29, జులై 2022, శుక్రవారం

ఎదురీతలో నేను - 37 *** హోరెత్తించిన వినాయక చవితి *** *** ఐరన్ లెగ్ శాస్త్రి ***

 ఎదురీతలో నేను - 37 *** హోరెత్తించిన వినాయక చవితి *** *** ఐరన్ లెగ్ శాస్త్రి ***

***అమ్మ పెళ్ళి సంబంధాల గురించి తెలిసిన వాళ్ళకి చెప్పి కనుక్కుంటూనే వుంది.***


*** హోరెత్తించిన వినాయక చవితి ***



1986లో అమ్మ వచ్చిన తర్వాత - సెప్టెంబరు 7వ తేదీ, ఆదివారం ***వినాయక చవితి*** వచ్చింది. అమ్మ పిల్లలు ఇన్నాళ్ళు తను లేకుండా చేసుకున్నారని. ఒకటే హడావుడి చేసింది. తను కూడా మాతో సరదాగా కూరగాయల మార్కెట్ వచ్చి, తనకి కావలసినవన్నీ తీసుకుంది. సరుకులన్నీ తెప్పించింది. మాకు కూడా సంతోషంగానే అనిపించింది. మా ఇల్లు రోడ్డు మీదే వుండేది కదా... రోడ్డుకి అవతల వైపున ***వినాయకుడి మండపం*** పెట్టారు. అమ్మ చూడడం అదే మొదలు కాబట్టి 9 రోజులు కాలక్షేపం బాగా వుంటుంది బాల్కనీలో కూచుని చూడచ్చని అనుకుంది.

మొదటి రోజు ఇంట్లో పూజ హడావుడి సరిపోయింది. అంతా బాగా జరిగింది. అమ్మ ఉండ్రాళ్ళు రకరకాల పిండివంటలు చేసింది. మంచి భోజనం ఆనందంగా తిన్నాం. ఇంక వినాయక మంటపం వాళ్ళు మైకులు పెట్టి మంత్రాలతో పూజ మొదలు పెట్టారు. సౌండ్ ఎక్కువగానే వుంది. సరేలే ఒకరోజే వుంటుందనుకున్నాం.

ఇక మర్నాడు పొద్దున్నే పెద్ద సౌండ్ తో రకరకాల పాటలు వేస్తున్నారు. చెవులు చిల్లులు పడిపోయేలా. ఆ సౌండ్ మాకు కడుపులో పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి వాయిస్తున్నట్టుంది. కాళ్ళలోంచి వణుకు. ఇల్లంతా అదరుతోంది. భరించడం చాలా కష్టమైపోయింది. మైక్ మా ఇంటివైపుకి ఒకటి వుంది. అమ్మ కూడా బాగా ఇబ్బంది పడింది. మధ్యాహ్నం వరకూ అదే తంతు. సాయంత్రం మళ్ళీ 5 గంటలకి మొదలయ్యింది. ఇంట్లో ఒకళ్ళమాటలు ఒకళ్ళకి వినిపించట్లేదు.

ఆ మంటపం దగ్గర గొడవలవ్వకుండా చూడ్డానికి వచ్చిన పోలీసు మా ఇంటి కింద అరుగుమీద కూచున్నారు. నేను వెళ్ళి సౌండ్ “తగ్గించమని చెప్పండి. ఇంట్లో పెద్దవాళ్ళు వున్నారు”, - అని చెప్పాను. “ఏం చెప్పమంటావమ్మా...! మాకు కష్టంగానే వుంది. మా ఇంటి దగ్గర కూడా ఇలాగే చేస్తున్నారు”, అన్నారు. నేను చాలా బతిమాలాను. లాభం లేకపోయింది. నాకయితే ఆయన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎందుకు వాళ్ళకి చెప్పట్లేదో అర్థం కాలేదు. అసలు చుట్టుపక్కల జనాలు ఎలా భరిస్తున్నారో అర్థం కాలేదు. దాన్ని భక్తి అంటారా...? వినాయకుడు విగ్రహం కాబట్టి సరిపోయింది. అనుకున్నాను. మొత్తానికి ఒక వారం రోజులు అలా భరించాల్సి వచ్చింది. కానీ క్రమక్రమంగా హైదరాబాద్ లో బుడ్డి బుడ్డిగాళ్ళందరూ కూడా విగ్రహాలు పెట్టడం మొదలు పెట్టారు. ఎన్ని పెట్టారో లెక్కలేదు.

రెండోరోజు ఆఫీసు నుంచి వచ్చేసరికి అమ్మ బాల్కనీలో, అక్క పాప సౌమ్యని పెట్టుకుని కూచుని వుంది. అమ్మ దగ్గిరకి వెళ్ళి నుంచున్నాను. ఇంతలోనే అమ్మ ఉన్నట్టుండి – “శాస్త్రీ, శాస్త్రీ ఇక్కడ”, అని అరవడం మొదలు పెట్టింది. శాస్త్రి అనే పేరుగల అతను పైకి చూశాడు. అతని మొహంలో చెప్పలేని ఆనందం.
“అక్కయ్య గారో... ఇక్కడ వున్నారేంటండోయ్? బావున్నారా... ఇక్కడ వినాయకుడి పూజ చేయించడానికి వచ్చా... అయిపోయాక వస్తా...” అన్నాడు. నాకు అతనెవరో అర్థం కాలేదు.

పూజ అయిపోయాక పైకి మా ఇంటికి వచ్చాడు. అమ్మ ముందు రూంలో కూచోపెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడటం మొదలుపెట్టింది. అతను - సినిమాల్లో వేస్తున్నాననీ, సినిమావాళ్ళందరి ఇళ్ళలో పౌరోహిత్యం చేస్తున్నాననీ, డబ్బులు బాగా వస్తున్నాయనీ, షేర్లు కొంటున్నాననీ చెప్పాడు. ఇంతకీ అతను ఎవరంటే - సినిమాల్లో వేస్తున్న –

*** ఐరన్ లెగ్ శాస్త్రి ***

ఇతను మా తాడేపల్లిగూడెంలో ఒక పురోహితుడి కొడుకు. కాలవ ఒడ్డున కూచుని కార్తీకమాసంలో అందరి దగ్గరా దక్షిణ తీసుకునేవాడుట. అమ్మకి అలా పరిచయం.

అదలా వుంచి ఇతను *** షేర్లు *** గురించి మా అమ్మకి ఏం చెప్పాడో తెలియదు కానీ, అమ్మ మమ్మల్ని కూడా షేర్లు కొనమని కూచుంది. మాకూ అప్పటికి సరిగ్గా తెలియదు కానీ, మేము తెలుసుకుని అమ్మకి చెప్పి, శాంతపరిచేసరికి మా పనయ్యింది.

మా పక్క రోడ్డులోనే వుండేవాడు. ఇంచుమించు మా అమ్మని కలిసి పలకరిస్తూనే వుండేవాడు. అమ్మ మా అమ్మాయికి పెళ్ళి సంబంధాలుంటే చెప్పమందిట. ఒకరోజు వాళ్ళ నాన్నగారిని తీసుకుని వచ్చాడు. ఆయన “అమ్మా! మీరు మీ అమ్మాయికి సంబంధం గురించి చెప్పారుట. వీడు నన్ను రమ్మంటే వచ్చాను. అమ్మ ఆయనేదో సంబంధం చెప్తారనుకుని వింటోంది.

ఆయన మళ్ళీ – “మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు, వీడికీ వాళ్ళకి ఎలా సరిపోతుంది” అన్నాడు. ఆశ్చర్యపోవడం మా వంతయ్యింది. అమ్మ “నేను ఏవైనా సంబంధాలు చెప్పమన్నాను. మీ అబ్బాయి గురించి కాదు” అంది. ఆయన మాటలకి మాకు ఏమనాలో అర్థం కాలేదు. అసలు అలా ఎలా అనుకున్నాడో... ఆ హడావుడి మనిషి అమ్మ చెప్తే ఏం విన్నాడో తెలియదు. మా చెల్లెలు ఒకరోజు అతను కనిపిస్తే... ఇంకెప్పుడూ మా ఇంటికి రాకు అని చెప్పిందిట. ఇంక మళ్ళీ అతను మా ఇంటివైపు రాలేదు.

కానీ ఇవివి సత్యనారాయణ గారి ద్వారా సినిమాల్లోకి వచ్చి, దాదాపు 100 సినిమాలపైనే నటించి, హాస్యనటుడిగా చాలా పేరు తెచ్చుకున్నాడు. చివర్లో డబ్బులకి చాలా ఇబ్బందులు పడి తాడేపల్లి గూడెం వెడితే.... సినిమాల్లో చూసి ఎంజాయ్ చేశారు కానీ... మళ్ళీ ఎవరూ పౌరోహిత్యానికి రానివ్వలేదు. ***ఐరన్ లేగ్*** పేరు అతనికి శాపమైంది. ఎంతైనా మా వూరి వాడు కదా బాధగానే అనిపించింది. చివరి రోజుల్లో దారుణమైన జీవితం గడిపాడు.

*** హైదరాబాద్ లో వినాయక విగ్రహాల స్థాపన - నిమజ్జనం ***

వినాయక నిమజ్జనోత్సవాలనేవి చెన్నారెడ్డి గారి హయాం వచ్చాయని విన్నాను. అది ఎంత వరకు కరక్టో నాకు తెలియదు. 1985-86లో నిమజ్జనం అంటే అంత హడావుడి ఏమీ వుండేది కాదు. 1986లో చక్రధరరెడ్డి అనే కాలేజీ విద్యార్థి రకరకాల వినాయకుడి విగ్రహాలు చెయ్యడం మొదలు పెట్టాడుట. అప్పటి నుంచీ వినాయకుడికి వెయ్యని వేషం లేదు. జనాలకీ అదో కొత్తవిషయం దొరికింది.

నేను మెహదీపట్నంలో ఉన్నప్పుడు ఒకసారి 6 నెం. బస్సు సెక్రటేరియట్ వరకూ రాగానే ఆపేసి “ఇక్కడి నుంచీ వెళ్లిపొండి” అన్నారు. బస్సులన్నీ డిపోకి వెళ్ళిపోతున్నాయి, ఇంక మళ్ళీ బస్సులు రేపే అన్నారు. నేను, హిమాయత్ నగర్ వేరే ఆఫీసులో పనిచేసే ఒకమ్మాయి ఇద్దరం మెహదీపట్నం నుంచి వచ్చాం. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆఫీసులో వాళ్ళకి అర్థం అవుతుందిలే అని ఇద్దరం మళ్ళీ సెక్రటేరియట్ నుంచి మెహదీపట్నం దాదాపు 7.5 కిలోమీటర్లు కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్ళిపోయాం.
.
*** ఖైరతాబాద్ వినాయకుడు***
ఇంతకీ ఖైరతాబాద్ వినాయకుడిని అయితే 1954లో సింగరి శంకరయ్య అనే ఆయన ఒక అడుగు విగ్రహంతో మొదలు పెట్టి, నెలరోజులు ఉత్సవాలు చేసేవారుట. 2013 వరకూ సంవత్సరానికి ఒక అడుగు పెంచుకుంటూ వచ్చారుట. అప్పటికి 59 సంవత్సరాలు పూర్తయి, 59 అడుగుల విగ్రహం అయిన సందర్భంగా 4,200 కిలోల లడ్డూని వినాయకుడి చేతిలో పెట్టారుట. 1960లో ఏనుగు మీద ఊరేగిస్తూ... సాగర్ కి నిమజ్జనానికి తీసుకెళ్ళారుట. 1983కి ముందు ఒకసారి విగ్రహం నిమజ్జనానికి తగిన క్రేన్ రాలేదని నెలరోజులు టాంక్ బండ్ మీదే వుంచేశారుట. క్రమంగా విగ్రహం అడుగులు తగ్గించుకుంటూ వచ్చారు. 2021 నాటికి 36-40 అడుగుల విగ్రహం తయారు చేస్తున్నారు.

25, జులై 2022, సోమవారం

ఎదురీతలో నేను - 36 *** అమ్మరాక ఆనందం *** *** నా పెళ్ళికి అమ్మ ఆరాటం ***

ఎదురీతలో నేను - 36

*** అమ్మరాక ఆనందం *** *** నా పెళ్ళికి అమ్మ ఆరాటం ***



అమ్మ మా దగ్గిరకి వచ్చిన దగ్గర నుంచీ తనే వంట చేసేది. పొద్దున్న అమ్మచేతి వంట వేడివేడిగా తినేసి, కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అమ్మ తను లేటుగా తింటుంది కాబట్టి కాఫీ తాగేది. తనతోబాటు మళ్ళీ మాకూ ఇచ్చేది. సాయంత్రం నాకు, చెల్లెళ్లు ముగ్గురికీ, పిన్ని పిల్లకీ ఒక కంచంలో కలిపి పెట్టేది. పెద్దక్క కూతురు సౌమ్య మాతోనే వుండడంతో, దగ్గరలో ఉన్న స్కూల్లో వేసి, రిక్షా మాట్లాడాం. అమ్మకి సౌమ్యతో కొంత కాలక్షేపం. మధ్యాహ్నమప్పుడు పుస్తకాలు చదువుకుంటూ వుండేది.

ఇంటి అద్దె (1986లో) 650 రూపాయలు. అది మాకు ఎక్కువే కానీ, పిన్ని పిల్లలు, మేము అందరం కలిసి సంపాదించేది బాగానే సరిపోయేది. నెల తిరిగేసరికి అందరూ నాకు శాలరీ తెచ్చి ఇచ్చేవారు. అందరివీ కలిసి ఇంటి లెక్కలు రాయడం, ఖర్చు పెట్టడం అన్నీ చూసుకునేదాన్ని. ఎక్కడా లోటు బడ్జెట్ వుండేది కాదు. అందరం కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళం. అమ్మని గుడులకి, పార్కులకి, తనకి తెలిసిన బంధువుల ఇళ్ళకీ తీసుకుని వెళ్ళేవాళ్ళం. చాలా వరకు అమ్మకి ఏం ఇష్టమో అవన్నీ తీర్చేవాళ్ళం.

అమ్మని ఆఫీసుకి కూడా తీసుకెళ్లి చూపించాం. అలాంటివి ఎప్పుడూ చూడలేదు కదా... అమ్మకి ఆశ్చర్యం. చాలా సంతోషించింది. అయితే నాకు ***సరుకుల డబ్బాల మీదకి పేర్లు*** చేసి పెట్టండి అని చెప్పింది. మేము ప్రింట్స్ తీసి ఇచ్చాక వాటిని జాగర్తగా డబ్బాల మీద అతికించుకుని అమ్మ ఎంత సంతోషపడిందో. ఎందుకంటే అప్పటివరకూ చేతిరాతతో పేర్లు వుండేవి. అమ్మ తనకి వచ్చిన పాటలు, పద్యాలు కొన్ని నోటు పుస్తకాలలో రాసుకుంది. వాటన్నిటినీ టైపు చేసి పుస్తకంగా చేసి ఇమ్మంది. సరే అని ఆఫీసులో పెట్టుకుని రోజుకి కొంత కొంత టైపు చేసేవాళ్ళం. విజయపాల్ గారికి చెప్పకుండా ఏదీ చేసేవాళ్ళం కాదు.

*** ఆఫీసు దగ్గరవడంతో పని ఎక్కువ చెయ్యడానికి వెసులుబాటు ***

ఆఫీసు ఇంటికి దగ్గరవడంతో మాకు తిండి విషయంలో ఎటువంటి ఇబ్బందీ అవలేదు. మేము పొద్దున్న ఒక ఇద్దరం, మధ్యాహ్నం ఒక ఇద్దరం షిఫ్ట్ లలో వెళ్ళేవాళ్ళం. గీతా పదవతరగతి పాస్ అయింది. తను కాలేజీలో చేరడానికి ఇంకా టైముంది. కాబట్టి అప్పుడప్పుడూ తను ఊరికే మాతోబాటు ఆఫీసుకి వస్తూ వుండేది.

అమ్మ చెల్లెళ్ళిద్దరినీ తీసుకుని విజయవాడ వెళ్ళింది. పిన్నిపిల్లలు ఏలూరు వెళ్ళారు. నేను ఒక్కదాన్నే ఆఫీసుకి వెళ్ళాను. “అర్జంటు వర్కు వుంది కొంచెం లేట్ అవర్స్ వుండి చేస్తారా?”, అన్నారు విజయపాల్ గారు. ఇంట్లో చెల్లెలు ఒక్కతే వుందని చెప్పాను. “సరే, ఆమెనీ తీసుకువద్దాం పదండి”, అని, వాళ్ళావిడ కృష్ణని కూడా తీసుకుని మా ఇంటికి వచ్చారు.

వాళ్ళకి మర్యాద చెయ్యడం సొంపు – నేను టీ కలుపుతాను తాగమని, బాగా ఇవ్వాలని, చాలా స్ట్రాంగ్ గా కలిపి ఇచ్చాను. అదెంతబావుందో తెలియదు కానీ, అతి చిక్కగా మాత్రం వచ్చింది. నేనూ తాగాను నాకయితే అస్సలు నచ్చలేదు. పాపం ఏమీ అనకుండా తాగేశారు. వాళ్ళతోబాటు చెల్లెలిని తీసుకుని వెళ్ళాం. ఇద్దరం కలిసి వర్కు చేసిపెట్టాం. మా విషయంలో అంత జాగ్రత్తగా వుండేవారు. ఆఫీసులో ఏదో ఒక వర్కు ఆగకుండా వుంటూనే వుంది.

*** నా పెళ్ళికి అమ్మ ఆరాటం ***

అమ్మ నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడయితే ఫోన్లమీద సంప్రదింపులు. అప్పుడు తెలిసిన కుటుంబం అయితే చాలు అనుకునేవారు. ప్రశాంతంగా పెళ్ళిళ్ళు జరిగేవి. ఒక కళ్ళు కనిపించని ఆయన గవ్వలు వేసి చెప్తారు జాతకం అంటే ముందర ఆయన్ని చూడాలని వెళ్ళి, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో కనుక్కుంది. ఇంకొకసారి బంధువుల ఇంటికి వెళ్ళి జాతకాలు చెప్తారని తెలిసి, ఊరికే నా నక్షత్రం ఇచ్చి పెళ్ళి గురించి అడిగింది. నాకు అసలు పెళ్ళే అవదని చెప్పారు. రిజర్వు బ్యాంక్ లో ఆఫీసర్ దిలీప్ కుమార్ గారు మా కుటుంబ మిత్రులు. ఆయన జాతకం చెప్పేవారు. నీ జాతకంలో పెళ్లి లేదు, ఒకవేళ అయినా 1992లో అవుతుందని చెప్పారు.

ఇవన్నీ విన్న అమ్మకి నామీద చాలా కోపం వచ్చింది. “నువ్వు కాళహస్తి విద్యాప్రకాశానంద స్వామి ఉపన్యాసాలు విని, సన్యాసం తీసుకుంటానన్నావు. ఆశ్రమానికి వెళ్ళిపోతానన్నావు. అందుకే నీ పెళ్ళి గురించి అందరూ ఇలా చెప్తున్నారు ”, అంటూ ఒకటే గోల పెట్టింది.

నేను “అవన్నీ నమ్మకమ్మా... నాకు పెళ్ళవుతుందిలే. వాళ్ళందరూ ఏవో చెప్తుంటారు. నువ్వేం బెంగపడకు, నువ్వు సంబంధాలు చూడు, ఎందుకు పెళ్ళవదో నేనూ చూస్తాను”, అని నవ్వేశాను. అమ్మకి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఏదో తన హడావుడి తను పడింది.

21, జులై 2022, గురువారం

ఎదురీతలో నేను - 35 *** మెహదీపట్నంకి బైబై *** *** అన్నీ కొత్త మార్పులే *** *** బస్ పాస్ ప్రహసనం ***

 

ఎదురీతలో నేను  - 35  *** మెహదీపట్నంకి బైబై ***    *** అన్నీ కొత్త మార్పులే ***  *** బస్ పాస్ ప్రహసనం ***

బాబాయి కూతురు శ్రీదేవి బి.ఎస్సీ. పాసయి ఖాళీగా వుందని ఏలూరు నుంచి వచ్చింది. వాళ్ళ తమ్ముడు ప్రసాద్ కూడా వచ్చాడు. ఊరికే ఉండడం ఎందుకులే అని మా ఆఫీసుకి ఇద్దరినీ తీసుకుని వెడితే విజయపాల్ గారు శ్రీదేవికి కంప్యూటర్ నేర్పించమన్నారు. ప్రసాద్ ని మేడ్చల్ లో ఉన్న ఆఫీసుకి పని నేర్పించడానికి తీసుకెళ్ళారు. మొత్తానికి ఇద్దరూ మా ఆఫీసులో చేరిపోయారు.

విజయపాల్ గారు మీరు ఆఫీసుకి దగ్గరలో ఇల్లు తీసుకోండి. ఎప్పుడైనా లేటయినా ఇబ్బంది ఉండదు అన్నారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ దగ్గర మెయిన్ రోడ్ మీద బస్ స్టాప్ వెనక ఒక మేడమీద పోర్షన్ దొరికింది. మొత్తానికి గుడిమల్కాపూర్ ని అలా వదిలేశాం. వదిలేటప్పుడు బాధగానే అనిపించింది. ఇల్లుగలవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా బాధ పడ్డారు. సామాను షిఫ్ట్ చెయ్యడానికి ఆఫీసు వాన్ ఒకటి వుంటే ఇచ్చారు. మళ్ళీ అక్కడ కూడా మమ్మల్ని రాములే డ్రైవర్ అయి ఆదుకున్నాడు.

ఫీవర్ హాస్పిటల్ ఏరియాలో ఆ హాస్పిటల్ చుట్టుపక్కల ఏమీ డెవలప్ అవలేదు. అన్నీ చిన్న చిన్న ఇళ్ళు. మేమున్న బిల్డింగ్ కింద ఒక చెప్పుల షాపు బేకరీ వుండేవి. మేము ఆ యింటికి వెళ్ళిన కొత్తలో రోడ్డుమీద బస్ లు వరసగా ఆగిపోతే ఎందుకు అలా ఆగాయో యాక్సిడెంట్ ఏమో అనుకున్నాం. ఎవరినో అడిగితే ట్రాఫిక్ జామ్ అని చెప్పారు. ఓహో అనుకున్నాం. ఎందుకంటే మేము ఆఫీసుకి వెళ్ళేటప్పుడు తప్ప మెహదీపట్నంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ సంగతి తెలియదు.

నల్లకుంటలో మా ఇల్లు బస్ స్టాప్ లోనే కాబట్టి బస్సుల రొద, ట్రాఫిక్ అన్నీ బాగా తెలుస్తుండేది. కోటీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ 3వ నెంబరు బస్సులు, సికింద్రాబాద్ బస్సులు 2వ నెంబరు ఎక్కువగా అటు తిరుగుతుండేవి. మొత్తానికి ఆ సందడికి అలవాటు పడ్డాం. పల్లె నుంచి పట్నానికి వచ్చినట్టయింది.

అప్పుడు నారాయణగూడా బ్రిడ్జి కూడా ఇంకా కట్టలేదు. రోడ్లు ఇప్పుడున్నంత రద్దీగా వుండేవి కావు. బస్సులు మాత్రం ఫ్రీక్వెంట్ గా బాగానే వుండేవి. దీపక్, శాంతి థియేటర్లు, నారాయణగూడా బ్లడ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ - హిమాయత్ నగర్ లో ఇండియన్ బ్యాంక్ (మా అకౌంట్ ఇందులోనే వుండేది) లిడ్ క్యాప్ బిల్డింగ్, గాయత్రీ భవన్ (మినర్వా) ఇవన్నీ అతి పాత బిల్డింగ్ లు. దీపక్ థియేటర్లో కొన్ని సినిమాలు చూశాం. నారాయణగూడా తాజ్ మహల్ హోటల్ కి కూడా ఆఫీసులో అమ్మాయిలం అందరం తరచు వెళ్ళేవాళ్ళం. అక్కడ వాళ్ళకి కూడా మేము బాగా అలవాటు పడిపోయాం. మాకు కాలేజీ లైఫ్ లా వుండేది.

ఒకరోజు ఆఫీసులో వర్కు చాలా ఎక్కువగా వుండి చాలా పిచ్చిపచ్చినట్లు అయ్యింది. ఏదైనా గొప్ప సినిమా చూడాలనుకున్నాం. అలా అనుకుని సంగీత్ థియేటర్లో ***ఎ నైట్ మేర్ ఆన్ ఎలెమ్ స్ట్రీట్*** సినిమాకి (American supernatural slasher film written and directed by Wes Craven and produced by Robert Shaye.) వెళ్ళాం. చాలా భయంకరమైన సినిమా. చూసేటప్పుడు భయం వేసింది. తర్వాత కొన్ని రోజులు భయపడ్డాం కానీ, చాలా అద్భుతంగా తీశారు. సినిమా చూశాక మేం చేసిన వర్కు అలసటంతా మటుమాయం. ☺

*** బస్ పాస్ ప్రహసనం ***




ఆఫీసుకి వెళ్ళడానికి 6, 190 బస్సులు ఎక్కి ఆఫీసుకి వెళ్ళేవాళ్ళం. హిమాయత్ నగర్ చాలా దగ్గరవడంతో కొంచెం ఊరటగానే వుండేది. బస్ పాస్ తీసుకునేవాళ్ళం.

ఇంటికి వెళ్ళేటప్పుడు నేను మా చెల్లెలు బస్ లో ఏదో మాట్లాడుకుంటున్నాం. చెకింగ్ వాళ్ళు వచ్చారు. నారాయణగూడాలో ఆపారు. “పాస్” అని చెప్పా. “ఏదీ చూపించండి” అన్నారు. నేను bag లో చూస్తే పాస్ కనిపించలేదు. “లేదు ఆఫీసులో మర్చిపోయా” అన్నాను. అలా ఎందుకు చెప్పానో తెలియదు. మా చెల్లెలు “సరిగ్గా చూడు అంటూనే” వుంది.

“అయితే బస్సు దిగు” అన్నారు. మళ్ళీ చూశా… హ్యాండ్ బ్యాగ్ లో పేపర్ల మధ్య ***వెక్కిరింతగా నవ్వుతున్నట్టు*** పాస్ కనిపించింది. అమ్మయ్య అనుకుని వెంటనే “ఇదిగోనండీ పాస్” అన్నా.

ఆ చెకింగ్ కి వచ్చినాయన “కంగారెందుకమ్మా... మీలాంటి వాళ్ళు టికెట్ లేకుండా, పాస్ లేకుండా బస్ ఎక్కరని తెలుసు. అందుకే నిన్ను దిగు అన్నాను కానీ, వెంటనే దిగిపొమ్మని చెప్పలేదు.

పాస్ ఎప్పుడూ ఎదురుగా కనిపించేలా పెట్టుకోవాలి ” అంటూ ముందుకి వెళ్ళిపోయాడు. బతుకుజీవుడా అనుకుంటూ... అప్పటి నుంచీ పాస్ చెయ్యిపెట్టగానే దొరికేలా వుంచుకున్నాను.

*** అమ్మ మా దగ్గిరకి వచ్చేసిందిగా ***

ఇల్లు పెద్దది తీసుకున్నామని అమ్మని మా దగ్గిరకి తీసుకొచ్చేశాం. ఎంత ఆనందంగా అనిపించిందో... ఇంక రోజూ అమ్మ చేతి వంట రోజూ తినచ్చు. అమ్మకి కూడా సిటీ వాతావరణం కొత్తగా అనిపించింది. కానీ బాల్కనీలో కూచుని వచ్చేపోయే బస్సులు, జనాల్ని చూస్తూ కూచునేది.

(మిగతా కథ రేపు).

18, జులై 2022, సోమవారం

ఎదురీతలో నేను - 34 *** డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్*** ***బైలాజికల్ ఇ లిమిటెడ్ *** *** ఆఫీసులో ఓవర్ టైం ***

ఎదురీతలో నేను  - 34  *** డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్***    ***బైలాజికల్ ఇ లిమిటెడ్ ***    *** ఆఫీసులో ఓవర్ టైం ***

DRR, Rajendranagar నుంచి ***కలంబూరు మురళీధరన్*** అని ఒక ***తమిళ్ సైంటిస్ట్, డైరెక్టర్ – Crop Protection *** వచ్చేవారు . మురళీధరన్ చాలా మంచి వ్యక్తి. ఆయన దగ్గర కూచుని వర్కు చేయించుకుంటుంటే - నేను ముందు చెప్పిన మా కోడ్ లాంగ్వేజ్ కంప్యూటర్ లో కూడా మేటర్ పర్ ఫెక్ట్ గా వచ్చేది. తప్పులు చాలా తక్కువ వుండేవి. ఆయన అతి తొందరలోనే కంప్యూటర్ గురించి తెలుసుకుని మాకు, ఆయనకి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునేవారు. ఆయన వాళ్ళ ఆఫీసు గురించి ఏది ఎలా డెవలప్ చేస్తారో చక్కగా వివరించేవారు. చాలా ఓపిక ఎక్కువ. ఇంగ్లీష్, తెలుగు రెండు పుస్తకాలు వుండేవి.
మేము లంచ్ చెయ్యడానికి వెడితే ఆయన కంప్యూటర్ దగ్గర కూచుని కరక్షన్స్ చేసేసుకునేవారు. ఆయన తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడేవారు. మాకు భాష రావాలని అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడేవారు. మాకు అనుభవం నేర్పిన పాఠాలు చాలా ఉన్నాయి. మురళీధరన్ ఫోన్ నెంబర్ దొరికింది. కానీ ఆయన్ని కలవలేకపోయాము.





ప్రస్తుతమున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (IIRR) గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ( DRR) అనే పేరుతో ఉండేది. వివిధ రకాల వరిని సాగుచెయ్యడం, దేశంలో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తిని పెంచడం; రైతులు పండించే పంట కి చీడ, పీడల విషయంలో సలహాలు ఇవ్వడం, ఇంకా ఎన్నో పరిశోధనలు అక్కడ చేస్తారు. ఆఫీసు వెనక ఉన్న ఎకరాల భూమిలో వీరి పరిశోధనలు జరుగుతాయి.

***బైలాజికల్ ఇ లిమిటెడ్ ***


ప్రింటింగ్ సెక్షన్ ఇన్ ఛార్జిగా బైలాజికల్ ఇ లిమిటెడ్ కి వెళ్ళాను. వాళ్ళకి మా ఆఫీస్ వాళ్ళు మందు సీసాల మీద లేబుల్స్ ప్రింట్ చేసి ఇచ్చారు. అవి ప్రింట్ చేసినప్పుడు ఒక్కోసారి ఒక బాక్స్ లో వచ్చినవి ఏమాత్రం లైట్ గా వచ్చినా వాళ్లు అవన్నీ రిజెక్ట్ చేసారు. దాంట్లో ఒకటి చూసి మిగిలినవన్నీ పక్కన పెట్టేశారు. అలా వాళ్ళు రిజెక్ట్ చేసినవి తీసుకెళ్ళమని ఆఫీసుకి ఫోన్ చేశారు. విజయపాల్ గారు రాముల్ని తీసుకుని కారులో వెళ్ళమని పంపించారు. మీరు అవి చూసి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పారు.

నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. లేబుల్స్ ఉన్న బాక్సులు నాకు చూపించారు. దాదాపు 200 బాక్స్ లు వున్నాయి. నేను ఒక్కో బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏవి బాగా వచ్చాయో చూపించి, రానివి పక్కకి పెట్టేశాను. ఆ బాక్సుల్లో ఒక పది మాత్రమే బాగా రానివి ఉన్నాయి. వాళ్ళు బాగా వచ్చినవి తీసుకుని వాటికి రావలసిన అమౌంట్ చెక్ ఏర్పాటు చేసి ఇచ్చేశారు. విజయపాల్ గారు చాలా సంతోషించారు.

*** ఆఫీసులో ఓవర్ టైం ***

ఆఫీసులో ఇటువంటి వర్కులతో మేము ఓవర్ టైం కూడా చెయ్యాల్సి వచ్చేది. ఆదివారాలు కూడా పని చేసేవాళ్ళం. మాకు శాలరీ కన్నా ఓవర్ టైం చాలా ఎక్కువగా వచ్చేది. అది ఆఫీసులో వాళ్ళకి కొంచెం బాధగానే వుండేది. మీరు ఊరికే వస్తున్నారా... పని చేస్తున్నారా లేదా అనేవారు. వాళ్ళు ఏం అన్నా మేము పట్టించుకునేవాళ్ళం కాదు. విజయపాల్ గారికి మా వర్కు కనిపించేది. ఎ.సి. వాళ్ళ ఇంటివైపుకి ఫిట్ చేసి వుండేది. సౌండ్ వచ్చిందంటే మేము వచ్చాం పని చేస్తున్నాం అని వాళ్ళింట్లోవాళ్ళకి అర్థం అయ్యేది. రాములికి చెప్పి మాకు కావలసిన ఏర్పాట్లు చూసేవారు. ఒక రోజు శాలరీకి డబల్ ఇచ్చేవారు.
ఒకసారి ఒక కంప్యూటర్ పాడయితే నేను మా చెల్లెలు - ఉ. 7 నుంచి మ. 1 గం. వరకు ఒకళ్ళు. 1గం. నుంచి 7 గం. వరకు ఒకళ్ళు పనిచేసేవాళ్ళం. పొద్దున్నే 6 గంటలకి బయల్దేరినప్పుడు రోడ్లన్నీ ప్రశాంతంగా వుండేవి. అప్పట్లో ***ట్రంకాల్స్*** వుండేవి కాబట్టి ***టెలిఫోన్ ఆపరేటర్స్*** కొంతమంది ఆ టైముకి మాతోబాటు వచ్చేవారు. ఈ ట్రంకాల్స్ అనేవి ఇప్పటి వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. మమ్మల్ని అడిగేవారు ఎక్కడ చేస్తున్నారని. మా వర్కు విని ఆశ్చర్యపోయేవారు. అప్పట్లో కంప్యూటర్స్ కొత్త కాబట్టి అందరికీ ఆశ్చర్యంగానే

ఉదయం వెళ్ళిన వాళ్ళం డైరెక్ట్ గాయత్రీ భవన్ (ఇప్పటి హిమాయత్ నగర్ మినర్వా ప్లేస్ లో వుండేది) కి వెళ్ళి ఇడ్లీ కానీ, ఉప్నా కానీ వేడి వేడిగా తినేసి, కాఫీతాగి వెళ్ళిపోయేవాళ్ళం. పొద్దున్నే వెళ్ళడం వల్ల హోటల్ వాళ్ళకి బాగా గుర్తుండి పోయాం. రెెగ్యులర్ కస్టమర్స్ మి కాబట్టి చాలా మర్యాదగా, నవ్వుతూ ఆహ్వానించేవారు. మధ్యలో రాములు లమ్సా టీ పెద్ద కప్పు నిండా ఇచ్చేవాడు. ఆ టీ చాలా పల్చగా వుండేది కానీ రుచి అమోఘం. మాకు ఎప్పటికప్పుడు అండదండలుగా వున్న రాములుని అయితే మర్చిపోలేం.

14, జులై 2022, గురువారం

ఎదురీతలో నేను - 33 ***సాధారణ జీవనం మొదలయ్యింది***

ఎదురీతలో నేను  - 33   ***సాధారణ జీవనం మొదలయ్యింది***

కర్ఫ్యూలు పోయాయి. మామూలు జీవన పరిస్థితులకి అలవాటు పడ్డారు జనం. మేము ఆఫీసుకి వెళ్ళిరావడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. అమ్మయ్య ఎవరిళ్ళకీ వెళ్ళక్కరలేదు. మా ఇంట్లో మేము ఉండచ్చు అనుకున్నాం.

ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఇంటికి కావలసినవన్నీ తెచ్చుకుని వచ్చేవాళ్ళం. సాయంత్రం 6 గంటల నించీ రాత్రి 9 పంపులో వాడుకునే నీళ్ళు వచ్చేవి. మా కాంపౌండ్ లోనే కానీ కొంచెం దూరం వెళ్ళి పట్టుకోవాలి. ఒక స్టౌ మీద అన్నం, మరో స్టౌ మీద టొమాటో చారు పెట్టేసి, చారువాసన ఆస్వాదిస్తూ... ఆకలిని ఆపుకుంటూ... కుతకుతా ఉడుకుతూ పలకరిస్తున్న అన్నాన్ని చూస్తూ - నీళ్ళు పోయే లోపునే పట్టుకుని మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకునేవాళ్ళం.

ఫ్రెష్ అయిపోయి ఆ వేడి వేడి అన్నంలో అమ్మ పంపించిన ఆవకాయ వేసుకుని, చారు పోసుకుని, మజ్జిగ పోసుకుని తింటుంటే ఎంత హాయిగా వుండేదో.... (పొద్దున్న బాక్స్ లోకి కూరలు అవీ చేసుకునే వాళ్ళం.) తినడం అయ్యాక వేరే ఎంటర్ టైన్ మెంట్ లేదు కాబట్టి పుస్తకాలు చదువుకుంటూ పడుకునేవాళ్ళం. ఇంటికి దగ్గరలో లైబ్రరీ వుండేది. శని ఆదివారాలలో అక్కడికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళం. మేమిద్దరం కూడా బయట వాళ్ళతో కబుర్లు చెప్పడం తక్కువ.


*** ప్రారంభమైన టీవీ యుగం ***



ఇండియాలో టి.వీ. 1980లో వచ్చింది. కానీ మేము హైదరాబాద్ లో చూసేసరికి 1985 చివర. అప్పటికే చాలామంది దగ్గర వుండి వుండచ్చు.

అబ్బ! బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినప్పుడు ఎంత సందడో! మెహదీపట్నంలో మా ఇల్లుగలవాళ్ళు టీ.వీ. కొన్నారు. అందరం ఒకే కుటుంబంలా వుండేవాళ్లం అని చెప్పాను కదా… అందరికీ పేరు పేరునా టీవీ వచ్చింది అని చెప్పారు. అందరూ వినేసి ఊరుకున్నారు. కానీ వాళ్ళు “శనివారం తెలుగు సినిమా వస్తుంది. అందరూ రండి చూద్దురు” అన్నారు.

పిలిచిందే తరువాయి అందరూ శనివారం ఎప్పుడు వస్తుందా... టీవీ ఎప్పుడు చూస్తామా... అని ఎదురు చూశారు. శనివారం నాడు ఇల్లుగలావిడ శాస్త్రోక్తంగా పూజచేసి, కొబ్బరికాయ కొట్టి అందరికీ కొబ్బరి ముక్కలు, స్వీట్లు పంచిపెట్టారు. ఇంక అందరూ వెళ్ళి వాళ్ళ హాలులో కూచున్నాం.

అప్పటి వరకూ టీవీ మొహం తెలియదు ఎవరికీ. రిమోట్లు లేవు కాబట్టి పక్కనున్నఆన్ ఆఫ్ - సౌండ్ పెంచడానికి వాల్యూమ్స్ తిప్పడం చాలా ఆశ్చర్యకరంగా వుండేది. కొత్తది చూస్తూన్నాం అనే ఆనందం.

అందరూ సినిమా మొదలయ్యే వరకూ ఆత్రుతగా చూస్తూ కూచున్నారు. ఇంట్లో సినిమా చూడ్డం అంటే అందరికీ వింతేమరి. పాత సినిమా వేశారు. ఏదో ఒకటి చూడ్డమే కావాలి. సినిమా మధ్యలో అడ్వర్ టైజ్ మెంట్లు లేవు. కథ ఎక్కడా ఆగకుండా నడుస్తోంది. మొత్తం సినిమా అయ్యే వరకూ ఎవరూ కదలలేదు.

మర్నాడు హిందీ సినిమా వేశారు. ఆరోజు కూడా రమ్మన్నారు కానీ మేము వెళ్ళలేదు. వారానికి ఒకసారి మాత్రం వాళ్ళింట్లో సినిమా చూడ్డం అలవాటయింది. శనివారం అదో కాలక్షేపంగా మారింది.

ఇంక మా గేటు బయట పాలుపోసేవాళ్ళు వుండేవారు. వాళ్ళ ఇంటి ముందంతా ఖాళీస్థలం వుంది. వాళ్ళు కూడా టీవీ కొన్నారు. వాళ్ళది ఇంకోరకమైన సమాజ సేవ. టీవీ ఇంటి బయట పెట్టి అందరినీ చూడ్డానికి రమ్మని అక్కడొక డబ్బా పెట్టి అందులో 25 పైసలు వెయ్యమనేవారు. అలా చూడ్డానికి ఇష్టమయిన వాళ్ళు 25 పైసలు ఇచ్చి శని, ఆదివారాలలో సినిమా చూసేవారు. ఓపెన్ థియేటర్ అన్నమాట. దాదాపు 50 మంది దాకా చూసేవారు. ఒకసారి దూరంగా నుంచుని అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూశాను.

ఒకమ్మాయి అయితే ప్రతి దానికీ తనకి తనే విరగబడి నవ్వేసుకుంటోంది. పక్కవాళ్ళకి ఇదేం పట్టట్లేదు. కథలో లీనమయిపోయారు. ఇంకొకళ్ళు సినిమాహాల్లో తిన్నట్లు ఏవో తెచ్చుకుని తినేస్తూ చూసేస్తున్నారు. ఇంకొక ఆమె అయితే 25 పైసలు ఇచ్చాం కదాని ఇంట్లోంచి చాప తెచ్చుకుని హాయికా పడుకుని చూస్తోంది. ఇంకొక ఆవిడ పిల్లాడు ఏడుస్తుంటే... ఒక్కటివేసి ఒళ్ళో పడుకోపెట్టుకుని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ... సినిమా చూసేస్తోంది. ఎవరేం చేస్తే మాకేం మాకైతే పైసలు ఇస్తున్నారు కదాని పాలవాళ్ళు ఊరుకున్నారు.

నాకు తెలిసిన ఇంకో టీవీ ప్రహసనం –

శ్వేత, రమణి అని ఇద్దరు అమ్మాయిలు వుండేవారు. రమణి బంధువుల ఇంటికి ప్రతి శనివారం టీవీలో సినిమా చూడ్డానికి వెళ్ళేవారు. వాళ్ళు నాలుగైదుసార్లు మొహమాటానికి ఊరుకునేవారు. ఒకసారి వాళ్ళు అక్కా మేము ఈ శని, ఆదివారాలు ఉండట్లేదు. మేము తర్వాత చెప్పాక వద్దురుగాని అన్నారు. వీళ్ళకి ఏమైనా సరే వచ్చేవారం సినిమా చూడాలి అనుకున్నారు.

శనివారం రానే వచ్చింది. సాయంత్రం శ్వేత రమణితో మనం అలా నడుచుకుంటూ వెడదాం ఎవరింట్లో అయినా టీవీ యాంటెనా కనిపిస్తే వాళ్ళింటికి వెడదాం. వాళ్ళు ఏం కావాలి అని అడుగుతారు కదా... ఇక్కడ మావాళ్ళు వుండాలి టీవీ చూడ్డానికి వచ్చాం. ఇల్లు వెతుకుతున్నాం అందాం. అప్పుడు వాళ్ళు ఫర్వాలేదు మా ఇంట్లో చూడండి అంటే చూసి వచ్చేద్దాం అని ప్లాన్ వేశారు. వీళ్ళ ప్లాన్ కాస్తా గోవిందా అయింది. ఎవరూ చూడమనలేదు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చారు. వాళ్ళు ఈ విషయం చెప్తే అంత కష్టపడి చూడకపోతే ఏమవుతుంది అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

ఆహా బ్లాక్ అండ్ వైట్ టీవీ మహత్మ్యం ఎంత గొప్పగా వుందో అనిపించింది.

9, జులై 2022, శనివారం

ఎదురీతలో నేను - 32 *** ఎప్పుడూ కర్ఫ్యూ.... కర్ఫ్యూ.... ***

 ఎదురీతలో నేను - 32 *** ఎప్పుడూ కర్ఫ్యూ.... కర్ఫ్యూ.... ***


మాకు ఆఫీస్ లో వర్కు ఎక్కువయినప్పుడు లేటయితే రాములు కారులో ఇంటి దగ్గర దింపడం మామూలుగా జరుగుతుండేది. మేముండే మెహదీపట్నం, గుడిమల్కాపూర్ ఓల్డ్ సిటీలోకే వస్తుంది. అప్పట్లో ఎప్పుడు ఏ నిమిషంలో కర్ఫ్యూ పెడతారో తెలిసేది కాదు. *** ఎక్కడో గొడవలయ్యాయిట మెహదీపట్నం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కర్ఫ్యూ అనేవారు. పొద్దున్నే పాలకి ఒకాయన వెడితే పొడిచేశారుట *** అనేవారు. ఆ టైములో ఎందుకు గొడవలయ్యేవో.... ఎవరిని ఎవరు ఏంచేసేవారో తెలియదు. బస్సులు అంతంత మాత్రంగానే వుండేవి. చాలా ఇబ్బందిగా వుండేది.





మేము ఒకరోజు ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లో కూచున్నాం. రాములు కారు తీసుకుని వచ్చి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నారు. సరే ఇద్దరం ఆఫీసుకి వెళ్ళిపోయాం. ఇలా రెండుమూడు రోజులు రాములు తీసుకురావడం, దింపడం చేశాడు. మేమే వస్తామని చెప్పడానికి ఒకోరోజు వెళ్ళే బస్సులు వుండేవి కానీ ఇంటికి రావడానికి వుండేవి కాదు. రోడ్లమీద పోలీసులు తప్ప ఎవరూ వుండేవారు కాదు. హిమాయత్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాలన్నింటిలో కర్ఫ్యూ వుండేది కాదు. రోజూ ఇలా ఎందుకొచ్చిన రిస్క్ అని కొన్ని రోజులు మేము చిక్కడపల్లిలో ఉన్న మా బాబాయి కొడుకు ఇంటికి వెళ్ళిపోయాం. తను మేము ఎప్పుడూ కలుస్తూ వుండేవాళ్ళం.

అక్కడ నుంచి మాకు ఆఫీసు చాలా దగ్గర కాబట్టి ఇబ్బంది లేకపోయింది. కానీ నాకు ఎక్కువ ఎవరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం వుండేది కాదు. అందుకని రెండురోజులు ఆఫీసులోనే వుండిపోయేవాళ్ళం. ఒక బట్టల బ్యాగ్ ఆఫీసులో రెడీగా పెట్టుకునేవాళ్ళం. మాకు ఆఫీసుకన్నా సెక్యూరిటీ ఎక్కడా ఉండేదికాదు. టైముకి భోజనం, టిఫిను, టీ అందించే రాములు కన్నా గొప్ప వ్యక్తి ఉండడు.

***

ఒకసారి ఇలాగే కర్ఫ్యూ టైంలో సంజీవరెడ్డినగర్ లో ఉన్న అక్కావాళ్ళింటికి వెళ్ళిపోయాం. అక్క తాడేపల్లిగూడెం వెళ్ళింది. బావగారు ఆఫీసుకి వెళ్ళారు. పెద్దావిడ వాళ్ళత్తగారు ఉన్నారు. ఆవిడకి ఇప్పుడే వస్తాం అని చెప్పి మా చెల్లెలు, నేను సత్యం థియేటర్ లో మార్నింగ్ షోకి వెళ్ళిపోయాం. సినిమా అయిపోగానే ఇంటికి వెళ్ళి భోజనం చేశాం.

అప్పట్లో ఇప్పటిలాగా ఎక్కడపడితే అక్కడ టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు లేవు. ఆవిడతో ఏం మాట్లాడతాం. మళ్ళీ “బయటికి వెళ్తున్నాం” అని చెప్పి సత్యం థియేటర్ వెనకే వున్న శీష్ మహల్ కి మ్యాట్నీకి వెళ్ళిపోయాం. అసలు సినిమాలంటే పెద్ద ఇష్టం లేదు. కానీ ఏం చెయ్యాలో తోచని పరిస్థితి.

ఇంటికి వచ్చేసరికి ఇంటి బయట కారు దగ్గిర నిలబడి ఉన్నాడు. “ఈ టైములో వచ్చావేంటి?” అని ఆశ్చర్యంగా అడిగాం. “మామ్మగారు మీరు సినిమాకి వెళ్ళారని చెప్పారు. అందుకే ఇక్కడ మీరు వస్తారని నిలబడ్డాను” అన్నాడు.

మేమిద్దరం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాం. “సార్ మిమ్మల్ని రేపు మానకుండా రమ్మన్నారు. ఏదో అర్జంటు వర్కు వచ్చిందిట. నన్ను ఎన్నిగంటలకి రమ్మంటారు” అన్నాడు. తొమ్మిది గంటలకి రమ్మని చెప్పి లోపలికి వెళ్ళాం. అక్క అత్తగారు మమ్మల్ని చూసి – “ఇదిగో అమ్మాయ్, మీరు సినిమాకి వెళ్ళారని నాకు తెలుసు. మీరు వెళ్ళిన టైములని బట్టి అనుకున్నా. సినిమా థియేటర్లు తప్ప బయట ఏమీ లేవని పక్కింటి అబ్బాయి చెప్పాడు, అహ్హ అహ్హ హ్హా.... అని నవ్వారు.

*** అంతేమరి ఒక షాపింగా ఏమన్నానా.... ? అప్పుడు అమీర్ పేటలో అక్కడక్కడ చిన్న చిన్న షాపులు వుండేవి. మైత్రీవనం, ఆదిత్య ఎన్క్లేవ్ అవన్నీ ఉన్నచోట ఖాళీస్థలాలు వుండేవి. సత్యం థియేటర్ సారధీ స్టూడియోస్ దగ్గర నిలబడితే కనిపించేది. సంజీవరెడ్డి నగర్ నుంచి అమీర్ పేట వెళ్ళే దారిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక కార్నర్ లో ఇరానీ హోటల్ వుండేవి అంతే. మధ్య మధ్యలో చిన్న చిన్న షాపులు. ఇప్పటిలాగా బయట షాపింగ్ అవీ ఏమీ లేవు. మెయిన్ రోడ్లమీద వేరే వూళ్ళకి వెళ్ళడానికి ట్రావెల్స్ కానీ ఏమీలేవు. ఒక్క గోల్డ్ స్పాట్ కంపెనీ మాత్రమే వుండేది. బస్సెక్కి ఊరు వెళ్ళాలంటే గౌలిగూడ బస్ స్టాండ్ కి వెళ్ళాల్సిందే. లేకపోతే రైల్వే స్టేషన్ కి ***

ఇద్దరం ఇంకేం మాట్లాడకుండా నవ్వి - ఆవిడని కూచోపెట్టి సినిమాకథ చెప్పేశాం. ఆవిడ కూడా ఆనందంగా విని, మా ఇద్దరికీ మంచి కాఫీ ఇచ్చారు.
ఇక మర్నాడు మళ్ళీ రాములు కారులో ఆఫీసుకి. కానీ ఎన్.టి.రామారావుగారు వచ్చిన తర్వాత క్రమం క్రమంగా గొడవలన్నీ తగ్గి కర్ఫ్యూ అనేదే లేకుండా పోయింది.

7, జులై 2022, గురువారం

ఎదురీతలో నేను - 31 ఉత్తరానికి ఎదురుచూపులు - ఆనందంగా ఆఫీసులో....

ఎదురీతలో నేను - 31 ఉత్తరానికి ఎదురుచూపులు - ఆనందంగా ఆఫీసులో....

నాకు 1000 రూపాయలు శాలరీ. అందులో అమ్మా వాళ్ళకి 500 రూపాయలు పంపించేదాన్ని. అందరూ అంత పంపించేస్తే ఇక్కడ నువ్వు ఎలా గడుపుతావు అనేవారు. కానీ నేను అతి పీనాసితనానికీ పోలేదు. అలా అని డబ్బులు విపరీతంగా కూడా ఖర్చు పెట్టలేదు. ఎప్పుడూ చాలా సంతోషంగానే ఉంటూ, నాకు కావలసినవి నేను ఎప్పుడూ తగ్గించుకోలేదు. అప్పులు చెయ్యలేదు. మా చెల్లెలు వచ్చాక ఇద్దరం సంతోషంగానే గడిపాం.


*** ఉత్తరానికి ఎదురుచూపులు ***


ఆరోజు ఆఫీసులో పైకీ కిందకీ తిరుగుతున్నాను. అందరూ “ఏమైంది?” అన్నారు. నేను ఏమీ మాట్లాడకుండా టెలిఫోన్ ఆపరేటర్ వుండేచోటికి వెళ్ళి నుంచున్నాను. 11 గంటలయింది. పోస్ట్ మేన్ గబగబా వచ్చి నా చేతిలో ఉత్తరం పెట్టాడు. అమ్మ ఉత్తరం చూసి ఎంత ఆనందంగా అనిపించిందో...

నా మొహంలో సంతోషం చూసి అమ్మయ్య ఉత్తరం వచ్చిందా... నీ టెన్షన్ చూసి ముందు మాకు అర్థం కాలేదు. “చదువుకుని మాకు స్వీట్ తెప్పించు” అన్నారు. వాళ్ళ మాట పట్టించుకోకుండా పైన మా రూంకి వెళ్ళిపోయాను.

అమ్మ ఐదోతరగతి చదువుకుంది. కానీ చాలా పుస్తకాలు చదివేది. చదవడం రానివాళ్ళకి చదివి వినిపించేది. ఇక ఉత్తరాలు అయితే ప్రతి చిన్న విషయం రాసేది.

*** “నాగమ్మా... ఎలా వున్నావు? సంక్రాంతికి వస్తున్నారా... ?” అక్కల పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాం. రత్న ఆడుకుంటూ కింద పడిపోయింది. దెబ్బ తగిలింది. ఛాయ వచ్చి దాన్ని పడేశానని నన్ను ఒక్క దెబ్బ వేసింది. ఎదురింటి వాళ్ళు ఎందుకో కనిపించట్లేదు. ఇవాళ అరటిపళ్ళవాడు ఇంటికి వెళ్ళిపోతున్నానని మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ముసలమ్మ వచ్చి గిన్నెలు తోమి వెళ్ళిపోతూ రేపు రానని చెప్పింది. ఇవాళ పొద్దున్న కాఫీ కలుపుతుంటే నువ్వు గుర్తు వచ్చావు... ప్రభావతి వచ్చింది కదా...! ఇద్దరూ సరిగ్గా తింటున్నారుకదా...! పెద్దక్క పిల్లలు ఛాయ, రత్న బాగా అల్లరి చేస్తున్నారు. నాకు వాళ్ళతో అస్సలు ఖాళీ వుండట్లేదు. మొన్న రత్నిని తిట్టానని ఛాయ కొబ్బరి పుల్లతో నన్ను కొట్టింది. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తుంటాను. - అమ్మ ***

ఇలా ఒకదానికి ఒకదానికి పొంతన లేక పోయినా... ఆ ఉత్తరం ఒక డైరీ రాసినట్లు రాసేది. (మర్చిపోయాను మా అమ్మ డైరీ తప్పకుండా రాస్తుండేది.) రాత మరీ అందంగా లేకపోయినా ఒకే పద్ధతిలో వుండేది. చదువుతుంటే అమ్మతో మాట్లాడుతున్నట్లు ఉండేది. మళ్ళీ మేము మా విశేషాలతో ఉత్తరం రాసేవాళ్ళం. ఆరోజులే వేరు. అక్కలు కూడా ఉత్తరాలు రాస్తుండేవారు. వాళ్ళు రాసిన ఉత్తరాలు వేరేగా వుండేవి.

మేము ఉత్తరం కోసం పడుతున్న హడావుడి చూసి ప్రతిసారీ ఆఫీసు వాళ్ళు పోస్ట్ మాన్ దగ్గర తీసేసుకుని “మీకు ఉత్తరం వచ్చింది మాకు స్వీట్ తెప్పిస్తే ఇస్తాం” అనేవారు. మా కన్నా వాళ్ళ ఎదురుచూపులు ఎక్కువ వుండేవి. ఒక పావుకిలో తెప్పించినా అందరూ పంచుకుని తినేవాళ్ళు. మాది ఉత్తరం ఆనందం. వాళ్ళది స్వీట్ ఆనందం.

ఇక మా హడావుడి విజయపాల్ రెడ్డి గారికి అర్థం అయి – “నాగలక్ష్మీ! మీరు ఆఫీసు నుంచి మీ అమ్మావాళ్ళతో ఎస్టీడీ కాల్ చేసి మాట్లాడుకోండి”, అని ఎస్టీడీ కోడ్ నెంబర్ ఇచ్చారు. అప్పుడు మా అమ్మా వాళ్ళింట్లో ఫోన్ లేదు. ఎదురుకుండా ఎవరో వ్యాపారస్తుల ఇల్లు వుండేది. మేము అక్కడికి చేసి అమ్మావాళ్ళు వచ్చాక వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. మా మూలంగా చాలా బిల్లు అయ్యేది. ఆయన ఎప్పుడూ దాన్ని గురించి మా దగ్గిర మాట్లాడలేదు. మమ్మల్ని అడగలేదు.

*** ఆఫీసులో కూడా కాలేజీ లైఫ్ ***

ఆఫీసులో అకౌంట్స్ లో నీరజ, వెంకటరమణ (అమ్మాయి) – ఆర్టిస్టుగా రమ, టెలిఫోన్ ఆపరేటర్ గా లీల. ఇక నేను, మా చెల్లెలు ప్రభావతి. లంచ్ టైంలో సందడే సందడి. అదయ్యాక “నాగలక్ష్మీ సాయంత్రం మూడు గంటలకి టీ అబ్బాయిని రావద్దని చెప్పాను దగ్గరలోనే ఉన్న గాయత్రీ భవన్ కి వెళ్ళి మంచి కాఫీ తాగొద్దాం” అంది నీరజ. అందరం కలిసి అలా ఒక పావుగంట తిరిగొచ్చాం. ఎప్పుడూ మా మధ్యన నవ్వుల జల్లులు వుండేవి.

“రేపు ఎవరం లంచ్ తెచ్చుకోవద్దు. లీల కొత్తగా చేరింది కదా తాజ్ మహల్ హోటల్ లో పార్టీ ఇస్తోంది” రమణ చెప్పింది. పాపం ఆ అమ్మాయి “ఎన్ని రూపాయలవి తింటారు” అంది. “తిన్నాక చెప్తాం” అన్నాం. మర్నాడు అందరం కలిసి తాజ్ మహల్ కి వెళ్ళి టిఫిన్ చేసి ఎవరి డబ్బులు వాళ్ళే ఇచ్చేశాం. లీల స్వీట్ తెప్పించింది. ఎప్పుడైనా సరదాగా లంచ్ టైంలో గాయత్రీ భవన్ కానీ, తాజ్ మహల్ కానీ దర్శించేవాళ్ళం.

5, జులై 2022, మంగళవారం

ఎదురీతలో నేను - 30 ఆఫీసులో మారుతున్న మనుషులు, కొత్తపనులు

 ఎదురీతలో నేను  - 30   ఆఫీసులో మారుతున్న మనుషులు, కొత్త పనులు


మా చెల్లెలు ప్రభావతి, నేను కలిసి ఆఫీసుకి వెడుతున్నాం. తనకి చాలా వరకు వర్కు నేర్పించేశాను. లక్ష్మణరావు గారు మానెయ్యడంతో శివప్రసాద్ గారి బంధువు నాగేశ్వరరావుగారు ఆర్టిస్టులుగా చేరారు. అంటే ప్రింట్ కి పేజీలు తయారు చెయ్యడం, కరక్షన్స్ ఉంటే కటింగ్, పేస్టింగ్ చెయ్యడం చేసేవారు. ఆర్టిస్టులు తయారు చేసినవి నెగెటివ్స్ తియ్యడానికి పెద్ద కెమేరాతో సెపరేట్ రూం వుండేది.


*** అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ***
*** మొదట మాకు గురువులయిన ప్రొఫెసర్లు ***


ఓపెన్ యూనివర్సిటీ కొత్తగా పెట్టడంతో వాళ్ళు డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పుస్తకాలు ప్రింటింగ్ కి మా ఆఫీస్ కి వచ్చారు. ఇంక వర్కు చాలా ఎక్కువైంది.
డా. రామచంద్రయ్య కెమిస్ట్రీ, డా. శివకుమార్ బోటనీ, డా. వెంకటనారాయణ – ఈ ముగ్గురూ వర్కు చేయించుకోవడానికి మా దగ్గిరకి వచ్చారు. వాళ్ళకీ ఈ వర్కు కొత్తే. కెమిస్ట్రీ, ఫిజిక్స్ రెండూ ఈక్వేషన్స్ తో సహా మేము చెయ్యగలిగేవాళ్ళం. వెంకటనారాయణ గారి మాథ్స్ మాకు టైము సరిపోయేది కాదు. చాలా బతిమాలేవారు. అది మాత్రం మేము చెయ్యలేదు.
డా. రామచంద్రయ్యగారు మనిషి ఎంత ఆప్యాయంగా మాట్లాడేవారో, వర్కు విషయంలో అంత కఠినంగా వుండేవారు. ప్రూఫ్ రీడింగ్ లో ఆయన చాలా పట్టుదల గల వ్యక్తి. పైగా అప్పుడు ఇప్పటిలాగా కంప్యూటర్ లోనే కరక్షన్స్ చేసేసి ఫైనల్ చెయ్యడం వుండేది కాదని చెప్పాను కదా. ఒక పేరాలో ఏదైన మార్పులు చేస్తే ఆ పేరాని మాత్రమే ఇస్తే పాత పేరా ప్లేస్ లో కొత్తదాన్ని పేస్ట్ చేసేవారు. చిన్న కామాలు, ఫుల్ స్టాప్ లతో సహా కట్ పేస్ట్ చేయించేవారు.
ఆయన పెట్టే ప్రెజర్ తట్టుకోలేక శివప్రసాద్ గారు “మీరు జిడ్డు చంద్రయ్యగారు. చెప్పిన మాట వినండి సర్. చిన్న చిన్నవి అయితే పెన్ తో పెట్టేద్దాం సర్, కంప్యూటర్ ఆపరేటర్లు ఇంత చిన్నచిన్నవి చేసి డెవలప్ చేసి ఇవ్వాలన్నా కష్టమే” అని బతిమాలుతుండేవారు.
రామచంద్రయ్యగారు మాత్రం ఏమాత్రం తొణకకుండా “నువ్వు ఏమైనా పిలవ్వయ్యా నన్ను, నాకేం అభ్యంతరం లేదు. నాకు మాత్రం ఒక్క తప్పు కూడా ఉండకూడదు. పిల్లలకి వెళ్ళే పుస్తకాలు ఇవి. ఒక పని చేద్దాం. వేస్టయిన బ్రోమైడ్ లు వుంటాయి కదా నేను వాటిల్లోంచి కామాలు, ఫుల్ స్టాప్ లు, ఏవైనా అక్షరాలు కట్ చేసి ఇస్తాను, నువ్వు పేస్ట్ చెయ్యి” అని చెప్పారు. ఏం చేస్తారు అలా పని పూర్తి చేశారు. కానీ ఆయన చాలా మంచి వ్యక్తి. మధ్యలో తినడానికి ఏమైనా తెప్పిస్తుండేవారు.
మాకు కూడా punctuation marks నేర్పింది ఆయనే. మేటర్ మధ్యలో *** - ; *** ఎందుకు పెడతారు అన్నది ఆయన దగ్గరే నేర్చుకున్నాం. పెద్ద పెద్ద వాక్యాలు రాసినప్పుడు చివరికి వెళ్ళేసరికి మొదటిది మర్చిపోయే అవకాశం వుంటుంది. కొన్ని వాక్యాలు చిన్నవిగా రాయలేం. అలాంటప్పుడు, ఇంకా కొన్ని చోట్ల - ; లతో బ్రేక్ చెయ్యగలుగుతాం. ఆశ్చర్యార్థకం ఎక్కడ పెడతారో కూడా తెలియని వాళ్ళున్నారు. మాకు వర్కుతోపాటు చాలా విషయాలు నేర్పించారు. అప్పట్లో ఫోటోలు తీసుకోవడానికి ఇలాంటి ఫోన్లు లేవు.
ఈ మధ్యన రామచంద్రయ్యగారి గురించి అడిగితే ఆయన ప్రపంచానికి దూరమయ్యారని తెలిసింది. కొంతమంది అలా గుర్తుండిపోతారు.
ఇక బోటనీ డా. శివకుమార్ గారు చాలా సున్నితంగా తనకి కావలిసినట్లు వర్కు చేయించుకునేవారు. ఆయన టాలెంట్ అది. ఆయన గురించి కూడా ట్రై చేశాం. బెంగుళూరులో ఉండచ్చు అని తెలిసింది.
*** విరామంలో పాటలు***
అప్పుడప్పుడు రామచంద్రయ్యగారు “శివప్రసాద్ ఓ రెండు పాటలు పాడవయ్య నాకూ బావుంటుంది. నీకూ నా మీద కోపం పోతుంది” అనేవారు. శివప్రసాద్ గారు గొంతెత్తి పాటలు పాడేవారు. పాతపాటలన్నీ అడిగిపాడించుకునేవారు. అప్పుడప్పుడు మమ్మల్ని పిలిచి పాడమంటే నాకు సినిమా పాటలు రావు. నేను ఎంకిపాటలు పాటలు, జానపద గేయాలు పాడేదాన్ని. ఆఫీసులో అకౌంటెంట్ నీరజ చిరంజీవులు సినిమాలో పి. లీల పాడిన ‘తెల్లవార వచ్చె తెలియక నా సామి’ పాట చాలా బాగా పాడింది. చాలా హాయిగా వుంటుంది. నేను భానుమతి అనుకున్నాను. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు ఒక జానపద గేయం మూలంగా తీసుకుని రాసిన పాట ఇది. ఆ పాట కూడా చాలా బావుంటుంది.
ఇలా మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ మా వర్కు కూడా చాలా బాగా చెయ్యగలిగేవాళ్ళం.