9, డిసెంబర్ 2020, బుధవారం

 

జ్ఞాపకాల పొదరిళ్లు ఆ వూళ్ళు 10


పిల్లలతో విహారయాత్రలో ** మా తాతగారి వూరు పెనుగొండ** ప.గో.జిల్లా


మినర్వా థియేటర్ (నిర్మాణం 1949)  ** 1 ***












మా తాతగారు సుబ్బారావుగారు 1949 నుంచి 1973 వరకూ అందులో పనిచేశారు.

మేము థియేటర్ లోకి వెళ్ళగానే సుబ్బారావుగారి మనవరాలిని అని చెప్పగానే చాలా మర్యాదగా లోపలికి పంపించారు.  వెళ్ళడమ్మా వెళ్లి మొత్తం అంతా చూడండి అన్నారు.

ఈ థియేటర్ చూసి పిల్లలు పడిన ఆనందం అంతా ఇంతా కాదు. 

అంత పాతకాలం సినిమా హాలు, అప్పట్లో సినిమాలు వేసే పద్ధతి,  వాళ్ళని చాలా ఆశ్చర్యపరిచింది.  బాల్కనీ అంటే నాలుగే నాలుగు కుర్చీలు. నేల టిక్కెట్టు అంటే నేలమీదే.  మేము వెళ్ళినప్పుడు సీతమ్మ వాకిట్లొ సిరిమల్లె చెట్టు సినిమా వేస్తున్నారు.  సినిమా చూసి వెళ్ళమన్నారు. మాకు అంత టైము లేదు.  పిల్లలు ప్రతిచోటా ఫోటోలు తీసుకున్నారు.

 

మా తాతగారి ఫోటో... ఆయన కూచున్న చోటు. మేము అక్కడ ఆడుకున్న చోటు అన్నీ చూపించాను. వాళ్ళకి నేను చూపిస్తూ పడిన ఆనందాన్ని వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు.

ఇప్పుడు దాంట్లో కూడా కొత్త సాంకేతిక పద్ధతులు వాడుతున్నారు.

* * *

మా తాతగారు మల్లంపల్లి సుబ్బారావుగారు అప్పటి వరకూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని  1948లో స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఏలేటిపాడు నుంచి పెనుగొండకి మారారు. కుటుంబం పెరిగి, బాధ్యతలూ పెరిగాయి. వ్యవసాయంతో మాత్రమే కుటుంబ పోషణ సరిపోదు.   

లక్ష్మయ్యనాయుడు పెనుగొండ నియోజక వర్గం 1955, 1967లలో ఎమ్మెల్యేగా పనిచేసిన జమీందారు జవ్వాది లక్ష్మయ్యనాయుడు గారు  మా తాతగారి చిరకాల మిత్రులు. స్వాతంత్ర్యపోరాటంలో కలిసి పనిచేశారు.

లక్ష్మయ్యనాయుడుగారు మినర్వా థియేటర్ 1949లో కట్టించారు. దాని మేనేజ్ మెంట్ చూసుకోమని మా తాతగారికి అప్పగించారు. (ఇంకా వుంది)   

 

6, డిసెంబర్ 2020, ఆదివారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు -12

 అమ్మా,

ఎలా వున్నావు. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఇడ్లీ వేశాను. చిన్నుగాడు వాడి ఆఫీసు అయిపోయి నా దగ్గిరకి వచ్చాడు. చాలా ఇష్టంగా తిన్నాడు.

అలా తినేటప్పుడు చిన్నప్పటి విషయాలు గుర్తుకు వచ్చాయి. మేము నాగేంద్ర అంకుల్ వాళ్ళింట్లో వున్నప్పుడు నువ్వు ఇంట్లో కంప్యూటర్ వర్క్ లో వుండేదానివి. మేమిద్దరం, ఆ బిల్డింగ్ లో వున్న పిల్లలందరితో కలిసి ఆడుతూ వుండేవాళ్ళం కదా. నువ్వు ఇడ్లీ వేసినప్పుడల్లా వీడు ఆడుకుంటున్నవాడల్లా కిందకి వచ్చి రెండు ఇడ్లీ జేబులో పెట్టుకుని పైకి వచ్చి ఎవరికీ కనిపించకుండా తినేసేవాడు కదా. చిన్నుగాడిని నేను అలా ఎలా తినేవాడివిరా అంటే పకపకా నవ్వాడు. వాడికెప్పుడూ అలా చిరుతిండి కావాలి. ఇప్పటికీ అంతే అమ్మా వస్తే డబ్బాలు వెతుక్కుంటాడు.

నాకు ఇంకో విషయం గుర్తుకు వచ్చింది. ఒకసారి వాడికి బాగా ఇడ్లీ తినాలనిపించింది. నిన్ను అప్పటికప్పుడు ఇడ్లీ వెయ్యమని పేచీ పెట్టాడు. పైగా దాంట్లోకి సెనగప్పు, కొబ్బరి పచ్చడి అడిగాడు. నువ్వేమో ఇప్పుడెలాగ రా అంటే వాడు అసలు వినిపించుకోలేదు. సరే నువ్వు పోయి ఆడుకో అని - నువ్వు మినప్పప్పు నానపెట్టి పైన ఎవరింట్లోనో రోలుంటే అందులో అయితే బాగా వస్తుందని రుబ్బుకొచ్చి ఇడ్లీ వేసి పెట్టావు. గట్టిగా వున్నా సరే ఆనందంగా తిన్నాడు. ఇవాల్టికి ఈ ఇడ్లీల కథ ఇలా చెప్పుకుని నవ్వుకున్నాం.
రేపు ఫోన్ చేస్తానమ్మా, మాట్లాడుకుందాం....

2, డిసెంబర్ 2020, బుధవారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు - 11

 



అమ్మా...

ఏం చేస్తున్నావు? ఎలా వున్నావు? నాన్న ఎలా వున్నారు?
నీకోసం సంగతి అర్జంటుగా చెప్పాలని ఉత్తరం రాస్తున్నాను. మొన్నకరోజు ఏమైందో తెలుసా? మా ఫ్రెండ్ వినీల వాళ్ళమ్మాయిని బేబీకేర్ లో పెడుతుంది. తనతోబాటు వెళ్ళాను. అక్కడంతా చిన్న చిన్న పిల్లలు. ఎంత ముద్దుగా వున్నారో!
వాళ్ళని చూడగానే నాకో విషయం గుర్తుకు వచ్చింది. మా చిన్నప్పుడు నువ్వు స్టేట్ హోమ్ వాళ్ళది వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ వర్క్ చేసేదానివి కదా! మేమిద్దరం కూడా నీతోబాటు వచ్చేవాళ్ళం. ఎక్కడికెళ్ళినా వెంటపడి వచ్చేవాళ్ళం కదా!
అప్పట్లో నువ్వు చెప్పావు - అక్కడ పిల్లల అనాథాశ్రమం అని పెట్టి కొంతమంది పిల్లల్ని వేరే దేశాలకి పంపించేస్తున్నారని, అటువంటి వాళ్ళని పట్టుకుని, పిల్లలందర్నీ తీసుకొచ్చి స్టేట్ హోమ్ లో పెట్టారని అన్నావు. నీకు పిల్లలంటే ఇష్టం కదా! మాకు కూడా ఆ పిల్లల్ని చూపించాలని మమ్మల్ని తీసుకుని వెళ్ళావు. ఈ చిన్నుగాడికి కూడా పిల్లలంటే చాలా ఇష్టంగా వుండేది. వాడేమో ఒకటే పేచీ పెట్టాడు - ఒక్కళ్ళనన్నా ఇంటికి తీసికెళదామని. అసలు ఊరుకుంటేనా! నిన్ను ఒకటే బతిమాలేస్తున్నాడు.
నాకేం తెలుసు వాళ్లు అలా ఇచ్చెయ్యరని. నువ్వు ఎక్కడ తీసుకొచ్చేస్తావోనని నేను తెగ బెంగ పెట్టేసుకుని - ఏమైనా సరే తీసుకురావద్దని మొండిగా మాట్లాడాను. "మమ్మల్ని పెంచడమే నీకు కష్టంగా వుంది. ఇంకొకళ్ళని ఎలా పెంచుతావని" ఆవయసులోనే నీతో అన్నాను. ఇప్పుడు తల్చుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు వాళ్ళు అలా ఇచ్చెయ్యరని, దానికి చాలా తతంగాలుంటాయని నాకు తెలిస్తే కదా! కానీ చిన్నుగాడితో ఈ విషయం చెప్తే వాడు నవ్వాడు.
ఇప్పటికీ వాడికి చిన్నపిల్లలు కనిపిస్తే అలా ఆగిపోయి చూస్తూవుంటాడు. మొగపిల్లల్లో ఇలాంటి వాళ్ళని అసలు చూడలేదు. ఎంత ముద్దు చేస్తాడోనమ్మా! బలే వుంటాయి కదా ఇవన్నీ తల్చుకోవడానికి.
ఉంటానమ్మా ఈసారి ఇంకో విషయంతో మళ్ళీ ఉత్తరం రాస్తాను. ఫోనులో కన్నా ఇలా ఉత్తరాలైతే ఎప్పుడూ చదువుకుంటూ వుండచ్చుకదా!
నీ వీణమ్మ