18, ఆగస్టు 2023, శుక్రవారం

ఆస్ట్రేలియా ప్రయాణం -3

 ఆస్ట్రేలియా ప్రయాణం -3




వీణా యూనివర్సిటీకి రోజూ బస్ లో వెళ్ళేదాన్నని చెప్పింది. సిటీలోనే ఒక అపార్ట్ మెంట్లో ఫ్రండ్స్ తో కలిసి షేరింగ్ లో వుంటున్నానని చెప్పింది. ఏం చెప్పినా చదువుకోవాలందని పంపించాం. ఇంకేం ఆలోచించలేదు. అందులోనూ తను బిటెక్ చదివినప్పటి ఫ్రండ్స్ చాలా మంది వున్నారు. 


అందరూ వీణాని చాలా బాగా చూసుకునేవారు. అక్కడ బాల అని (పశ్చిమగోదావరి తణుకు వాస్తవ్యులు) ఆయనకి సూపర్ మార్కెట్ కం - పెట్లోల్ బంక్ వుందని చెప్పింది. అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ, వారంలో మూడు రోజులు యూనివర్సిటీకి వెళ్తున్నానని చెప్పింది. తను తీసుకున్న సబ్జక్ట్ బిజినెస్ మేనేజ్ మెంట్ కి సంబంధించినది. నాతో అమ్మా  ప్రొఫెసర్స్ అందరూ చాలా ముస్సలి వాళ్ళు, ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారు  అని చెప్పింది. నేను చాలా ఊహించుకున్నాను. ఎంత పెద్దవాళ్ళలా వుంటారో వాళ్ళు ఎలా చెప్తారో అని. కానీ తను వాళ్ళతో తీసుకున్న ఫొటో చూసేసరికి ఆశ్చర్యం వేసింది. తనకి ఎడమవైపు ఉన్నాయనకి 80 సంవత్సరాలు, కుడివైపు ఉన్నాయనికి 60 సంవత్సరాలు. 

వీణా అంటే వాళ్ళకి చాలా ఇష్టం. తనకి ఏ డౌట్స్ వచ్చినా వాళ్ళు టైం తీసుకుని చెప్తుండేవారుట. క్లాసులో ఏ స్టూడెంట్ కి డౌట్ వచ్చినా వీణాని అడగమనేవారుట. తన మెరిట్ కి యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్ ఇచ్చారు. మంచి పేమెంట్ ఇచ్చేవారు. ఇంకొక 25 లక్షల ఫీజు  తనే జాబ్ చేస్తూ కట్టుకుంది. అక్కడికి వెళ్లాక డబ్బుల విలువు బాగా తెలిసిందని చెప్పింది. 


11, ఆగస్టు 2023, శుక్రవారం

ఆస్ట్రేలియా ప్రయాణం - 2

ఆస్ట్రేలియా ప్రయాణం -2




అసలు మా అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళగలుగుతుందా? లేదా? అన్న డైలమాలోనే వున్నాం. తను కొన్ని పరిస్థితులలో చాలా నిరాశపడిపోయింది. పోనీలేమ్మా వదిలేద్దాం. చాలా డబ్బులున్నవాళ్ళకే ఫారిన్ ప్రయాణాలు అంది.  నిరాశపడడం అనేది నా మనస్తత్వం కాదు. పని పూర్తి చెయ్యాలనే పట్టుదల నాకు ఎక్కువ.   

 

మేము కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. కానీ అందరం ఎలాగైనా సరే తనని ఆస్ట్రేలియా పంపించాలని  నిర్ణయించుకున్నాం. 

 

బ్యాంక్ లోన్ కి వెడితే ఆ డబ్బులు పెట్టి పెళ్ళి చేసెయ్యండి. ఆడపిల్లకి చదువెందుకు అన్నారు ఆ మేనేజర్.  పెళ్ళి చెయ్యడం చేసెయ్యచ్చు. తర్వాత తన జీవితంలో అనుకున్నది అవలేదని బాధపడినప్పుడు సమాధానం కూడా చెప్పలేం.  చదువంటే పిచ్చి ఇష్టం.  

 

కానీ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తనని ఎలా పంపించాలో అర్థం కాలేదు. మేము కూచుని ఆలోచించాం. సరే డబ్బులు ఏదో సర్దుబాటు అయ్యాయి. మావారి పెన్షన్ డబ్బులు, మా స్థలం మీద కొంత డబ్బు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ అడుగడుగునా ఆటంకాలే. ఒక్క చిన్న పేపర్ రావడానికి కూడా సమస్యే అయిపోయింది. మొత్తానికి ఎన్నో రకాల సమస్యలకి ఎదురు నిలిచి పని ప్రారంభించాం.


మొత్తానికి పనులన్నీ పూర్తయ్యాయి. వీసా వచ్చింది.  మొత్తానికి  రహదారి ఏర్పడిరది. వీణకి పశ్చిమ ఆస్ట్రేలియా మౌంట్‌ లాలీలో మంచి పేరున్న ఎడిత్‌ కొవాన్‌ యూనివర్సిటీ(ECU) లో ఎమ్మెస్‌  సీటు వచ్చింది.   కానీ మొత్తం చదువుకి 30 లక్షలు.   ఆస్ట్రేలియాకి వెళ్ళే రోజు దగ్గిర పడింది. 


తను ఆగస్టు 7వ తేదీన క్లాసులకి అటెండ్ అవ్వాలి. అయితే 5వ తేదీకి మాత్రమే ఒకే ఒక్క టికెట్ వుంది. అది కూడా సింగపూర్ లో 12 గంటలు వెయిటింగ్. అది దాటితే మళ్ళీ 15వ తేదీ వరకు టికెట్లు లేవు. మాకు భయం మొదటిసారి వెళ్తోంది.  కానీ తను ఏమీ భయం లేకుండానే వెళ్ళడానికి ఫిక్స్ అయ్యింది. ఆ టికెట్ తీసేసుకున్నాం. 


ఆఫీసు వాళ్ళు వెళ్ళే రోజు 4 గంటలకి తన రెజిగ్నేషన్ లెటర్ యాక్సెప్ట్ చేశారు. రాత్రి తొమ్మిది గంటలకి ఫ్లైట్. ఇంటికి వచ్చింది. కరెంట్ పోయింది. ఏమీ తిండిలేదు. హడావుడి.


అయినా కూడా -

నాకు జూన్ లో హెర్నియా ఆపరేషన్ అయ్యింది. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆనంద్ కి ఫోన్ చేసి నేను, మా అమ్మా మీ దగ్గిరకి వస్తున్నాం అని చెప్పింది. ఆయన సికింద్రాబాద్ లో వేరే హాస్పటల్ లో వున్నారు. నేను వస్తున్నాను అని చెప్పి ట్రాఫిక్ తప్పించుకుంటూ ఎర్రగడ్డ నీలిమ హాస్పిటల్ కి వచ్చారు.  మీ అమ్మకి ఏమీ భయం లేదు నేను చూసుకుంటాను. ధైర్యంగా వెళ్ళు అని చెప్పారు.  డాక్టర్ చెకప్ చేయించి మిగిలిన పనులు చూసుకుంది. 

ఇంట్లో కరెంట్ పోయింది. ఫోన్ ఛార్జింగ్ లేదు. సింగపూర్ లో 10 గంటలు గ్యాప్  

మేము వెళ్ళేటప్పుడు ఒక 50,000 చేతిలో పెట్టి, 6 లక్షలు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాం. తన ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ ఉన్నారు. వెళ్ళగానే అకామడేషన్ వెతుక్కుని పని తప్పింది. తర్వాత తన ఫీజు ఎలా కట్టాలా అని కూడా మేము ఆలోచించలేదు.


 మొత్తానికి వీణాకి సెండాఫ్‌ ఇవ్వడానికి ఎయిర్‌పోర్ట్ కి వెడితే అది కలా, నిజమా అనిపించింది. ఆస్ట్రేలియాలో ఫ్లైట్‌ దిగానని ఫోన్‌ చేశాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. 


సమస్యలకి ఎదురు నిలిచినప్పుడే విజయం సాధిస్తామని అప్పుడు అనిపించింది.

 

ఈ పరిస్థితులలో అసలు మేము ఆస్ట్రేలియా వెడతామని, చూస్తామని ఆలోచించలేదు.      

 

7, ఆగస్టు 2023, సోమవారం

ఊహించని మలుపులు - ఆస్ట్రేలియా ప్రయాణం -1

 ఊహించని మలుపులు - ఆస్ట్రేలియా ప్రయాణం -1 


చాలా మంది పిల్లలని డబ్బులకోసం వేరే దేశం పంపించేస్తారని. 

అదో స్టైల్ అయిపోయిందని అంటుంటారు. పిల్లలని బలవంతంగా కూడా పంపించలేం.  కొంతమంది అక్కడి వరకూ వెళ్ళి చదువుపూర్తి చేసుకుని వచ్చేస్తుంటారు. 


కానీ పిల్లలు వేరే వేరే దేశాల్లో సెటిల్ అవడానికి చాలా కారణాలు వుంటాయి. 

అందరినీ ఒకలాగే అనుకోవడం కూడా తప్పేనేమో అనుకుంటాను నేను. 

ఎవరి సంగతో నాకు తెలియదు కానీ 


మా అమ్మాయి వెస్ట్రన్  ఆస్ట్రేలియాలో ఉన్న పెర్త్ ఎందుకు వెళ్ళిందో.... 

తను అక్కడ ఎందుకు సెటిల్ అయ్యిందో.... 


(Product Manager at Vgw (Virtual Gaming Worlds), Perth)

తను వెళ్ళిన దాదాపు పది సంవత్సరాలకి మా అబ్బాయి ఎలా వెళ్లాడో చెప్పాలంటే... చాలానే వుంది. 


***


అసలు తన చదువుగురించి కొంత చెప్పాలి మరి. 

 మా అమ్మాయి వీణాధరి హైదరాబాద్‌లో అప్పటి నిర్మల్ ఎమ్.ఎల్.ఎ దిండిగల్లులో పెట్టిన  SSIT ఇంజనీరింగ్ కాలేజీలో  EEE లో చేరింది.  అప్పుడప్పుడే బిల్డింగ్  కడుతున్నారు.  అసలు ఇంజనీరింగ్ అంటే ఏమిటో తెలియని మాకు మొత్తానికి ఏదో ఒక కాలేజీలో చేరిందిలే అనుకున్నాం. కానీ అక్కడ ఉన్న లెక్చరర్స్ చాలా బాగా చదువు చెప్పారు. తను కూడా లైబ్రరీకి వెళ్ళడం, కావలసిన మెటీరియల్ సేకరించడం దాంతో సబ్జక్ట్ నేర్చుకోవడం చేసేది. 


మూడుసార్లు శ్రీశైలం ప్రాజెక్ట్ కి వెళ్ళొచ్చారు. అక్కడి విద్యుత్ ప్రాజెక్ట్ వివరాలన్నీ  పొల్లుపోకుండా చెప్పింది. ఓహో కరెంట్ తయారు చెయ్యడానికి ఇంత కష్టపడతారా...  అనుకున్నాం. మాకు ఇంట్లో ఏ రూంలో వుంటే ఆ రూంలోనే లైటు వేసుకునే అలవాటు చిన్నప్పటి నుంచీ వుంది. ఇల్లంతా లైట్లు ఎప్పుడూ వేసేవాళ్ళం కాదు. తను EEE చదివిన తర్వాత ఇంకా కంట్రోల్ చేసేది. ఒక్కళ్ళు చేస్తే అయిపోదు కానీ... నేర్చుకున్నది ఆచరించడం మంచిదే కదా అనుకున్నాం.  మూడు రూముల ఇంట్లో వుండేవాళ్ళం.  అలాగే  చదువుకునేది. ఎగ్జామ్స్ అప్పుడు ఫ్రండ్ తోకలిసి కంబైండ్ స్టడీ చేసేది. మేము దేనికీ అడ్డు చెప్పలేదు. 

 90% మార్కులతో బి.టెక్‌. పూర్తిచేసింది. ఈ EEE  కష్టమే అయినా చాలా శ్రద్ధగా పూర్తిచేసింది.   బిటెక్ పూర్తయ్యేలోపున ఒక నాలుగైదు కోర్సులు నిట్ లో చేసింది. తనకి మ్యూజిక్ లో కూడా నేషనల్ లెవెల్ ప్రైజులు వచ్చాయి.  

తర్వాత అమ్మా అద్భుతమై బిల్డింగ్ లు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలలో నేను చేయగలనా అంది.

తనతో రెండు చోట్లకి ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను. డెలాయిట్ లో ఇంటర్వ్యూ చేసినాయన  అమ్మా మా కంపెనీ నీలాంటి వాళ్ళని తీసుకోవడానికి చాలా సంతోషిస్తుంది. కానీ నీకున్న ఈ క్వాలిఫికేషన్స్ కి తగిన ఉద్యోగం మేము ఇవ్వలేం. నువ్వు ఇంకా మంచి కంపెనీలో సెటిల్ అవ్వచ్చు అన్నారు. 

తర్వాత ఒక నెల రోజులకే 

సాఫ్ట్ వేర్ సంస్థ కాగ్నిజెంట్ లో ఉద్యోగంలో చేరింది.  చదువంటే చాలా ఇష్టం. ముందు ఉద్యోగంలో చేరిపోవాలని చేరిపోయింది - కానీ ఇంకా చదవాలనే ఆలోచన మాత్రం ధృఢంగా వుండేది. రెండున్నర సంవత్సరాలు ఉద్యోగం చేశాక ఆస్ట్రేలియా వెళ్ళి ఎమ్మెస్‌ చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఉద్యోగంలో రకరకాల మనుషులని మనస్తత్వాలని వాటి వెనక ఉన్న భావాలని అర్థం చేసుకుంది. ఇంత రాజకీయాలా అని ఆశ్చర్యపోయింది.  ఇంకెలాగైనా అక్కడ నుంచి బయటపడాలని అనుకుంది. 

****


**** ఆస్ట్లేలియా అంటే చాలామందికి తెలిసే వుండచ్చు కానీ నా మాటలలో ....


మా ఆస్ట్రేలియా పర్యటన జీవితంలో మరపురాని మధురస్మృతి. మా పర్యటన గురించి చెప్పేముందు  ఆస్ట్రేలియా ఖండంలో మేము ఎక్కడికి వెళ్ళాం, ఎలా వెళ్ళాం అనేది చూస్తే -


పశ్చిమ ఆస్ట్రేలియా (Western Australia ) - ఆస్ట్రేలియా  ఖండంలోనే అతిపెద్ద రాష్ట్రం, మొత్తం భూభాగం 2,529,875 చదరపు కిలోమీటర్లు. 1616లో మొట్టమొదటి యూరోపియన్‌ డచ్‌ అన్వేషకుడు డిర్క్‌ హార్టోగ్‌, అనే అతను పశ్చిమ ఆస్ట్రేలియా తీరాన్ని సందర్శించాడు. మేజర్‌ ఎడ్మండ్‌ లాక్యెర్‌ 1826 డిసెంబర్‌ 26న సౌత్‌వేల్స్‌ వలస ప్రభుత్వం తరపున యాత్రకు వచ్చినప్పుడు ఆస్ట్రేలియాలో మొదటి యూరోపియన్‌ స్థావరం ఏర్పాటు చేశాడు.  


ఇప్పుడు అల్బనీ అని పిలవబడుతున్న కింగ్‌ జార్జ్‌ III  సౌండ్‌లో  నేరస్థులతో కూడిన మిలటరీ వారితో ప్రభుత్వాన్ని స్థాపించాడు. 21 జనవరి 1827న  బ్రిటిష్‌ అధిపత్యం (కిరీటం) కోసం ఖండంలోని పశ్చిమ మూడవ భాగాన్ని అధికారికంగా స్వాధీనం చేసుకున్నాడు. దీని తరువాత 1829లో  ప్రస్తుత రాజధాని పెర్త్‌తో సహా ‘స్వాన్‌ రివర్‌ కాలనీ’ స్థాపించబడిరది. ఈ పెర్త్‌లో మా అమ్మాయి ఎలా స్థిరనివాసి అయ్యిందో చూద్దాం మరి. ***


****


2013లో ప్రయత్నాలు మొదలుపెట్టాం. అంతకు ముందు వెళ్ళిన వాళ్ళని ఎంతమందిని అడిగినా మన అనుభవం మనకి కొత్తే,  సవాలే !  మా అమ్మాయి  వెళ్ళేటప్పుడు ఆర్థికమైన సమస్యలు ఒకటే కాదు. చాలా రకాల సమస్యలు సవాళ్ళయ్యాయి. అన్నీ ఆటంకాలే. చెప్పాలంటే అదొక పెద్ద కథే అవుతుంది.