29, మార్చి 2023, బుధవారం

*** కొన్ని పాత విషయాలే బావుంటాయి *** -78

 

*** కొన్ని పాత విషయాలే బావుంటాయి *** -78

 

ఒకరోజు సత్యవాణిగారు అమ్మా నాగలక్ష్మీ! బంజారాహిల్స్ లో వెంకట శివయ్యగారు, రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసరుగారు వుంటారు. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఆయనకి హిందీ, తెలుగు కలిపి కొన్ని పేజీలు చేసి పెట్టాలిట. ఫోన్ నెంబర్ ఇస్తాను. వెళ్ళిరా తల్లీ! వారం రోజుల నుంచీ చెప్తున్నారుఅన్నారు.

 

సత్యవాణిగారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాను.

 

*** వెంకట శివయ్య, ఐఎఎస్ అనగానే పాత రోజులు గుర్తుకువచ్చాయి. 1975 నుంచి 80 మధ్యలో అనుకుంట తాడేపల్లి గూడెం టౌనుహాలులో సాహితీసమాఖ్య మీటింగ్ జరిగింది. ఆ మీటింగులకి మా అమ్మ(44సం. చదివింది 5వతరగతి)తో సహా అందరం వెళ్ళేవాళ్ళం. మా అమ్మ పుస్తకాలు బాగా చదివేది కాబట్టి ఇలాంటి మీటింగులంటే చాలా ఇష్టంగా వచ్చేది. రంగినీని సత్యనారాయణరాజుగారు, మారేమండ సీతారామయ్యగారు వంటి ప్రముఖులంతా ఈ కార్యక్రమ నిర్వాహకులుగా వుండేవారు. ఇంకా చాలామంది వుండేవారు పేర్లు గుర్తులేవు.

 

ఒకసారి మీటింగుకి వెంకట శివయ్య, కలక్టరుగారు వచ్చారు. ఆయన సాహిత్యాభిమాని. ఆరోజు ఆయన మాట్లాడవలసిన విషయం - రామరాజభూషణుడు (భట్టుమూర్తి) రచించిన గిరికా, వసురాజుల ప్రణయకావ్యం (ద్వ్యర్థి కావ్యం). నేను చదివింది స్పెషల్ తెలుగు. ఆయన ఏం మాట్లాడతారో అని చాలా ఆసక్తిగా ఎదురు చూశాను.

 


***

***

 

*** రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానానికి ఆభరణంలా ఉండటం వలన ఆయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చింది. ***

 

***

***

 

వసుచరిత్ర గురించి వెంకటశివయ్యగారు ఎంతో అద్భుతంగా మాట్లాడారు. ప్రతి పద్యంలోనూ సంగీత, సాహిత్యపరమైన అర్థాలు గోచరిస్తాయి. ఆయన మాట్లాడిన పద్యాలలో రెండు నాకు బాగా గుర్తుండిపోయాయి.

 

***

***

 

|| పదమెత్తం గలహంసలీల యథరస్పందంబు సేయన్ శుభా

స్పదమౌ .................. వీక్షింప ష

షట్పదియుంబొల్చు, దరంబె కన్నెగొనియాడన్ గేయవాక్ర్పౌఢిమన్||

 

ఈ పద్యం చూస్తే - మంజువాణి గిరికను గురించి బాహ్యసౌందర్యమే కాదు మనోల్లాన్ని కలిగించే సంగీతంలో కూడా దిట్ట అని వసురాజుకి ఇలా చెప్తుంది-

 

***పదమెత్తంగలహంస లీల ***

 

కాలు (పదము) పెట్టిందంటే రాయంచ నడక

పాటని అందుకుందంటే హంసధ్వని రాగమే

 

పెదవి తెరిచిందంటే అనురాగరంజితమే

పెదవి విప్పిందంటే రాగమాలికలే...

 

*** వీక్షింప షట్పదియుంబొల్చు***

 

కళ్ళు తెరిస్తే నల్లని తుమ్మెదల్లా వుంటాయట.

 

సంగీతపరంగా చూస్తే - చూచెనా షట్పదులు (తుమ్మెదపదాలు పలుకుతాయట, మరో అర్థం చూస్తే కన్నులు తెరిచిందంటే ప్రణయాహ్వానమే)

 

వసంత కాలం వచ్చి భట్టుమూర్తి రాగమాలికతో సంగీత కచ్చేరీ ప్రారంభించినట్టుటుంది ఈ కావ్యం. సకల జంత్ర గాత్ర వాయిద్యాల బృందగాన మాధుర్యాన్ని మనోజ్ఞంగా వర్ణించాడు.

 

ఉద్ధతరిపు విద్ధతపన

పద్ధతి కరి భవన దవని పటదంబుధి సం

వద్ధరణ సముద్ధరణ స

మిద్ధరణ రజోవ్రజోద్యధిభ మద సృతికిన్

 

తద్ధి తకిట, తద్ధితఝణు

తద్ధిరుతకు, తకిట దికిట తకతోంకిట, తాం

కు తఝుణు, కకుంతఝణు, కు

కూంత దిరు, తతోంత కూంత తకుత దిగిణతోం

 

ఇందులో మృదంగ వాద్య ధ్వని ఎంతో మనోహరంగా ఆదితాళ లయ ప్రధానంగా వ్యక్తం చేశాడో తెలుస్తుంది.

 

***

***

 

సత్యవాణి గారు చెప్పిన వెంకట శివయ్య గారు - తాడేపల్లి గూడెంలో వసుచరిత్ర గురించి గొప్పగా మాట్లాడిన వెంకట శివయ్యగారు ఒకటే అయితే ఆ గొప్ప సాహిత్యవేత్తని మళ్ళీ చూడగలుగుతానని అనుకున్నాను.

 

ఆవిడ ఇచ్చిన ఫోన్ నెంబర్ తో అడ్రస్ కనుక్కుని వాళ్ళింటికి వెళ్ళాం. ఆయన చాలా మర్యాదగా కూచోమన్నారు. నేను ఆయనతో తాడేపల్లిగూడెం విషయం ప్రస్తావించాను. అవును నేనే ఆ వెంకట శివయ్యని అని చెప్పారు.

 

42 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనని చూసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. సాహిత్యవిషయాలు చాలా చర్చించారు. అప్పుడు ఆయన మాట్లాడిన విషయాలు గుర్తుపెట్టుకుని చెప్పినందుకు చాలా సంతోషించారు.

 

మీ గురించి సత్యవాణిగారు చాలా బాగా చెప్పారుఅని ఆయనకి కావలసిన పనేమిటో... వివరించారు.

ఒకే అర్థం వచ్చే హిందీ, తెలుగు పదాలు పక్క పక్కనే రావాలి. సరే చేస్తామని చెప్పాను. పది పేజీలు శాంపిల్ కి చేసి ఇమ్మన్నారు. అది రన్నింగ్ మేటర్ కాదు. ఒక హిందీ పదం, ఒక తెలుగు పదం చెయ్యాలి టైం పడుతుంది. ఆయన అడిగినట్లు చేసి మెయిల్ చేశాము.

 

ఆయనకి అది నచ్చింది కానీ... మేము చేసే పనిని ఆయన తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు. తర్వాత రెండుసార్లు ఫోన్ చేశారు కానీ... మేము ఏదో చెప్పి తప్పించుకున్నాం.

 

నాకు మళ్ళీ ఆయనకి సంబంధించిన పని చెయ్యాలనిపించలేదు. దీనికి కారణాలు చాలా వున్నాయి. ఆయన 80 సంవత్సరాల లోపు ఎన్నో గొప్ప పుస్తకాలు రాసారు.

42 సంవత్సరాల కిందటి గొప్ప వ్యక్తిత్వం ఆయనలో చూడలేకపోయానేమో... తెలియదు.

 

ఆయన శ్రీమతి గారు ఆడపిల్ల ఇంటికి వచ్చిందని చక్కటి చిరునవ్వుతో జాకెట్టు గుడ్డ, తాంబూలం ఇచ్చి పంపించారు.

 

తర్వాత నేను ఈ వెంకట శివయ్యని మర్చిపోయాను. తాడేపల్లిగూడెం వచ్చిన ఆ గొప్ప వ్యక్తిని మాత్రమే నేను గుర్తుంచుకున్నాను.

 

మా ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మా తెలుగు లెక్చరర్  నన్ను నీకు ఏ కావ్యం అంటే... ఇష్టం అని అడిగారు. వసుచరిత్ర అని చెప్పాను.

ఇది నేను ప్రణయకావ్యంగా చెప్పలేదు.

అందులో ఉన్న సాహిత్య, సంగీతపరమైన అర్థం గురించి చెప్పాను.

ఎందుకు ఇష్టం అని అడగలేదు. నవ్వారు.

ఎందుకో ఆ నవ్వు నాకు నాకు నచ్చలేదు.

తరవాత మిగిలిన లెక్చరర్స్ తో చెప్పి నవ్వారు.

తెలుగు లెక్చరర్ అలా అనడం నాకు నచ్చలేదు.

 

అయినా భట్టుమూర్తి తర్వాత ఇటువంటి కావ్యం మరొకటి రాలేదు.

దాని వెనక ఆయన కృషి ఎంత గొప్పదో.... మన ఊహకి అందనిది.

25, మార్చి 2023, శనివారం

స్వీట్ కార్న్ సలాడ్ చేస్తుంటే ఇలా..... 77

స్వీట్ కార్న్ సలాడ్ చేస్తుంటే ఇలా..... 77



నా జీవనయానంలో ఫుడ్ స్టాల్ పెట్టాలన్న కోరిక తీరలేదు.
నేను 1986లో అనుకున్నాను.
నాకు సలాడ్స్, ఛాట్ స్టాల్ ఎప్పుడైనా సరదాపెట్టాలనుకున్నాను.
ఈమాట చెప్తే కొంతమంది పెట్టండి మేమే ముందర వస్తాం తినడానికి అన్నారు.
మేమూ వెనకే వస్తాం అన్నారు.


నాకు బయట రకరకాల ఫుడ్స్ తిన్నప్పుడు
ఇప్పటికీ నెలకి ఒకరోజు ఇంటి భోజనం అని ఒక స్టాల్ పెట్టాలనిపిస్తుంది.

***
***
ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ రోజూ ఉద్యోగం చేసుకునే వాళ్ళు
శుక్రవారం, శనివారం, ఆదివారం స్టాల్స్ పెట్టుకుంటారు.
రకరకాల ఫుడ్స్ ఎంజాయ్ చెయ్యాలనుకునేవాళ్ళు
అక్కడి వెళ్ళి అవి తింటూ చాలాసేపు గడుపుతారు.




ఆదివారం సంత వుంటుంది.
అక్కడయితే కూరగాయలు, పళ్ళు, ఫుడ్ కి సంబంధించిన రకరకాలన్నీ అమ్ముతారు.

కొండమీద చెట్ల నీడలో, చల్లటి గాలిలో పోద్దున్న నుంచీ మధ్యాహ్నం వరకూ మాత్రమే వుంటుంది.
అక్కడ తిరుగుతుంటే బలే సరదాగా వుంటుంది.

14, మార్చి 2023, మంగళవారం

*** ఎలా వచ్చారో అలాగే మాయమయ్యారు *** - 76

 *** ఎలా వచ్చారో అలాగే మాయమయ్యారు *** - 76

***ఒకోసారి కొందరి పరిచయం వింతగా వుంటుంది***

ఒకరోజు పొద్దున్న 9.30 గంటలకి ఫోన్ వచ్చింది. “అమ్మా! నా పేరు శ్రీధర్. మేము ఆర్య సమాజ్ లో సంధ్యావందనం లక్ష్మీదేవిగారి ‘వైదిక నిత్యకర్మ విధి’ పుస్తకంలో మీ పేరు ఫోన్ నెంబరు చూసి ఫోన్ చేస్తున్నాను. మా పుస్తకాలు కొన్ని ఉన్నాయి. 11 గంటలకి వద్దామనుకుంటున్నాం. రావచ్చా...!” అన్నారు. రమ్మని చెప్పాను.

సరిగ్గా 11 గంటలకి గుమ్మం ముందు ఇద్దరు యువస్వామీజీలు ప్రత్యక్షం అయ్యారు. నేను ఊహించలేదు. మళ్ళీ పేరు చెప్పి, పరిచయం చేసుకున్నారు. పెద్దాయన పేరు శ్రీధర్. వయసు 40 సంవత్సరాల లోపే వుంటుంది. చిన్నాయనకి 30 సంవత్సరాలు వుంటుంది. చిన్న స్వామీజీ గురువుగారితో చాలా వినయంగా వున్నాడు. ఇద్దరూ ఎమ్.ఎ. చదివారు. చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు భాషలలో మంచి పట్టు వుంది. వాళ్ళు ఎంచుకున్న బాట ఇది.


ఉద్యోగాలు చెయ్యడం ఇష్టం లేక ఇలా మారామని వాళ్ళే చెప్పారు. వీళ్ళు డబల్ బెడ్ రూం ఇల్లు తీసుకుని అందులో కొంతమంది పేద విద్యార్థులకి ఆశ్రయం ఇస్తున్నామని చెప్పారు. వాళ్ళకి మేమే వంట చేసి పెడుతున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచీ వాళ్ళకి అన్నీ మేమే అందిస్తాం. కొంతమంది అందులో దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. అందుకే ఎవరికి అవసరమో వాళ్ళనే వుంచుకుంటున్నాం అని చెప్పారు. అంతేకాకుండా కొంతమంది రాజకీయవేత్తలు మేము మీకు స్థలం ఇస్తాం. ఆశ్రమం కట్టిస్తాం. మీరు వచ్చెయ్యండి అన్నారట. కానీ వీళ్ళకి అది ఇష్టం లేక రామని చెప్పామన్నారు. మా ఇంట్లో ఉడకపెట్టినది ఏదీ తినేవారు కాదు. పళ్ళు ఇస్తే తీసుకునేవారు.

ఈ స్వామీజీలు మా దగ్గిర మృత్యుంజయ సర్వస్వం, దయానంద సూక్తులు పుస్తకాలు చేయించుకున్నారు. ఇంకా రెండు పుస్తకాలు ప్రింటింగ్ కి ఇవ్వవలసినవి ఉన్నాయి. వీళ్లకి స్పాన్సర్ చేసేవాళ్ళూ చాలామందే వున్నారు. యజ్ఞాలు, యాగాలు చేస్తుంటారు. గుడులలో సత్సంగాలు చేస్తుంటారు. మాకు పుస్తకాలకి డబ్బుల విషయంలో ఇబ్బంది పెట్టలేదు.




వీళ్ళ జీవితానుభవాలు మాతో చెప్తుండేవారు. ఎందులో వుండే కష్టాలు అందులో వుంటాయన్నారు. చిన్న స్వామీజీ వాళ్ళింట్లో పెళ్ళి చేస్తాం వచ్చెయ్యమంటున్నారని, పెద్ద స్వామీజీ వాళ్ళక్క ఇవన్నీ వదిలేసి హాయిగా ఇంటి పట్టున వుండమని చెప్పారట. అన్ని విషయాలు ఫ్రీగా మాట్లాడేవారు. వాళ్ళు చర్చించని విషయం లేదు. స్వామీజీలుగా వాళ్ళ అనుభవాలన్నీ మాతో పంచుకునేవారు.

2016లో వచ్చారు. మిగిలిన పుస్తకాలు చేయించుకోవడానికి మళ్ళీ వస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. మళ్ళీ ఫోన్ లేదు. మనుషులు లేరు. మేమూ ఫోన్ చెయ్యలేదు.

ఏది ఏమైన ప్రపంచంలో ఎవరి ఆరాటం వాళ్ళది. ఎవరు ఏ రంగం ఎంచుకున్నా... మనం ఏమీ అనలేం. ఏది ఏమైనా తెలుసుకునేవి చాలా వుంటాయి.

ఈమధ్య ఒకసారి ఫోన్ చేశారు కానీ, నేను నెంబర్ సేవ్ చేసుకోవడం మర్చిపోయాను. మళ్ళీ వాళ్ళే వస్తారులే అనిపించింది.