29, జనవరి 2023, ఆదివారం

వస్త్రాల ఉప్పెనలో మునిగితేలుతున్న ప్రపంచం - 68



 వస్త్రాల ఉప్పెనలో మునిగితేలుతున్న ప్రపంచం - 68

మేము హైదరాబాద్ వచ్చేవరకూ బట్టలు కుట్టడానికి బయట ఇవ్వడం అనేది అసలు తెలియదు. ఎందుకంటే మా చిన్నప్పుడు అమ్మ పిల్లలందరి బట్టలు కుట్టాలంటే చాలా అయిపోతుందని పక్కరోడ్డులో ఉన్న ఒక ఆడ టైలర్ దగ్గిరకి వెళ్ళి టైలరింగ్ నేర్చుకుంది. 300 రూపాయలు పెట్టి ఉషా మిషన్ కొనిపించుకుని మా అందరి బట్టలు తనే కుట్టేది.

అమ్మ ఉద్యోగం చెయ్యకపోయినా అమ్మచేసిన పనికి చాలా ఖర్చు కలిసొచ్చినట్టే... మరి. ఎంత ఆస్థాన పనిమనిషి, ఆస్థాన చాకలి దాదాపు 25 సంవత్సరాలు మానకుండా చేసినవాళ్ళు ఉన్నప్పటికీ... పిల్లలందరి సంగతీ చూసుకోవడం అనేదే పెద్దపని వుండేవి. టైమ్ మేనేజ్ మెంట్ ఎలా వుండేదో మరి.

ఇంక హైదరాబాదు వచ్చాక మాటి మాటికీ వూరెళ్ళి అక్కడ నుంచి కుట్టించుకుని తెచ్చుకోవాలంటే డబ్బులు చూసుకోవాలి. ఉద్యోగాల్లో శలవు కావాలి. మెహదీపట్నంలో ఉండగా ఇంటి వెనక వైపున ఒక టైలర్ వుండేవాడు. మామూలుగా అంటే ఏదో ఒకలాగా కుట్టడానికి 70 పైసలు. చాలా బాగా కుట్టాలంటే రు. 2 తీసుకునేవాడు.

అదేం తేడానో అర్థమయితే కదా... రెండు రూపాయలు తీసుకుంటే జాగ్రత్తగా కుడతాడనమాట. కానీ అమ్మో 2 రూపాయలా అనుకునేవాళ్ళం. తప్పనిసరయితే 70 పైసలు పెట్టి కుట్టించుకునేవాళ్ళం. నేను యూసఫ్ గూడాలో పనిచేసినప్పుడు నన్ను ఇబ్బందులు పెట్టిన ఆ హీరోయిన్ కూడా కుట్టించి పెట్టమంటే ఒకటి బాగా కుట్టాడు. మురిసిపోయింది. మరో నాలుగు ఇచ్చింది. తగలేసి పెట్టాడు.

అడుగు పెడితే బట్టల షాపులు లేవు. ఏవైనా కొనుక్కోవాలంటే కోఠీ వెళ్ళాల్సిందే. అప్పుడప్పుడే చీరలు ఒకళ్ళో ఇద్దరో ఇన్స్టాల్ మెంట్స్ లో అమ్మేవారు. రు. 20 చీరకి 5 సార్లు ఇచ్చేవాళ్ళం. అవీ ఎక్కువ రాజ్ కమల్ లాంటి కాటన్ చీరలు వుండేవి.

కోఠీ వెడితే కుప్పలు పోసి రు.20 లేదా 30కి అమ్మేవారు. చూసుకోకుండా తీసుకున్నామంటే దాన్ని ఒక గుమ్మానికి కర్టెన్ గానో, లేకపోతే దాన్ని ఇంకో రకంగానో ఉపయోగించుకోవాల్సిందే. హడావుడి పనికిరాదు. ఇలా కొనుక్కున్న వాటికి అంచులో, జాకెట్లో కుట్టించుకోవాలంటే టైలర్ ని వెతుక్కోవలసిన పరిస్థితి. ఎవరో ఎక్కడో టైలర్ వున్నారంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళచేత కుట్టించుకునే వాళ్ళం. వాళ్ళు తీసుకున్నది రు. 4. రోజులు మారుతున్నకొద్దీ...! సంపాదన పెరుగుతున్నకొద్దీ ఖర్చుకూడా అంతే...!

పంజాగుట్ట మీద నుంచీ బస్ వెళ్ళేటప్పుడు Muntaz Boutique అని ఒక బోర్డు కనిపిస్తూ వుండేది. ఎత్తైన గోడలున్న పేద్ద ఇల్లు. లోపలంతా చెట్లు కనిపిస్తూ వుండేవి. బాగా డబ్బున్నవాళ్ళిల్లు లాగే వుండేది. అసలు ఆ Boutique అంటే ఏమిటో తెలియదు. ఎవర్ని అడిగినా ఎవరైనా చెప్తే కదా... అందరూ నాలాంటి వాళ్ళే... అవునా మేం చూడలేదే అనేవారు. అయినా అంటే ఏంటో మాకూ తెలియదు అన్నారు.

నాకు ఏదైనా కనిపిస్తే దాన్ని గురించి తెలుసుకోవాలని ఆత్రం ఎక్కువ. ఒకసారెప్పుడో అక్కడ బస్ దిగినప్పుడు ఆ ఇంటి గేటు వరకు వెళ్ళి ఇక్కడ ఎవరుంటారు? ఏం చేస్తారు? అని అడిగాను. అక్కడున్న సెక్యూరిటీ అతనికి హిందీ తప్ప తెలుగు రాదు. నాకు హిందీ రాదు. సగం తెలుగు, సగం వచ్చీరాని హిందీలో మాట్లాడాను. మొత్తానికి అర్థం చేసుకున్నాడు. కపడా... మేమ్ సాబ్ టైలర్... అన్నాడు. థాంక్స్ చెప్పేసి వచ్చేశాను. అబ్బో బట్టలు కుట్టడానికి కూడా ఇలాంటి బోర్డు పెట్టుకుంటారా....!!! అనుకున్నాను. పోనీలే నా సందేహం తీరింది అమ్మయ్య అనుకున్నాను. తర్వాత ఆలోచిస్తే దీనికి ఇంత ఆత్రపడడం ఎందుకు? అమ్మయ్య అనుకోవడం ఎందుకు? అనిపించింది. ఓ కొత్త విషయం తెలుసుకున్నాను.

అయిపోయిందా.... ఇంక మెల్లి మెల్లిగా రోజులు పెరుగుతున్నకొద్దీ... టైలర్లు పెరగడం మొదలు పెట్టారు. నేను మా అమ్మ దగ్గిర కొన్ని బట్టలు కుట్టడం నేర్చుకున్నాను. కొంత తెలుసుకదా అని, మా అమ్మాయి పుట్టినప్పుడు తనని మా అత్తగారికి అప్పచెప్పి, మహిళామండలి వాళ్ళు నేర్పిస్తుంటే నేర్చుకుందామని వెళ్ళాను. నేను ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ నేర్చుకోవడానికి వచ్చిన ఐదారుగురు అమ్మాయిలు వుండేవారు కానీ... నేర్పేవాళ్ళు ఎప్పుడూ కనిపించలేదు.

మొత్తానికి ఎక్కడో ఎంతో దూరంలో ఎవరో ఒకరు టైలర్ దొరికేవారు. తర్వాత్తర్వాత ఒక జాకెట్ కి 15 రూపాయలు, 20 రూపాయలు తీసుకునేవారు. టైలర్లు మాత్రం చాలా తక్కువ. ఇన్నిరకాల బట్టలు అప్పుడు లేనేలేవు.

ఇప్పుడు చూస్తే అడుగు పెడితే బట్టల షాపులు. టైలర్ షాపులు. రెడీమేడ్ షాపులు. అప్పటికప్పుడు ఏదైనా వూరెళ్ళాలంటే... షాపింగ్ కి వెళ్ళిపోయి రెడీమేడ్ తెచ్చేసుకుని రెడీ అయిపోవడమే.

ఆన్ లైన్ ఒకటి ఎక్కువైపోయింది. వాళ్ళు పెట్టే ఫోటోలు ఒకటి. పంపించేవి ఒకటి. కొన్నయితే ఎంత దారుణంగా వుంటాయో... అసలయితే మనకి ఏవి కావాలన్నా చెప్పేస్తే కుట్టేసి కొరియర్ లో పంపించేస్తారు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రపంచం గుప్పిట్లోకి వచ్చేసింది. ఏమూల ఎవరు ఎక్కడ ఏం బిజినెస్ చేస్తున్నారో నిమిషాల్లో తెలుసుకుంటున్నారు.

ఏం చేసినా జరిగే మోసాలు జరుగుతున్నాయి.

ఈమధ్య మాకొక కొరియర్ వచ్చింది. అది ఢిల్లీలో ఎక్కడో పెద్ద మార్కేట్ నుంచి వచ్చింది. 700 రూపాయలు కట్టి తీసుకోమని. కొరియర్ తెచ్చినతను డబ్బులు అడుగుతున్నాడు. ఎవరు పంపించారో తెలియదు. లోపల ఏదో క్లాత్ లాగా మెత్తగా వుంది. చింపితే డబ్బులు ఇవ్వాలి. అతన్ని అక్కడ ఉండమని.... మా అమ్మయిని, అబ్బాయిని, ఇంకా మా దగ్గిర వాళ్ళందరినీ మీరు పంపారా..?. మీరు పంపారా...? అని అడిగాం. ఈలోపున కొరియర్ అతను అటూ ఇటూ తిరిగేస్తున్నాడు. ఎవరూ పంపలేదనేసరికి తిప్పి పంపెయ్యమని చెప్పాం. మాకు మళ్ళీ ఎటువంటి ఫోన్ కానీ, మెసేజ్ కానీ రాలేదు. ఇలా వుంటాయి.

ఇప్పుడు ఒక జాకెట్ కుట్టాలంటే ఎవరో ఎక్కడో 250 తీసుకుంటారు. కొంచెం పేరున్న షాపుకి వెడితే మినిమమ్ 550 రూపాయలు. చీర రేటు తక్కువయినా ఎక్కువయినా అంతే... ఉద్యోగాలు చేసేటప్పుడు ఉన్న బట్టలతోనే నీట్ గానే వెళ్ళేవాళ్ళం. ఇప్పటి వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి ఎన్ని రకాల బట్టలో.... బుడ్డి బుడ్డి పిల్లలకి కూడా ఎలాంటివి కొనుక్కోవాలో తెలుసు.

ఆస్ట్రేలియాలో ఉన్న మా మనవరాలయితే నాలుగో సంవత్సరం వచ్చింది. డ్రెస్ మీదకి అన్నీ మాచింగ్ కావాలి.

అబ్బో బట్టల గురించి చెప్పాలంటే చాలా కథే వుంటుందని అందరికీ తెలుసు. ఇది ఇంటింటి రామాయణం.

18, జనవరి 2023, బుధవారం

*** రెక్కలు విప్పుకున్న పక్షులు *** - 67


*** రెక్కలు విప్పుకున్న పక్షులు *** - 67



మా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయిపోయారు. నేను చదువులన్నీ ఎస్.ఆర్. నగర్ లోనే అయిపోతాయి. పిజి కాలేజీ కూడా వచ్చేస్తుంది. దూరాలు వెళ్ళక్కరలేదు అనుకున్నాను. అప్పటికే డిగ్రీ కాలేజీ వుండేది. మేము డిగ్రీ చదివాం కాబట్టి అదే దృష్టిలో వుంది.

అమ్మాయికి టెన్త్ క్లాస్ అయ్యింది. కాలేజీలో చేర్పించాలి. నారాయణా కాలేజీ వాళ్లు మీ అమ్మాయి మార్కులకి ఫీజు తగ్గిస్తాము రేపు రండి అని ఫోన్ చేశారు. కాలేజీకి వచ్చి మాట్లాడమన్నారు. మర్నాడు మాట్లాడితే ఆ పని అయిపోతుంది. అందులోనూ మా అమ్మాయికి అనుకున్నపని అనుకున్నట్టు అయిపోవాలి. అస్సలు వెయింటింగ్ ఇష్టం వుండదు.

*** (తను 3వ తరగతిలో ఉన్నప్పుడు పిల్లల పుస్తకాలకి అట్టలు వేసి పంపించమన్నారు. నేను, మా వారు ఇద్దరం కూచుని చాలా జాగ్రత్తగా అట్టలు వేస్తున్నాం. తను కూడా నిద్రపోకుండా కూచుంది. పడుకో అమ్మా... అంటే... కూచుని చూస్తూనే వుంది. కాసేపు పడుకోవడం, మళ్ళీ రావడం చేస్తోంది. సరే కొన్ని వేసి మేము పడుకున్నాం. పొద్దున్న లేచి చూసేసరికి పుస్తకాలన్నింటికీ అట్టలు మేము ఎలా వేశామో అలా వేసుకుంటోంది. స్కూలుకి వెళ్ళేలోపున ఆ పని అయిపోయింది. అప్పటి నుంచీ తమ్ముడి పుస్తకాలకి, తన పుస్తకాలకి తనే అట్టలు వేసుకునేది. మాకు ఆ బాధ్యత వుండేది కాదు. ఎప్పుడూ తమ్ముడి గురించి బాగా ఆలోచిస్తుంది.)

***

వెయిటింగ్ భరించలేకపోవడం నా పోలికే వచ్చినట్టుంది.

కాలేజీకి నేను, మావారు అనుకున్న టైంకి వెళ్ళాం. ముందరే ఇంజనీరింగ్ చదవాలని డిసైడ్ అయిపోయింది కాబట్టి ఎమ్.పి.సి. తీసుకుంది. కాలేజీ వాళ్ళు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారు. ఫీజు కట్టేసి వచ్చేశాం. మాకూ ఒక పని అయిపోయినట్టుంది. కాకపోతే స్కూలు లాగా ఇక్కడ పాటలు, ప్రోగ్రాములు, ఆటలు ఏమీ లేవు. ఈ కార్పొరేట్ కాలేజీల్లో ఇంతే... తను కూడా చదువు మీద దృష్టి పెట్టింది. అప్పుడప్పుడు సంగీతం టీచర్ దగ్గిరకి వెళ్ళివస్తోంది. ఇంటర్ చదువుతుండగా ఎమ్సెట్ కోచింగ్ తనతో మేమూ పరుగులు. అదీ అయిపోయింది. చదువు విషయంలో మేము ఎప్పుడూ పిల్లలని ఒత్తిడి చెయ్యలేదు. వాళ్ళ ఇష్టానికే వదిలేశాము.

ఎస్ ఎస్ ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో EEE (Electrical & Electronics Engineering) తో చేరింది. బస్ లో వెళ్ళాలి. ఫస్ట్ టైం ఒక చిట్టి సెల్ ఫోన్ కొనిచ్చాం. మాకు అప్పటి వరకూ అన్నీ నడిచే దూరంలో ఉన్నాయి. తను వచ్చే వరకూ కొంచెం కంగారుగానే వుండేది. ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్ పూర్తిచేసింది. కొరుకుడు పడని సబ్జక్టులు అయినా ఎప్పుడూ తప్పకుండా మంచి మార్కులతో పాసయ్యింది. ఒకసారి ఎవరితోనో సాఫ్ట్ వేర్ కంపెనీకి వెళ్ళి అబ్బ ఇలాంటి కంపెనీలో చెయ్యాలని నా కల అంది. ఉద్యోగం వచ్చేలోపున ఖాళీగా వుండకుండా మూడు కోర్సులు చేసింది. ఎంతసేపూ చదువు, చదువు అదే తనకి.

తన కల నెరవేరినట్లు కాగ్నిజంట్ లో ప్రారంభంలోనే పాతికవేలతో ఉద్యోగం వచ్చింది. కానీ ట్రైనింగ్ చెన్నై. 6నెలలు. ఇద్దరం చెన్నై వెళ్ళి తను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేవరకు వుండి, మా వారి అన్నయ్యగారింట్లో దింపేసి వచ్చాం. వీళ్ళింటికి ఆఫీసు దూరమవడంతో తను హాస్టల్ లో వుండాల్సి వచ్చింది. ఎప్పుడూ కన్నీళ్ళు రాని నాకు ధారాపాతంగా వచ్చాయి.

***

హైదరాబాదులో మేము మా పనుల్లో బిజీ అయిపోయాం. మద్రాసు నించి రోజూ ఫోన్ చేసేది. హాస్టల్ తిండి పడక జ్వరం వస్తూ వుండేది. మాకు చెప్పినప్పుడు చాలా బాధగా వుండేది. ఫ్రండ్స్ వుండేవాళ్ళు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకునేవాళ్ళు. ఎంతైనా మా దిగులు మాకుండేది. మా వాళ్ళు ఉన్నా రెండున్నర గంటల దూరం. తను ఫ్రెండ్స్ తో ఆరు నెలలు గడిపేసింది. అలా తనంతట తను ప్రపంచంలో ఎలా బతకాలో నేర్చుకుంది. ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆరునెలలు అయ్యాక హైదరాబాద్ వచ్చేసింది. ఇక మాకూ ఆనందం. కానీ మా పని మేం మానలేదు. రెండేళ్ళు చేశాక తనకి ఏమైనా సరే పై చదువులకి వెళ్ళాలని అనుకుంది.

***

మా అబ్బాయి అక్కతోబాటే స్కూలు వరకూ కలిసి వెళ్ళినా తను ఇంటర్ కి వచ్చేసరికి సెపరేట్ అయ్యాడు. వాడు ఆడుతూ పాడుతూ చదివేవాడు. వాడి ఆలోచనలు అన్నీ వేరేగా వుండేవి. ఎప్పుడూ ఏదో కొత్త దారిలో వెళ్ళాలనే ఆలోచనే... కానీ అక్కని మాత్రం ఎప్పుడూ ఫాలో అవుతాడు.

ఇంటర్ గౌతమి కాలేజీలో చేరాడు. వాడుకూడా అక్కబాటే. ఎమ్.పి.సి. తీసుకున్నాడు. మంచి మార్కులతోనే పాసయ్యాడు. ఎమ్మెసెట్ లో వాడికి వచ్చిన రాంక్ కి అతి పెద్ద కాలేజీ అయిన సెంట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజి (రామోజీ ఫిల్మ్ సిటీ) దగ్గర సీటు వచ్చింది. ఐటి లో చేరాడు.

ఇంచుమించు రెండుగంట దూరం కాలేజీ బస్ లోనే అయినా మొదట్లో ఇబ్బంది పడ్డాడు. దొరికిన వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ కావడంతో - క్లాసులున్నప్పుడు క్లాసులకి అటెండ్ అవడం లేనప్పుడు చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసి రావడం చేసేవాడు. చూస్తుండగా వాడికీ ఇంజనీరింగ్ అయిపోయింది. దాని తర్వాత మల్టీమీడియా – యానిమేషన్ కోర్సు చేశాడు. అప్పుడే వాడికి రియల్ పేజ్ ఇండియా అనే యానిమేషన్ కంపెనీలో జాబ్ వచ్చింది. కానీ కొన్ని నెలలు చేశాక అక్కడ పాలిటిక్స్ వాడికి నచ్చక మానేశాడు. ఇంటి నుంచే యానిమేషన్ కి సంబంధించిన వర్క్స్ తీసుకుని చెయ్యడం అలవాటయింది. వాడికి చాలా కళాత్మక దృష్టి వుంది. ఇప్పుడు పెళ్ళి కూడా అయ్యింది. కోడలు చక్కటి పిల్ల అన్నీ అర్థం చేసుకుంటుంది. ఎవరికి తగిన వాళ్ళు వాళ్ళకి దొరుకుతారేమో... వాళ్ళూ బాగా సెటిల్ అయ్యారు.

పిల్లలిద్దరూ ఎప్పుడైనా కొన్ని పరిస్థితుల్లో మానసిక ఒత్తిడికి గురయినా... వాళ్ళతో చిన్నప్పటి కబుర్లు చెపుతూ... వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళి మామూలు మూడ్ లోకి తీసుకు రావడానికి ప్రయత్నించేవాళ్ళం. ఎప్పుడూ డౌన్ అవనివ్వలేదు. ఎందుకంటే సంసారం అన్నాక రకరకాల సమస్యలు అందరికీ వుంటాయి. ఎప్పుడూ ఆనందంగా వుంచడానికే ప్రయత్నించాను.

11, జనవరి 2023, బుధవారం

అనుకోకుండా మరో ప్రముఖవ్యక్తితో పరిచయం - 66

అనుకోకుండా మరో ప్రముఖవ్యక్తితో పరిచయం - 66


2015 డిసెంబరు నెల చివరి వారంలో... పొద్దున్నే 6 గంటలకి ఫోను – ఆ టైములో అసలు ఫోన్ ఎవరు చేస్తారూ...? ఎందుకు చేస్తారూ....? అనుకుంటూ landline దగ్గిరకి వెళ్ళి ఫోన్ ఎత్తాను. అవతలి నుంచి కొంత పెద్దవాళ్ళు, మగవాళ్ల గొంతు - “నాగలక్ష్మి గారూ... నా పేరు సంధ్యావందనం శ్రీనివాసరావు. సంధ్యావందనం లక్ష్మీదేవి గారి భర్తని. లక్ష్మీదేవిగారు మీతో మాట్లాడాలంటున్నారు. మా ఫోన్ నెంబరు, ఇంటి అడ్రసు ఇస్తాను. రాగలరా... లక్ష్మీదేవికి ఒంట్లో బావుండట్లేదు. మీరు వస్తే బావుంటుంది. మేము కార్ఖానాలో ఉంటాం” అని అడ్రస్ ఇచ్చారు.

“సంధ్యావందనం లక్ష్మీదేవిగారి పేరు బాగా విన్నాను సర్. రేపు మా వారిని తీసుకుని మీ ఇంటికి వస్తాను సర్” అని చెప్పి ఫోన్ పెట్టేశాను. మర్నాడు పొద్దున్న వాళ్ళింటికి బయల్దేరాం. అప్పట్లో ఊబర్ లు, ఓలాలు లేవు. వెతుక్కుంటూ వెళ్ళాలంటే కష్టం. నేను, మా వారు కలిసి తెలిసిన ఆటోలో వెళ్ళాం. లక్ష్మీదేవిగారి మొహం కొంచెం నీరసంగా వున్నా... మొహంలో ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. ఆయన మా ఇద్దరికీ జామకాయ జ్యూస్ ఇచ్చారు.


లక్ష్మీదేవిగారు వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి చెప్పి, వైదిక నిత్యకర్మవిధి పుస్తకం ఇంతకు ముందు ఒక చోట డిటిపి చేయించాం. చాలా తప్పులు వున్నాయి. నాకు పుస్తకం మీద ఎంత ఆశ వున్నా... ఆ తప్పులకి నీరసం వచ్చింది. అవన్నీ కరక్ట్ చేసి మళ్ళీ పుస్తకం ప్రింట్ చేయిద్దామనుకుంటున్నాం. సోమరాజు సుశీలగారు మీరు పేరు చెప్పారు. మీరు ఈ మేటర్ ఎలా ఎప్పటిదప్పుడు మీరు వచ్చిన ఆటో అబ్బాయికి ఇచ్చి పంపిస్తారా...? అన్నారు. మేము టైపు చేసేసి చెప్తాము అన్నాను. టైప్ చెయ్యడం మొదలు పెట్టాం. అంతా సంస్కృత శ్లోకాలు వాటికి అర్థాలు. టైపు చెయ్యడం అయిపోయాక చెప్పాం.

లక్ష్మీదేవిగారు “అమ్మా... మీరు పంపించద్దు. నేను వరసగా ఒక వారం రోజులు వచ్చి ఆ పుస్తకం పూర్తి చేసుకుంటాను. మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకునేందుకు అవకాశం కల్పించండి. నాకు ఇప్పుడు పుస్తకం మళ్ళీ మొదలు పెట్టాక ఓపిక వచ్చింది” అన్నారు.

ఒక వారం రోజులు వచ్చి పుస్తకం పూర్తిచేసుకున్నారు. ఇద్దరూ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి కావలసి భోజనం తెచ్చుకుని వచ్చేవారు. నేను కూడా మా ఇంట్లో చేసినవి ఇచ్చేదాన్ని. మొత్తానికి పుస్తకం వాళ్ళకి నచ్చినట్లు వచ్చింది. అంత ఒంట్లో బావుండకపోయినా మధ్యలో రెస్ట్ తీసుకుంటూ చాలా ఓపికగా పని పూర్తి చేసుకున్నారు.




ఇక పుస్తకాలు ఆపేద్దామనుకున్నాను కానీ, ఇంకో రెండు పుస్తకాలు రాసి నీ చేత చేయించుకోవాలనిపిస్తోంది అన్నారు. తప్పకుండా మళ్ళీ వస్తానని వెళ్ళిపోయారు. ఆవిడ అనారోగ్యం వల్ల పిల్లలు అమెరికా తీసుకెళ్ళారు.

పుస్తకం పేరు “వైదిక నిత్యకర్మ విధి”. పుస్తకం ఆవిష్కరణకి తప్పకుండా రమ్మని చెప్పారు. ఆవిష్కరణకి వెళ్ళాం. వేదిక మీద ప్రముఖులైన – ఆవుల మంజులతగారు (మాజీ తెలుగు అకాడమీ డైరెక్టర్, అప్పటి తెలుగుయూనివర్సిటీ వి.సి.), గొట్టిపాటి సత్యవాణిగారు (శ్రీధర్మపురి దేవాలయాల నిర్వాహకురాలు, ధార్మికోపన్యాసకురాలు), సోమరాజు సుశీలగారు (ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, రచయిత), సంధ్యావందనం లక్ష్మీదేవిగారు ఉన్నారు.





భూమి గుండ్రంగా వుందన్నట్టుగా నాకు వర్కుల ద్వారా పరిచయం అయిన వాళ్ళందరూ ఒకే చోట కనిపించేసరికి సంతోషంగా అనిపించింది. వాళ్ళు నాకు సన్మానం చేస్తున్నట్టు చెప్పలేదు. అక్కడకి వెళ్ళాక స్టేజి మీదకి పిలిచి సన్మానం చేశారు. అదొక మంచి జ్ఞాపకం. తర్వాత సత్యవాణిగారు చెప్పారు – “నేను, సుశీల గారు అక్కడ కూచున్నంతసేపూ నీ గురించే మాట్లాడుకున్నాం. సుశీల గారి వర్కులు కూడా చేస్తున్నావుట కదమ్మా....” అన్నారు. అదొక ఆనందకరమైన విషయం.

నేను 2019 సెప్టెంబరు 5వ తేదీన ఆస్ట్రేలియా వెళ్ళడానికి హడావుడి పడుతుంటే... ఆగస్టు 25వ తేదీన సంధ్యావందనం శ్రీనివాసుగారు మళ్ళీ ఇంకో పుస్తకం తీసుకుని వచ్చారు. మీరెళ్ళేలోపున అయిపోతుంది చేసిపెట్టండి అన్నారు. నేను మేటర్ టైపింగ్ చేసి పెడతాను. నాకు వర్కు చేసిపెట్టే శ్రీనివాస్ కి మిగిలిన పని అప్పచెప్తానని, టైపింగ్ వరకూ చేసి ఇచ్చేశాను. పని మొత్తం శ్రీనివాస్ కి అప్పచెప్పి వెళ్ళిపోయాను. ఆయన శ్రీనివాస్ చేత మిగిలిన పని పూర్తి చేయించుకుని పుస్తకం ప్రింట్ చేసుకున్నారు.

3, జనవరి 2023, మంగళవారం

*** శరీరం సహకరించకపోయినా.... ఆత్మస్థైర్యమే ఆయనకి బలం *** - 66

 *** శరీరం సహకరించకపోయినా.... ఆత్మస్థైర్యమే ఆయనకి బలం *** - 66

*** కోడూరు పుల్లారెడ్డిగారు అవిశ్రాంత రచయిత ***






మా ఫ్రెండ్ తో కలిసి పుల్లారెడ్డిగారి అబ్బాయి గృహప్రవేశానికి వెళ్ళాను. నాకు అప్పటి వరకూ ఆయన కానీ, అమ్మాయి, కోడలు పరిచయం లేరు. అందరూ బాగా మాట్లాడారు. చాలా మర్యాదగా, అభిమానంగా మాట్లాడారు. ఆయన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కర్రలు పట్టుకుని నడుస్తున్నారు. నా ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు. ఒకరోజు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చారు.

ఆయనకి కొన్ని అనారోగ్య కారణాల వల్ల నడవలేని స్థితి వచ్చింది. సహాయం లేనిదే నడవలేరు, లేవలేరు, కూచోలేరు. డ్రైవర్ కమ్ అసిస్టెంట్ రాజు ఆయన ఇంట్లోనే కుటుంబంతో ఉండి ఆయనకి అన్ని రకాలుగా సహాయం చేస్తుంటాడు. రాజు చాలా ఓపికమంతుడు. ఈరోజుల్లో ఎంత డబ్బులిచ్చినా పని ఎగ్గొట్టి వెళ్ళిపోతారు. కానీ సంవత్సరాలుగా రాజు ఆయన్ని కనిపెట్టుకుని ఏ అవసరానికైనా ఆయన వెంట ఉంటాడు. మనం కోపంగా మాట్లాడినా అతను మాట్లాడడు. అంత చిన్న వయసులో ఆ ఓపిక ఎలా వచ్చిందా అనిపిస్తుంది. పుల్లారెడ్డిగారు అదృష్టవంతులు.

పుల్లారెడ్డిగారు ఇటువంటి పరిస్థితిలో ఉండి పుస్తక రచన చేస్తున్నారు. రాయలేని స్థితిలో వుండి కూడా *** 'ప్రాచీన ప్రపంచ ప్రసిద్ధ శిల్ప, చిత్రకారులు' *** గురించి ఒక చక్కటి పుస్తకాన్ని తయారు చెయ్యాలనే గట్టి సంకల్పంతో నాకు 2016 నుంచి మా ఇంటికి వచ్చి రోజుకి కొంత కొంత పక్కన కూచుని చెప్తుంటే నేను టైపు చేస్తున్నాను. గొప్ప గొప్ప చిత్రకారుల గురించి ఓపికగా మేటర్ తయారు చేశారు. అది ఒక రిఫరెన్స్ పుస్తకంగా రావాలని ఆయన కోరిక. ఇది కాకుండా మధ్య మధ్యలో ఏవో వ్యాసాలు, లెటర్లు కూడా చేయించుకుంటారు.

నేనే మీ ఇంటికి వస్తాను. కంప్యూటర్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పాను. కానీ ఆయన కదలకుండా కూచుంటే అనారోగ్యం ఎక్కువవుతుందని. ఎంత ఓపిక లేకపోయినా వచ్చి పనిచేయించుకుంటారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పుడు నేను వెళ్ళి పలకరించి వస్తుంటాను.

ఎంత ఓపిక లేకపోయినా ఆయన అలా రావడంతో నేను ఆయనకోసం టైము కేటాయించుకుంటాను. నేను మధ్యలో రెండుసార్లు ఆస్ట్రేలియా వెళ్ళడంతో... పుస్తకం కొంచెం ఆగినప్పటికీ... మొత్తానికి పూర్తయ్యింది. 700 పేజీల పుస్తకం. ఫోటోలు పెట్టే టైముకి కరోనాతో కొన్నాళ్ళు, మధ్యలో ఆయన అనారోగ్యంతో కొన్నాళ్ళు ఆగింది. ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫైనల్ చేసుకుని ప్రింట్ కి ఇస్తానంటున్నారు. ఆయనకి వయసు వల్ల అనారోగ్యం వల్ల ఈమధ్య అసహనం, కోపం ఎక్కువైంది. ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని నడుచుకోవడమే.... అనుకున్నాను. పుస్తకం పూర్తయితే చాలనిపిస్తుంది. మా అమ్మాయి ఎంగేజ్ మెంట్ కి వచ్చిన ప్రముఖులలో ఈయన ఒకరు. మా అమ్మాయి పెళ్ళికి, అబ్బాయి పెళ్ళికి కూడా ఆయన తనంతటతనే కారు ఇచ్చి, రాజుని కూడా మాతో పంపించారు.

ఎప్పుడైనా పని చెయ్యడానికి ఓపిక లేకపోతే పుల్లారెడ్డిగారిని తలుచుకుని ఆయనకన్నా ఎంతోచిన్నదాన్నయిన నేను ఇలా వుండకూడదని నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను.

***
***అన్నను మించిన సోదరుడు ***
***

పుల్లారెడ్డి గారి సోదరుడు కోడూరు ప్రభాకర రెడ్డి గారు కూడా గొప్ప రచయిత.

అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. తమ్ముడి పుస్తకాలన్నీ ఓపిక లేకపోయినా పుల్లారెడ్డిగారు ప్రూఫ్ చేసిపెడతారు.

కోడూరు ప్రభాకరరెడ్డిగారు కడపలో ప్రముఖ పిల్లల వైద్యులు. వారి వైద్య వృత్తిలోనే కాకుండా సాహిత్య ప్రపంచంలో కూడా పేరు ప్రఖ్యాతులున్నాయి. పిల్లల ఆరోగ్యం కోసం అంకితమయినా కూడా ఆయనకి సాహిత్యంపట్ల ఉన్న అభిలాష, తెలుగు మీద ఆయనకి ఉన్న పట్టు, ఆయన పద్యరచనా వైశిష్ట్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన వైద్యుడా, తెలుగు పండితుడా అనిపిస్తుంది.

నేను ఆయన రచించిన నాలుగు పుస్తకాలు డిటిపి, ప్రూఫ్ రీడింగ్, కవర్ డిజైన్ చేశాము. చివరికి ప్రెస్ వాళ్ళ దగ్గర కూచుని ఫైనల్ గా ప్రింటింగ్ కి వెళ్ళేవరకు బాధ్యత తీసుకున్నాం. ప్రూఫ్ రీడింగ్ మేం చేసినా రచయితదే పైచెయ్యి.

1. "సాహితీ రసాయనం" - చక్కటి సాహిత్య వ్యాసాలతో రచించిన ఈ పుస్తకం పరిశోధకులకి చాలా ఉపయోగపడగలదు.
2."షేక్స్ పియర్ సానెట్స్" (భావగీతాలు) - షేక్స్ పియర్ భావగీతాల్ని చక్కటి సీసపద్యాల్లోకి అనువదించారు.
3."కీట్స్ కవితావైభవం" - కీట్స్ కవితల్ని తెలుగు భాషలోకి అందంగా, సరళంగా అనువదించారు.
4. "బాలల భాగవత కథలు" - అందరికీ బాగా అర్థమయ్యేరీతిలో భాగవత కథల్ని రచించారు. వాటికిబొమ్మలు పెట్టమని మాకు అప్పగించడంతో మేము ప్రతి కథకి బొమ్మలు పెట్టాము.
5. శ్రీనాథుని చాటువులు






ఇవి కాకుండా ఈయన రచనలు ఎన్నో ఉన్నాయి.

పుల్లారెడ్డిగారు, ప్రభాకర రెడ్డిగారు సాహిత్యంలో గొప్ప పేరున్న వ్యక్తులు. అన్నగారికి తమ్ముడు ప్రేమతో చేసిన సత్కార సభలో, నాకు కూడా సన్మానం చేశారు. నేను పుల్లారెడ్డిగారి గురించి మాట్లాడాను.