25, జులై 2023, మంగళవారం

*** చాలా సంవత్సరాలకి 113K బస్సుతో నేను బస్సులో కనిపించిన వింతలు- విశేషాలు, నా జ్ఞాపకాలు *** - 94

 *** చాలా సంవత్సరాలకి 113K బస్సుతో నేను

బస్సులో కనిపించిన వింతలు- విశేషాలు, నా జ్ఞాపకాలు ***

దూరం నుంచీ చెయ్యి చూపించాను...



113K బస్సు డ్రైవర్ ఆపాడు. “తొందరగా రామ్మా!” అన్నాడు. ఒక్క ఉదుటన బస్ ఎక్కాను. కండక్టర్ వెనక నుంచి వస్తూ...

“ఎక్కడికి వెళ్ళాలి?”
“ఎస్ ఆర్ నగర్”
మళ్ళీ “ఎక్కడికి?” అన్నాడు.
“సంజీవరెడ్డి నగర్”
“సంజీవరెడ్డి నగర్ కాదు ఎస్ ఆర్ నగర్ అనాలి” అన్నాడు.

నేను నవ్వేసి “ఓహో అలాగా... బస్ ఎక్కి చాలా రోజులైంది. ఏమనాలో కూడా గుర్తులేదు. టికెట్ ఇవ్వండి” అన్నాను. 27 సంవత్సరాలు సంజీవరెడ్డి నగర్ లో ఉన్నామని అతనికి తెలియదుగా...

డ్రైవర్ వెనక ముగ్గురు కూచునే అడ్డసీటు వుంది. ఈమధ్య బస్సుల్లో సీట్లు కూడా మార్చినట్టున్నారు. నేను ఆసీటులో కూర్చున్నాను. నా పక్కనున్న తల్లీ, కూతుళ్లు ఏదో ఫంక్షన్ కి వెళ్ళివచ్చినట్టున్నారు. డ్రైవర్ మాటలకి, నా మాటలకి కూతురు నన్నుచూసి నవ్వింది. ఎక్కడికో ఫంక్షన్ కి వెళ్ళిట్టున్నారు. ఒంటినిండా నగలు, పట్టు చీరలు. ఆ అమ్మాయి చాలా కూల్ గా వుంది.

***

ఇంతలోకే ఓ స్కూటర్ పిల్ల బస్సుని రాసుకుంటూ బస్సు ముందునుంచి పోయింది. డ్రైవర్ ఒక్కసారి అదురుకుని సడన్ బ్రేక్ వేశాడు. ముందు కూచున్న మాకు ఒక్కసారి గుండె దడదడ కొట్టుకుంది. నేను “పడిందా...” అని గట్టిగా అన్నాను. “లేదు వెళ్ళిపోయింది” అన్నాడు డ్రైవర్. అమ్మయ్య అనుకున్నాను. పిల్లలు చాలా తుంటరిగా వున్నారు.

***

ముందు బస్ స్టాప్ లో బస్ ఆగింది. ఓ నాజూకు నారి, వాళ్ళమ్మ కాబోలు ఎక్కారు. చూడ్డానికి ఆ అమ్మాయి తమాషాగా వుంది. ముక్కుకి ఫ్యాన్సీ ముక్కెర పెట్టుకుంది. చెవులకి పొడవైన లోలకులు వేలాడుతున్నాయి. కోల మొహం. తెల్లగా వుంది. అందం అంటే అంత అందంగా ఏం లేదు. పెళ్ళయ్యింది. ఆ సన్నటి శరీరాన్ని ఒకటే మెలికలు తిప్పుతోంది. జుట్టు అంత ఒత్తుగా లేదు. కాకపోతే నొక్కుల నొక్కుల జుట్టు గాలికి మొహం మీద ఆటలాడుతోంది.

నేను కూచున్న సీటులోంచి ఆ అమ్మాయి మొహం బాగా కనిపిస్తుంది. ఎందుకో పదే పదే చూడాలనిపించింది. నాలుగైదుసార్లు చూశాను. కానీ ఆ అమ్మాయి మొహంలో నవ్వులేదు. కళ్ళు తీక్షణంగా దేన్నో వెతుకుతున్నట్టు ఆరాటపడుతున్నాయి.

అంతచక్కటి పిల్ల మటమటలాడుతోంది. నవ్వుచూడాలనిపించింది. ఉన్నట్టుండి ఏదో చుడువాపల్లీ లాంటిది తీసి పక్కనావిడకి ఇచ్చి తనూ గబగబా తినేస్తోంది. ఆ తినడంలో ఈ సమస్యకి పరిష్కారం వుందా అన్నట్టు వుంది. ఇంక చూస్తే బావుండదని రోడ్డు వైపు చూడ్డం మొదలు పెట్టాను.

***

ఆ అమ్మాయిని పరిశీలించే హడావుడిలో బస్సు తిలక్ నగర్ మీద నుంచి వెడుతోంది. తిలక్ నగర్ చూడగానే ఓ జ్ఞాపకం పొరలలోంచి బయటికి వచ్చింది. నేను హిమాయత్ నగర్ లో పనిచేసినప్పుడు భూషణ్ మాతో పనిచేసేవాడు. ఒకరోజు వచ్చి “మా ఇంటి దగ్గర ఒక స్కూలు అమ్మకానికి వచ్చింది. 8 వేలకి ఫర్నిచర్, గుడ్ విల్ తో బాటు అమ్ముతున్నారు. మీరు 3 వేలు పెట్టి పార్టనర్ షిప్ తీసుకుంటారా? ఒకసారి మా ఇంటికి రండి” అన్నాడు.

నేను నిజంగానే స్కూలులో పార్టనర్ షిప్ తీసుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే డిగ్రీ అవగానే కొన్ని నెలలు స్కూల్లో చేసిన అనుభవం నా వెన్నుతట్టింది. ఆదివారం వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళింట్లో వెజిటబుల్ బిర్యాని పెట్టారు. అది తిన్నాక బాదం మిల్క్ ఇంట్లో చేసినది ఇచ్చారు. కాసేపు ఛెస్ ఆడుకుందాం అని, తను వాళ్ళావిడ నాకు ఎలా ఆడాలో చెప్పి నాతో ఆడారు. అది మొదటి సారే అయినా చాలాసార్లు వాళ్ళని ఓడించాను. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆడలేదు.

నన్ను తీసుకెళ్ళి స్కూలు చూపించాడు. చాలా బావుంది. “నేను ఊరికి వెళ్ళి మా పెద్దక్కతో మాట్లాడి చెప్తాను. అంతవరకు ఆగండి” అన్నాను. అతను అప్పటికి సరే అని తల వూపాడు.

నేను ఊరు వెళ్ళడం అక్కకి చెప్పడం జరిగింది. అప్పటి వరకూ మా ఇంట్లో ఎవరూ స్వయంకృషి మీద పైకిరావడం తెలియదు. అక్క మౌనంగా వుండిపోయింది. కానీ నేనేమీ నిర్ణయం తీసుకోలేకపోయాను. 1986లో 2000 వేలు చాలా ఎక్కువే మరి.

***

అటు పక్క ముందు సీటులో ప్రశాంతంగా కాళ్ళు జాపుకుని కూచున్న ఒకావిడ నిద్రలోకి వెళ్ళిపోయింది. మధ్యమధ్యలో కళ్ళు తెరిచి తనెక్కడుందో చూసుకుంటోంది. ఫీవర్ హాస్పిటల్ బస్ స్టాప్ లో బ్యాగ్ సద్దుకుని హడావుడిగా దిగిపోయింది. ఓహో ఎంత నిద్రలో వున్నా ఆవిడలో వున్న అలారం చెప్తుందనమాట అనుకున్నాను.


***

చూస్తుండగా బస్ బరకత్ పూరా వైపు మలుపు తిరిగింది. ఆ మలుపు నన్ను ఒక్కసారి నాలో ఉలుకుని కలిగించింది. అమ్మతో గడిపిన ఇల్లు, ఆ రోజులు గుర్తుకు వచ్చాయి.

రాఘవేంద్రస్వామి గుడికి దగ్గిరికి రాగానే అప్పటి నుంచీ ఇప్పటి వరకూ మారని కళ్ళ డాక్టరు బోర్డు కనిపించింది. అమ్మకి కంటికి ఏదో అయ్యిందని దగ్గరలో ఉన్నాడు కదా అని తీసుకెడితే... అమ్మ ఏదో చెప్పబోతే చాలా విసుక్కున్నాడు. అమ్మ చాలా బాధపడింది. నేను “సరిగ్గా చెప్పండి. మీరు కాకపోతే ఇంకొకరు” అని అమ్మ తీసుకుని ఇంటికి వచ్చేశాను.

***

హిమాయత్ నగర్ వచ్చింది. అదో పెద్ద ప్రపంచం అయిపోయింది. అప్పటి ప్రశాంతత లేదు. పెద్ద హోటళ్ళు, షాపులు. నగరం నడిబొడ్డున ఒక ధనవంతమైన షాపింగ్ సెంటర్లా అయిపోయింది.

హిమాయత్ నగర్ లో ఒకప్పుడు మినర్వా హోటల్ చోటులో గాయత్రీ భవన్ వున్నప్పుడు దాని ముందు ఒకతను పెన్నులు అవీ పెట్టుకుని కూచునేవాడు. అతను ముసలివాడు అయిపోయాడు. కొడుకనుకుంట కూచున్నాడు. ముసలాయన వచ్చేపోయే వాళ్ళు బళ్ళు, కార్లు పెట్టుకోవడాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. బస్సు మెల్లగా లిబర్టీ వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ ఆఫీసు పక్క నుంచి వెళ్ళట్లేదు.

ఆ గాయత్రీ భవన్ లో ఎన్నోసార్లు టిఫిన్ చేశాం. మంచి రుచికరంగా వుండేది. ఈ మధ్య రాజ్ భవన్ రోడ్డులో గాయత్రీ భవన్ చూశాను. అదీ, ఇదీ ఒకటో కాదో తెలియదు.




***

లిబర్టీలో ఉన్న మున్సిపల్ ఆఫీసు వాళ్ళు ఆ చోటుని పార్కింగ్ కి సెట్ చేసుకున్నారు. అడ్డాలు పెట్టేశారు. అక్కడ పక్కనే ఎప్పుడూ విశాలాంధ్ర వాళ్ల బుక్ షాప్ వుండేది. చాలా పుస్తకాలు కొన్నాం. బస్సు అటు వెళ్ళకపోవడంతో అమ్మ కాసేపు మురికివాసన పీల్చే పని తప్పింది అనుకున్నాను. ఆ మురికి వాసన ఇప్పటికీ ముక్కులోంచి కడుపులో ఎక్కడికో వెళ్ళి వికారం తెప్పిస్తుంది.

***

మొత్తానికి 113K లో ఊరంతా తిరిగి అనుభవాలు, అనుభూతులు నెమరు వేసుకుంటూ అమీర్ పేట ఛర్మాస్ పక్కన బస్ స్టాప్ లో దిగి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాను. మొత్తానికి 200 రూపాయలలో ఉప్పల్ వెళ్ళి, వచ్చాను. డబ్బులకోసం కాదు. ఎప్పుడైనా బయటి ప్రపంచం ఎంత మారిపోయిందో చూడాలంటే బస్సు కూడా ఒక సాధనమే. చక్కగా అన్నీ కనిపిస్తాయి. కానీ అస్తమానం ఆ టైం పెట్టలేం.

2 కామెంట్‌లు:

  1. అవునండి, సంజీవరెడ్జి నగర్ ని S R Nagar చేసేసారు. ఈ కాలం వారెవరయినా S R Nagar అంటే పూర్తి పేరు ఏమిటి అని అడిగితే చెప్పలేక పోవచ్చు. వైజాగ్ లో “మువ్వల వాని పాలెం” అని ఒక పెద్ద కాలనీ ఉంది. ఒకప్పుడు నోరంతా తెరిచి పూర్తి పేరు పలికేవాళ్ళు. ఇప్పుడు దాన్ని MVP కాలనీ చేసేసారు; ఆ మాత్రం కూడా పలకడానికి బద్ధకించే వాళ్ళు సింపుల్ గా MVP అనేస్తుంటారు. సిటీ బస్సుల మీద కూడా అలాగే వ్రాసుంటుంది. ఇంకా ఆ ఊరిలోని “నక్క వాని పాలెం”, “రేసపు వాని పాలెం” వగైరాలు ఏం రూపాంతరం చెందాయో మరి? అలాగే విజయనగరం దగ్గరున్న గజపతి నగరం పేరు కూడా ఏమయినా పొట్టిదయి పోయిందా తెలియదు. SMS లు, e-mail వచ్చిన తరువాత అన్నిటికీ షార్ట్ కట్టే.

    సిటీ బస్సు ప్రయాణం చాలా పాత జ్ఞాపకాల్ని తట్టి లేపుతుంది. ఊరంతా విపరీతమయిన మార్పులు కదా. చాలా చోట్ల కొత్త కొత్త గుర్తులు వెలుస్తున్నాయి. ఒకప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషను అంటే అందరికీ తెలిసేది, అక్కడ బస్ స్టాప్ పేరు కూడా అదే. ఆ మధ్య దానికెదురుగా “హైదరాబాద్ సెంట్రల్” అని ఓ మాల్ వెలిసింది. ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఎక్కడుందంటే హైదరాబాద్ సెంట్రల్ కు ఎదురుగా అని చెబితే గానీ ఈ కాలం వారికి అర్థం అవని పరిస్ధితి. మార్పు ….. మార్పు ….. మార్పు.

    అవునూ, మీరు అమీర్ పేట కు వెళ్లడానికి దాన్ని దాటి సంజీవ రెడ్డి నగర్ వరకు టికెట్ తీసుకున్నారా? ఓహో, RTC స్టేజీల గోలేమో?

    లిబర్టీ దగ్గర నుంచి బస్ మునిసిపల్ ఆఫీసు ప్రక్కగా వెళ్ళడం లేదన్నారు కదా. మరి స్ట్రెయిట్ గా వెళ్ళిపోతాందా? ఒకప్పుడు అలాగే వెళ్ళేవి. తరువాత తరువాత మునిసిపల్ ఆఫీసు వైపు తిరిగేవి. మళ్ళీ మొదటికొచ్చిందా?

    మొత్తానికి మీ ప్రయాణం బాగున్నట్లుంది.

    ఒక మనవి - మీ బ్లాగు పోస్టుల్లో అక్షరాల సైజు కాస్త పెద్దది చేస్తే చూపు మందగించిన మాలాంటి వాళ్ళకి కాస్త సౌకర్యంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  2. బస్సులు ఎక్కితే కానీ కొన్ని విషయాలు తెలియవు సర్. అవును అన్ని పేర్లు షార్ట్ కట్ చేసి పడేస్తున్నారు. పంజాగుట్ట అయితే చాలా మారిపోయింది. నేను సంజీవరెడ్డి నగర్ టికెట్ తీసుకున్నాను కానీ.... అక్కడ నుంచి కన్నా ఛర్మాస్ దగ్గిర దిగిపోతే కమ్మ సంఘం పక్కనుంచి శ్రీనగర్ కాలనీ చాలా దగ్గిరవుతుందని అక్కడ దిగిపోయాను. లిబర్టీ దగ్గర మున్సిపల్ ఆఫీసు దగ్గర నుంచి కొన్ని బస్సులే వెడుతున్నాయి సర్. మామూలు కన్నా పెద్దవిగానే పెడుతున్నాను. ఇంకా సైజు పెంచుతాను సర్. మీకు నా ధన్యవాదాలు. నాకు బస్సు ప్రయాణం చాలా సరదాగా అనిపించింది.

    రిప్లయితొలగించండి