27, సెప్టెంబర్ 2020, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 3

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు -3


ఏలేటి పాడులో పెళ్ళి


1975లో అమ్మ మేనమామ పట్టెయ్యశాస్త్రులుగారి అమ్మాయి రత్నం పెళ్ళికి నేను అక్కలిద్దరూ వెళ్ళాం. ఇంకా చదువుకుంటున్న రోజులు. పల్లెటూళ్ళలో పెళ్ళి చూద్దామని వెళ్ళాం.


మా అమ్మ పుట్టిన ఇంట్లోనే ఆ పెళ్ళి జరిగింది. 

ఇప్పటిలాగా ఆర్భాటాలు లేవు. ఆర్టిఫిషియల్ పెళ్ళి కాదు.   

వూళ్ళో వున్న జనాభాలో చాలా మంది వీళ్ళ బంధువులే అవడంతో అందరూ పెళ్ళికి వచ్చారు. అదో నిండుతనం.


పెళ్లంటే తాటాకు పందిళ్లు.. మామిడాకుల తోరణాలు.. అరిటాకుల భోజనాలు.. కొసరికొసరి వడ్డింపులు.. ఆత్మీయ పలకరింపులు... అనుబంధాలు ఆప్యాయతలు


ఇంటిముందర చక్కటి తాటాకు పందిరి. దానికి వూగిసలాడుతున్న మామిడి తోరణాలు. పందిరి గుంజలకి వచ్చేవారిని ఆహ్వానిస్తున్నట్లు చేతులు చాస్తున్న పచ్చటి కొబ్బరి ఆకులు, గెలలతో అందంగా అరటి చెట్లు. ఇంటిముందు చక్కటి సన్నాయి వాయిద్యం. 


చక్కటి లంగా వోణీల్లో, పొడవైన జడలు, జడనిండా పువ్వులతో కిలకిలలాడుతూ తిరుగుతున్న ఆడపిల్లలు. మొహమంతా నిండుతనం - పెద్దరికం ఉట్టిపడే చీరలతో, పంచెలతో హుందాతనంతో పెద్దవాళ్ళు.


ముందురోజు ఇంటి మేడమీడ ఆకాశాన్ని చూస్తూ చుక్కలు లెక్కపెడుతూ, ఉండి ఉండి శరీరాన్ని తాకుతున్న చల్లగాలి ఆటలని ఆస్వాదిస్తూ, పెళ్ళివాళ్ళ హడావుడి కబుర్లు వింటూ పడుకున్నాం. ఎప్పుడు నిద్రపట్టిందో… మళ్ళీ హడావుడి వినిపిస్తే లేచి చూసేసరికి తెల్లవారగట్ల 3.30కి ముహూర్తం అని రెడీ అవుతున్నారు. 


మేమూ లేచి రెడీ అయి పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి జరుగుతూనే వుంది. మాకేమో నిద్ర. మా మూడో అక్క ఉమ అయితే కాఫీ కావాలని అడిగింది. ఇప్పటిలాగా గ్యాస్ స్టౌవ్ లు కాదు. మొత్తానికి నాలుగు గంటలకి వంటవాళ్ళు వచ్చి అందరికీ చక్కగా బంగారంలా మెరుస్తున్న ఇత్తడి గ్లాసులలో చిక్కటి కాఫీ అందించారు. 


పెళ్ళి అవగానే ఇప్పటిలాగా టిఫిన్లు, తర్వాత భోజనాలు కాదు. ఇంకోసారి కాఫీ అందించారు. పొద్దున్న పదిగంటలకల్లా - బూరెలు, పులిహోర, ముద్దపప్పు, వంకాయి కూర, పనసపొట్టు కూర, ముక్కల పులుసు, కమ్మటి పెరుగు.  ఆ పెళ్ళి ఆనందంగా అలా జరిగింది. అదో చక్కని అనుభూతి. 










23, సెప్టెంబర్ 2020, బుధవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు 2వ భాగం


 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు -2


విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) అనే రాజు అధీనంలో క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి  అనే  ఒక పెద్దమనిషి  సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. వాటిలో ఏలేటిపాడు కూడా వుండేదిట. 


ఇక్కడ కొన్ని శతాబ్దాల కిందటి శివాలయం కూడా వుంది. అమ్మ వాళ్ళు ఆ గుడి ప్రాంగణంలో ఆడుకుంటూ వుండేవాళ్ళమని చెప్పింది. 


అదిగో ఆ ఫోటోలో వున్న ఇల్లు మా అమ్మ పుట్టిన ఇల్లు. 

అనురాగాల లోగిలి

మా  అమ్మావాళ్ళ అమ్మ అమ్మ పుట్టిన ఏడాదికే చనిపోతే అమ్మని మేనమామలు అపురూపంగా పెంచారు.  అసలు ఎవరూ కింద దింపేవారు కాదుట. వాళ్ళ ఆప్యాయతల గురించి అమ్మ చెప్తుంటేే కడుపు నిండిపోయేది. 


అమ్మ ఒక జోలపాట పాడేది…

“అమ్మాయి మామల్లు ఎటువంటి వారూ… అంచుపంచెల వారు అంగీల వారూ…” అని నిజంగానే అలాగే వుండేవారు. 


ఆ ఇంటి ఆరుగుల మీద అమ్మావాళ్ళు ఏ సీజన్ లో పువ్వులు ఆ సీజన్ లో అరుగుల మీద పోసుకుని దండలు కట్టి జడల్లో పెట్టుకునేవారట. అమ్మ ఆ దృశ్యాలు వర్ణిస్తుంటే కళ్ళకి కట్టినట్లు వుండేది. అందరికి ఇంటి వెనక పెద్ద పెద్ద స్థలాలు వుండడంతో రకరకాల పువ్వుల చెట్లు పెంటుకునేవారు. 


మాకు ఒకసారి అమ్మ మేనమామ పట్టెయ్య శాస్త్రులుగారు, అత్త వెంకాయమ్మగార్ల ఆప్యాయతని పొందే అవకాశం వచ్చింది.  ఆ ఇంట్లో అడుగుపెట్టే అదృష్టం కూడా వచ్చింది. నేను, మా చెల్లెలు ప్రభావతి ఒకసారి వెళ్ళాం. మమ్మల్ని ఎంతో బాగా ఆదరించి, మా ఇద్దరికీ చక్కగా పీట వేసి వెండి కంచాల్లో వేయించిన కందిపప్పుతో చేసిన పప్పు. గుమ్మడి వడియాలు, మంచి పాడి నెయ్యి, వంకాయకూర, ఘుమఘుమలాడే ఇంగువ చారు, గడ్డపెరుగుతో భోజనం పెట్టారు. ఆ రుచి ఇప్పటికీ మరిచిపోలేం. ఆప్యాయత మరుగుపడే అవకాశమే లేదు. 


జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 2

 















20, సెప్టెంబర్ 2020, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు -1










మా అమ్మాయి వీణ ఎమ్మెస్ చెయ్యడానికి ఆస్ట్రేలియా వెళ్ళేముందు సకుటుంబ సమేతంగా ఒక పది రోజులు యాంత్రిక జీవితాన్ని పక్కన పెట్టి గోదావరి జిల్లాల పర్యటనకి వెళ్ళాం. వాళ్ళు ఏ పల్లెటూరు చూడలేదు.
మా ఈ పర్యటనలో…
చిన్నప్పుడు మేము తిరిగిన ఊళ్ళు, మా మధుర జ్ఞాపకాల ఆనవాళ్ళు చూపించాను.
వాళ్ళ వయసుని మర్చిపోయి పసిపిల్లల్లా ఆడారు, తిరిగారు. మాతోబాటు వాళ్ళ ఫ్రెండ్ శ్యామ్ కూడా వచ్చాడు. ఇలాంటి పర్యటనలు కూడా వుండాలేమో అనిపించింది.
మొదటగా మా అమ్మ పుట్టిన వూరు గురించి చెప్తాను. ఈ ఊళ్లో చాలా జ్ఞాపకాలున్నాయి.
ఊరు చిన్నదే వెళ్ళేదారి మాత్రం ప్రశాంతంగా పారుతున్న కాలువ. కాలువకి కాలువ గట్టుమీద పెద్దపెద్ద పచ్చని చెట్లు కాలువ మీదకి వంగి కాలువతో కబుర్లు చెబుతూ... గాలికి అటూ ఇటూ వూగుతూ కాలువని స్పృశిస్తూ... అప్పుడప్పుడు ఎగసి పడే కాలువతో ఆనందం పంచుకుంటూ వుంటాయి.
ఊరిపేరు ఏలేటిపాటు - (ప.గో.జిల్లా) తణుకుకి 16 కి.మీ. 20ని. ప్రయాణం
ఆ వూరు అమ్మ పుట్టిన వూరు
ఆ ఇల్లు అమ్మ పుట్టిన ఇల్లు
మేనమామలు, అత్తల ఆప్యాయతల మధ్య అమ్మ పెరిగింది.
అమ్మ లేదు. అమ్మని పెంచిన మామలు, అత్తలు లేరు.
కానీ ఇప్పటికీ ఆ ఊరు ఆప్యాయంగా చేతులు జాపుతుంది, ఆహ్వానిస్తుంది.
తరువాతి తరం వారు అంతే ఆప్యాయత చూపిస్తున్నారు.
చాలా ఆనందంగా అనిపించింది.
వాళ్ళ ఆప్యాయతలకి మా పిల్లలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఈ ఇంటి వెనక పచ్చని పంట పొలాలు. ఆహ్లాదకరమై వాతావరణం. ప్రపంచాన్నే మర్చిపోవచ్చు.