28, ఆగస్టు 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 27 - నాన్నగారి వూరు ఏలూరు వివరాలు -3

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 27 - నాన్నగారి వూరు ఏలూరు వివరాలు -3



బామ్మ మా నాన్నగారిని బాగా గారబంగా పెంచింది. ఆడింది ఆట పాడింది పాటగా వుండేది. బాగా అల్లరి చేస్తుండేవారుట. ఒకసారి బామ్మ తిట్టిందని ఒక అగ్గిపెట్టె, చిన్న కిరసనాయిలు దీపం పట్టుకుని రైల్వేట్రాక్ మీద నడుచుకుంటూ వెడుతుంటే - ఎవరో తెలిసిన వాళ్ళు చూసి బామ్మకి చెప్పారుట. బామ్మ గబగబా వెళ్ళి ఎక్కడికి వెడుతున్నావురా... అంటే... నన్ను తిట్టావుగా హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పారుట.


కానీ మా నాన్నగారు అల్లరి ఎంత చేసినా "ఫుట్ బాల్ ప్లేయర్" అయ్యారు.

ఈ మెడల్స్ అన్నీ ఆయనవే. ఆయన 1938లో చాలా ఫుట్ బాల్ పోటీలలో పాల్గొని సాధించిన మెడల్స్. ఇన్నాళ్ళూ జాగర్త పెట్టిన వాళ్ళు మాకు అందచేశారు.




ఆయనకి ఆటలమీద, చిత్రలేఖనం మీద మంచి ఆసక్తి వుండేదిట. బొమ్మలు చాలా చక్కగా వేసేవారు. ఆయనకి ఏదో సాధించాలనే తపన చాలా ఎక్కువగా వుండేది.

అప్పట్లో ఏలూరులో ఆంధ్రాబ్యాంక్ కొత్తగా పెడితే మా బామ్మని మీ అబ్బాయిని పంపమని అడిగారుట. బామ్మ తీసికెళ్ళి చేర్పించింది. మూడుసార్లు పారిపోయి వచ్చారుట. వాళ్ళు మళ్ళీ పిలిచి తీసుకెళ్ళారుట. ఎందుకంటే వర్క్ విషయంలో చాలా నిజాయితీ గల మనిషి అవడం, నిమిషాల మీద కష్టమర్స్ పని పూర్తి చేయడం, పంపించడంతో ఆ ఉద్యోగం ఆయన్ని వదిలిపెట్టలేదు.


20, ఆగస్టు 2021, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 26 - నాన్నగారి వూరు ఏలూరు వివరాలు -2


జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 26 -  నాన్నగారి వూరు ఏలూరు వివరాలు -2  



మా  బామ్మగారు నేర్పిన బ్రహ్మసమాజ గీతం

 

దీనిని కృష్ణశాస్త్రిగారు –

 

పార్వతీశ్వర కవుల ‘ఉదయ గానము చదివి ప్రతిస్పందనగా ‘లేదోయి నిదురలో లేదోయి సుగతి ‘ గీతాన్ని రచించారు. అప్పట్లో ఈ గీతం ఎంతో ఉత్తేజకరంగా వుండి, అందరూ కలిసి పాడుకుంటూ వుండేవారట. ఈ పాట ఎంత గొప్పగా వుందో....  మా బామ్మగారు మాకు బ్రహ్మసమాజ గీతాల పుస్తకాన్ని ఇచ్చారు.  

ఆవిడ ఉన్నప్పుడు టెక్నాలజీ ఇంత బాగా డెవలప్ అవలేదు.  పైగా నేను మధ్యలో అమ్మాయిని అవడం వల్ల మేము అన్నీ తెలుసుకునే సమయానికి వాళ్ళు మాయమైపోయారు.

 

 

సద్దుచేయక రేయి సాగిపోయినది

పొద్దు చీకటి తెరల పొంచి చూచినది

మిద్దెలోపలి దివ్వె మింటికెగసినది

లేదోయి నిదురలో లేదోయి సుగతి

చూడవా కన్నెత్తి చూడవా జగతి

 

అన్నదమ్ములు చేతులందుకొన్నారు

ఆలుబిడ్డలు తోడు నీడలైనారు

ప్రాణులందరు కూడ పథికులైనారు

లేదోయి నిదురలో లేదోయి సుగతి

చూడవా కన్నెత్తి చూడవా జగతి

 

కోటలో కొలువులో మేటి రారాజై

వేయి చేతులు చాచి వెలుగుచున్నాడు

పేరు పేరున నిన్ను పిలుచుచున్నాడు

లేదోయి నిదురలో లేదోయి సుగతి

చూడవా కన్నెత్తి చూడవా జగతి

 

 

మింటిపై బురుజుపై గంట మోగినది

కొండపై కోనపై జెండ వూగినది

గుండె గుండెకు పిల్పు కొసరి సాగినది

లేదోయి నిదురలో లేదోయి సుగతి

చూడవా కన్నెత్తి చూడవా జగతి

 

 

 

 

 

 

 


15, ఆగస్టు 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 25 - నాన్నగారి వూరు ఏలూరు వివరాలు -1

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 25 -  నాన్నగారి వూరు ఏలూరు వివరాలు -1  

 

ఏలూరులో మా నాన్నగారి తల్లితండ్రుల గురించి  పుట్టిల్లు గురించి కొంత చెప్పాలి.

 


                               నుంచున్నావిడ మా బామ్మగారు, ఆవిడ అత్తగారు


మా బామ్మగారి ఇల్లు ఏలూరు పవరుపేటలో అంబికా దర్బార్ బత్తి ఎదురుగా వుండేది. దాదాపు వెయ్యి గజాల స్థలం. పెద్ద ఎత్తు అరుగులతో ఒక పేద్ద పెంకుటిల్లు. దాని ఎదురుగా వరసగా మూడు పోర్షన్ల పెంకుటిల్లు. ఇవి కాకుండా పెద్ద ఖాళీస్థలం వుండేది. మా బామ్మ ఏలూరు మున్సిపల్ కౌన్సిలర్ గా చేసింది. మా తాతగారూ, బామ్మగారు అప్పట్లో కాంగ్రెస్ లో బాగా తిరిగేవారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.  రాజారామమోహనరాయలు ప్రారంభించిన బ్రహ్మ సమాజంలో తిరిగేవారు. రకరకాల పాటలు పాడుతుండేవారు.  మా బామ్మ మాకు ఆపాటలు చాలా నేర్పేది.  వాళ్ళు హరిజనోద్యమాలలో పాల్గొని పంక్తి భోజనాలు చేశారు.  ఇలా చేస్తున్న సమయంలో మా తాతగారు ప్రాణాయామం గురించి చెప్తూ ఉన్నట్టుండి గుండె ఆగి చనిపోయారని చెప్తారు. ఆయన మా బామ్మని బ్రహ్మసమాజ సిద్ధాంతాలకి అనుగుణంగా వితంతు వివాహం చేసుకున్నారు.  

 

బామ్మకి నాన్నగారు ఒక్కరే కొడుకు. ముగ్గురు కూతుళ్ళు. పెద్ద కూతురు సరళాదేవిగారిని సంగీతం విద్వాన్ చేయించారు. ఆవిడ మాకు చాలా పాటలు నేర్పేది. రెండో కూతురు సతీదేవి ఆవిడ అప్పట్లో ఎస్.ఎస్.ఎల్. సి చదివింది. మా అమ్మకి వాళ్ళమ్మ చనిపోతే,  సవతి తల్లిగా వచ్చింది. పెనుగొండలో వుండేవారు.   మూడో ఆవిడ అంజనాదేవి. ఆవిడ ఏలూరులోనే స్కూలులో పనిచేసేది.  

 

కాంగ్రెస్ లో తిరిగుతూ పెద్ద పెద్ద వాళ్ళ పరిచయం వుండటం వలన మా బామ్మకి చాలా పలుకుబడి వుండేది. బ్రిటీష్ రాణి ఎప్పుడైనా ఏలూరు వస్తే ఆవిడని కలుస్తూ వుండేవారుట. అప్పుడు బామ్మవెళ్ళినప్పుడు ఆవిడ పంఖా పీకు అనేవారట. అంటే పైన తెరలాంటి గుడ్డని తాడుతో ఊపితే గాలి వచ్చేదిట. సగం సగం తెలుగు నేర్చుకుని మాట్లాడేవారుట.       

మా బామ్మగారు, పక్కన మా మేనత్త
వెనక మేనత్త కూతుళ్ళు ముగ్గురు, అల్లుళ్ళు


8, ఆగస్టు 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 24 - తాడేపల్లిగూడెం - ఆ ఇంటితో రుణం తీరిన వేళ - 8

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 24 -  తాడేపల్లిగూడెం  - ఆ ఇంటితో రుణం తీరిన వేళ  - 8  



 జ్ఞాపకాల గూడుతో రుణం తీరింది

ఆ ఇంటితో రుణం తీరిన వేళ

 

అమ్మని చాలా బాగా చూసుకునేవారు. అమ్మ మేనగోడలే అయినా అమ్మకి ఏ విషయంలోనూ లోటు రానియ్యలేదు. నాన్నగారు చాలా శాంత స్వభావులు. అమ్మకి తన పిల్లలకి చెడ్డ పేరు రాకూడదని మమ్మల్ని చాలా మిలటరీ డిసిప్లిన్ తో పెంచింది. శిక్ష కఠినంగానే వుండేది.  మా అక్కచెల్లెళ్ళు అందరికీ ఆరేళ్ళు వచ్చేలోపునే తెలుగు అక్షరాలు, గుణింతాలు, మాటలు రాయడం, చదవడం. అన్నీ నేర్పేసింది. ఎబిసిడిలు మొదటి బరి రెండో బరి అనేవాళ్ళం. మొదటిది పొడి మాటలకి, రెండోది అక్షరాలు కలిపి రాయడానికి. మేము 6 సంవత్సరాలకి స్కూల్లో చేరేసరికి మాకు మొత్తం చదవడం, రాయడం వచ్చేసేది.  ఇంటిముందు కూచుని బియ్యం ఏరుకుంటూ చదువు చెప్పేది.

 

ఆ ఇల్లు చూసి ఇంతబాగా మళ్ళీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుని, అందరికీ చెప్పిన నేను రుణం తీరిన విషయం కూడా చెప్పాలి.

 

ఒకరోజు అమ్మ మమ్మల్ని పొద్దున్నే 7 గంటలకి లేపింది. నాన్నగారు ఎందుకో కదలట్లేదు. నోట్లోంచి గురక వస్తోంది. మీరిద్దరూ వెళ్ళి మూర్తి డాక్టరుగారిని పిలుచురండి అంది. నేను 7వ తరగతి,  మా చెల్లెలు 5వ తరగతి. ఇద్దరం రైల్వేట్రాక్ దాటి డాక్టరుగారిని పిలుచుకు రావడానికి వెళ్ళాం. డాక్టరు గారు లేరు. అప్పట్లో నేను మా చెల్లెలు ఇంటికి వచ్చేసరికి నాన్నగారిని కారులో ఏలూరు తీసుకుని వెళ్ళారుట.  మేము వెళ్ళే లోపున  డాక్టరు గారికి ఎవరో కబురు అందించారు.  ఆయన చూసి ఏలూరు పెద్దాసుపత్రికి తీసుకుని వెళ్ళమన్నారు. తాడేపల్లిగూడెంలో పెద్ద ఆసుపత్రులు లేవు.

 

మమ్మల్ని బ్యాంక్ వాళ్ళు వేరే కారులో వెనక పంపించారు. మేము ఏలూరు చేరేసరికి సాయంత్రం అయిపోయింది.  మానాన్నగారి వూరు ఏలూరు కాబట్టి తిన్నగా బామ్మగారి ఇంటికి వెళ్ళిపోయాం.  తీరా చూస్తే నిర్జీవంగా పడుకున్న నాన్న. అంత హఠాత్తుగా వదిలివెళ్ళిన ఆ మనిషిని చూస్తే ఏడుపు కూడా రాలేదు.  ప్రశ్నార్థకమైన మొహాలేసుకుని చూస్తూ కూచున్నాం.  

 

నాన్నగారు పోయాక అందరూ మమ్మల్ని ఏలూరులోనే వుండమన్నారు కానీ, బ్యాంక్ వాళ్ళు మాత్రం మీరు గూడెం వచ్చెయ్యండి అన్నారు. మీ నాన్నగారు పిల్లలు చదువు గురించి చెప్పేవారు.  అని మాకు ఏడాదికి సరిపడా సరుకులు కొనిచ్చారు. అక్కకి బ్యాంక్ లో టెంపరరీగా ఉద్యోగం వచ్చేలా చేశారు. మెల్లగా పర్మనెంట్ అయి మా అందరినీ చదివించి, పెళ్ళిళ్ళు చేసింది.

 

అన్ని జ్ఞాపకాలు గూడుకట్టుకున్న ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయాం.

 

నాకు తాడేపల్లి గూడెం వెళ్ళి ఆ యింటిని చూడాలనిపించి చూసి, మళ్ళీ ఇవన్నీ గుర్తు చేసుకున్నాను.

 


3, ఆగస్టు 2021, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 23 - తాడేపల్లిగూడెం - నాన్నగారితో.... ఆ ఇంట్లో - 7

   జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 23 -  తాడేపల్లిగూడెం  - నాన్నగారితో....  ఆ ఇంట్లో  - 7  


                                        ఇది ఇంటికి వచ్చే గుమ్మం. ఈ గుమ్మంలోంచే మా పరుగులు

సాయంత్రం  నాన్నగారు Bank నుంచి వచ్చేటప్పుడు సందు తిరగగానే దగ్గు వినిపించేది. మేము పరుగులు పెట్టుకుంటూ కిందకి వెళ్ళేవాళ్ళం.  ఎదురెళ్ళి ఇంటికి కలిసి వచ్చేవాళ్ళం.

 

Bank నుంచి రాగానే టిఫిన్ తిని, కాఫీ తాగి అలా బజారు దాకా వెళ్ళేవారు. తనతోబాటు నన్ను కానీ, మా మూడో అక్క ఉమని కానీ తీసుకుని వెళ్ళేవారు. తాడేపల్లి గూడెం ఎండుమిర్చి, చింతపండు, బెల్లంకి మంచి వ్యాపార ప్రదేశం. నాన్న Cash లో కూచునేవారు కాబట్టి షాపుల వాళ్ళందరితోటీ బాగా పరిచయాలుండేవి. అక్కడ ఒక షాపుకి తీసుకుని వెళ్తే సుబ్బారావుగారి పాప వచ్చింది. జీడిపప్పు, పటికబెల్లం ఇమ్మనేవారు. ఇంచుమించు పావుకిలో జీడిపప్పు, పావుకిలో పటికబెల్లం ఇచ్చేవారు.  అవి తీసుకుని ఇంటికి వచ్చి అమ్మకి ఇచ్చేవాళ్ళం. 

 

నాన్నగారు Bank లో క్యాషియర్ గా పనిచేసేవారు. అప్పట్లో బ్యాంక్ ఉద్యోగస్తులంటే చాలా గొప్పగా వుండేది.  ఎవరైనా డబ్బు కట్టడానికి కానీ, తీసుకోవడానికి కానీ వస్తే లెక్కపెట్టేటప్పుడు తెల్లకాగితాలు మాత్రమే కనిపించేవిట. ఒక్కళ్ళని కూడా వెయిట్ చేయించేవారు కాదు. అందరూ వ్యాపారస్తులు అవడంతో రష్ గానే వుండేది.  ఊరందరికీ నాన్నగారు దేవుడు.

 

ఈ ఇంటికి అప్పుడప్పుడు నాన్నగారి ఫ్రెండ్స్ వస్తూండేవారు. వాళ్ళందరూ కలిసి కింద రూంలో పేకాట ఆడుకునేవారు. అది ఒక సరదాగానే వుండేది.  పడుకునే మంచం దగ్గర వున్న కిటికీ దగ్గర నిలబడితే వచ్చేవాళ్ళు కనిపించేవారు. ఇష్టం లేకపోతే అక్కడ నుంచి చెయ్యి ఊపి రావద్దని చెప్పేవారు.

 


ఆ చివరగా ఉన్న కిటికీ దగ్గర మంచం మీద పడుకునేవారు.  తెరిచిపెట్టి వున్న చివరి కిటికీ నుంచీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండేవారు.


పండగలు వస్తే చాలు శ్రీరామనవమి, దసరా, సంక్రాంతి , వినాయక చవితి పండగలకి నాన్నగారు దగ్గరుండి అలంకారాలు చేసేవారు. శ్రీరామనవమికి అయితే ఒక చక్కటి గొడుగుతో ఉన్న సింహాసనం చేశారు. అప్పట్లో ఇలా ఫోటోలు తీసుకోవాలని తెలియదు. అంతేకాకుండా వినాయక చవితికి పెద్ద విగ్రహం కొని, పాలవెల్లి అలంకరించేవారు.  

 


అమ్మా నాన్నలతో ఆరుగురం - నాన్నగారు అలంకరించిన సంక్రాంతి బొమ్మల కొలువు


దసరాకి బొమ్మలకొలువు బాగా అలంకరించారు. మా నాన్నగారు ఇండియా బొమ్మ సిమెంటుతో తయారు చేసి అందులో నదులు అవన్నీ కూడా డిజైన్ చేశారు.  నాన్నగారు మంచి ఆర్టిస్టు.  పెద్దక్కకి సైన్సు రికార్డుల్లో బొమ్మలన్నీ నాన్నగారే వేసి పెట్టేవారు.  

 

ఇంటి వెనకవైపు నేనూ అమ్మా ఎన్నో పువ్వుల మొక్కలు వేశాం. బావి పక్కన వేసిన మందార చెట్టు అంచలంచలుగా ఎదిగి రోజుకి 80 దాకా పువ్వులు పూసేది.  గులాబీ రంగు డిసెంబరు, ముళ్ళ గొబ్బీ, కనకాంబరం ఒకటేమిటి అమ్మకి దేవుడికి పెట్టటానికి కావలసిన పువ్వులన్నీ వుండేవి. నేను ఇంత బాగా పెంచుతుంటే నాన్నగారు నాకు ఒక గులాబీ మొక్క కొనిచ్చారు. అది మొగ్గ తొడిగి, పువ్వు పూసేదాకా దాని చుట్టూ తిరిగేదాన్ని. పూసిన పువ్వుని చూసి నా ఆనందం అంతా ఇంతా కాదు. 



ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న కుండీలో కనకాంబరం మొక్క వుండేది. ఎన్ని పువ్వులో పూసేది. అమ్మ దండ కట్టి గాయత్రి చిన్న జడలలో పెట్టేది. అది గంతులు వేసుకుంటూ తిరిగేది. 




మేము కింద పెట్టిన  చిక్కుడు, దొండ పాదులు ఈ కిటికీ వరకూ పాకుతూ వచ్చి మళ్ళీ పైన కూడా కాయలు కాసేవి. వీటికోసం నాన్నగారు తాళ్ళు కట్టేవారు. ఈ రెండు కూరలు బాగా తిన్నాం. 


(వచ్చేవారం ముగింపు)