27, ఆగస్టు 2022, శనివారం

కొత్త జీవితానికి నాంది - 43 *** ఆరోజేమయ్యిందో తెలుసా...? ***

 కొత్త జీవితానికి నాంది - 43   *** ఆరోజేమయ్యిందో తెలుసా...? ***





నేను అమ్మ అడిగినట్లు ఒక వారం రోజులు అమ్మ దగ్గిర వున్నాను. అక్టోబరు 19వ తేదీ సోమవారం నేను సంజీవరెడ్డి నగర్ వెళ్ళి అక్కడ కొన్ని పనులు చూసుకుని మళ్ళీ 21వ తేదీ పొద్దున్న అంటే నరకచతుర్ధశి రోజు అమ్మ దగ్గిరకి వచ్చాను. అమ్మ ఎందుకో నీరసంగా వుంది. ఏమైందని అడిగితే - "అందరూ వస్తున్నారు కదా... నీళ్ళు సరిపోవాలి. పంపునీళ్ళు లేటుగా వస్తాయి. అందుకని ఇంటి ముందు ఉన్న బోరింగ్ కొట్టి నీళ్ళు నింపాను. ఎందుకో నీరసం వచ్చింది" అంది.

అమ్మ ప్రేమ ఎలా వుంటుందంటే అటు వచ్చేవాళ్ళమీద ప్రేమ - ఇటు నిద్రపోతున్న చెల్లెళ్ళనీ లేపడం ఇష్టం లేక తనే ఒళ్ళుమరిచి పడిన హడావుడి. అమ్మ పని ఉంటే ఎప్పుడూ కూచునేది కాదు. ముందు ఆ పని అయిపోవాలి. అప్పుడు అమ్మకి నిశ్చింత. అమ్మకి జ్వరం రావడం పడుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. చాలా హుషారుగానే పనులు చేసుకునేది.

పెద్దక్క అన్నపూర్ణ, పిల్లలు విజయవాడ నుంచి వచ్చారు. రెండో అక్క, బావగారు, వాళ్ళబ్బాయి వచ్చారు. మా వారు నరకచతుర్ధశి రోజు మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చారు. మేము సాయం చేస్తే పెద్దక్క దీపావళి రోజుకి వంటల సంగతి చూసుకుంది. సాయంత్రం కొత్త ప్రమిదలు తెప్పించి, ఇల్లంతా దీపాలు పెట్టించి, అక్క పిల్లల చేత కాకరపువ్వత్తులు కాల్పించి సంతోషపడింది. దీపావళి రోజు అందరితో గడిపి, సాయంత్రం భోజనం చేసేసి, మర్నాడు పొద్దున్నే 5 గంటలకి డ్యూటీ వుందని వెళ్ళిపోయారు. పెద్ద బావగారు, రెండో బావగారు కూడా వెళ్ళిపోయారు. ఇంట్లో అందరం ఆడవాళ్ళు మాత్రమే వున్నాం.

*** గుబులు నింపిన దీపావళి ***

రాత్రి 11.30కి అప్పుడే నిద్రలోకి వెళ్ళబోతున్న నన్ను పెద్దక్క లేపింది. అమ్మ ఏదో అవస్థ పడుతోంది. ఏదో అర్థం కాని పరిస్థితి. నేను అన్నీ అర్థం చేసుకునేసరికి రాత్రి 12.00 గంటలు అయ్యింది. అక్క నాతో "బయట రిక్షా కానీ, ఆటో కానీ వుంటే చూడు అర్జంటుగా అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి" అంది. అంత రాత్రి అని కానీ, ఎలా అని కానీ ఆలోచన రాలేదు. చెల్లెళ్ళు, పిల్లలూ నిద్రలో వున్నారు. బయటికి వెళ్ళాను. కొద్ది దూరంలో రిక్షాలో ఒకతను నిద్రపోతున్నాడు. వెళ్ళి పిలిచాను. పిలవగానే లేచాడు. దగ్గరలో ఉన్న దుర్గాబాయ్ దేశ్ ముఖ్ హాస్పిటల్ కి వెళ్ళాలని చెప్పాను.

అమ్మని మెల్లిగా నడిపించుకుంటూ రిక్షా దగ్గిరకి తీసుకెళ్ళాం. బాగానే ఎక్కగలిగింది. రోడ్డు మీద అక్కడక్కడ షాపులు తీసి వున్నాయి. జనాలు అంతగా లేరు. అవన్నీ ఆలోచించే టైము కూడా లేదు. అమ్మని చూస్తే పళ్ళ బిగువున బాధని అదుముకుంటోందని అర్థం అయ్యింది. ముట్టుకుంటే కూడా అమ్మ భరించలేకపోతోంది. మొత్తానికి హాస్పిటల్ కి చేరాం. సందడి లేదు.

ఒక చోటికి వెళ్ళి అడ్మిట్ చెయ్యాలని చెప్పాను. ఈలోపున అమ్మ రిక్షా దిగేసింది. "అయ్యో... వుండమ్మా... ఇక్కడ కాదుట. మళ్ళీ ఎక్కగలవా? అన్నాను", ఏమీ చెప్పలేకపోతోంది. రిక్షా అబ్బాయిని అమ్మని చూస్తూవుండమని, పక్కనే ఉన్న ఎమర్జెన్సీకి వెడితే, రిసెప్షన్ లో అమ్మాయి మంచి నిద్ర లో వుంది. లేపి సంగతి చెప్పి వీల్ ఛైర్ పంపమని అమ్మని లోపలికి తీసుకుని వెళ్ళాను.

అమ్మకి టెస్టులు చేస్తున్నారు. తెల్లారుతుండగా పెద్దక్క వచ్చింది. కానీ ఆరోజు అమ్మ పడిన వేదన మరిచిపోలేను. ఒకరోజంతా అయ్యాక కొంచెం బాగానే వుంది. ఐసియులో పెట్టారు. పదిగంటలకి డా. సోమరాజు హార్ట్ స్పెషలిస్ట్ వచ్చి చూసినప్పుడు అమ్మ - "కళ్ళంతా మసకగా వున్నాయి, కొంచెం నీరసంగా వుంది" అని చెప్పింది. "మూడు రోజుల్లో ఏమీ వుండవు" నన్ను, అక్కని పిలిచారు. "ఏం జరిగింది" అని అడిగారు.

"అమ్మకి బి.పి. వుండేది, డాక్టర్ ట్రీట్ మెంట్ లోనే వుంది. బోరింగ్ కొట్టి నీళ్ళు నింపింది" అని చెప్పాం. ఆయన చాలా విచారంగా మొహం పెట్టి, "అయ్యో! ఆ ఒత్తిడి ఆవిడ గుండెమీద పనిచేసింది. మీరు ఎవరికైనా చెప్పాలంటే చెప్పండి. ఇంక మూడు రోజులు మాత్రమే ఆవిడ ఉండగలరు" అని చెప్పారు. నాకు అప్పుడు అర్థమయ్యింది - మూడురోజుల్లో "ఏమీ వుండవ"ని అమ్మకి డాక్టర్ ఎందుకు చెప్పారో. మేము పడిన బాధ అంతా ఇంతా కాదు.

అమ్మ "స్నానం చెయ్యాలని వుంది. చిరాగ్గా వుంది. ఇంట్లో చాలా పనులు వుండిపోయాయి ఎప్పుడు ఇంటికి వెడతామో..." అంది. నేను, "అవన్నీ ఏమీ ఆలోచించకు. రేపు ఇంటికి వెళ్ళిపోదాం" అని చెప్పాను. "నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు. ఇంకా కొన్నిరోజులు నా దగ్గిర వుంటావా...?" అంది. ఏం మాట్లాడను నేను...? పైకి రాని దుఃఖం కుదిపేస్తోంది.

వెంటనే మళ్ళీ "నాకు వేడి వేడి చారు అన్నం తినాలని వుంది తెస్తావా...? అంది. వెంటనే ఇంటికి వెళ్ళి మెత్తగా అన్నం వండి, చారు పెట్టి అమ్మకి తీసుకెళ్ళి పెట్టాను. ఎంతో హాయిగా వుందని తింది. చాలా నేను రోజులు చారు అన్నం తినలేదు. ప్రభావతిని కూడా అలాగే పండు అడిగింది. డాక్టర్ పెట్టొద్దన్నారని పెట్టలేదు. ప్రభావతి కూడా చాలారోజులు అరటిపండు తినలేక పోయింది.

అక్క నన్ను, చెల్లెలు ప్రభావతిని హాస్పిటల్లో వుండమని చెప్పి తను వెంటనే బయల్దేరి విజయవాడ వెళ్ళింది. మేము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అక్కడే వున్నాం. 26 రాత్రి ఇద్దరం హాస్పిటల్ లో వున్నాం.
27వ తేదీ పొద్దున్న నేను ప్రభావతితో "అమ్మ నిద్రపోతోంది. నేను ఒకసారి సంజీవరెడ్డి నగర్ వెళ్ళి వస్తాను" అని ఇంటికి వచ్చాను. "నా వెనకే హాస్పిటల్ లో పక్కన బెడ్ వాళ్ళ అబ్బాయి మిమ్నల్నందరినీ హాస్పిటల్ కి రమ్మంటున్నారు" అన్నాడు. ఆఘమేఘాల మీద వెళ్ళాం.

11 సంవత్సరాలకి పెళ్ళయి మధ్యలో అనారోగ్యాలు లేకపోయినా పుట్టిన పిల్లల ఆలనా పాలనా, రూపు దాల్చకుండా పోయిన పిల్లలు, 38 సంవత్సరాలకే భర్తని పోగొట్టుకుని పడిన ఆవేదనలు - ఇలా ఎన్నో రకాలుగా అలిసిపోయిన శరీరాన్ని 54 ఏళ్ళకే వదిలి శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. ఏడుగురు పిల్లల్ని వదిలేసి మాయమయిపోయింది.

ఢిల్లీ అక్కకి చెప్దామంటే ట్రంకాల్ బుక్ చెయ్యాల్సి వచ్చింది. ఎస్ టిడి లేదు. టైముకి చెప్పలేకపోయాం. మొత్తానికి చివరగా చూశారు.

ఇక్కడ కూడా మాకు విజయపాల్ గారు రాముల్ని, కారుని పంపి పూర్తిగా సహకరించారు.

కానీ అప్పటి నుంచీ దీపావళి పండగ వస్తుందంటే మనసంతా గుబులుగా వుంటుంది. నాన్నగారు 1971, అక్టోబరు 7వ తేదీన రాత్రి పడుకుని పొద్దుటికి లేవలేదు. 15వ తేదీన వచ్చిన దీపావళికి మేమింకా దుఃఖంలో వున్నాం. చాలా సంవత్సరాలు దీపావళిని మర్చిపోయాం.

అమ్మని హైదరాబాదు తీసుకువచ్చి దూరం చేసుకున్నామా...? లేకపోతే కనీసం అన్ని రోజులైనా తనతో గడపగలిగామా? అన్నది మాకు ప్రశ్నగానే వుండిపోయింది. ఏది ఏమైనా కాలం మాత్రం ఆగనిది. తర్వాత ఎన్నో మార్పులు.


24, ఆగస్టు 2022, బుధవారం

కొత్త జీవితానికి నాంది - 42 *** పెళ్ళయ్యిందిగా... తిరుపతికి వెళ్లాలన్నారు ***

 కొత్త జీవితానికి నాంది - 42   *** పెళ్ళయ్యిందిగా... తిరుపతికి వెళ్లాలన్నారు ***

*** తిరుపతి ప్రయాణం – కాలినడకన కొండ మీదకి***




పెళ్ళయిన తర్వాత మా అత్తగారూ వాళ్ళు మద్రాసు వెడుతూ మమ్మల్ని తిరుపతి తీసుకుని వెళ్ళారు. మా తోటికోడలు వాళ్ళ పుట్టిల్లు తిరుపతి మిట్టవీధిలో వుంది. వాళ్ళ అన్నయ్యలు ముగ్గురు తిరుపతి దేవస్థానంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళింటికి వెళ్ళాం. ఉమ్మడి కుటుంబం. ఇల్లు మరీ పెద్దది కాకపోయినా ఇల్లంతా పిల్లలతో, మనవలతో వయసు మీరిన ఇంటిపెద్దలని చూస్తే ఆశ్చర్యం, ఆనందంగా అనిపించింది. తిరుపతి కాబట్టి వచ్చేపోయేవాళ్ళు ఎక్కువ. కానీ అందరూ మర్యాదస్తులు. వాళ్లు పెట్టిన భోజనం కన్నా... ఆప్యాయతకి కడుపు నిండిపోయింది.

నేను తిరుపతి చూడ్డం అదే మొదటిసారి కావడంతో చూడాలన్న ఆత్రుత ఎక్కువైంది. (ఎప్పుడో నేను చంటిపిల్లగా ఉన్నప్పుడు అమ్మావాళ్ళు కారులో వెళ్ళారని విన్నాను.) మర్నాడు పొద్దున్నే 4 గంటలకి బయల్దేరి మేము తిరుపతి కొండకి నడుచుకుంటూ వెళ్ళాం. అదొక అద్భుతమైన అనుభూతి. చల్లటి వేళ, పొద్దున్నే కాఫీ తాగి బయల్దేరాం. మధ్య మధ్యలో కూచుంటూ, మళ్ళీ మెట్ల దారమ్మట ప్రయాణం సాగించాం. దారిలో కట్టెల పొయ్యిమీద వేసిన వేడి వేడిగా చిల్లుల చిల్లుల మెత్తటి దోసెలు, పచ్చడి తిన్నాం. అతి తక్కువ ధరకే వచ్చాయి. ఆ చల్లదనానికి వేడిగా కడుపులో పడిన ఆ దోశలు శక్తినిచ్చాయి.

మరికొంత దూరం వెళ్ళాక పోపు, కరివేపాకు వేసిన పలుచటి మజ్జిగ తాగాం. చాలా బావుంది. ఎన్ని గ్లాసులు తాగినా తాగినట్టే లేదు. అక్కడక్కడ అమ్ముతున్న తోతాపురి మామిడి కాయల ముక్కలు కాలక్షేపాన్నిచ్చాయి.

దారిలో జింకల పార్కు చూడ్డానికి చాల బావుంది. మనని చూసి అవి చూసే బెదురు చూపుల్లో ఉన్న అందం చెప్పలేం. ఓసారి తొంగిచూసి వడి వడిగా వెళ్ళిపోతుంటే వాటి హడావుడికి నవ్వొచ్చింది. ఆ అడవి చెట్ల అందాలు, పక్షుల కిలకిలా రావాలు మనసుకి ఆహ్లాదంగా వుండి నడిచిన అలసట తెలియలేదు. మొత్తానికి ఆడుతూ పాడుతూ కొండ పైకి ఎక్కేశాం.

అక్కడకి వెళ్ళాక కాటేజ్ తీసుకుని కొంచెం విశ్రాంతి తీసుకుని పరిశుభ్రంగా దర్శనానికి వెళ్ళాం. దర్శనం చాలా బాగా జరిగింది. మధ్యలో వాళ్ళు పెట్టిన మిరియాల పులిహోర, అతి చిన్న లడ్డూలు చూసి నేను ఆశ్చర్యపడ్డాను. అప్పటి వరకూ మిరియాల పులిహోర తినలేదు. ఉచితభోజనం బావుంటుంది అన్నారు కానీ మాకోసం ఇంటిభోజనం రెడీగా వుండడంతో దాన్ని విరమించుకున్నాం.

కొండ దిగి వచ్చేటప్పుడు బస్ లో వచ్చాం. కొండ మార్గంలో బస్సు దిగుతుంటే అదొక వింత అనుభూతి. పచ్చని చెట్ల అందాన్ని, చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కొండ దిగువకి వచ్చాం. అక్కడ నుంచీ మళ్ళా మిట్ట వీధికి వెళ్ళి వాళ్ళు పెట్టిన చిట్టి మామిడి పండ్ల పులుసు (కాయలకి కాయలతో), వేయించిన కందిపప్పుతో చేసిన పప్పు, పులిహోర, గారెలు, పరమాన్నంతో ఆనందంగా భోజనం చేసి వాళ్ళిచ్చిన బహుమతులు స్వీకరించి తిరుగు ప్రయాణం అయ్యాం.

విజయవాడలో మా పెళ్ళి పీటల మీద కూచున్న పెద్దక్కా వాళ్ళింటికి వెళ్ళి, వాళ్ళతో కాసేపు గడిపి రాత్రికి హైదరాబాదుకు ప్రయాణం అయ్యాం. పొద్దున్నే ట్రైన్ దిగి నేను అమ్మదగ్గిరకి, ఆయన వాళ్ళ రూంకి వెళ్ళిపోయాం.

*** కొత్త సంసారానికి సంరంభం ***

పెళ్ళి హడావుడిగా అయిపోవడంతో ఇల్లు గురించి ఆలోచించే టైము లేకపోయింది. జానకిరాం గారి ఆఫీసు బాలానగర్ కావడం, షిఫ్ట్ డ్యూటీలు అవడంతో దూరం అయితే కష్టం అవుతుందని అప్పటికే సంజీవరెడ్డి నగర్ లో ఉన్న అక్కకి ఇల్లు చూడమని చెప్పాం. అంతదాకా ఎవరిళ్ళలో వాళ్ళు.

మొత్తానికి అక్కావాళ్ళ ఇంటి దగ్గరే మాకు ఇల్లు దొరికింది. రు. 300 అద్దె. ఇంటివాళ్ళు చాలా బాగా మాట్లాడారు. ఇల్లు బాగానే వుంది కానీ, ఇంట్లోకి సామాను అమర్చుకోవాలి. మా పెళ్ళికి గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు, కుక్కర్ తో సహా కావలసినవన్నీ వచ్చాయి.

ఒకసారి అమ్మని తీసుకుని వెళ్ళి ఇల్లు చూపించాను. అమ్మ ఏమీ మాట్లాడలేదు. అమ్మ కొంచెం దిగులుగా ఉన్నట్లు అనిపించింది. మళ్ళీ అమ్మని తీసుకుని వెళ్ళిపోయాను. మేము సెటిల్ అవడానికి కొన్ని రోజులు పడుతుంది.

మధ్య మధ్యలో జానకిరాం గారు వచ్చి వెడుతుండేవారు. జూన్ లో పెళ్ళయితే సెప్టెంబరు వరకూ అమ్మ దగ్గిరే వుండిపోయాను. పిన్నీవాళ్ళ పిల్లలు ఏలూరు వెళ్ళిపోవడంతో రెంట్ తగ్గుతుందని చిక్కడపల్లి మెయిన్ రోడ్డు మీద ఒక మేడమీదకి మారాం. అక్కడ నీళ్ళ ఇబ్బంది. రాత్రీపగలు వాహనశబ్దాలు మరీ భయంకరంగా. మళ్ళీ అక్కడ నుంచి నారాయణగూడా తాజ్ మహల్ ఆపోజిట్ వెదురు బుట్టలు తయారు చేసే వాళ్ళ వెనక వుండే ఇంట్లోకి వెళ్ళాం. అది ఎవరో చెప్పారని వెళ్ళాం. కానీ అందరూ అక్కడవుండలేరు. ఇది నచ్చలేదు.

ఒక నెల రోజులకే బరకత్ పూరా చౌరస్తాకి దగ్గరలో కింద ఇల్లు అన్ని రకాలుగా వీలుగా వుంది. అక్కడికి మార్చేసి, సెప్టెంబరు 10వ తేదీకి నేను సంజీవరెడ్డి నగర్ లో వున్న మా ఇంటికి వెళ్ళిపోయాను.

ఆఫీసుకి నల్లకుంట దగ్గిరే కాబట్టి లంచ్ టైంలో అమ్మ దగ్గిరకి వస్తుండేదాన్ని. అమ్మకి ఇష్టమయిన పెద్ద పెద్ద సీతాఫలాలు, జామకాయలు, అరటిపళ్ళు- ఇంకా కూరగాయలు తెచ్చి ఇస్తుండేదాన్ని. ఒకరోజు నేను వెళ్ళడం లేటయింది. అమ్మ అప్పుడే అన్నం పెట్టుకుని తింటోంది.

“ఏంటమ్మా ఇంకా తినలేదు” అంటే, “నువ్వొస్తావని కూచున్నాను. నువ్వు రాలేదని ఇప్పుడే తింటున్నాను” అంది ఆ మాటల్లో నన్ను మిస్సవుతున్న బెంగ బాగా కనిపించింది. నాకు తల్చుకుంటే కళ్ళనీళ్లు వస్తాయి. అమ్మకి అన్నీ అమర్చిపెట్టేదాన్ని. అమ్మ దేనికైనా తిట్టినా పట్టించుకునేదాన్నికాదు.

నేను మళ్ళీ ఆఫీసుకి వెళ్ళేటప్పుడు “ఒక వారం వచ్చి వుంటావా... దీపావళి వస్తోందికదా... అక్కలు వాళ్ళ పిల్లలు వస్తారు. జానకిరాంకి నేను చెప్పానని చెప్పు” అంది.

“సరే అమ్మా!” అని ఆఫీసుకి వెళ్ళిపోయాను. రోజూ లంచ్ టైంలో మాత్రం అమ్మ దగ్గిరకి వెళ్ళేదాన్ని. వెడుతూ వెడుతూ పళ్ళో, కూరలో ఏవో ఒకటి తీసుకుని వెళ్ళి ఇచ్చేదాన్ని.


17, ఆగస్టు 2022, బుధవారం

కొత్త జీవితానికి నాంది - 41 *** పెళ్ళి హాలుకి తరలి వెళ్ళాం ***

కొత్త జీవితానికి నాంది - 41   *** పెళ్ళి హాలుకి తరలి వెళ్ళాం ***


19వ తేదీ వచ్చేసింది. పొద్దున్న పురోహితుడు వచ్చి, పెళ్ళికి కావలసినవి అన్నీ ఉన్నాయో లేదో చూసుకున్నాడు. ఓ సమస్య తీరింది. సాయంత్రం 6 గం.లకి వచ్చేస్తానని చెప్పాడు. అందరం మధ్యాహ్నం ఇంట్లోనే భోజనాలు కానిచ్చుకున్నాం. హాలు వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల నుంచీ ఇస్తానన్నాడు, ఇంటికి 2 కి.మీ. దూరం కాబట్టి అంత హడావుడి లేకపోయింది. (ఆ హాలు దగ్గర ఓ ఫోటో తీసుకుందామంటే పడగొట్టి అపార్ట్ మెంట్ కట్టారు).






మూడు గంటలకి రాములు ఆఫీసు van, వేరే డ్రైవర్ తో ఒక కారు తీసుకుని వచ్చాడు. సామానంతా van లో తరలించి, వెనక మేమందరం వెళ్ళాం. అప్పటికీ వంటవాళ్ళ ఆచూకీ లేదు. అప్పటికప్పుడు భోజనాల ఏర్పాటు ఎలా చెయ్యాలనే తర్జనభర్జన. అసలు సంగతి వాళ్ళు చాలా తొందరగా చెయ్యగలరుట. సాయంత్రం 5 గంటలకి రావచ్చని వాళ్ళే తీర్మానించుకున్నారుట. ఏం విన్నారో ఏమో.... మొత్తానికి 5 గంటలకి వచ్చారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. ఎక్కువ డబ్బు వ్యవహారాలు చూసుకున్నది నేను, పెద్దక్క కాబట్టే ఈ హడావుడి మాకు ఎక్కువయింది.

మాకు ఇచ్చిన రూమ్ లో అంతా సద్దేసుకుని, ఇంక కార్యక్రమాలకి రెడీ అవుతున్నాం. ఇంతలోకే నా పెళ్ళికి అసలు పెద్ద, నాకు కాబోయే ఆడబడుచు (నండూరి రామమోహనరావుగారి కోడలు ఇందిర) కుటుంబం స్టేషన్ నుంచి డైరెక్ట్ వచ్చారు. చంటిపిల్లలతో వచ్చిన వాళ్ళకి కాఫీ, టిఫిను కూడా వెంటనే అందించలేకపోయాం. ఎటువంటి కోపతాపాలు లేకుండా వాళ్ళు మాకు బాగా సహకరించారు.

సాయంత్రం 6.30 గంటలకి పురోహితుడు వచ్చాడు. మంగళ స్నానాలు అయ్యాక నన్ను గౌరీ పూజ దగ్గర కూర్చోపెట్టే కార్యక్రమానికి హడావుడి పడుతున్నాడు.

మగపెళ్ళివారు 6 గంటలకే వస్తామన్నవాళ్ళు 7 గంటలయినా రాకపోతే ఏమయ్యిందో అర్థం కాలేదు. మళ్ళీ ఇదో టెన్షనా అనుకున్నా. ఎవ్వరికీ సెల్ ఫోన్ లు లేవు. *** పురోహితుడు రాకపోతే దండలు మార్చకుందాం అనుకున్నాం. మరి పెళ్ళికొడుకు రాకపోతేనో...*** నాకే నవ్వొచ్చింది. అదేంటో అసలు భయమే లేదు. నేను ఆ సిట్యుయేషన్ ఊహించుకుంటూ... మా అమ్మ వంక చూశాను. అమ్మ చాలా రోజులకి చూసిన తన వాళ్ళని హడావుడిగా పలకరించుకుంటూ సంబరపడిపోతోంది. ఈ విషయమే పట్టినట్టు లేదు. పెద్దమ్మాయి అన్నీ చూసుకుంటుందిలే అని ధీమా... నా మొహాన్ని చూసి చదివినట్టు పురోహితుడు “అమ్మా నాగలక్ష్మీ... అవన్నీ వాళ్ళు చూసుకుంటారు నువ్వు ఇటువైపు తిరుగు” పెళ్ళి బ్రహ్మాండగా అవుతుంది అన్నాడు. జరుగుతున్న కథ నా వైపు చూసి వెక్కిరింతగా నవ్వింది.

వాళ్ళకి దిల్ సుక్ నగర్ నుంచి విద్యానగర్ కి దగ్గర దారి వుంది. వాళ్ళు పావుగంటలో చేరిపోవచ్చు. అందరూ హడావుడి పడుతున్నారు - *** పెళ్ళికొడుకు వచ్చాడు, వచ్చాడు అని.*** అందరినీ లోపలకి ఆహ్వానించారు. ఇంతకీ అసలు సంగతి ఏంటయ్యా అంటే పెళ్ళికొడుకుకి అప్పటి వరకూ వడుగు అవలేదు కాబట్టి, పొద్దున్న వడుగు కార్యక్రమం చేసుకుని, భోజనాలు చేసి, విశ్రాంతి తీసుకుని వచ్చారు.

***
*** మళ్ళీ కథకి హుషారొచ్చింది. నవ్వుకుంటూ రంగంలోకి దిగిపోయింది. పెళ్ళి హడావుడిలో పడిపోయింది***
***

కాశీయాత్ర హడావుడిగా పూర్తి చేశారు. వాళ్ళు లేటుగా వచ్చారు కదా... మొత్తానికి పెళ్ళికొడుకుని పీటల మీద కూర్చోపెట్టారు. ఇంక పెళ్ళి కార్యక్రమం మొదలైంది.

మెల్లిమెల్లిగా హాలంతా జనాలతో నిండిపోయింది. మేము ప్రింట్ చేయించిన కార్డులు ఇద్దరివీ కలిపి 200. వచ్చినవాళ్ళు 300 పైనే. పెద్దక్క వైపు బంధువులు, అమ్మ వైపు బంధువులు, పెళ్ళికొడుకు బంధువులు, రెండో అక్క స్టేట్ బ్యాంక్ స్టాఫ్, మాకు తెలిసిన స్నేహితులు – వీళ్ళందరూ కాకుండా మా ఆఫీసు వాళ్ళు. ఆఫీసు వాళ్ళే కాకుండా, నేను పిలిచిన విజయపాల్ గారి కుటుంబం, బంధువర్గమంతా పెళ్ళికి వచ్చారు. విజయపాల్ (మా బాస్) గారి అమ్మగారు, శ్రీమతి కృష్ణగారు నాకు బట్టలు స్వీట్స్ ఇచ్చి వెళ్ళారు.

ముహూర్తం దగ్గరపడుతుండగా మేనమామలు నన్ను బుట్టలో కూర్చోపెట్టి పెళ్ళి మంటపంలోకి తీసుకెళ్ళారు.

పక్కగా నిలబడిన జానకిరాం గారి స్నేహితులు మీదకి వంగి - “జానకిరాం అమ్మాయిని బాగా సెలక్ట్ చేసుకున్నావ్. లవ్ మేరేజ్ బాగానే చేసుకుంటున్నావుగా....” అన్నారు. అందరి ఎదురుగా అలా అనేసరికి ఒక్కసారి గాభరాపడిన ఆయన - అసలే అన్నలంటే గౌరవం, భయం వింటే ఏమనుకుంటారో... వాళ్ళు కుదిర్చిన పెళ్ళే అయినా కూడా... ఫ్రెండ్స్ ని వెనక్కి పొమ్మని మళ్ళీ కార్యక్రమాల్లోకి వచ్చారు.

జీలకర్ర బెల్లం సరిగ్గా 9.20 ని.లకి పెట్టించారు. తర్వాత మంగళసూత్రధారణ, కన్యాదానం, తలంబ్రాలు అన్నీ యథావిధిగా జరిగిపోయాయి. *** అమ్మ మొహంలో అమ్మయ్య పెళ్ళయిపోయిందని ఆనందం.*** ఒక పక్కన భోజనాల కార్యక్రమం మొదలుపెట్టేశారు. లేటయిపోతుందని. ఒక్కొక్కళ్ళూ మమ్మల్ని పలకరించి వాళ్ళివ్వవలసినవి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు.

బ్రాహ్మడు నాగవల్లి కార్యక్రమం కానిచ్చేసరికి రాత్రి 11 అయ్యింది. అప్పుడు మా ఇద్దరికీ భోజనాలు పెట్టారు. ఇంకా భోజనాలకి వచ్చేవాళ్ళు వస్తుానే వున్నారు. తరవాత చెప్పారు ఒక్కోళ్ళకి వడ్డించేసరికి నడుములు పడిపోయాయని. వంటవాళ్ళు వండినవాళ్ళు వండినట్టున్నారని. 300ల పైన వచ్చిన వాళ్ళకి భోజనాలు అంటే మామూలా.. బహుశ హాలు రోడ్డు మీద వుండడంతో రోడ్డు మీద వాళ్ళు కూడా వచ్చి వుండచ్చు. అసలు హైలైట్ ఏమిటంటే విజయపాల్ గారి కుటుంబం, బంధువర్గం కూడా అందరితోబాటు కింద కూచుని, వడ్డిస్తుంటే భోజనం చేసి వెళ్ళారు.

ఆ రోజు శుక్రవారం కావడంతో 12 గంటలవరకు కూచుని అప్పగింత కార్యక్రమం పూర్తిచేశారు. ఏమిటో ఏడుపే రాలేదు. నాకు ఏడుపు రావడం చాలా తక్కువ. పెళ్ళయ్యింది చాలనుకున్న అమ్మ కూడా ఏడవలేదు. (నాకు మా అమ్మాయి పెళ్ళిలో మాత్రం కళ్ళనీళ్ళు బొటబొటా వచ్చేశాయి.)

మొత్తానికి పెళ్ళి కార్యక్రమం సుఖాంతం అయ్యింది. నాకు సముద్రమంటే ఇష్టం. అది చూడాలంటే మద్రాసు వాళ్ళని పెళ్లి చేసుకుంటే సరి అనుకున్నాను. ఏంటో ఆ ఆలోచన. మొత్తానికి మా అత్తగారూ వాళ్ళు మద్రాసులో సెటిల్ అయిన తెలుగువాళ్ళు.

***

వాటర్ వర్క్స్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేస్తున్న మా బావగారు రాజేశ్వరరావుగారు అందరినీ ఆఫీసు జీపులో అలకాపురిలో ఉన్న వాళ్ళింటికి తీసుకుని వెళ్ళారు. రాత్రి 1.30 అయ్యింది. మర్నాడు సత్యనారాయణ వ్రతం.

పొద్దున్న వ్రతం అయి, భోజనాలు అయ్యాక అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం.

13, ఆగస్టు 2022, శనివారం

కొత్త జీవితానికి నాంది - 40 నాకు చిక్కిన పెళ్ళికొడుకు ఫోటో.

కొత్త జీవితానికి నాంది - 40

*** నాకు చిక్కిన పెళ్ళికొడుకు ఫోటో. ఇక ఊహలు గుసగుసలాడే .... నా హృదయము ఊగిసలాడే... ***



కానీ అప్పుడప్పుడే చూసేదాన్ని ఆఫీసు ఎన్నో పనులున్నాయికదా.... నాకు ఫోటో అక్కరలేదు. ఫోటో ఉంటే నా పనులన్నీ ఆగిపోతాయి అన్నారు. చూడాలంటే నేనే వస్తా... అనుకుంటూ... మళ్ళీ దగ్గిరకి వస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని. నేను బస్ ఎక్కేటప్పుడు అవతలి రోడ్డులో నుంచుని చూసి ఆనందించేవారు. ఇద్దరికీ చెయ్యి ఊపుకోవాలన్నా భయమే... ఏంటో ఆ రోజులు. లేకపోతే ఇంటికి వచ్చి అమ్మ పెట్టిన భోజనం చేసి వెళ్ళిపోతుంటే... నేను మేడమీంచీ బస్ స్టాప్ లో నుంచున్న ఆయన్ని వెనక నుంచీ చూసేదాన్ని.

*** ముహూర్తం పెట్టుకోవడానికి వేళయ్యింది ***
*** శుభలేఖల హడావుడి ***

జూన్ 3వ తేదీన (1987) ఫైనల్ గా అన్ని మాటలూ అయ్యాయి. *** జూన్ 19వ తేదీన రాత్రి 9.20 ని.*** లకి పెళ్ళి ముహూర్తం పెట్టారు. అస్సలు టైము లేదు. అంతా హడావుడి హడావుడి అవుతోంది. మ్యారేజ్ హాల్ బుక్ చెయ్యాలని అనుకున్నాం. ఎన్నిచోట్లకి తిరిగినా హాలు దొరకలేదు. ఇంచుమించు ఒక 20 హాల్స్ తిరిగాం. అన్నీ ముందరే బుక్ అయిపోయాయి. 19వ తేదీ చాలా పెళ్ళిళ్ళు వున్నాయి. హాలు బుక్కవ్వందే కార్డులు ప్రింట్ చెయ్యలేం.

నేనయితే ఏదో ఒక గుళ్ళోనో, లేకపోతే మేముండే ఇంటి మేడమీదో పెళ్ళి కానిచ్చేద్దామని చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. పెళ్ళికొడుకు పెద్ద అన్నయ్యగారు అలకాపురిలో ఉన్న వాళ్ళింటిదగ్గర చేద్దామని చెప్పారు. కానీ ఇంకా అప్పటికి ఆ ఏరియా అంత డెవలప్ అవ్వలేదు. వీళ్ళిల్లు తప్ప చుట్టుపక్కల ఏమీ లేవు. రాత్రి 9.20కి ముహూర్తం అంటే ఎవరు రావాలన్నా కష్టమే. ఆటోలు కూడా అంతంత మాత్రంగానే వుండేవి. అందుకని అది వద్దనుకున్నాం.

మా అమ్మ సంత్ నిరంకారి సత్సంగ్ వాళ్ళు తాడేపల్లి గూడెం వచ్చారు. వాళ్ళు లకడీకాపూల్ లో వుంటారుట. నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంది. సరే అని అమ్మని అక్కడికి తీసుకుని వెళ్ళాను. లకడీకాపూల్ సెంటర్ లో ఉన్న అతి పెద్ద భవనం వాళ్ళది. కానీ చుట్టూరా చాలా ఖాళీస్థలం వుంది. అమ్మ అక్కడ అమ్మకి పరిచయం అయిన వాళ్ళు కనిపించారు. వాళ్ళతో మాట్లాడి వచ్చేసేముందు. “ఇంత చోటుంది కదా... మా అమ్మాయి పెళ్ళి ఇక్కడ చేసుకుంటాం” అంది. అమ్మ తాపత్రయం అమ్మది. వాళ్ళు బాగానే వుంటుంది. మీరు ఒక్క పైసా ఇవ్వక్కరలేదు. కానీ నీళ్ళతో సహా అన్నీ తెచ్చుకోవాలి అన్నారు. అవన్నీ కష్టం అనుకున్నాం.

మొత్తానికి కాళ్ళు అరిగిపోయేలా తిరిగాం – చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టయ్యింది. మొత్తానికి విద్యానగర్ లో ***హిమాయత్ పంక్షన్ హాల్ *** దొరికింది. హాలు రోడ్డుమీదకే వుంది. ఫంక్షన్ హాల్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడి మొత్తం 200 మంది వస్తారు అని మేము అనుకున్నాం. ఎంత తక్కువ ఖర్చు అయితే అంత మంచిదని అక్కడ మాకు కావలసినవి వీలైనంత తక్కువ తీసుకున్నాం. మా తర్వాత చాలామంది వచ్చారు. కానీ వాళ్ళు మాకే ఇచ్చారు. నల్లకుంట నుంచి విద్యానగర్ 2 కిలోమీటర్ల దూరం వుందంతే. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం.

హాలు బుక్కయిపోయింది కదా... విజయపాల్ గారికి చెప్పాను. వెడ్డింగ్ కార్డు నాకు ఆఫీసులోనే ప్రింట్ చేసి ఇవ్వమన్నాను. ఎన్ని కావాలి అన్నారు. వంద అన్నాను. ఆశ్చర్యపోయారు. అసలు సిటీలో కార్డులు ఎక్కడ ప్రింట్ చేస్తారో తెలియదు. హైదరాబాద్ లో పెళ్ళి చెయ్యడం అదే మొదలు. సాయంత్రం మిస్టర్ పెళ్ళికొడుకు గారు వచ్చి మీరు కార్డులు ఎక్కడ ప్రింట్ చేయిస్తున్నారు అన్నారు. నేను చెప్పాను. అయితే మాకూ ఒక 100 చేయించండి అన్నారు. నాకే చెప్పడం ఆశ్చర్యం అనిపించినా సరే అన్నాను. మళ్ళీ ఆఫీసులో ఇంకోవంద వాళ్ళకి అని చెప్పాను.

రాములు నన్ను కారులో మేడ్చల్ లో ఉన్న మా ఆఫీసు ప్రింటింగ్ ప్రెస్ కి తీసుకెళ్ళాడు. అప్పట్లో కలర్ ప్రింటింగ్ చేసే మిషన్లు కొత్తగా వచ్చాయి. ఆ చివర నుంచి ఈ చివర దాకా ఉన్న ఆ మిషన్ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఫోర్ కలర్స్ ఎలా ప్రింట్ చేస్తారు, టు కలర్స్ ఎలా ప్రింట్ చేస్తారో చూసి తెలుసుకున్నాను. అంతేకాకుండా కటింగ్ మెషిన్ మీద పేపరు కట్ చేసేటప్పుడు మన నీడ పడినా అది కట్ చెయ్యకుండా ఆగిపోతుంది. అంటే ఎవరికీ ఏ ప్రమాదం జరగకుండా అంత టెక్నాలజీ అది. నన్ను ఓ విఐపిని చూసినట్టు చూశారు.

నన్ను మొత్తం అంతా తిరిగి ఆ మెషనరీ అంతా చూసి వచ్చేలోపున వాళ్ళు కార్డులు రెడీ పెట్టారు. మాకు భోజనం ఏర్పాట్లు చేశారు. తినేసి, కార్డులు తీసుకుని ఇంటికి వచ్చాం.

తెలిసిన వాళ్ళు ఒంగోలులో మా చుట్టాలాయన పెళ్ళి చేస్తారు ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే వున్నారు అన్నారు. ఆయనని పెళ్ళిచెయ్యడానికి మాట్లాడి వచ్చాం. పెళ్ళిరోజు పొద్దుటికి వస్తానని ఆయన ఒంగోలు వెళ్లిపోయారు. అక్కావాళ్ళతో అన్ని విషయాలు చాలా వివరంగా మాట్లాడారు. వంటమనిషిని కూడా మాట్లాడారు. బఫే అయితే ఆనందంగా వుండదని వడ్డన మాట్లాడారు. వంటవాళ్ళు వంటవరకే చేస్తామన్నారు.

ఇక పెళ్ళిఎలాజరిగిందో రేపు

5, ఆగస్టు 2022, శుక్రవారం

ఎదురీతలో నేను - 39 *** పెళ్ళి చూపులకి వారొచ్చారు... ***

ఎదురీతలో నేను - 39  *** పెళ్ళి చూపులకి వారొచ్చారు... *** 


***అసలు పెళ్ళికొడుకుని ఆ రోజు మిస్సయ్యాం కదా...!***

పెద్దవాళ్ళందరి ఇంటర్య్వూ అయ్యింది. అమ్మ, నేను, అక్క ఇంటికి తిరిగి వచ్చేశాం. అమ్మ అక్కడ కొత్తగా ఫీలయినా అందరూ బాగా మాట్లాడారని, అమ్మయ్య కూతురికి పెళ్ళి కుదిరిందని సంతోషించింది. నాకు పెళ్ళవదనే అమ్మ భయాలన్నీ పటాపంచలయ్యాయి.

అక్క విజయవాడ వెళ్ళిపోయి పెళ్ళికొడుకు జానకిరాంకి ఉత్తరం రాస్తూ.... నా ఆఫీసు అడ్రస్ ఇచ్చింది. వచ్చే ఆదివారం నల్లకుంటలో మా ఇంట్లో కలుద్దాం అని ఆ అడ్రస్ కూడా ఇచ్చింది.

ఒకరోజు నేను వర్కులో వుండగా సాయంత్రం నాలుగు గంటలకి మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పారు. బయటికి వచ్చి చూస్తే - కాబోయే పెళ్ళికొడుకు జానకి రామ్ వచ్చి వున్నారు. ఒక్క ఐదు నిమిషాలు కూచుని వూరికే కలుద్దామని వచ్చాను. కింద మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు అని వెళ్ళిపోయారు. ఇంకేం మాట్లాడే అవకాశం లేదు. నాకు విచిత్రంగా అనిపించింది. సరేలే మొహాలు చూసుకున్నాం కదా.. అనుకున్నాను. ఫర్వాలేదు చూడ్డానికి బాగానే వున్నారు. ఇంక నా వర్కు హడావిడిలో నేను పడ్డాను. ఊహించుకుని కాసేపు కలలు కందామంటే మొహమే గుర్తులేదు. సరేలే ఆదివారం చూస్తాను కదా అనుకున్నాను.

మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న జానకిరాం గారి MTAR Technologies Ltd. (Machine Tool Aids and Reconditioning) శనివారం అక్క, బావగారు ఆఫీసుకి వెళ్ళారు. ఎవరో వచ్చారని చెప్తే బయటికి వచ్చి, వీళ్ళతో మాట్లాడి ఆదివారం సాయంత్రం వస్తానని చెప్పారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకి పెళ్ళికొడుకు జానకిరాం గారు అసలు సిసలైన పెళ్ళిచూపులకి మా ఇంటికి వచ్చారు. అక్క కాఫీ, స్నాక్స్ ఇచ్చి, మాట్లాడుతూ వుండమని చెప్పి వంట ప్రయత్నాలలోకి వెళ్ళిపోయింది.

నా గురించి సమాచారం అంతా వెళ్ళిపోయింది కాబట్టి – పేరేమి? చదువేమి? ననుప్రేమిస్తావా? వయసెంత? - అని అడగలేదు. ఇంక పెళ్ళి చేసుకున్నాక ప్రేమించకపోతే బావుండదు కదా... !

ఆయనే వాళ్ళ ఆఫీసులో షిఫ్ట్ డ్యూటీస్ వుంటాయని చెప్పారు. తను చేసే ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ గురించి చెప్పడం మొదలుపెట్టారు - *** శ్రీహరి కోట నుంచి పంపించే రాకెట్ల మెయిన్ పార్ట్ వికాస్ ఇంజన్ *** వీళ్ళ ఆఫీసులోనే తయారు చేస్తారు. అవి ఒక్క మిల్లీమీటర్ తేడా వచ్చినా రిజెక్ట్ చేస్తారు. శ్రీహరికోట ఇస్రో నుంచి ఇన్స్ పెక్టర్స్ హైదరాబాద్ లోనే వుండి పార్ట్ తయారయ్యేలోపున ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుండేవారు. ఆ పార్టు పంపించేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు, దాన్ని ఎలా పంపిస్తారో.... ఇవన్నీ ఇమోషనల్ గా చెప్పుకుంటూ వెళ్ళుతున్నారు. అది ఒక ఆశ్చర్యకరమైన విషయమే. ఆ టెక్నాలజీ చాలా గొప్పగా వుంది. సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువే. రాకెట్ స్పేస్ లోకి పంపించినప్పుడు వికాస్ ఇంజన్ ని ముందర వదిలేస్తుంది. వీళ్ళందరూ పడే ఆనందం గురించి కూడా చాలా ఇమోషనల్ గా చెప్పారు.





వాళ్ళ అక్క చెల్లెళ్ళవి, అన్నదమ్ములవి, అమ్మగారివి ఫోటోలన్నీ చూపించారు. ఈయనకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇష్టం. వీళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి సికింద్రాబాద్ లో ఒకచోట నేర్చుకుని, హైదరాబాద్ రేడియోస్టేషన్ లో రెండుమూడుసార్లు ప్రోగ్రాం ఇచ్చారు. ఏ ప్రోగ్రాం మిస్సవకుండా వెడతామనీ చెప్పారు. ABBA గ్రూప్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ABBA గ్రూప్ సింగర్స్ తో ప్రోగ్రాం చేస్తోందని తెలిసి సంతోషించారు. (ఈయన వెస్ట్ర్ న్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఒక ఛాప్టర్ రాయాలి. అది ఇప్పుడు అవదు.)

చిత్తూరు జిల్లా నారాయణవనంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పాడేపాటలు ఏమేమి ఇష్టమో చెప్పారు. వాళ్ళు ఎలా పాడేవారో చెప్పారు. తను నేర్చుకున్న పాటలు తర్వాత పాడి వినిపిస్తానన్నారు. ఇవన్నీ మాట్లాడుకునేలోపున అక్క వంట పూర్తి చేసింది. భోజనం చేసి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయారు.
నన్ను ఏదైనా పార్కుకి వెడదామని అడుగుదామనుకుని మళ్ళీ ఇంత చనువేమిటని అనుకుంటామని అడగలేదని తరవాత మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. పెళ్ళి గురించి చెప్తే ఫ్రెండ్స్ మాత్రం ప్రేమించి పెళ్ళిచేసుకుంటున్నాం అనుకున్నారుట. లేదు తర్వాత ప్రేమించుకుంటాం అని చెప్పారుట.
ఇంక వాళ్ళన్నగార్లు, మా అమ్మావాళ్లు పెళ్ళి ముహూర్తాల హడావిడిలో పడ్డారు. ఎట్టకేలకు జూన్ 19వ తేదీన ముహూర్తం ఖరారైంది.

2, ఆగస్టు 2022, మంగళవారం

ఎదురీతలో నేను - 38 *** పెళ్ళి చూపులు - ఐదుసార్లు ఒకే కుటుంబ సభ్యులు***

ఎదురీతలో నేను - 38 *** పెళ్ళి చూపులు - ఐదుసార్లు ఒకే కుటుంబ సభ్యులు***



మా గురువుగారు సత్యనారాయణగారి ఇంటి నుంచి మేమిద్దరం అక్కావాళ్ళ ఇంటికి వచ్చేశాం. వెంటనే సత్యనారాయణగారు “మా పక్కనే వున్న ఇందిర గారూ వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. ఇందిర గారు ***నండూరి రామమోహనరావు*** గారి పెద్ద కోడలు. ఆవిడ, వాళ్ళమ్మగారు మీ చెల్లెలు నాగలక్ష్మిని చూశారు. రేపు సాయంత్రం వాళ్ళు మీతో మాట్లాడడానికి మీ ఇంటికి వస్తున్నారు” అని అక్కతో చెప్పారు.

ఇక అక్క, బావగారు ఒకటే హడావిడి పడిపోయారు. బావగారు నాలుగు రకాల స్వీట్లు, రెండు రకాల హాట్లు పట్టుకుని వచ్చారు. అంటే 1987 ఏప్రిల్ 21 సాయంత్రం 5 గంటలకి నండూరి రామమోహనరావుగారి శ్రీమతి రాజేశ్వరి గారు, వాళ్ళ కోడలు ఇందిర, ఇందిరా వాళ్ళమ్మ లీలావతి గారు, సత్యనారాయణగారి శ్రీమతి కృష్ణగారు వచ్చారు. అప్పటి వరకూ రామమోహనరావుగారి పుస్తకాలు కొన్ని చదివాను. రాజేశ్వరి గారిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. చక్కటి మనిషి, శాంతస్వభావం, పొందికైన మాట. రాజేశ్వరి గారు - “లీలావతమ్మ గారికి మొహమాటం ఎక్కువ. నేనూ అమ్మాయిని చూసినట్టు వుంటుందని వచ్చాను” అని – నన్ను “ఏం చదివావు? ఏం చేస్తున్నావు?” అని అడిగారు. వంట వచ్చా...? అని మాత్రం అడిగారు. పాటలు పాడమని మాత్రం అడగలేదు.

రాజేశ్వరి గారు - లీలావతిగారి ***(నాకు కాబోయే అత్తగారు)*** గారి పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ మద్రాసులో వాళ్ళ మూడో అబ్బాయి దగ్గర వుంటారనీ..., ఇప్పుడు పెళ్ళికావలసిన జానకిరాం హైదరాబాద్ లో ఉన్నాడనీ చెప్పారు. లీలావతి గారికి ***ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం*** చెల్లెలి కొడుకు అవుతారనీ, వీళ్ళూ వాళ్ళూ ఎప్పుడూ కలుస్తూ వుంటారనీ చెప్పారు. అంతే కాకుండా - వీళ్ళ పిల్లలందరూ మంచివాళ్ళు, నెమ్మదస్తులు, మంచికుటుంబం - అని కూడా చెప్పారు. మొత్తానికి ఈరకంగా రెండోసారి పెళ్ళిచూపులు అయ్యాయి.

పెద్దక్క అన్నపూర్ణకి వాళ్ళు బాగా నచ్చేశారు. ఎందుకంటే అంతగొప్ప రచయిత నండూరి రామమోహనరావు గారి కుటుంబంతో బాంధవ్యం ఏర్పడుతోందని సంతోషించింది. అంతేకాకుండా అక్క పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంకికి రామమోహనరావుగారు, వాళ్ళబ్బాయి కృష్ణప్రసాద్ వస్తూండడంతో అక్కకి బాగా పరిచయం. పాటలంటే ఇష్టమైన అక్క లీల గారికి బాలసుబ్రహ్మణ్యం బంధువులు అనేసరికి ఇంకా సంతోషపడింది. ఇంక అబ్బాయిని చూడాలి అనుకుంది.

ఇందిర గారి దగ్గర వాళ్ళ అన్నయ్య జానకిరాం అడ్రస్ తీసుకుని హైదరాబాద్ లో “ఒక ఆదివారం హైదరాబాద్ లో కలుద్దామని” ఉత్తరం రాసింది. ఫోన్లు లేవు కాబట్టి వ్యవహారం అంతా ఉత్తరాల మీదే. నేను హైదరాబాద్ రాగానే ఒకరోజు ఎవరిదో పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. సాయంత్రం 6 గంటలకి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు. వాళ్ళకి వాళ్ళే “మేము జానకిరాం అన్నగార్లం” అని పరిచయం చేసుకున్నారు. పెద్దాయన రాజేశ్వరరావు గారు హైదరాబాద్ వాటర్ వర్క్స్ లో ఎక్జిక్యూటివ్ ఇంజనీరు, రెండో ఆయన హరిప్రసాదరావు గారు రైల్ నిలయంలో సీనియర్ ఆఫీసర్. నాకు వాళ్ళు చెప్పకుండా వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఫోన్లు లేవుగా మరి. కానీ, అందరితో మాట్లాడటం అలవాటు కాబట్టి వాళ్ళు కూడా చేసిన ఇంటర్వ్యూకి సరైన సమాధానాలు ఇచ్చాను. అమ్మకూడా వాళ్ళతో బాగానే మాట్లాడింది. కాఫీ తాగి వాళ్ళు బయల్దేరారు. వాళ్ళ మొహాలు సంతోషంగానే అనిపించాయి. మూడోసారి పెళ్ళిచూపులు అయ్యాయి.

అయితే వెడుతూ వెడుతూ – “మా అమ్మ, తమ్ముడు రఘురాం, మా మరదలు సంధ్యారాణి మద్రాసు నుంచి వచ్చారు. వీళ్ళందరూ అలకాపురిలో మా ఇంట్లోనే ఉన్నారు. మా అమ్మ పెద్దావిడ. ఆవిడ అన్నిచోట్లకి తిరగలేదు” అని మా అమ్మతో చెప్పి, “మీ అమ్మాయి ఆదివారం విజయవాడ నుంచి వస్తుందని చెప్పారుట – మీరు, మీ అమ్మాయి, నాగలక్ష్మి కలిసి మా ఇంటికి రండి. అందరూ మిమ్మల్ని చూసినట్టు వుంటుంది. అందరం అక్కడే మాట్లాడుకుందాం” అన్నారు.
అత్తగారు పెద్దావిడ అంటే అప్పటికి ఆవిడకీ 55 సంవత్సరాలు ఉండచ్చు. ఈ ఆధునిక పద్ధతి మా అమ్మకి మింగుడుపడలేదు, విస్తుపోయింది. పెద్దక్క ఆదివారం వచ్చాక అమ్మ ఇలా అన్నారని చెప్పింది. అక్క ఈ విషయాన్ని వ్యతిరేకించలేదు. *** మా అమ్మమ్మలు, బామ్మలు, తాతగార్లు బ్రహ్మసమాజంలోనూ, హరిజనోద్యమాలలోనూ, స్వాతంత్ర్యోద్యమాల్లోను పాల్గొని, ఆధునిక భావాలు కలవాళ్ళు*** కాబట్టి వాళ్ళ భావాలు వంటబట్టినట్టున్నాయి.

ఆదివారం ముగ్గురం కలిసి ఆటో మాట్లాడుకుని దిల్ సుక్ నగర్ దగ్గరి అలకాపురిలో ఉన్న వాళ్ళింటికి బయల్దేరాం. నల్లకుంట నుంచీ కోఠీ మీదుగా వెళ్ళినప్పుడు ఇప్పటిలాగా అంత ట్రాఫిక్ లేదు.

*** కోఠీలో బడేచౌడీ ప్రాంతం మాత్రమే బట్టలు షాపులు, రకరకాల అలంకరణ వస్తువులు, బ్యాగులు అమ్మే వాళ్ళతో హడావుడిగా వుంది. అక్కడ ఒక చెట్టు కింద కొంతమంది కూరగాయలు పెట్టుకునేవాళ్ళు. ఉసిరికాయలు, మామిడికాయలు, వాక్కాయలు, ఇంకా కొన్ని స్పెషల్ కూరగాయలు సీజన్ లేకపోయినా అక్కడ మాత్రమే దొరికేవి. కొత్తిమీర, మెంతికూర పెద్ద పెద్ద కట్టలు తక్కువరేటుకి దొరికేవి. అక్కడ ఒక పానీపూరీ బండీ వుండేది. చాలా బావుండేది. అది తినడానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఏం కొనుక్కోవాల్సినా అక్కడికే ***

మొత్తానికి దిల్ సుక్ నగర్ చేరాం. ఇప్పటి అంత హడావిడి లేదు. అటో బస్ స్టాప్, ఇటో బస్ స్టాప్ ఉన్నాయి. అలకాపురి వైపు టర్న్ అయి అటూ ఇటూ ఏమీలేని ఆ ఖాళీ రోడ్ల మీద లోపలికి వెళ్ళాం. అలకాపురిలో అప్పట్లో వాళ్లిల్లు తప్ప చుట్టుపక్కల అంతా ఖాళీ స్థలాలే. ఆటోని రానూ పోనూ మాట్లాడుకున్నాం. అమ్మ వయసు అప్పటికి 53 సంవత్సరాలే అయినా... అమ్మకి బస్సులు అలవాటు లేదు, దూరం కాబట్టి అమ్మని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. మొత్తానికి వాళ్ళిల్లు చేరాం. చాలా పెద్ద ఇల్లు.
వాళ్ళు మర్యాదలు బాగానే చేశారు. మాకు కొత్తేమీ అనిపించలేదు. కాబోయే అత్తగారు లీలావతిగారు నన్ను విజయవాడలో చూసి నేనెలా వున్నానో వర్ణించి చెప్పారుట. అందరూ అప్పుడు డైరెక్ట్ గా చూశారు. నాకు కాబోయే తోటికోడలు సంధ్యారాణికి కూడా బాలసుబ్రహ్మణ్యం కజిన్ అవుతారని తెలిసింది. ఇన్ని మాట్లాడుకున్నా మొత్తానికి అసలు పెళ్ళికొడుకు రాలేదు. కొంచెం సేపు వెయిట్ చెయ్యమన్నారు. ఆయన రావాలంటే బాల నగర్ నుంచి రావాలి అన్నారు. కాసేపు కూచున్నాం కానీ, రాలేదు. ఇలా నాలుగో పెళ్ళి చూపులు.

వాళ్ళు ఏవో పెళ్ళి విషయాలు, ఖర్చుల గురించి మాట్లాడారు. ముహూర్తం పెట్టిస్తామని చెప్పారు. అబ్బాయిని మళ్ళీ కలుద్దురుగాని, లేకపోతే మీ ఇంటికి రమ్మని చెప్తాం అన్నారు.