2, డిసెంబర్ 2020, బుధవారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు - 11

 



అమ్మా...

ఏం చేస్తున్నావు? ఎలా వున్నావు? నాన్న ఎలా వున్నారు?
నీకోసం సంగతి అర్జంటుగా చెప్పాలని ఉత్తరం రాస్తున్నాను. మొన్నకరోజు ఏమైందో తెలుసా? మా ఫ్రెండ్ వినీల వాళ్ళమ్మాయిని బేబీకేర్ లో పెడుతుంది. తనతోబాటు వెళ్ళాను. అక్కడంతా చిన్న చిన్న పిల్లలు. ఎంత ముద్దుగా వున్నారో!
వాళ్ళని చూడగానే నాకో విషయం గుర్తుకు వచ్చింది. మా చిన్నప్పుడు నువ్వు స్టేట్ హోమ్ వాళ్ళది వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ వర్క్ చేసేదానివి కదా! మేమిద్దరం కూడా నీతోబాటు వచ్చేవాళ్ళం. ఎక్కడికెళ్ళినా వెంటపడి వచ్చేవాళ్ళం కదా!
అప్పట్లో నువ్వు చెప్పావు - అక్కడ పిల్లల అనాథాశ్రమం అని పెట్టి కొంతమంది పిల్లల్ని వేరే దేశాలకి పంపించేస్తున్నారని, అటువంటి వాళ్ళని పట్టుకుని, పిల్లలందర్నీ తీసుకొచ్చి స్టేట్ హోమ్ లో పెట్టారని అన్నావు. నీకు పిల్లలంటే ఇష్టం కదా! మాకు కూడా ఆ పిల్లల్ని చూపించాలని మమ్మల్ని తీసుకుని వెళ్ళావు. ఈ చిన్నుగాడికి కూడా పిల్లలంటే చాలా ఇష్టంగా వుండేది. వాడేమో ఒకటే పేచీ పెట్టాడు - ఒక్కళ్ళనన్నా ఇంటికి తీసికెళదామని. అసలు ఊరుకుంటేనా! నిన్ను ఒకటే బతిమాలేస్తున్నాడు.
నాకేం తెలుసు వాళ్లు అలా ఇచ్చెయ్యరని. నువ్వు ఎక్కడ తీసుకొచ్చేస్తావోనని నేను తెగ బెంగ పెట్టేసుకుని - ఏమైనా సరే తీసుకురావద్దని మొండిగా మాట్లాడాను. "మమ్మల్ని పెంచడమే నీకు కష్టంగా వుంది. ఇంకొకళ్ళని ఎలా పెంచుతావని" ఆవయసులోనే నీతో అన్నాను. ఇప్పుడు తల్చుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు వాళ్ళు అలా ఇచ్చెయ్యరని, దానికి చాలా తతంగాలుంటాయని నాకు తెలిస్తే కదా! కానీ చిన్నుగాడితో ఈ విషయం చెప్తే వాడు నవ్వాడు.
ఇప్పటికీ వాడికి చిన్నపిల్లలు కనిపిస్తే అలా ఆగిపోయి చూస్తూవుంటాడు. మొగపిల్లల్లో ఇలాంటి వాళ్ళని అసలు చూడలేదు. ఎంత ముద్దు చేస్తాడోనమ్మా! బలే వుంటాయి కదా ఇవన్నీ తల్చుకోవడానికి.
ఉంటానమ్మా ఈసారి ఇంకో విషయంతో మళ్ళీ ఉత్తరం రాస్తాను. ఫోనులో కన్నా ఇలా ఉత్తరాలైతే ఎప్పుడూ చదువుకుంటూ వుండచ్చుకదా!
నీ వీణమ్మ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి