద్దాం అనుకున్నాం.

కొంతదూరం అలా వెళ్ళాక కారు ఆపి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం. అక్కడంతా కాఫీ మొక్కలు చాలా కనిపించాయి. వాటిని చూడడం అదే మొదలు.

అలా లోపలికి వెడుతుంటే ప్రశాంతమైన వాతావరణంలో పక్షుల కిలకిలలు, జలపాతం చప్పుడు వినిపించింది.  అక్కడ ఎలా వుందంటే రెండు తాడిచెట్ల లోతుకి మెట్లు వున్నాయి. అవీ మట్టి మెట్లు. అంతకు ముందు వెళ్ళినవాళ్ళు ఎక్కలేక ఎక్కలేక ఎక్కి వస్తున్నారు. నన్ను చూసి ఆంటీ మేమే ఎక్కలేకపోయాం మీరు ఇక్కడే వుండండి వాళ్ళు వెళ్ళివస్తారు అన్నారు.

నాకు హెర్నియా మేజర్ ఆపరేషన్ అయి 7 నెలలు అయ్యింది.  ముందు దిగుదామా వద్దా అని ఆలోచించాను. కానీ నన్ను నేను సవాల్ చేసుకున్నాను. అందరూ వున్నారు కదా అంతమందితో నేను అనుకున్నాను.  ఇంతకీ వాళ్ళు ఎందుకు ఎక్కలేకపోయారు అంటే వాళ్ళు తెచ్చుకున్న పులిహోర వగైరాలు  కింద జలపాతం దగ్గర బావుంటుందని అక్కడ తినేసి ఎక్కారు. అదీ సంగతి.

అక్కడ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు  మీరు నాలుగు గంటలలోపున పైకి వచ్చెయ్యండి అని చెప్పారు.  అక్కడ పక్కలకి ఆధారంగా వున్న పెద్ద లతల్ని పట్టుకుని మెల్లిగా దిగడం మొదలు పెట్టాను. మట్టిమెట్లు అంటే అంత సరిగా వుండవు కదా. అయినా సరే సాహసం చేసి దిగేశాను. పైన ఎక్కడి నుంచో పడుతున్న జలపాతం కింద ఒక పెద్ద నదిలా పారుతోంది. చాలా అద్భుతంగా వుంది.  పిల్లలు చాలాసేపు ఆ నీళల్లో ఆడారు.  ఆ చెట్ల కింద పెద్ద పెద్ద కన్నాలు కనిపించాయి. బహుశ కొండచిలువలు వుంటాయేమోఅనిపించింది. అంత కింద వున్నప్పుడు వస్తే అమ్మో ఎటూ పారిపోయే స్థితి లేదు అనుకున్నాము. తర్వాత మెల్లిగా మళ్ళీ మెట్లు ఎక్కి పైకి వచ్చేశాము.

పైన  ఇంకో జలపాతం వుంది. దాని పక్కన ఉన్న కొండలు గుట్టలు ఎక్కారు పిల్లలు.  వీణా జలపాతం నుంచి వచ్చే నీళ్ళు పక్కన పారుతుంటే అక్కడ రాళ్ళమీద కూచుందామని వెళ్ళింది. కానీ రాళ్ళు పాకుడుగా వుండి నీళ్ళ ప్రవాహానికి కొంచెం ముందుకి కొట్టుకుని వెళ్ళింది. అక్కడక్కడ రాళ్ళ గుట్టలు వుండడంతో ప్రమాదం తప్పింది.

పైన ఆకుపచ్చటి చెట్లు గాలికి వూగుతుంటే వచ్చే చల్లటి గాలి, జలపాతం నీళ్ళనుంచి ఎగిసి ఎగిసి పడే నీటి తుంపరలు, జలపాతం గలగలలు కాసేపు ఆ ప్రకృతిలో మమేకం అయ్యి, ఆనందంతో తిరుగు ప్రయాణానికి అయ్యాం.

అయితే మేము ఆ అడవుల్లోంచి బయటికి రాగానే ఒకతను వచ్చి అమ్మా భోజనం చేస్తారా.... పూర్తి వెజిటేరియన్అని చెప్పాడు. అసలు భోజనమే దొరకదనుకుంటే పూర్తి వెజిటేరియన్ అని చెప్పేసరికి చాలా ఆనందంగా అనిపించింది. మేము తిరిగినంతసేపూ ఆకలి, దాహం తెలియలేదు. అతనితోబాటు వెళ్ళాం.

ఒక చక్కటి పెంకుటిల్లు, లోపల హోటల్ లాగా టేబుల్స్ ఏర్పాటు చేసి వున్నాయి. వాళ్ళది భీమవరంట. వేయించిన కందిపప్పుతో చేసిన పప్పు, దాంట్లోకి ఇంట్లో కాచిన  నెయ్యి, టమేటా చారు, గడ్డ పెరుగు, బీరకాయ రోటి పచ్చడి, వేడి వేడి అన్నం. తింటుంటే చాలా హాయిగా అనిపించింది. నేను అంతా తిన్నాక ఇది కట్టెల పొయ్యిమీద వండారా... అన్నాను. ఆవిడ నవ్వి అవునండీ అని ఇంటి వెనక వైపుకి తీసుకెళ్ళింది. అక్కడ పెద్ద మట్టిపొయ్యి, దానిమీద సన్నటి సెగమీద ఒక గుండిగలాంటి గిన్నెలో అన్నం. పక్కనే చిన్న చిన్న పొయ్యిలు కనిపించాయి. మా పిల్లలు మట్టి పొయ్యిలు చూడ్డం అదే మొదలేమో.... చాలా ఆశ్చర్యంగా చూశారు.

మొత్తానికి అక్కడ ఆప్యాయతతో కూడిన భోజనం చేసి తిరిగి రాజమండ్రి వచ్చేశాం.