28, ఫిబ్రవరి 2023, మంగళవారం

*** రూం టు రీడ్ *** - 73

*** రూం టు రీడ్ *** - 73

*** అభివృద్ధి చెందుతున్న దేశాలలో విద్యలో అక్షరాస్యత
బాలబాలికల సమానత్వాన్ని మెరుగుపరచడానికి ఒక లాభాపేక్షలేని సంస్థ.***


అక్క రమాసుందరి సంజీవరెడ్డి నగర్ స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తుండేది. రూం టు రీడ్ సంస్థలో పనిచేస్తున్న ధరణి అక్కని రోజూ కలుస్తుండేది. ఒకరోజు అక్కతో మాట్లాడుతూ – “పిల్లల కథలు రాసేవాళ్ళు ఎవరైనా వున్నారా... వుంటే చెప్పండి. మేము పిల్లల కథలకి పోటీ నిర్వహిస్తున్నాం. అనగానే అక్క కవితలు, కథలు రాసేది కాబట్టి, మర్నాడు ఒక కథ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చింది. అక్కకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇంకెవరైనా కథలు రాసేవాళ్ళుంటే చెప్పమంటే - తను మా చెల్లెలు కూడా పిల్లల కథలు రాస్తుంది. తనకి ఇంట్లో తెలుగు డిటిపి ఉంది. వాళ్ళు రకరకాల పుస్తకాలు చేస్తుంటారు అని చెప్పింది.

ధరణి నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చింది. నా అడ్రస్, ల్యాండ్ లైన్ ఫోన్ నెంబరు తీసుకుంది. ఒకరోజు ఫోన్ చేసి ఆఫీసుకి వచ్చి, వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారిని కలవమంది. అయితే అప్పటి వరకూ సంజీవరెడ్డి నగర్ లో వుండే ఆఫీసు సరిపోవట్లేదని మాసాబ్ ట్యాంక్ కి మార్చారు. వర్కు గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఆఫీసుకి వెళ్ళాను. అందరూ చాలా మర్యాదగా మాట్లాడారు. పిల్లల ప్రాథమిక విద్యకి సంబంధించిన పుస్తకాలు చెయ్యాలని చెప్పారు.

డిటిపి చెయ్యడానికి వాళ్ళ పుస్తకాలు నాకు చాలా ఇచ్చారు. ఆపుస్తకాలు చాలా వరకు బాలికల చదువుకి ప్రోత్సాహానికి సంబంధించినవే వుండేవి.

అందులో 24 సంవత్సరాల ధరణి, సునీత పనిచేస్తుండేవారు. వాళ్ళకి వేరే వూళ్ళు వెళ్ళాల్సిన అవసరం వుంటూవుండేది. వాళ్ళిద్దరూ ఈ సంస్థకోసం చాలా కష్టపడేవారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఒక టైము అంటూ వుండేది కాదు. అప్పుడప్పుడు మా ఇంటికి వర్కు గురించి వచ్చినప్పుడు నేను పెట్టినవి ఏవో ఒకటి తిని, టీ తాగి కాసేపు రిలాక్స్ అయి వెళ్ళేవారు. నేనంటే వాళ్ళకి చాలా అభిమానం.

డబ్బుల విషయం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అయితే వాళ్ళలో ఒకావిడ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువాదం చేసేది. సునీత మేం చేసిన వర్కుని ప్రూఫ్ రీడింగ్ చేస్తుండేది. అనువాదంలో వాక్యనిర్మాణం సరిగా వుండేది కాదు. ఒకటి రెండుసార్లు చెప్పాను. వాళ్ళు అదే పద్ధతిలో చేస్తున్నారు.

ఇంతలో వాళ్ళ బాస్ కి సంబంధించిన వాళ్ళు ఎవరో కొత్తగా డిటిపి పెట్టుకున్నారని వాళ్ళకి ఇవ్వడం మొదలు పెట్టారు. అలా వాళ్ళతో సంబంధాలు తగ్గిపోయాయి. అయినా చాలా విషయాలు తెలుసుకున్నాను.

రూమ్ టు రీడ్ పుస్తకాలు హిందీ నుంచి తెలుగు అనువాదం నాకు తెలిసిన వాళ్ళచేత చేయించి వాటిని నేను పుస్తకాలుగా సెట్ చేసి ఇచ్చేదాన్ని. ఆ అనువాదానికి సంబంధించిన డబ్బులు మాత్రం పూర్తిగా రాలేదు. అది మధ్యలో వాళ్ళు ఇవ్వలేదు.

ఆ అమ్మాయిలిద్దరూ చాలా కష్టపడేవాళ్ళు. ఇంటికి ఒక టైం కి వెళ్ళడం వుండేది కాదు. ఇంక ధరణి వాళ్ళింట్లో పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తే ఆ అమ్మాయి మానేసింది. సునీత లాంటి వాళ్ళు చాలామంది ఆ సంస్థలో బాలికా విద్య ప్రోత్సాహానికి అంకిత భావంతో పనిచేస్తున్నారని విన్నాను.

మేము చేసిన పుస్తకాలతో లైబ్రరీలు పెట్టి పిల్లలచేత అవి చదివించి, విద్యని ప్రోత్సహిస్తారని చెప్పారు.

***
***

రూమ్ టు రీడ్ బాలికల పాఠశాలలో పిల్లలకి ప్రాథమిక విద్యలో అక్షరాస్యత నైపుణ్యాల్ని, చదివే పిల్లలకి మంచి అలవాట్లని, అంతకు మించి జీవన నైపుణ్యాలతో మాధ్యమిక పాఠశాల విద్య విజయవంతం కావడానికి సంబంధించిన విషయాల్లో మద్దతు ఇస్తుంది. - "ప్రపంచ మార్పు విద్యావంతులైన పిల్లలతో మొదలవుతుంది" – అనే నినాదంతో ఈ సంస్థ పనిచేస్తుంది.

జాన్ వుడ్ కాలిఫోర్నియాలో మైక్రోసాఫ్ట్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుండేవాడు. ఆయన తన చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక పాఠశాలలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయులకి, పిల్లలకి ఉన్న వనరుల లేమిని చూసి అవన్నీ కల్పించడం తన కర్తవ్యంగా భావించి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ముఖ్యంగా వెనకబడి ఉన్న బాలికా విద్యని ప్రోత్సహించాలనుకున్నాడు. ఈ కారణంగా రూమ్ టు రీడ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు.

గ్రామీణ సంఘాలతో కలిసి పాఠశాలలని నిర్మించి, లైబ్రరీ (రీడింగ్ రూం) లని ఏర్పాటు చేసి బాలికలు చదువులో ముందుండాలనుకున్నాడు. పుస్తకాలు తప్పనిసరిగా చదివించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్సాహవంతులైన యువతులని ఈ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రోత్సహించారు.

నా జీవనయానంలో మరో కొత్త విషయం తెలుసుకున్నాను.

21, ఫిబ్రవరి 2023, మంగళవారం

*** ఆటోలు - హైదరాబాదు *** -72

  *** ఆటోలు - హైదరాబాదు *** -72



*** ఒక ఆటో వాలా ఇచ్చిన బిరుదు***

మా అత్తగారు మా దగ్గిరకి వచ్చినప్పుడు ఆవిడని తీసుకుని అప్పుడప్పుడు హైదరాబాదులో ఎక్కడికో అక్కడికి తీసుకెడుతుంటాను. అలా ఒకరోజు వెళ్ళాం. ఇద్దరం తిరిగి ఇంటికి వస్తున్నాం. అప్పుడు మేము బల్కంపేటలో ఉండేవాళ్ళం. ఇంకో రెండు నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. మా ఇంటికి వెళ్ళేందుకు పక్క పక్క రోడ్లు రెండున్నాయి. ఒకటి స్ట్రెయిట్ రోడ్డు. ఇంకొకటి కొంచెం తిరిగి వెళ్ళాలి. ఈ స్ట్రెయిట్ రోడ్డులో నుంచి తీసుకెళ్ళమని చెప్పాను.

పొద్దున్న మేము వెళ్ళేసరికి బాగానే వుంది కానీ... సాయంత్రం వచ్చేసరికి ఆ రోడ్డులో ఏదో తవ్వుతున్నారు. ఇంటికి వెళ్ళే దారిలేదు. నేను ఆటో అతనితో “వెనక్కి తిప్పి పక్క రోడ్డులోంచి తీసుకెళ్లు”అన్నాను. “నేను తీసికెళ్ళను ఇక్కడే దిగిపొండి...” అన్నాడు. కనీసం నడిచి వెళ్ళే దారి కూడా లేదు. నాకు చాలా కోపం వచ్చింది.

“ఎందుకు తీసికెళ్ళవు?” అన్నాను.

“నువ్వు ముందు ఇటే తీసికెళ్ళమన్నావు దిగండి ఇక్కడే” అని గొడవ పెట్టుకున్నాడు. పెద్దావిడ ఉన్నారనికి ఆలోచనలేదు. అస్సలు వినట్లేదు.

ఇంక నాకు చిరాకొచ్చి “మేము ఎప్పటి నుంచో ఇక్కడ వుంటున్నాం. అందరూ తెలిసిన వాళ్ళే... చెప్పానంటే నువ్వు, నీ ఆటో ఇంటికి వెళ్ళరు” అన్నాను.

వెంటనే ఆటో వెనక్కి తిప్పి నేను చెప్పిన ఇంకో రోడ్డులోంచి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపాడు. డబ్బులు ఇస్తుంటే....

“గూండారాణి! గూండాలని బాగానే మెయింటెయిన్ చేస్తున్నావు” అంటూ వెళ్ళిపోయాడు. వాడన్నమాటలకి నేను షాకయ్యి చూస్తూవుంటే.... మా అత్తగారు ఇంటిముందున్న అరుగు మీద కూచుని పొట్ట పట్టుకుని నవ్వుతున్నారు. ఆవిడని చూసి నాకూ నవ్వాగలేదు.

తర్వాత ఆవిడ “నువ్వు వాడిని భయపెట్టడానికి చెప్పావనుకున్నాను. నిజంగానే నీకు ఇక్కడ అందరూ తెలుసా....” అన్నారు. “అవునండీ... ఎప్పటి నుంచో వుంటున్నాం కదా... ఇక్కడ అందరూ ఏ సాయానికైనా పరుగెత్తుకుని వస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..” అని ఆవిడని తీసుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాను.

***
***

మరోసారి సంజీవరెడ్డి నగర్ నుంచి శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆర్ బి ఐ క్వార్టర్స్ పక్కన నా శిష్యురాలు లక్ష్మి ఏదో ఫంక్షన్ కి పిలిస్తే వెళ్ళాల్సి వచ్చింది. ఆటో అతనికి ఆర్ బి ఐ క్వార్టర్స్ గుర్తు చెప్పాను. అక్కడి వరకూ వెళ్ళాక ఆటో ఆపేసి ఇదే క్వార్టర్స్ దిగిపొమ్మన్నాడు.

నేను “కొంచెం ముందుకి తీసుకెళ్ళు నేను దగ్గర అని చెప్పాను. క్వార్టర్స్ అని చెప్పలేదు” అన్నాను. అతను చెప్తుంటే వినట్లేదు. లక్ష్మి ఒక టైము చెప్పింది. ఆ టైములోపల వెళ్ళాలి. దగ్గరలోనే వున్నాం కదా... అనుకుంటే ఇదో నస అనుకుంటూ.... మళ్ళీ అడిగాను. ససేమిరా ఒప్పుకోవట్లేదు. నడవడానికి ఇబ్బంది లేదు కానీ... అపార్ట్ మెంట్ లోపలకి వెళ్ళాలి.

నేను అతనితో “శ్రీనగర్ కాలనీ ఏరియా కార్పొరేటర్ విజయలక్ష్మిగారు మాకు బాగా తెలుసు. నేను ఆవిడకి ఫోన్ చేస్తాను” అన్నాను. (మేము ఆవిడకి లెటర్లు చేసి పెడుతూ వుంటాం. నేను చాలాసార్లు వాళ్ళింటికి కూడా వెళ్ళాను.) నేను ఆవిడ పేరు చెప్పగానే.... “అమ్మా.... ఆ మేడమ్ తాలూకా అని ముందరే చెప్పచ్చుగా.... ఆ అమ్మ చాలా మంచిది” అని నేను తీసుకెళ్ళాల్సిన చోట దింపాడు.

నేను డబ్బులు ఇస్తూ.... “కరక్ట్ గా అడ్రస్ చెప్పలేక ఒకోసారి పక్కనున్న ఏదైనా పేరున్న ఆఫీసో.. స్కూలో ఏదో చెప్తాం. అలాంటప్పుడు మేం చెప్పిన చోటికి తీసుకెళ్ళాలి. ఇలా నస పెట్టకూడదు. ఇంకో ఐదురూపాయలు అడగాలి. నాకు కాదు ఇంకెవరికైనా ఇలాగే కావచ్చు” అన్నాను.

డబ్బులు తీసుకుని ఓ దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు.

ఇప్పుడయితే ఆటోనో క్యాబో బుక్ చేసుకుంటే సరిపోతుంది. అవీ కొన్నిసార్లు ఇబ్బంది అవుతున్నాయి.

15, ఫిబ్రవరి 2023, బుధవారం

***కుటుంబ మిత్రులైన ప్రముఖ జర్నలిస్టులు *** 71

 ***కుటుంబ మిత్రులైన ప్రముఖ జర్నలిస్టులు *** -71


2016లో పాత్రికేయులు కొండా లక్ష్మణ రావుగారు ఫోన్ చేసి "అమ్మా నాగలక్ష్మిగారు నా పేరు లక్ష్మణరావు. జర్నలిస్టు కాలనీలో ఉంటాం. ఇన్నయ్యగారు మేము చిరకాల మిత్రులం. మీరు ఇన్నయ్యగారి పుస్తకాలు ప్రింట్ చేయిస్తుంటారు కదా... సీనియర్ పాత్రికేయులు జి.ఎస్. వరదాచారిగారి పుస్తకం చెయ్యాలి. మీఅడ్రస్ చెప్పమ్మా..." అన్నారు.


లక్ష్మణరావుగారు “వరదాచారిగారు 1962 ఆంధ్రభూమిలో (యువపాత్రికేయులు) న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం మీద అప్పటి చైనా దండయాత్ర వలన ఆనాటి సామాన్యుని పరిస్థితిని గురించి రాసిన ఐదు వ్యాసాల్ని 13, 14, 15, 16, 17 తేదీల్లో రాసిన వ్యాసాల్ని చిన్న పుస్తకంగా వేద్దామనుకుంటున్నామని చెప్పారు. అది 2016 ఆగస్టులో వరదాచారిగారి గారి పాత్రికేయ జీవనయాన పరిస్థితిని పురస్కరించుకుని పుస్తకాన్ని ఆవిష్కరిస్తామ”ని చెప్పారు.

*** వరదాచారిగారు ‘‘ఆంధ్రభూమి’’లో 1961 నుండి 1982 దాకా, న్యూస్‌ ఎడిటర్‌గా పని చేశారు. అనంతరం ‘‘ఈనాడు’’ పత్రికలో, 1988 వరకు, సహాయ సంపాదకులుగా ఉన్నారు. 1988 నుండి 2010 దాకా, 22 సంవత్సరాల సుదీర్ఘకాలం పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయంలో, తొలుత జర్నలిజం డిపార్టుమెంటు శాఖాధిపతిగా, అనంతరం, విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు.*** వరదాచారిగారి గురించి తెలుసుకోవాలంటే ఆయన జీవనయానం చదవాల్సిందే.

వరదాచారిగారి భారత పై చైనా దండయాత్ర, జ్ఞాపకాల వరద (సిడిలో మేటర్ విని టైప్ చేసి పెట్టాం. ఎమెస్కో వాళ్ళు ప్రింట్ చేశారు), అవిశ్రాంత భాషా సేవకుడు తిరుమల రామచంద్ర పుస్తకం టైప్ చేసి ఇచ్చాం.




ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ రచయిత ఉడయవర్లు గారు ఇచ్చిన *** దాశరథి స్మృతి, రావిచెట్టు రంగారావుగారి జీవితచరిత్ర *** పుస్తకాలు మేము చేసి ఇచ్చాము.

*** ఇలా త్రిమూర్తులులాంటి వీరు ముగ్గురూ తరచు ఏదో ఒక పని చేయించుకోవడానికి మా ఇంటికి వస్తుండేవారు. 2016 మార్చిలో జరిగిన మా అమ్మాయి నిశ్చితార్థానికి పిలవగానే ముగ్గురూ వచ్చి కార్యక్రమానికి వచ్చిన సాహితీ ప్రముఖులందరినీ కలిశారు. అమ్మా మీ అమ్మాయి నిశ్చితార్థంలా లేదు. సాహితీసమావేశంలా వుంది. మాకు చాలా ఆనందంగా గడిచిందని చెప్పారు. ***


****
****

అలా కొనసాగిన పరిచయంతో....

2019 జులై 20వ తేదీన ప్రముఖ పాత్రికేయులు *** గోవిందుని రామశాస్త్రి గారి శతజయంతి*** సాహిత్య అకాడమి, వయోధిక పాత్రికేయ సంఘం సంయుక్తంగా నిర్వహించారు. వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా విచ్చేసి, గోరాశాస్త్రి గారి గురించి చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. గోరాశాస్త్రిగారి “వినాయకుడి వీణ”పేరుతో వచ్చిన సంపాదకీయాల్ని పుస్తకంగా ముద్రించి వెంకయ్యనాయుడుగారి చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు.

ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు విభాగాలుగా జరిగింది. ప్రముఖపాత్రికేయులు వరదాచారిగారు, ఉడయవర్లుగారు, లక్ష్మణరావుగారు వయసులో చాలా పెద్దవాళ్ళయినా కార్యక్రమం నిర్వహణ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు.

పేరుగాంచిన పాత్రికేయులతో సమావేశమందిరం కళకళలాడింది. దాసు కేశవరావుగారు, కె.బి.లక్ష్మి గారు, కల్లూరి భాస్కరం గారు, నాగసూరి వేణుగోపాల్ గారు, నందిరాజు రాధాకృష్ణగారు, పి.యస్. గోపాలకృష్ణ గారు, గోవిందరాజు చక్రధర్ గారు, శ్రీనివాస్ వాసుదేవ గారు సమర్పించిన పత్రాల ద్వారా గోరాశాస్త్రిగారి జీవిత విశేషాలు ఎన్నో తెలుసుకోగలిగాం.

సాహిత్య అకాడమి, తెలుగు సలహామండలి సంచాలకులు శివారెడ్డిగారు, భండారు శ్రీనివాసరావుగారు సమావేశ విభాగాలకు అధ్యక్షత వహించారు. రావెల సోమయ్య గారు, వంశీ రామరాజుగారు, తెన్నేటి సుధాదేవిగారు, భగీరథ గారు ఇంకా ఎంతో మంది ప్రముఖులు విచ్చేసిన ఈ సమావేశం చాలా విజయవంతంగా ముగిసింది.




ఈ సమావేశంలో ఉడతా భక్తిగా నేను కొన్ని పనులలో సహకరించాను. జ్యోతి ప్రజ్వలన సమయంలో వెంకయ్య నాయుడుగారు వంటి ప్రముఖులతో బాటు నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. వరదాచారిగారి చేతుల మీదుగా మెమెంటో అందుకున్నాను.

ఈ సమావేశంలో గోరాశాస్త్రి గారి జీవిత విశేషాల గురించి ప్రముఖ రచయితలు సమర్పించిన పత్రాలని “ప్రముఖ సంపాదకుడు రచయిత” మొదటి భాగం ముద్రణకి తయారవుతోంది. ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణగారి జీవిత చరిత్ర కూడా ముద్రణకి సంరంభమవుతోంది. కరోనాతో, నేను ఆస్ట్రేలియా వెళ్ళడంతో ఆగిపోయిన పుస్తకాలు మళ్ళీ మాచేతుల మీదుగానే ముద్రణకి తయారవుతున్నాయి.

ఇంక మీరు ఇప్పుడప్పుడే ఆస్ట్రేలియా వెళ్ళరు కాబట్టి ఇంక మాకు దిగులు లేదు. మిగిలిన పుస్తకాలు కూడా రెడీ చేసుకుంటున్నాం అని చెప్పారు. నేను ఆస్ట్రేలియా వెళ్ళినా అక్కడ కంప్యూటర్ లో కొంతమంది పనులు చేశాను.

ఇవన్నీ పుస్తకాలుగా వచ్చేశాయి. ఈ రెండు సంవత్సరాలలో చాలా పుస్తకాలే చేశాం.

****
****

వీళ్ళందరినీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందరూ చాలా చలాకీగా తిరుగుతూ వుంటారు. వరదాచారిగారు వయసు వల్ల బయటికి ఎక్కువ రాలేకపోతున్నారు.

**** ఉడయవర్లుగారు ప్రూఫు రీడింగ్ చేస్తున్నారు. కింగ్ కోటీలో ఉన్న అతి పురాతన (1901 స్థాపన) శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, తెలంగాణలో మొదటి గ్రంథాలయాన్ని అప్పుడప్పుడు వెళ్ళి పర్యవేక్షిస్తుంటారు. ***

వయోధిక పాత్రికేయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డా. వరదాచారిగారు, అధ్యక్షులు ఉడయవర్లుగారు, సెక్రటరీ లక్ష్మణరావుగారు గారు మా ఇంటికి వచ్చారు. దీనికి ఉపాధ్యక్షులు గుడిపూడి శ్రీహరిగారు, జాయింట్ సెక్రటరీ బండారు శ్రీనివాసరావుగారు అని చెప్పారు. లక్ష్మణరావుగారు ఈ సంఘ చరిత్రని చాలా చక్కగా చెప్పారు. వీరికి వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వయోధిక పాత్రికేయులకి చేసిన ఉపకారాన్ని కూడా వివరించారు. ప్రస్తుతం గుడిపూడి శ్రీహరిగారు ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.

ఈమధ్యే ప్రముఖ పాత్రికేయులైన వరదాచారిగారు, గుడిపూడి శ్రీహరిగారు కాలం చేశారు. ఇదొక బాధాకరమైన విషయం.

మహామహుల ఎందరి పనులో చేయగలుగుతున్నాను. ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.

10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

*** ముందు సీటూ... మూడు కుట్లూ... *** - 70

 *** ముందు సీటూ... మూడు కుట్లూ... *** - 70



*** ఆ విషయం తలుచుకుంటే... అప్పడూ... ఇప్పుడూ... ఎప్పుడూ.... మనసులో... వణుకే ***

ఒక రోజు పొద్దున్నే ముప్ఫయి సంవత్సరాల అమ్మాయి వచ్చింది. అప్పుడప్పుడే పుస్తకాలు, విజిటింగ్ కార్డులు చేయించుకోవడానికి ఎవరో ఒకరు వస్తూవున్నారు. ఆ అమ్మాయి కూడా అలాగే వచ్చిందనుకుని లోపలికి రమ్మన్నాను.

వచ్చి కూచుని – “నా పేరు లత అండీ. మా అన్నయ్యగారు స్టేట్ బ్యాంక్ లో చేస్తారు. మీ ఊరు అమ్మాయి అరుణ మా వదినకి ఫ్రెండ్ ట. మీరు కంప్యూటర్ మీద చేసే పని గురించి అరుణ నాకు చెప్పింది. నాకూ నేర్చుకోవాలని వుంది. నేర్పుతారా? మేము సంగీత్ థియేటర్ దగ్గిర వుంటాం. ఎప్పటి నుంచి రమ్మంటారు? ” అని ఆపకుండా అమాయకమైన మొహంతో అడుగుతోంది.

అలాగే నేర్పిస్తానని చెప్పాను. మర్నాటి నుంచీ రావడం మొదలు పెట్టింది. కొంత వర్కు నేర్చుకున్నాక “మీరు మా ఇంటికి ఒకసారి వస్తారా... ? అన్నయ్య మీతో మాట్లాడాలన్నారు” అంది. అడ్రస్, ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ తీసుకుని బుధవారం వస్తానని చెప్పాను.

ఏవో శలవులు రావడంతో పిల్లలిద్దరూ ఇంట్లోనే వున్నారు. మా వాడికి సంవత్సరం. మా అమ్మాయికి 4 సంవత్సరాలు. ఇద్దరినీ తీసుకుని ఇంటినుంచి రెండు నిమిషాల దూరంలో ఉన్న బల్కంపేట బస్ స్టాప్ నుంచీ 10p బస్సులో బయల్దేరి వెళ్ళాను. బస్సు చాలా రష్ గా వుంది. బాబుతో ఉన్నానని ఎవరో ముందుసీటులో కూచోమన్నారు. మా ఇంటి దగ్గర తెలిసిన లక్ష్మిగారు మా అమ్మాయిని తన దగ్గర కూచోపెట్టుకున్నారు.

ముందు సీటులో కూచున్నానన్నమాటే కానీ జనాలు అక్కడ కూడా బాగా వున్నారు. ఒకో స్టాప్ లో కొంత కొంతమంది దిగుతున్నారు. నా ముందర వాళ్ళందరూ దాదాపు దిగిపోయారు. బస్సు కొంచెం ఖాళీ అయ్యింది.

సంగీత్ థియేటర్ దగ్గిరికి వెళ్ళేసరికి బస్ కి సడన్ బ్రేక్ వేశాడు. ముందు సీటులో కూచున్న నేను ఎగిరి బస్సులో సీటు పక్కన పడి, ఒక్కో మెట్టు మీద నుంచీ కూచున్న దాన్ని కూచున్నట్లు ధనా ధనా కింద పడ్డాను. కాసేపు ఏం జరుగుతోందో అర్థంకాలేదు. ఒళ్ళో బాబున్నాడు. ఏదీ పట్టుకునే అవకాశం కూడా లేదు. మా అమ్మాయి “అమ్మా… అమ్మా… ” అని అరుస్తూ ఏడుస్తుంటే వినిపిస్తోంది కానీ... ఒక షాక్ లో ఉన్నాను.

డ్రైవర్ కూడా బస్ ఆపేశాడు. నేను నేల మీద అలా కూచుండిపోయాను. నా ఒళ్ళంతా రక్తం. అంత పడ్డంలోనూ మా అబ్బాయిని గట్టిగా పట్టుకున్నాను. కానీ నాకు ఆ షాకులో బాబుకి ఏదో తగిలింది. దాని వల్ల ఈ రక్తం అనుకుని ఇప్పుడేం ఘోరం చూడాలా అనుకుంటూ... అందరూ లేవమంటుంటే... పట్టించుకోకుండా ముందర బాబుని ఆప్యాయంగా తడిమాను. వాడికేమీ కాలేదు. వాడు ఒళ్ళో సేఫ్ గా ఉన్నాడు. అమ్మయ్య అనుకున్నాను. వాడి వంటికి కూడా రక్తం వుంది.

అప్పుడు కొంచెం తేరుకుని లేద్దామనుకుంటుంటే – “అయ్యో మీ తలకి దెబ్బ తగిలింది. లేవండి హాస్పిటల్ కి వెడదాం” అని ఎవరో పాతికేళ్ళ అబ్బాయి లేవదీసి తాగడానికి నీళ్ళు ఇస్తే... అప్పుడు తల తడుముకున్నాను. రక్తం కారుతూనే వుంది. అంటే నాకు ఆ స్పర్శ తెలియలేదు. ఎదురుకుండానే ఒక చిన్న హాస్పిటల్ వుంది. అబ్బాయి దగ్గరుండి తీసుకెళ్ళాడు.

వెళ్ళగానే వాళ్ళు క్లీన్ చేసి “బాగా లోతుగా తగిలింది. కుట్లు పడతాయి” అన్నారు. నేను “సరే” అన్నాను మాతో బాటు మా ఇంటి దగ్గర లక్ష్మిగారు మా అమ్మాయిని తీసుకుని వచ్చారు. అది బిక్కమొహం వేసుకుని కళ్ళ నుంచీ బొటబొటా నీళ్ళు కారుతూ నుంచుంది. హాస్పిటల్ వాళ్ళు మూడు కుట్లు వేసి, తలకి కట్టుకట్టారు. నన్ను హాస్పిటల్ కి తీసుకు వచ్చిన అబ్బాయి థాంక్స్ చెప్పాను. అక్కడ నుంచీ ఇంటికి వెళ్ళి పోవచ్చు కదా... లతకి మాట ఇచ్చానని గుర్తుకువచ్చింది.

పాపం రమ్మంది. ఎదురు చూస్తూ వుంటుంది అనుకుంటూ - ఆటో మాట్లాడుకుని పిల్లలిద్దరినీ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళింట్లోనే కాసేపు రెస్ట్ తీసుకుని, వాళ్ళన్నయ్యగారితో మాట్లాడాను. ఆయన “మా చెల్లెలికి కొన్ని అనారోగ్య కారణాలుగా పెళ్ళి అవలేదు. తనని మీకు అప్పచెప్తున్నాను. మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. తనకి పూర్తి వర్కు నేర్పించండి ” అన్నారు. నేను దెబ్బతగిలినా లత చెప్పిందని వచ్చినందుకు సంతోషించారు. అక్కడ నుంచీ మళ్ళీ ఆటోలో ఇంటికి వచ్చేశాం.

నేను వచ్చేసరికి కొంతమంది నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి పని చేయించి పంపించి. ఇంటికి వచ్చాక నాకు చాలా మగతగా అనిపించింది. అక్కకి, చెల్లెలు ప్రభావతికి ఫోన్ చేశాను. ఆఘమేఘాల మీద వచ్చారు. కాసేపు వుండి, నాకు కావలసినవి చేసి పెట్టి మా వారు వచ్చాక వెళ్ళిపోయారు.

ఇంతలో రవి అనే స్క్రీన్ ప్రింటర్ వాళ్ళావిడ “ఏమండీ 12 గంటలకి విజిటింగ్ కార్డ్ ప్రూఫ్ ఇస్తానన్నారు. మా కస్టమర్ ఒకటే ఫోన్లు. ఇంత లేట్ చేస్తారా. ఇంటికి వస్తే తాళం వేసివుంది” అని landline కి ఫోన్ చేసి గోల పెట్టింది. నేను పొద్దున్నే తీసిపెట్టిన ప్రూఫు తీసుకుని మాకు దగ్గరలోనే ఉన్న వాళ్ళింటికి వెళ్ళి ఇచ్చాను. నా తలకున్న కట్టు చూసి విషయం తెలుసుకుని సారీ చెప్పింది. ఒక వారం రోజులు కాస్త ఇబ్బంది పడ్డాను.

పిల్లలు తర్వాత బస్ ఎక్కినప్పుడల్లా నుంచుందాం కానీ, ముందు సీటులో మాత్రం కూచోవద్దు అనేవారు. అప్పటి నుంచీ ముందు సీటు వంక కూడా చూడలేదు.

ఒక రోజు లత వచ్చి కళ్ళ నీళ్ళతో “నేను గుంటూరు వెళ్ళిపోతున్నానండీ... నేను నేర్చుకోవడం, ఇక్కడ వుండడం మా వదినకి ఇష్టం లేదు. నాన్న దగ్గిరకి వెడుతున్నాను. మీరు నేర్పినవి నాకు చాలా వరకు అర్థం అయ్యాయి. ఏమైనా డౌట్లు వుంటే ఫోన్ చేస్తాను. నేను డిటిపి యూనిట్ పెట్టుకుందామను కుంటున్నాను” అని తను తెచ్చిన ఒక పెద్ద స్వీట్ బాక్స్ ఇచ్చి, గుంటూరు అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయింది. తర్వాత లత డిటిపి యూనిట్ పెట్టి, ఒక 4 ఆపరేటర్లని పెట్టుకుని బాగా సెటిల్ అయ్యిందని విన్నాను.

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

గుర్తుండిపోయే సంఘటనలు - 69

గుర్తుండిపోయే సంఘటనలు - 69

***
శనివారం పొద్దున్నే పెద్దక్క, బావగారు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరినీ తీసుకుని విజయవాడ నుంచి వచ్చారు. ఇద్దరూ చాలా చిన్నవాళ్ళు. ఫోన్లు లేవు. ఎక్కడికీ వెళ్ళంకదా అనుకుని వచ్చారు. అప్పుడు మెహదీపట్నంలో ఉన్నాం. మాతోకలిసి సరదాగా ఎక్కడికన్నా వెడదామనుకుని వచ్చారుట.

మేము జాబ్ చేసే విజయపాల్ గారి ఆఫీసులో ఎవరిదో పెళ్ళివుంటే రెడీ అయ్యి అప్పుడే వెళ్ళబోతున్నాం. వాళ్ళని చూడగానే మేము ఆశ్చర్యపోయి, 9 గంటలకి పెళ్ళి, 11 గంటలకల్లా వచ్చేస్తాం అని చెప్పి బయల్దేరాం. దారిలో ఇంకో ఇద్దరిని పిక్ అప్ చేసుకోవాలి కాబట్టి రాములు కారు తీసుకుని వస్తాను అన్నాడు. రాములు రాగానే మేము బయల్దేరి మేరేజ్ హాలుకి వెళ్ళాం. అక్కడ ఒక్క పిట్టకూడా లేదు. పెళ్ళిసందడి అసలే లేదు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. రాములు కనుక్కుని వస్తే... ఇంకో గంటలో హాలుకి వస్తారని చెప్పారు.

9 గంటలకి ముహూర్తం అన్నవాళ్ళు గంటతర్వాత రావడం ఏమిటో అర్థం కాలేదు. మాకేమో అక్కావాళ్ళు వచ్చారు, వదిలిపెట్టి వచ్చామని బాధగా వుంది. ఫోన్లు లేవు. వెళ్ళినవాళ్ళం నలుగురం ఉన్నాం. ఎంతసేపూ ఏం మాట్లాడుకుంటాం. రోజూ ఆఫీసులో చూసుకునే మొహాలే... చాలా బోర్ కొట్టేసింది. స్మార్ట్ ఫోన్ లు లేవు చూసుకుంటూ టైం పాస్ చెయ్యడానికి. టిఫిన్లు లేవు మరి. వాళ్ళకి అలవాటు లేదుట. మేమేమో.... పదకొండుగంటలకి పెళ్ళి, భోజనాలు అన్నీ అయిపోతాయనుకుని ఏమీ తిని వెళ్ళలేదు. గంట అన్నవాళ్ళు 11.30 వచ్చారు. అంతసేపు వెయిట్ చేయించినందుకు మజా తెప్పించి ఇచ్చారు. అన్నీ సద్దుకుని మొత్తానికి పెళ్ళి మొదలు పెట్టారు.
బ్రాహ్మడు చదివే మంత్రాలు చూస్తే ఆశ్చర్యం వేసింది. అన్నీ తప్పులే. తనకి వచ్చిన ***గురుబ్రహ్మతో మొదలు పెట్టి అష్టోత్తరాలు, పద్యాలు*** అన్నీ చదివేస్తున్నాడు. అది బాగా గమనిస్తే కానీ ఎవరికీ తెలియదు. మధ్య మధ్యలో పెళ్ళితంతు జరిపిస్తున్నాడు. మేమయితే *** ఆహా... ఏమిటీ విపరీతం*** అనుకున్నాం. పెళ్ళిలో తలంబ్రాలు, నాగవల్లి కార్యక్రమం ఇవేవీ లేవు. మొత్తానికి తొందరగానే అవగొట్టారు.
మేము బయల్దేరి వెళ్ళిపోదామంటే వెళ్ళనీయరు. ఎక్కడో మేడ్చల్ లో పెళ్ళి. మాకు దారికూడా పెద్దగా తెలియదు. ఇంక తప్పదన్నట్లు కూచుని వాళ్ళు పెట్టినది తిని, ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయింది.

***
***
*** గండిపేటలో..... ***
***
***
పాపం అక్కావాళ్ళు పడుకున్నారు. మేము వెళ్ళగానే లేచారు. మాకే జాలేసింది. గండిపేట వెడదామని బయల్దేరాం. మెహదీపట్నం నుంచి డైరెక్ట్ చాలా బస్సులు వున్నాయి. ఇప్పటిలా క్యాబ్ లు, ఆటోలు అంతగా లేవు. అందరం చిన్నవాళ్ళమే కాబట్టి బస్ ఎక్కి వెళ్ళాం. కాసేపు సరదాగా గడపడానికి గండిపేట ఒక పెద్ద పిక్నిక స్పాట్. కాసేపు అక్కడ చెట్లకిందా, చెరువు దగ్గర గడిపి, పిల్లలని పార్కులో ఆడించి ఇంక ఇంటికి బయల్దేరదాం అనుకుంటుంటే బస్సులు ఎంతకీ రావట్లేదు. చీకటి అయిపోతోంది. దారిలో రెండు బస్సులు ఫెయిల్ అయ్యాయిట.



చిన్నపిల్లలు. ఎలాగో అలా... కొంత దూరం ఆటోలో... కొంతదూరం బస్సులో అనుకుంటే అసలు ఆటోలు లేవు, బస్సులు లేవు. రావలసిన రెండు బస్సులు ఫెయిల్ అవడం ఏమిటో తెలియదు. అప్పుడు ఇంకా అంతగా డెవలప్ అవలేదు. తినడానికి కూడా ఏమీలేవు. పిల్లలు ఆకలని గోల... ఏవో చిన్న చిన్న చాక్ లెట్లు వుంటే కొనిపెట్టాం. మాతోబాటు కనీసం మంచినీళ్ళు కూడా పట్టికెళ్ళలేదు. ఎక్కడపడితే అక్కడ ఏదో ఒకటి తినే అలవాటు లేదు.

ఇంతలోనే దూరంగా ఒక అంబాసీడర్ కారు కనిపించింది. దాని దగ్గరకి ఇద్దరు మగవాళ్ళు వెడుతున్నారు. నేను మా బావగారితో “వెళ్ళి వాళ్ళని లిఫ్ట్ అడగండి కొంతదూరం అయినా వెళ్ళిపోవచ్చు” అన్నాను. ఆయనకి చాలా మొహమాటం కొంతదూరం వెళ్ళి “ఏం బావుంటుందీ... వస్తుందిలేమ్మా బస్” అంటూ వెనక్కి వచ్చేశారు. ముందర పిల్లలతో బయట పడాలి. బళ్ళ మీద, కార్లలో వచ్చినవాళ్ళు వెళ్ళిపోతున్నారు.

వాళ్ళు ఇంక బయల్దేరబోతుంటే... ఇంక నేనే ధైర్యం చేసి వాళ్ళదగ్గిరకి పరిగెత్తి, ఆపి వాళ్ళతో “మేము మెహదీపట్నం వరకూ వెళ్ళాలి. చిన్న పిల్లలు ఉన్నారు. మీకు ఇబ్బంది లేకపోతే డ్రాప్ చేస్తారా?” అని అడిగాను. వాళ్ళు “రండి, మేము అటే వెళ్తున్నాం” అన్నారు. మా వెనకే కొంతమంది వచ్చి మేముకూడా వస్తాం అన్నారు కానీ, కారులో చోటు సరిపోదు. మేము ఏమీ చేసే పరిస్థితి కూడాలేదు.

అమ్మయ్య అనుకుని కారులో నలుగురు పెద్దవాళ్ళం, ఇద్దరు పిల్లలు సద్దుకుని కూచున్నాం. మమ్మల్ని మెహదీపట్నం బస్ స్టాప్ లో దింపారు. థాంక్స్ చెప్పి, డ్రాప్ చేసినందుకు డబ్బులు ఇవ్వబోతే – మేము డబ్బులకోసం డ్రాప్ చెయ్యలేదు. ఉంచండి అనేసి వెళ్ళిపోయారు. మొత్తానికి ఆరోజు అలా సుఖంగా ఇంటికి చేరాం.

సమయానికి వాళ్ళని డ్రాప్ చెయ్యమనాలనే ఆలోచన వచ్చింది కాబట్టి సరిపోయింది. మర్నాడు పొద్దున్న *** “గండి పేటకి సమయానికి రాని బస్సులు. రాత్రి పదకొండు గంటల వరకూ పర్యాటకులు పడిన ఇబ్బందులు అంటూ....”*** పేపర్లో న్యూస్ వచ్చింది. బస్సులు ఫెయిల్ అయ్యాయని చెప్పారు కానీ.... అసలు ఏమయిందో అయితే తెలియదు.

***
*** మరోసారి గండిపేట విహారానికి – వర్షంలో ఇరానీ చాయ్, ఉస్మాన్ బిస్కట్లు ***
***
మా అక్కచెల్లెళ్ళం కలిసి ఒకసారి గండిపేట వెళ్ళాం. తినడానికి పులిహోర, స్నాక్స్ తీసుకుని వెళ్ళాం. అంతా తిరిగిన తర్వాత ఇంక అన్నీ సద్దుకుని తినబోతుంటే హోరున పెద్ద వర్షం. ఎక్కడా కూచోడానికి లేదు. తినేవాటి నిండా వర్షం నీళ్ళు పడ్డాయి. అవన్నీ అక్కడే పడేసి బయటి వచ్చి రెడీగా ఉన్న ఒక ఆటో ఎక్కాం. ఆటో అతను “అమ్మా ఈ వర్షంలో కష్టం. ఇక్కడే దిగిపొండి” అని ఒక ఇరానీ హోటల్ దగ్గిర ఆపాడు.
పూర్తిగా తడిసి ముద్దయిపోయాం. హోటల్ వాళ్ళు మాకు కూచోడానికి చోటుచూపించారు. ఎప్పుడూ ఇరానీ హోటల్ కి వెళ్ళలేదు. అదే మొదటిసారి.



ఇరానీ హోటల్లో వేడి వేడి ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కట్లు తీసుకుని, కాసేపు అక్కడే కబుర్లు చెప్పుకుని, వర్షం తగ్గాక ఇంటికి చేరాం. ఆ విహారం అలా గడిచింది. ఇరానీ టీ మాత్రం చాలా బావుంది. హైదరాబాద్ వచ్చినవాళ్ళు తప్పనిసరిగా ఇరానీ తాగి వెళ్ళేవారు. ఇప్పుడు ఎలా వుందో తెలియదు.
*** ఇరానీ చాయ్ పుట్టుక - ఇరాన్ , టర్కీ - కావలసిన పదార్థాలు - పాలు, చక్కెర, గరం మసాలా, లవంగాలు, ఏలకులు - రాగిపాత్రలో కట్టెల పొయ్యి మీద చేస్తారు కాబట్టి ఆ రుచి వేరే వుంటుంది. ఇప్పుడు చాలా సిటీల్లో దొరుకుతోంది. ) ***