10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

*** ముందు సీటూ... మూడు కుట్లూ... *** - 70

 *** ముందు సీటూ... మూడు కుట్లూ... *** - 70



*** ఆ విషయం తలుచుకుంటే... అప్పడూ... ఇప్పుడూ... ఎప్పుడూ.... మనసులో... వణుకే ***

ఒక రోజు పొద్దున్నే ముప్ఫయి సంవత్సరాల అమ్మాయి వచ్చింది. అప్పుడప్పుడే పుస్తకాలు, విజిటింగ్ కార్డులు చేయించుకోవడానికి ఎవరో ఒకరు వస్తూవున్నారు. ఆ అమ్మాయి కూడా అలాగే వచ్చిందనుకుని లోపలికి రమ్మన్నాను.

వచ్చి కూచుని – “నా పేరు లత అండీ. మా అన్నయ్యగారు స్టేట్ బ్యాంక్ లో చేస్తారు. మీ ఊరు అమ్మాయి అరుణ మా వదినకి ఫ్రెండ్ ట. మీరు కంప్యూటర్ మీద చేసే పని గురించి అరుణ నాకు చెప్పింది. నాకూ నేర్చుకోవాలని వుంది. నేర్పుతారా? మేము సంగీత్ థియేటర్ దగ్గిర వుంటాం. ఎప్పటి నుంచి రమ్మంటారు? ” అని ఆపకుండా అమాయకమైన మొహంతో అడుగుతోంది.

అలాగే నేర్పిస్తానని చెప్పాను. మర్నాటి నుంచీ రావడం మొదలు పెట్టింది. కొంత వర్కు నేర్చుకున్నాక “మీరు మా ఇంటికి ఒకసారి వస్తారా... ? అన్నయ్య మీతో మాట్లాడాలన్నారు” అంది. అడ్రస్, ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ తీసుకుని బుధవారం వస్తానని చెప్పాను.

ఏవో శలవులు రావడంతో పిల్లలిద్దరూ ఇంట్లోనే వున్నారు. మా వాడికి సంవత్సరం. మా అమ్మాయికి 4 సంవత్సరాలు. ఇద్దరినీ తీసుకుని ఇంటినుంచి రెండు నిమిషాల దూరంలో ఉన్న బల్కంపేట బస్ స్టాప్ నుంచీ 10p బస్సులో బయల్దేరి వెళ్ళాను. బస్సు చాలా రష్ గా వుంది. బాబుతో ఉన్నానని ఎవరో ముందుసీటులో కూచోమన్నారు. మా ఇంటి దగ్గర తెలిసిన లక్ష్మిగారు మా అమ్మాయిని తన దగ్గర కూచోపెట్టుకున్నారు.

ముందు సీటులో కూచున్నానన్నమాటే కానీ జనాలు అక్కడ కూడా బాగా వున్నారు. ఒకో స్టాప్ లో కొంత కొంతమంది దిగుతున్నారు. నా ముందర వాళ్ళందరూ దాదాపు దిగిపోయారు. బస్సు కొంచెం ఖాళీ అయ్యింది.

సంగీత్ థియేటర్ దగ్గిరికి వెళ్ళేసరికి బస్ కి సడన్ బ్రేక్ వేశాడు. ముందు సీటులో కూచున్న నేను ఎగిరి బస్సులో సీటు పక్కన పడి, ఒక్కో మెట్టు మీద నుంచీ కూచున్న దాన్ని కూచున్నట్లు ధనా ధనా కింద పడ్డాను. కాసేపు ఏం జరుగుతోందో అర్థంకాలేదు. ఒళ్ళో బాబున్నాడు. ఏదీ పట్టుకునే అవకాశం కూడా లేదు. మా అమ్మాయి “అమ్మా… అమ్మా… ” అని అరుస్తూ ఏడుస్తుంటే వినిపిస్తోంది కానీ... ఒక షాక్ లో ఉన్నాను.

డ్రైవర్ కూడా బస్ ఆపేశాడు. నేను నేల మీద అలా కూచుండిపోయాను. నా ఒళ్ళంతా రక్తం. అంత పడ్డంలోనూ మా అబ్బాయిని గట్టిగా పట్టుకున్నాను. కానీ నాకు ఆ షాకులో బాబుకి ఏదో తగిలింది. దాని వల్ల ఈ రక్తం అనుకుని ఇప్పుడేం ఘోరం చూడాలా అనుకుంటూ... అందరూ లేవమంటుంటే... పట్టించుకోకుండా ముందర బాబుని ఆప్యాయంగా తడిమాను. వాడికేమీ కాలేదు. వాడు ఒళ్ళో సేఫ్ గా ఉన్నాడు. అమ్మయ్య అనుకున్నాను. వాడి వంటికి కూడా రక్తం వుంది.

అప్పుడు కొంచెం తేరుకుని లేద్దామనుకుంటుంటే – “అయ్యో మీ తలకి దెబ్బ తగిలింది. లేవండి హాస్పిటల్ కి వెడదాం” అని ఎవరో పాతికేళ్ళ అబ్బాయి లేవదీసి తాగడానికి నీళ్ళు ఇస్తే... అప్పుడు తల తడుముకున్నాను. రక్తం కారుతూనే వుంది. అంటే నాకు ఆ స్పర్శ తెలియలేదు. ఎదురుకుండానే ఒక చిన్న హాస్పిటల్ వుంది. అబ్బాయి దగ్గరుండి తీసుకెళ్ళాడు.

వెళ్ళగానే వాళ్ళు క్లీన్ చేసి “బాగా లోతుగా తగిలింది. కుట్లు పడతాయి” అన్నారు. నేను “సరే” అన్నాను మాతో బాటు మా ఇంటి దగ్గర లక్ష్మిగారు మా అమ్మాయిని తీసుకుని వచ్చారు. అది బిక్కమొహం వేసుకుని కళ్ళ నుంచీ బొటబొటా నీళ్ళు కారుతూ నుంచుంది. హాస్పిటల్ వాళ్ళు మూడు కుట్లు వేసి, తలకి కట్టుకట్టారు. నన్ను హాస్పిటల్ కి తీసుకు వచ్చిన అబ్బాయి థాంక్స్ చెప్పాను. అక్కడ నుంచీ ఇంటికి వెళ్ళి పోవచ్చు కదా... లతకి మాట ఇచ్చానని గుర్తుకువచ్చింది.

పాపం రమ్మంది. ఎదురు చూస్తూ వుంటుంది అనుకుంటూ - ఆటో మాట్లాడుకుని పిల్లలిద్దరినీ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళింట్లోనే కాసేపు రెస్ట్ తీసుకుని, వాళ్ళన్నయ్యగారితో మాట్లాడాను. ఆయన “మా చెల్లెలికి కొన్ని అనారోగ్య కారణాలుగా పెళ్ళి అవలేదు. తనని మీకు అప్పచెప్తున్నాను. మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. తనకి పూర్తి వర్కు నేర్పించండి ” అన్నారు. నేను దెబ్బతగిలినా లత చెప్పిందని వచ్చినందుకు సంతోషించారు. అక్కడ నుంచీ మళ్ళీ ఆటోలో ఇంటికి వచ్చేశాం.

నేను వచ్చేసరికి కొంతమంది నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి పని చేయించి పంపించి. ఇంటికి వచ్చాక నాకు చాలా మగతగా అనిపించింది. అక్కకి, చెల్లెలు ప్రభావతికి ఫోన్ చేశాను. ఆఘమేఘాల మీద వచ్చారు. కాసేపు వుండి, నాకు కావలసినవి చేసి పెట్టి మా వారు వచ్చాక వెళ్ళిపోయారు.

ఇంతలో రవి అనే స్క్రీన్ ప్రింటర్ వాళ్ళావిడ “ఏమండీ 12 గంటలకి విజిటింగ్ కార్డ్ ప్రూఫ్ ఇస్తానన్నారు. మా కస్టమర్ ఒకటే ఫోన్లు. ఇంత లేట్ చేస్తారా. ఇంటికి వస్తే తాళం వేసివుంది” అని landline కి ఫోన్ చేసి గోల పెట్టింది. నేను పొద్దున్నే తీసిపెట్టిన ప్రూఫు తీసుకుని మాకు దగ్గరలోనే ఉన్న వాళ్ళింటికి వెళ్ళి ఇచ్చాను. నా తలకున్న కట్టు చూసి విషయం తెలుసుకుని సారీ చెప్పింది. ఒక వారం రోజులు కాస్త ఇబ్బంది పడ్డాను.

పిల్లలు తర్వాత బస్ ఎక్కినప్పుడల్లా నుంచుందాం కానీ, ముందు సీటులో మాత్రం కూచోవద్దు అనేవారు. అప్పటి నుంచీ ముందు సీటు వంక కూడా చూడలేదు.

ఒక రోజు లత వచ్చి కళ్ళ నీళ్ళతో “నేను గుంటూరు వెళ్ళిపోతున్నానండీ... నేను నేర్చుకోవడం, ఇక్కడ వుండడం మా వదినకి ఇష్టం లేదు. నాన్న దగ్గిరకి వెడుతున్నాను. మీరు నేర్పినవి నాకు చాలా వరకు అర్థం అయ్యాయి. ఏమైనా డౌట్లు వుంటే ఫోన్ చేస్తాను. నేను డిటిపి యూనిట్ పెట్టుకుందామను కుంటున్నాను” అని తను తెచ్చిన ఒక పెద్ద స్వీట్ బాక్స్ ఇచ్చి, గుంటూరు అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయింది. తర్వాత లత డిటిపి యూనిట్ పెట్టి, ఒక 4 ఆపరేటర్లని పెట్టుకుని బాగా సెటిల్ అయ్యిందని విన్నాను.

4 కామెంట్‌లు:

  1. మీరు ఈటపాకు పెట్టిన శీర్షిక భలేగా ఉంది. యతి చక్కగా కుదిరింది మరి. జీవితంలో ఎన్నో ఆటుపోట్లూ కొన్ని మంచివీ కొన్ని భయంకరమైనవీ ఐన అనుభవాలూ తప్పకుండా ఉంటాయి. నేనూ అలాంటి భయంకరమైన అనుభవాలను చాలానే చవిచూసానండి. మీ దగ్గర పనినేర్చుకున్న వాళ్ళు అదృష్టవంతులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటే ముందుకెళ్ళిపోతాం. లేకపోతే ఇంక అంతే సంగతులు. మీకు నా ధన్యవాదాలు.

      తొలగించండి
  2. సిటీ బస్సుల్లో అన్నిటి కన్నా ముందర ఒక సింగిల్ సీటు ఉండేది, అదా మీరు చెప్పేది? దాని కన్నా దరిద్రపు / ప్రమాదకరమయిన సీటు మరొకటి ఉండదు.
    దానికి పోటీ వచ్చేది బస్సులో వెనకాల తలుపు పక్కనుండే సీట్లు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాదండీ సింగిల్ సీటు వెనకసీటు. కిటికీ దగ్గర కాకుండా ఇవతలకి కూచుకున్నాను. అప్పటి నుంచీ ఇప్పుడు ఎప్పుడైనా బస్ ఎక్కినా ఆ సీటులో మాత్రం కూచోను.

      తొలగించండి