31, అక్టోబర్ 2020, శనివారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు - 6

 అమ్మా ఎలావున్నారు...

మీరు ఇక్కడికి వస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఎప్పుడు వస్తారా!అని రోజులు లెక్కపెట్టుకుంటున్నాను.
మేము పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారుతున్నాము. ఈ మారేటప్పుడు మనం హైదరాబాద్ ఇల్లు మారడం గుర్తుకు వచ్చింది.
మనం వున్న ఇళ్లలో ఒకింట్లో అలమారు పైన పెద్ద అటక వుండేది కదా... దాంట్లో నువ్వు పనికిరానివన్నీ బస్తాల్లో కట్టి పెట్టావు. చిన్నుగాడు ఆ అలమారు మించి అటక మీదకి ఎక్కేసేవాడు. ఆ పైన కూచుని ఏం చేసేవాడో మనకి తెలియదు. వాడికి తోచనప్పుడల్లా ఎక్కేస్తూ వుండేవాడు. నేను అప్పుడప్పుడు ఎక్కేదాన్ని కానీ కొంచెం సేపు వుండి వచ్చేసేదాన్ని.
కింద మనకి అసలు సామానేమీ వుండేది కాదు. ఇల్లు నీట్ గా వుండేది. మనం అనుకోకుండా ఆ ఇంట్లోంచి మారాల్సి వచ్చింది. కిందవన్నీ పంపించేశాక "నువ్వు పైన అన్నీ బస్తాలు వున్నాయి కదా! అవి దింపండి" అన్నావు.
నాన్న, చిన్నుగాడు ఇద్దరూ తియ్యడం మొదలు పెట్టారు. ఎంత తీసినా తరగని సంపద లాగా వస్తూనే వుంది. నువ్వు "ఇంకా ఎన్ని వున్నాయి... బస్తాల్లో వుండాలి కదా!" అన్నావు.
నాన్న "ఇక్కడ బస్తాలేం లేవు. అన్నీ పరిచి వున్నాయి" అన్నారు.
"ఏం చిన్నూ ఎందుకు ఇప్పావురా అంటే వాటిల్లో ఏమున్నాయో చూద్దామని" అన్నాడు. "అందులో నాకు కావలసినవి తీసుకుందామని" అన్నాడు. ఎప్పుడూ ఏవో ఒక వింత వస్తువులు తయారు చేసేవాడు కదా....
ఇంక నాన్న, వాడు అటక మించి దింపుతూనే వున్నారు. నీకు ఏడుపు ఒకటే తక్కువ. నిన్ను చూస్తే నాకు జాలేసింది. నీకు చిరాకొచ్చి వాటిల్లో పనికిరానివన్నీ తీసి అవతల పడేశావు. మొత్తానికి మధ్యాహ్నం పూర్తవాల్సింది రాత్రికి పూర్తయింది.
ఇప్పుడు వాడితో ఈ విషయం అంటే ఒకటే నవ్వు. అబ్బో చిన్నప్పుడు తెలియలేదు కానీ, ఇప్పుడు చూస్తుంటే ఇల్లు మారడం ఎంత కష్టమో తెలుస్తోంది.
మీరు వస్తే ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు. అబ్బా ఎంత ఆనందంగా ఎదురు చూస్తున్నానో తెలుసా....

27, అక్టోబర్ 2020, మంగళవారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరం -5

 అమ్మా... ఎలా వున్నావు.

ఎన్నిరోజులైందమ్మా నీకు ఉత్తరం రాసి. రోజులు తొందరగా గడిచిపోతున్నాయి. కానీ పాతజ్ఞాపకాలు తవ్వుకుంటూ వస్తున్నాయి. మొన్న నువ్వు నీ టైమ్ లైన్ లో నవంబర్ 14న మా పాత జ్ఞాపకాల ఫొటోలు పెట్టావు కదా... అవి చూడగానే నాకు బలే సంతోషంతా అనిపించింది. 

మేము వాళ్ళ ప్రోగ్రాములో పాల్గోవడం అనేది అనుకోకుండా బలే జరిగింది. నువ్వు మమ్మల్ని రెగ్యులర్ గా బాలభవన్ కి తీసుకెళ్ళేదానివి కదా. వాళ్ళు నవంబర్ 14 ప్రోగ్రాం కి పిల్లలు చాలామంది కావాలంటే నువ్వు మన బిల్డింగ్ లో వున్న సౌమ్య, సౌజన్య, కామేశ్వరి, ఇంకా నా ఫ్రెండ్స్ రమ్య, సౌమ్య, నన్ను, చిన్నుగాడిని మొత్తం ఒక పదిమంది పిల్లల దాకా పోగేసి తీసుకెళ్ళావు. వాళ్ళు చాలా సంతోషించారు. 

మాకందరికీ - బచ్చే హమ్ బాలభవన్ కి - కవాలి మా అందరికీ నేర్చించారు. వాళ్లు దానికి డ్రెస్ ల కోసం చిన్నుగాడిని వాళ్ళతోబాటు కోటీ తీసుకెళ్తే చిన్నవాడు కదా వాళ్ళు ఎక్కడైనా వదిలేస్తారేమోనని నువ్వూ, నేనూ ఎంత కంగారు పడ్డామో కదా... వాడు మాత్రం భయం లేకుండా వెళ్ళిపోయాడు. 

మొత్తానికి వాళ్ళు వచ్చాక అందరం కలిసి బాలభవన్ బస్ లో శిల్పారామం వెళ్ళాం. సౌమ్యావాళ్ళ మమ్మీ అందరికీ చపాతీ తీసుకుని వచ్చారు. చాలా బావుంది. అందరం అదే తిన్నాం. నాన్న మా అందరికీ ఫొటోలు తీశారు. ఈ ఫొటోలే మా తీపి గుర్తులు. ఆ రోజులు ఎంత బావుండేవో కదమ్మా. ఎక్కడ ప్రోగ్రాం అయినా మా అందరినీ నువ్వు బలే తీసుకుని వెళ్ళేదానివి.
చిన్నుగాడు, నేను ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నాం.

ఇంకా కొన్ని విశేషాలతో మళ్ళీ రాస్తాను. ఉంటానమ్మా....

నీ వీణ 

25, అక్టోబర్ 2020, ఆదివారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు ప్రేమతో రాసిన ఉత్తరం - 4


 

మా అమ్మాయి వీణాధరి నాకు ప్రేమతో రాసిన ఉత్తరాలు

అమ్మా...

ఎలా వున్నావు.. రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు. నిన్ను, చిన్నప్పుడు నువ్వు చెప్పిన కథలు తలుచుకుంటూ పడుకున్నాను. నువ్వేమో మా ఇద్దరినీ చెరొక పక్కా పడుకోపెట్టుకుని కథలు చెప్పేదానివి. పగలంతా ఇంట్లో పని, ఆఫీసులో పని చేసుకుని వచ్చి బాగా అలిసిపోయేదానివి.
కానీ మాకు అన్నం పెట్టేటప్పుడు, పడుకునేటప్పుడు మాగాయముక్క రాక్షసుడి కథ, అరేబియన్ నైట్స్ - సోమరిపోతు హసన్ కథ - ఇనప అత్తగారు, అత్తగారు కాకరకాయలు ఎన్నికథలు చెప్పేదానివమ్మా...! నాకు సడన్ గా ఇనప అత్తగారి కథ గుర్తుకు వచ్చింది.
ఆ కథ తల్చుకుంటే బలే నవ్వు వచ్చింది. అసలు కోడళ్ళు అలా భయపడతారా...? అప్పటి కోడలు కదా...! అత్తగారంటే కోడలికి విపరీతమైన భయమని - అత్తగారు తను చచ్చిపోతే పెట్టుకోమని తన బొమ్మ ఒకటి ఇనుముతో చేయించి ఇస్తుందని - అత్తగారు పోయాక కూడా ఆ బొమ్మని చూసి భయపడుతుందని - అత్తగారి బొమ్మకి ఏం పెట్టకుండా తను తినేది కాదని చెప్పావు. ఒకసారి కోడలు తిరణాలకి వెడుతూ అత్తగారి బొమ్మని తీసుకెడుతుందని చెప్తూనే నిద్రపోయావు.
మేమిద్దరం నువ్వలా నిద్రపోయేసరికి ఏం చెయ్యాలో తెలియక అమ్మా కథ చెప్పు అని లేపాం. నువ్వేమో ఏం కథ... ఆ... హసన్ కథ కదా...! అన్నావు. నేను అత్తగారి కథమ్మా అన్నాను. నువ్వేమో పాపం నిద్రమత్తులో ఆ... హసన్ అత్తగారితో వెళ్ళిపోయాడు అన్నావు.
మేమిద్దరం బాగా నవ్వాం. నువ్వు సగం సగం కళ్లు తెరిచి ఎందుకు నవ్వుతున్నారు రేపు చెప్తాలే మిగిలిన కథ అని మళ్ళీ నిద్రపోయావు.
పొద్దున్న లేచాక నీకు నీ మాటలు చెప్తే... బాగా నవ్వావు. అయ్యో మొత్తం కథ చెప్పలేదా నేను. సారీ బాగా నిద్రొచ్చేసింది. ఇవాళ సరిగ్గా చెప్తాలే అన్నావు. నువ్వు కథ చెప్తుంటే అందులోకి వెళ్లిపోయేవాళ్ళం.
అమ్మా... నీ చేత మళ్ళీ కథలు చెప్పించుకోవాలి. చిన్నుగాడు కుడా అదే అంటున్నాడు.
నిన్ను తలుచుకుంటూ... నీ కథలు నెమరేసుకుంటూ నిద్రపోతా...

21, అక్టోబర్ 2020, బుధవారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు - 4


 అమ్మా!

ఎలా వున్నావు? మళ్ళీ ఉత్తరం రాస్తున్నాను. ఏమిటో ఫోన్ లో ఏం మాట్లాడుకున్నా ఉత్తరంలో మనసు విప్పి రాస్తుంటే చాలా బావుంది. నీతో మళ్ళీ అన్నీ పంచుకోవడం చాలా సంతోషంగా వుంది.
నువ్వు నన్ను కేర్ సెంటర్లో దింపిన మొదటి మూడు రోజులూ బాగా ఏడ్చానని చెప్పావు కదా! పాపం తాతా వాళ్ళు నాతో ఏం ఇబ్బంది పడ్డారో. తర్వాత నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం అయిపోయింది కదూ!

మొత్తానికి నేను వాళ్ళకి అలవాటు పడ్డాను కదా! నువ్వు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నన్ను దింపగానే నేను పరిగెత్తుకుని వెళ్ళిపోయేదాన్నని చెప్పావు. అక్కడ ఇంకా చిన్న పిల్లలు వుండేవారు కదా! బాగా ఆడుకునేదాన్ననుకుంట.



అక్కడ ఎంతమంది పిల్లలున్నా తాత నన్ను మాత్రమే ఎత్తుకుని తిప్పేవారని, నన్ను తన పక్కనే మంచం మీద పడుకోపెట్టుకునేవారని, తనే అన్నం తినిపించేవారని నువ్వు చెప్పింది మాత్రం బాగా గుర్తుంది. సీత ఆంటీ కూడా బాగా ఆడించేవారని చెప్పావు. ఒకసారి నాకు వాకర్ కొని దానితో నన్ను నడిపిద్దామని అందులో నిలబెడితే నేను పడిపోయి నా మూతికి దెబ్బ తగిలితే, సాయంత్రం నువ్వు వచ్చేసరికి ఆంటీ ఏడుస్తూ చెప్పారని చెప్పావు. పాపం భయపడినట్లున్నారు. ఏంటో అమ్మా ఇవన్నీ తలుచుకుంటుంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయినట్లుంది.

ఇంకా నీకు చాలా విషయాలు రాయాలి. మళ్ళీ రేపు రాస్తాను.
ఉంటా అమ్మా!

15, అక్టోబర్ 2020, గురువారం

అమ్మకు ప్రేమతో.... 2 వ ఉత్తరం




 అమ్మా!

ఎలా వున్నావు? నా పుట్టినరోజు రోజునే నీకు లెటర్ రాద్దామనుకున్నాను. ఆఫీసులో పార్టీ పెట్టి చాలా హడావుడి చేశారు. అయినా నీకు ఉత్తరం రాయాలన్న సంగతి మర్చిపోలేదు.

నీతో మరికొన్ని జ్ఞాపకాలు పంచుకుని ఆనందించాలని అనుకుంటున్నాను.

నేను పుట్టిన తర్వాత మొదట అమ్మాయి పుట్టినందుకు నువ్వు చాలా సంతోషించానని చెప్పావు. హాస్పటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా చిన్ని, చిన్ని పాదాలు చూసి ముద్దొచ్చి అక్కడ నీ బుగ్గలని ఆనించి నా పాదాలతో తన్నించుకున్నానని చెప్పావు. ఆ స్పర్శ చాలా ఆనందంగా అనిపించిందన్నావు. "నాకు మాటలు వస్తే అలా చేసేదాన్నా? అయ్యో అమ్మని అలా ఎలా తన్నాను?" అన్నాను.

నువ్వేమన్నావో తెలుసా! నీకు గుర్తుందా అసలు. "పిల్లలు కడుపులో వున్నపుడు పొందిన ఆనందం ఒక ఎత్తయితే, వాళ్లు బయటికి వచ్చాక వాళ్ళు చేసే ప్రతి పనీ తల్లికి ఆనందంగానే వుంటుంది. నువ్వు అంత బాధపడక్కరలేదు" అన్నావు. అమ్మమనసు ఎంత గొప్పదో కదా! నాతో చాలా ఆటలు ఆడేదానివి కదమ్మా!

నేను పుట్టినప్పుడు బామ్మ వచ్చిందని చెప్పావు. నాకు నాలుగో నెల వచ్చాక బామ్మ అనుకోకుండా మద్రాసు వెళ్ళిపోయింది - నువ్వేమో ఉద్యోగానికి వెళ్ళాలి. ఏం చెయ్యాలో అర్థం కాలేదన్నావు. కానీ నువ్వు టెన్షన్ పడకుండా మనింటికి దగ్గరలోనే వున్న కేర్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి వచ్చానన్నావు. నా జీవితంలో అదొక మర్చిపోలేని విషయమమ్మా! వాళ్ళు ఎలా కేర్ సెంటర్ మొదలు పెట్టారో నువ్వు చెప్పింది నేను చెప్తా చూడు -

అది మొదలు పెట్టింది భార్యా భర్తలు. ఆయన రిటైర్డ్ ఇంజనీరు. ఆయన పేరు కోటేశ్వరరావు, ఆవిడ పేరు సీత - ఇంట్లోనే వుంటారు. నన్ను చూసి రేపటి నుంచి తీసుకురండి అన్నారు. నేనే మొదటి పిల్లని వాళ్ళ కేర్ సెంటర్ లో. ఆయన్ని నేను తాత అని పిలిచేదాన్ని. కాని మొదటి మూడు రోజులూ సీత ఆంటీని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించానని చెప్పావు. నిన్ను వదిలేసరికి నాకు బాగా ఏడుపు వచ్చినట్టుంది. నువ్వేమో ఉద్యోగానికి వెళ్ళాలి. నువ్వూ చాలా బాధపడ్డానని చెప్పావు. నాలుగో రోజు నుంచి నేను బాగా అలవాటు పడిపోయాను కదా!

అమ్మా రాస్తుంటే ఇలా రాయాలనే అనిపిస్తోంది. ఈ జ్ఞాపకాలు ఎంత అందమైనవో కదా! కనీసం వారానికోసారైనా తప్పకుండా రాస్తానమ్మా!

ఉంటాను మరి....

14, అక్టోబర్ 2020, బుధవారం

అమ్మకు ప్రేమతో..... పిల్లలు రాసిన ఉత్తరాలు

పిల్లలు దూర దేశాలకి వెళ్ళినప్పుడు అమ్మకి ప్రేమతో రాసిన ఉత్తరాలు ఇవి....

పిల్లలు పుట్టిన దగ్గరనుంచీ వాళ్ళ అల్లర్లు, పేచీలతో ఎన్నో ముచ్చట్లు ఉంటాయి. ఆ ముచ్చట్లలో ప్రేమ వుంటుంది, మనం తట్టుకోలేని నవ్వు వుంటుంది, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారనే ఆలోచన, దాంట్లో మనం నేర్చుకునే పాఠం వుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళయి వాళ్ళ వృత్తి రీత్యా కానీ, వివాహం అయి కానీ దూరంగా వున్నప్పుడు వాళ్ళు వాళ్ల చిన్నప్పటి విషయాలన్నీ తల్లితండ్రులతో పంచుకుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? దాన్నే ఈ రకంగా ప్రారంభించి వీలైనప్పుడల్లా మా పిల్లల ముచ్చట్లు మీతో పంచుకుందామనుకుంటున్నాను!


అమ్మా!
నీకు చాలా రోజుల నుంచి ఉత్తరం రాయాలనుకుంటున్నాను. ఎప్పుడూ ఆఫీసు, ఇల్లు! నేను, చిన్నుగాడు పుట్టేముందు, పుట్టాక నువ్వు చెప్పిన నీ అనుభవాలు గుర్తుకు వచ్చాయి. అంతేకాకుండా మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఆడిన ఆటలు, చదువులు, స్నేహితులతో మా అనుభవాలు, స్కూలు రోజులు, కాలేజీ రోజులు మొత్తం అన్నీ నీకు ఉత్తరం రాస్తే ఎలా వుంటుంది అనిపించింది.

నేను పుట్టేముందర, పుట్టిన తర్వాత విషయాలు నీకు గుర్తున్నా నేను వాటిని మధుర జ్ఞాపకంలా నీతో పంచుకుందామనుకుంటున్నాను.


అమ్మా! నేను పుట్టేముందర నీ పొట్టలో అటూ ఇటూ కదిలేదాన్నని, ఆ కదలికలు మరీ ఎక్కువ వుండేవి కావు, బుద్ధిమంతురాల్ని అనుకున్నానని చెప్పావు. కానీ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మాత్రం బస్సు హారన్ కి ఉలిక్కిపడటం నీకు ఆశ్చర్యం కలించిందన్నావు. అంటే ఏదైనా శబ్దాలకి మాత్రం బాగా స్పందించడం చూసి నువ్వు పాటలు పాడుతూ వుండేదానివి కదూ! నీ పొట్టలో వుండి పాటలు వింటూ కాళ్లూ, చేతులూ కదిపేదాన్నని, అదే కారణంగా నేను సంగీతం నేర్చుకుని రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో బహుమతులు గెల్చుకున్నానని చెప్పిన విషయం నేను మర్చిపోలేదమ్మా! నేను, చిన్నుగాడు ఎన్నో విషయాలు రాసి నీకు, నాన్నకి ఆనందం కలిగించాలి.
ఇప్పటికి వుంటాను.
ప్రేమతో....

10, అక్టోబర్ 2020, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 6

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 6

 

ఇప్పటి వరకూ అమ్మ చెప్పిన సంక్రాంతి పండుగ చూశారు కదా

 








మరి ఈ సంక్రాంతి పండుగ ఏలేటిపాడులో చూడడానికి అమ్మ మేనమామ పట్టెయ్య శాస్త్రులు గారి అబ్బాయి కృష్ణశాస్త్రి గారింటికి నేను, మా వారు వెళ్ళాం. మా వారికి పల్లెటూళ్ళో భోగిమంటలు, పండగ చూడాలని వుందంటే వెళ్ళాం. 

 

కృష్ణశాస్త్రి వారి సతీమణి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. భోగి రోజు పొద్దున్నే లేచి భోగిమంట వేశారు. మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. తర్వాత కాసేపు తెలిమంచు అందాలు చూడడానికి వారి మేడపైకి వెళ్ళాం. మసక మసకగా చెట్ల నిండా మంచు పడి, చలి చలిగా చాలా బావుంది.  పండగ రోజు చక్కగా మంచి పిండి వంటలతో భోజనం పెట్టారు. వారి మర్యాదలు, ఆప్యాయతలు పెద్దల నుంచి పుణికి పుచ్చుకున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. 

 

మళ్ళా రెండోసారి పిల్లలని తీసుకుని వెళ్ళాము. వాళ్ళ నుంచి అవే మర్యాదలు, అవే ఆప్యాయతలు. వీధులలో వేసిన ముగ్గులు సంక్రాంతి హడావుడి చూసి పిల్లలు చాలా సంతోషించారు. అక్కడ పొలాల గట్లమీద, చెరువుల దగ్గిరికి వెళ్ళి వాటి అందాలని ఆస్వాదించి వచ్చారు.  పెద్దపండగ రోజు ఊరంతా ఒకటే హడావిడి. ప్రభల ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు. ఇది మూడు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుందిటి. పుట్టింటి ఆడబడుచులు తప్పనిసరిగా వస్తారు.  

 

రకరకాల వింత వింత వేషాలతో, డప్పుల ధ్వనులతో మాకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తానికి పాతకాలంలో జరిగినట్లు కాకపోయినా పల్లెటూరులో సంక్రాంతికి వెళ్ళి ఆనందించాం.

7, అక్టోబర్ 2020, బుధవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 4 ఏలేటిపాడులో అమ్మ చెప్పిన సంక్రాంతి సందడి -1












 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 4


ఏలేటిపాడులో అమ్మ చెప్పిన సంక్రాంతి సందడి -1


అమ్మావాళ్ళ చిన్నప్పుడు  సంక్రాంతి వస్తోందంటే ఒకటే సందడి హడావుడి వుండేదిట. డిసెంబరు 15వ తేదీ నుంచి నెల పట్టడం అని చేసేవారుట. అంటే కేవలం సంక్రాంతి పండగ మీదే దృష్టి పెట్టేవారు. ఇలా చెప్పింది అమ్మ - 


అందరిళ్ళలో పశుసంపద బాగా వుండేది. అందుకని నెల పట్టినప్పటి నుంచి ఆవుపేడతో రోజూ గొబ్బిళ్ళు పెట్టేవారు. వాటిని గోడకి పిడకలుగా కొట్టి వాటి మధ్య చిల్లు పెట్టేవారు. ఎందుకంటే భోగి రోజున మంటలో దండలుగా గుచ్చి వేసేవారు. ఒకళ్ళమీద పోటీగా ఒకళ్ళు గొబ్బిళ్ళతో పిడకలు చేసి దండలు రెడీ చేసుకునేవారు. ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకి గొప్పగా వుండేది. 


అమ్మ చక్కటి ముగ్గులు పెట్టేది. అప్పట్లో ఇంటిముందు పేడనీళ్ళు చల్లి తెల్లటి బియ్యపు పిండితో ముత్యాల ముగ్గులు పెట్టేవారు.  గీతల ముగ్గులు చాలా తక్కువ. బియ్యపు పిండితో ముగ్గులు ఎందుకంటే చీమలకి ఆహారం వేసినట్లు అనుకునేవారు. నెల రోజులు రకరకాల ముగ్గులతో వాకిళ్ళు శోభాయమానంగా వుండేవి. అందరిళ్ళలో పిల్లలు అందరిళ్లకి పరుగులు పెట్టుకుంటూ ఎవరి ముగ్గు బావుందో చూసి వచ్చేవారు. 


ఈ నెల రోజులు హరిదాసు కీర్తనలతో, జంగమదేవరల గంటల సవ్వడితో చాలా సందడిగా వుండేది. హరిదాసు వస్తున్నాడనగానే పిల్లలు చిట్టి చిట్టి చేతులతో బియ్యం తీసుకుని గుమ్మం ముందు నుంచునేవారు. పెద్దవాళ్ళు హరిదాసుకి కొత్త బట్టలు ఇచ్చేవారు. మధ్యాహ్నం వరకు తిరిగి హరిదాసు ఇంటిదారి పట్టేవాడు. 

జోలె తగిలించుకుని, గంట వాయించుకుంటూ, శంఖం వూదుతూ వచ్చే జంగమ దేవరని పిల్లలు, పెద్దలు చాలా ఆసక్తిగా చూసేవారు.  వీళ్ళు శైవారాధకులు. రకరకాల కథలు, శైవ కథలు చెపుతూ ప్రచారం చేస్తూ తిరుగుతుండేవారు. జంగమ దేవర చెప్పే కథలంటే అప్పట్లో అందరికీ చాలా ఆసక్తిగా, కాలక్షేపంగా వుండేది. జంగమ దేవరలని కూడా కొత్తబట్టలు, బియ్యం, పప్పులు ఇచ్చి గౌరవించేవారు. 


గంగిరెద్దు వాళ్ళు ఎద్దుని చక్కగా అలంకరించి ఇంటి ముందుకు వచ్చేవారు.  ఎద్దుని అయ్యగారికి దణ్ణంపెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టి అనగానే అది వంగి దణ్ణం పెట్టేది. 


వాళ్లకి డబ్బులు వేస్తే పిల్లల పేరు అడిగి -

“మహలక్షమ్మగారి ఆరుగురు మగపిల్లలు ఐదుగురు మగపిల్లలు పదకొండు మంది సంతానంతో ఇల్లంతా కళకళలాడుతుందని” ఆశీర్వదించేవారు. 


వాళ్ళ ఆశీర్వాదానికి పిల్లలు సిగ్గుపడుతూ నవ్వుకునేవారు.  వీళ్ళకి కూడా బట్టలిచ్చి, కొత్తధాన్యం ఇచ్చి పంపేవారు. 


అందరిళ్ళలో పెద్ద పెద్ద పెరడ్లు వుండడంతో అందరూ రకరకాల పువ్వుల మొక్కలని పెంచేవారు. రంగు రంగుల బంతిపువ్వులతో గొబ్బిళ్ళని, దండలు గుచ్చి గుమ్మాలని అలంకరించేవారు. 


అమ్మావాళ్ళు రోజూ పెట్టే గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాడే పాట -


సుబ్బీ గొబ్బెమ్మ 

సుఖమూ నియ్యావే

చామంతి పువ్వుంటి 

చెల్లెలినియ్యావే

గుమ్మడి పువ్వంటి 

కూతుర్నియ్యావే

తామర పువ్వుంటి

తమ్ముడినియ్యావే

మొగలి పువ్వంటి 

మొగుడ్నియ్యావే


ఇలా పాడి చివరికి మొగుడు అనగానే సిగ్గుపడి పాడేవారు. 


ఇలా రోజూ పెట్టడం వుంటూండగానే…. పండగ దగ్గిర పడుతుంటేే ఏదో ఒక రోజు సందె గొబ్బీ అని  సాయంత్రమప్పుడు పెద్ద పెద్ద గొబ్బెమ్మలని తయారు చేసి వాటిని పువ్వులతో బాగా అలంకరించి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి వాళ్ళతో కలిసి వాటి చుట్టూరా తిరుగుతూ పాటలు పాడి వాటిని దగ్గరలో ఉన్న కాలవలో కలిపేవారు. 

సందె గొబ్బీ దగ్గర


ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను

ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను

ఉట్లమీద పాలు పెరుగు ఎట్ల దించెను

నే కొట్ట బోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు


  • అంటూ తిరుగు తిరుగుతూ వున్నవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని అటూ ఇటూ చెల్లా చెదురై గలగలా నవ్వుకునేవారు. 



చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు

రవికలన్ని మూట కట్టి రమణ కృష్ణుడు

ఆ చెట్టు మీద దాచెనమ్మ చిన్ని కృష్ణుడు


ఆ మూట కట్టడం చెప్పేటప్పుడు వాళ్ళు కట్టుకునన పట్టు లంగాలని ముందుకు తీసుకుని చేత్తోమూటలుగా చేసి తిరిగేవారు.


గొబ్బీయళ్ళో గొబ్బీయళ్లో

తోట తోటా వేసేరంటా

ఏమీ తోటా  వేసేరంటా

రాజుగారీ తోటలో 

జామీ తోటా వేసేరంటా - ఇలా వుండేవి ఆ పాటలు


జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 5 - ఏలేటిపాడులో అమ్మ చెప్పిన సంక్రాంతి సందడి - 2

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 5


ఏలేటిపాడులో అమ్మ చెప్పిన సంక్రాంతి సందడి - 2







పండగ ముందు వారం రోజులనుంచీ ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తుండేవారు - జంతికలు, కజ్జికాయలు, కరకజ్జం, చిట్టి గారెలు, బూందీ లడ్డూలు, అరిసెలు ఇలా ఎన్నో రకాలు డబ్బాలలో నింపి పెట్టేవారు. 


పెద్ద పండగ అవడంతో అందరూ కొత్త బట్టలు వేసుకునేవారు. ఆడపిల్లలకి ముచ్చటగా పట్టు లంగాలు, జడగంటలు పెట్టిన పువ్వుల జడలు తప్పనిసరిగా వుండేవి. ఊరంతా పరుగులు పెట్టుకుంటూ తిరుగుతుంటే కళకళలాడుతుండేది. 


మొదటి పండగ భోగి రోజు - 


భోగిరోజు తెల్లవారు జామున ఇన్నిరోజులు దాచిపెట్టిన గొబ్బీ పిడకలు, పెద్ద పెద్ద చెట్ల్ మానులు వేసి భోగిమంట వేస్తారు.  ఆవు పేడతో చేసిన పిడకలు కావడం వల్ల వాటి నుంచి వచ్చే పొగ కూడా ఆరోగ్యానికి మంచిది. ప్రతి నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వేస్తారు. ఆ మంట మీద చాలా మంది స్నానానికి నీళ్లుకాచుకుంటారు. 


భోగిమంట తర్వాత తలస్నానం ఒక పెద్ద పనిగా వుండేది. ఒంటికి నువ్వుల నూనె రాసుకుని, సున్నిపిండితో నలుగు పెట్టుకుని, కుంకుడు కాయలతో మాత్రమే తలస్నానాలు చేసేవారు. ఒకవేళ ఆ కుంకుడు రసం కంట్లో పడి కన్ను మండితే… రాళ్ళ ఉప్పు నోట్లో వేసుకోమనేవారు. ఎందుకో తెలియదు. ఇదంతా అయ్యాక దేవుడి దగ్గిర పెట్టిన కొత్త బట్టలు కట్టుకుని హరిదాసుకోసం ఎదురు చూసేవారు. హరిదాసుకి బియ్యం వేసి ఎవరి దారిన వాళ్ళు స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళేవారు. సాయంత్రం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పేరంటం పెట్టి - పువ్వులు, రేగిపళ్ళు, రాగి పైసాలు కలిపి అందరికీ ఇచ్చి దిష్టి తీసి నెత్తిమీద పోయించేవారు. ఆ వేడుక అయిన తర్వాత కిందపడిన పైసాలు చాకలి అమ్మాయినో, పని మనుషులనో తీసుకోమనేవారు. 


రెండవ రోజు సంక్రాంతి - పెద్ద పండగ


ఆరోజు నింజంగానే పెద్ద పండగ. ఆరోజు కుటుంబంలో ముందు తరాల పెద్ద వాళ్ళన గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఇష్టమైన రకరకాల పిండి వంటలు చేస్తారు. పులిహోర, బూరెలు, బొబ్బట్లు ఒకరకం కాదు చాలా రకాలు చేస్తారు. పిల్లలూ పెద్ద వాళ్ళూ కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా గడుపుతారు.   సంక్రాంతికి బొమ్మల కొలువులు ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టి పేరంటానికి పిలుస్తుండేవారు.  కొంతమంది మూడు రోజులు, కొంతమంది తొమ్మిది రోజులు వుంచుతారు. రకరకాల పెద్ద, చిన్న బొమ్మల దగ్గర నుంచీ ఎన్నో బొమ్మలు వుంటాయి. బొమ్మల కొలువు పెట్టిన వాళ్ళు పేరంటానికి పిలిచి - అలా అందరినీ ఆరోజు కలుస్తారు. ఇదొక పెద్ద సందడిగా వుంటుంది. 


మూడవరోజు కనుమ

సంక్రమణం జరిగిన మరుసటిరోజుని కనుమ అంటారు. ఈ రోజు ఎవరూ ప్రయాణాలు పెట్టుకోరు. కనుమునాడు కాకి కూడా కదలదనీ నానుడి. ఈ రోజు తల స్నానం చేసితీరాలట. కనుము నాడు మినుము తినాలని అనేవారు.  కనుక కనుమునాడు సాధారణముగా మినపగారెలు తింటారు. భోజనం లో ప్రత్యేకత గారెలు. ఈ రోజు ఊరి అమ్మవారికి నైవేద్యం చెల్లించడం ఆచారం. ఊరి అమ్మవారి సంబరం జరగడం కూడా వేడుకే. 

ఈ రోజు పశువులను కడిగి అలంకారం చేసి హారతిస్తారు.  ఎడ్ల పోటీలు, కోడి పందాలతో ఊరంతా హడావుడిగా వుంటుంది. కనుము పూర్తిగా రైతుల పండుగ. ఈరోజు రైతులు ఉదయమే  పశువుల పాకలని శుభ్రం చేసి, అలికి ముగ్గులు పెట్టి, అక్కడ పాలతో పొంగలి వండుతారు. దీనిని పాన పొంగలి లేదా పశుల పొంగలి అంటారు. పనిముట్లను, పశువులను కడిగి, కుంకుమాదులతో అలంకరించి పూజిస్తారు. పొంగలిని నైవేద్యముగా పెట్టిన తరువాత ఆ మెతుకులను పసుపు, కుంకుమలతో కలిపి పొలాలలో చల్లుతారు. దేనిని ‘పోలిచల్లడం’ అంటారు. 

కనుము నాడు కొన్ని ప్రాంతాలలో జరిగే ప్రభల తీర్థం చాలా బావుండేది. చక్కగా అలంకరించబడిన ప్రభలలో తమ తమ శివాలయాలలోని ఉత్సవ మూర్తులని ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ఒక చోట సమావేశ పరుస్తారు. ఎక్కడెక్కడి నుండో బంధువులు, మిత్రులు అంతా కలిసి ఆనందంగా గడుపుతారు. 

నాలుగవ రోజు జరుపుకొనేది ముక్కనుమ. ఇలా ఊళ్ళో సంక్రాంతి పండగ జరుగుతుందని చాలా బాగా గడిపేవాళ్ళమని అమ్మ చెప్పింది.