31, మే 2022, మంగళవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 18 హైదరాబాద్ నగరంలో ఎదురీత

  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 18   హైదరాబాద్ నగరంలో ఎదురీత

** టైపిస్ట్ కమ్ ట్యూషన్ టీచర్***


రోజూ పటాన్ చెరూ బస్సెక్కి ఆఫీసుకి వెళ్ళడం దినచర్య. ఆఫీసులో ఎం.డి. గారు వచ్చినప్పుడు వర్కు వుండేది. లేకపోతే ఆఫీసు వెనక తోటలో తిరిగి రావడం. ఇంకా బోరు కొడితే కెమికల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ వైపు వెళ్ళి చూసి వచ్చేదాన్ని. అయితే పని వాళ్ళు చాలా జాగర్త అని చెప్పారు. ఆ కెమికల్స్ తయారు చేసే తొట్లలో పొరపాటున పడితే ఎముకలు కూడా కరిగిపోతాయి. అంత ప్రమాదం. ఒక వర్కర్ అలా మాయమయ్యాడు. తెల్లారి అతని చెయ్యిమాత్రమే కొంచెం పైకి వచ్చి వుంది.

క్రమంగా తెలిసిందేమంటే ఎమ్.డి. రెడ్డిగారికి చాలా అప్పులు వున్నాయిట. ఫ్యాక్టరీ అంతంత మాత్రమే నడుస్తోంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 3వతరగతి చదువుతున్న వాళ్ళబ్బాయి చందుకి ట్యూషన్ టీచర్ కావాలి కాబట్టి నన్ను, టైప్ మిషన్ ని యూసఫ్ గూడా బస్తీలో వున్న వాళ్ళ స్వగృహంలోకి మార్చారు. ఇల్లు చాలా బావుండేది సినిమా సెట్టింగ్ లాగా.

నేను వాళ్ళింటికి వెళ్ళాలంటే మెహదీపట్నంలో బస్ ఎక్కి - లకడీకాపూల్ లో దిగి - అమీర్ పేట వెళ్ళే బస్ ఎక్కి అక్కడ దిగి దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల దూరం నడిచి యూసఫ్ గూడా బస్తీలో వాళ్ళింటికి వెళ్ళాలి.



రోడ్డు మొదట్లో సారధీ స్టూడియోస్, మధ్యదారిలో ఒక మసీదు తప్ప దారంతా చాలా ఖాళీగా వుండేది. ఏవో చిన్న చిన్న ఇళ్ళు వుండేవి. మట్టి రోడ్డు. షేర్ ఆటోలు లేవు, బస్సులు లేవు. చచ్చినట్లు నడవాల్సిందే. అప్పుడప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకి వెళ్ళి వాళ్ళ అబ్బాయి ఫీజు కట్టి వచ్చేదాన్ని. వాళ్ళ టీచర్ తో మాట్లాడమనేవారు. ఏవో బ్యాంక్ పనులు చేసేదాన్ని. ఇలాంటి పనులు ఉన్నప్పుడు నాలుగుసార్లు నడవాల్సి వచ్చేది. ఆయన రిక్షాలో వెళ్ళి రమ్మనేవారు. కానీ వాళ్ళావిడ నడిస్తే ఎక్సర్ సైజు, నడవమనేది.
చందు ఇంగ్లీషు మీడియం 3వ తరగతి చదువుతున్నాడు.. నేను ఎం.ఎ.తెలుగు, బి.ఎ. తెలుగు అయినా ధైర్యంగా ట్యూషన్ చెప్పడానికి రెడీ అయ్యాను. నేను చెప్పడం మొదలు పెట్టాక వాడికి మార్కులు పెరిగాయి. అప్పుడప్పుడు ఏవైనా లెటర్లు వుంటే టైప్ చేసేదాన్ని. నేను అక్కడికి వెళ్ళడం మొదలయ్యి రెండు నెలలు అయ్యాయి.

నా అదృష్టమో ఏమో నాంపల్లి నుంచి ‘9y’ రెండు బస్సులు వేశాడు. కొంత రిలీఫ్.

*** మళ్ళీ ఎప్పుడూ లాస్ట్ స్టాప్ అనలేదు ***

రోజూ లకడీకా పూల్ లో 9y ఎక్కి యూసఫ్ గూడ బస్తీకి వెళ్ళడం అలవాటయ్యింది. బస్తీ బస్ స్టాప్ లో చిన్న చిన్న షాపులు, ఆ వెనక రోడ్డులో రెడ్డిగారు వాళ్ళిల్లు. అందుకని ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేకపోయేది. మళ్ళీ సాయంత్ర 6 గంటలకి అక్కడ బస్ ఎక్కి వెళ్ళేదాన్ని. హాయిగా వుంది అనుకున్నాను.

ఒకరోజు లకడీకాపూల్ లో 9y బస్ ఎక్కాను. మరీ రష్ గా ఏమీ లేదు. టికెట్ కండక్టర్ అందరికీ టికెట్లు ఇస్తున్నాడు. వెనక నుంచి ఎవరో లాస్ట్ స్టాప్ అన్నారు. కండక్టర్ నా దగ్గిరకి రాగానే నేనూ స్టైల్ గా “లాస్ట్ స్టాప్” అన్నాను. కండక్టర్ టికెట్ ఇచ్చాడు. బస్ అమీర్ పేట నుంచీ సారధీ స్టూడియోస్ పక్కనుంచి లోపలికి ప్రవేశించింది. ఇంకొక 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను అని నిశ్చింతగా కూచున్నాను. కొంతమంది మధ్యలో దిగిపోయారు. బస్ ఏదో కొత్త రూటులో వెడుతున్నట్టు అనిపించింది. అయినా లాస్ట్ స్టాప్ అని చెప్పాను కదా అని కూచున్నాను.

ఇంక బస్ లో నేను, ఒక పల్లెటూరి ముసలామె, ఇంకొకతను, డ్రైవరు, కండక్టరు వున్నాం. ఆ బస్సు మట్టిరోడ్లమీంచి కొండలు, గుట్టల మధ్యలో ఆగింది. కండక్టరు “దిగండి దిగండి” అన్నాడు. ఎక్కడికి దిగాలీ.... ఇక్కడ ఆగిందేమిటీ... అనుకుంటూ... “యూసఫ్ గూడా బస్తీకి కదా వెళ్ళాలి” అన్నాను. “నువ్వు లాస్ట్ స్టాప్ అన్నావు కదమ్మా… ఇదే లాస్ట్ స్టాప్. కొత్తగా ఒక స్టాప్ పెంచారు” అన్నాడు కండక్టర్.

“నేను యూసఫ్ గూడా బస్తీకి వెళ్ళాలి, మళ్ళీ బస్సు ఎప్పుడు వెడుతుంది?” అన్నాను. “ఇంకా చాలా టైముందమ్మా.... నువ్వు అలా నడుచుకుంటూ పో.... పోలీస్ లైన్స్ వస్తాయి. అక్కడనించీ నీకు దగ్గరే” అన్నాడు. వేరే అతను, ఆ ముసలామె వెళ్ళిపోయారు. డ్రైవరు, కండక్టరు చాలా మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది.

కానీ నాకు మాత్రం బుర్ర తిరిగింది. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళిపో అని తేలికగా అన్నారు కానీ.... అక్కడ మొత్తం సగం సగం తీసిన పునాదులు, గుట్టలు గుట్టలు గా రాళ్ళు, ఎర్రమట్టి. ఎక్కడో దూరంగా ఇద్దరు ఒక ఆడ, ఇద్దరు మగ పనివాళ్ళు పనిచేస్తున్నట్టు కనిపించింది. ఒక్కసారిగా....

“పాపం పసివాడు” సినిమా గుర్తొచ్చి, అందులో పాట “అమ్మా చూడాలని వుంది. నిన్నూ చూడాలని వుంది. పొరపాటు పనులిక చేయబోనని చెప్పాలని వుంది.... ” పాట కూడా గుర్తొచ్చింది. ఒక్కక్షణం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కొత్తగా హైదరాబాద్ వచ్చి ఇవేం సాహసాలు రా బాబూ అనుకుంటూ.... బయల్దేరాను.


ఆ బస్సు ఇప్పటి కృష్ణానగర్ నుంచి టర్న్ అయి ప్రస్తుతం జూబిలీ చెక్ పోస్ట్ ఏరియాకి వెళ్ళింది. అస్సలు ఒక్క బిల్డింగ్ కూడా లేదు. విపరీతమైన ట్రాఫిక్ తో నిండివున్న ఇప్పటి ఏరియా అప్పుడు అలా వుంది. మంచి ఎండ. అంతా మట్టి దిబ్బలు కాబట్టి పరిగెత్తేందుకు లేదు. మొత్తానికి ఆ మట్టి దిబ్బలు, పునాదులు దాటుకుంటూ, చీకట్లో చిరుదీపంలా ఆ పనివాళ్ళని చూసుకుంటూ, మనుషులున్నారనే ధైర్యం మనసుకి చెప్పుకుంటూ.... వాళ్ళ దగ్గిరికి వెళ్ళాను. వాళ్ళని పోలీస్ లైన్స్ కి ఎటు వెళ్ళాలి అని అడిగాను. అలా ముందుకి సీదా పో అమ్మా... అన్నారు.

అక్కడ కనుచూపు మేరలో ఏం కనిపించట్లేదు. మళ్ళీ నడక సాగించాను. మొత్తానికి ఆ పోలీసు క్వార్టర్స్ దగ్గిరకి వచ్చాను. అక్కడికి ఒక నాలుగు కిలోమీటర్లు నడిచి వుంటానేమో.... అక్కడ నుంచీ మొత్తానికి బయట పడ్డాను. మళ్ళీ దారి కనుక్కుంటూ.... రిక్షాలు వుండేవి. ఆటోలు అంతంత మాత్రమే. ఎక్కాలని కూడా అనుకోలేదు. మళ్ళీ అక్కడ నుంచీ 1.5 కిలోమీటరు నేను వెళ్ళాల్సిన రెడ్డిగారిల్లు. ఇప్పటిలాగా స్ట్రెయిట్ రోడ్లులేవు. జనసంచారం అంతగా లేదు. మళ్ళీ అందరినీ అడుగుతూ మొత్తానికి చేరాను. పొద్దున్న 9.30 గంటలకి చేరాల్సిన దాన్ని మధ్యాహ్నం 12.30 అయ్యింది.

వెళ్ళగానే మా ఆడబాస్ ఏంటి నాగలక్ష్మీ ఇప్పుడా రావడం. రెడ్డిగారు ఇప్పటి వరకూ చూసి బయటికి వెళ్ళిపోయారు. ఇంక రారేమో అనుకున్నాను అంది. ఒక్క నిమిషం అని - ఆవిడతో ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కాస్త ఫ్రెషప్ అయ్యి, మంచినీళ్ళు తాగి అప్పుడు జరిగినదంతా చెప్పాను.

అయ్యో! అవునా... అసలే సన్నగా వున్నారు. ఎలా నడిచారండీ బాబూ... (లావుగా వుంటే ఎక్కడో కూచుండిపోయేదాన్ని) ఎలాగా లేటయ్యింది కదా... లంచ్ చేసేసి, చందూ స్కూల్ నించి రాగానే ట్యూషన్ చెప్పి వెళ్ళిపోండి అంది. పొద్దున్న తిన్నదంతా అరిగిపోయింది.

ఇంక తప్పదుగా... వాళ్ళపని వాళ్ళకి. చందూగాడికోసం ఎదురుచూస్తూ కూచున్నాను.

29, మే 2022, ఆదివారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 17 హైదరాబాద్ నగరంలో ఎదురీత

  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 17   హైదరాబాద్ నగరంలో ఎదురీత

హైదరాబాద్ లో నా జీవనయానం - 5

ధైర్యానికి సవాల్ ఆ రోజు

రోజూ మెహదీపట్నం నుంచి 117 బస్ టోలీచౌకీ, శేర్లింగంపల్లి గచ్చిబౌలిల మీదుగా బిహెచ్ ఇ ఎల్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి పటాన్ చెరు చేరేది. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ గా మారిన ఈ ప్రదేశాలన్నీ అప్పుడు పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా వుండేవి.

నేను పొద్దున్న 9 గంటలకి బస్ స్టాప్ లో వుంటే బస్ చాలా రష్ గా వుండేది. దాదాపు గంట ప్రయాణం. అందుకని నా ప్రయాణాన్ని 7.30 గంటలకి మార్చుకున్నాను. బస్ లో అంత పొద్దున్నే వెడుతుంటే అటూ ఇటూ పచ్చటి చెట్లు స్వాగతం చెప్పేవి. దారిలో అక్కడక్కడ వున్న కస్తూరి తుమ్మ చెట్లు పచ్చటి పూలతో కమ్మటి సువాసనలు వెదజల్లేవి. అప్పుడప్పుడు బస్ చెట్ల పక్కనించి వెళ్ళినప్పుడు కొమ్మలు సుతారంగా తాకి గిలిగింతలు పెట్టేవి. పచ్చటి చెట్లలో నుంచీ కోయిల కుహు కుహు రాగాలు, పిట్టల కిచకిచలు చాలా ఆనందాన్నిచ్చేవి. అక్కడక్కడ చిన్నచిన్న నీటి కాలవలు పారుతూ వుండేవి. బాస్ లో కూచోడానికి చోటు దొరికేది కాబట్టి ఇదంతా ఆస్వాదించేదాన్ని.

దారిలో చెప్పుకోదగ్గ ముఖ్యమైన బస్ స్టాప్ ALIND (Alluminium Industries Ltd. India’s Largest Alluminium Fabrication, Estd. 1946) శేర్లింగంపల్లి. పనిచేసేవాళ్ళతో సందడి సందడిగా వుండేది. ఇప్పుడు దానిని షూటింగ్ లకి వాడుతున్నారని తెలిసింది.


ఇదంతా బాగానే వుంది. మా ఎమ్.డి. రెడ్డిగారు రోజూ వచ్చేవారు కాదు. ఒకరోజు ఆఫీసుకి వచ్చారు. ఆ రోజు సాయంత్రం రెడ్డిగారు నన్ను, అకౌంటెంట్ ని కారు ఎక్కించుకుని ఆఫీసు రోడ్డు చివరకి రాగానే నువ్వు ఇక్కడ దిగేసి బస్ లో వెళ్ళు నీకు రూటు తెలియాలి అని దింపేసి వెళ్ళిపోయారు.

అప్పటికి సాయంత్రం 6 గంటలైంది. రోజూ ఆ టైముకి బస్ వుండేది. కానీ రావలసిన బస్ ఎంతకీ రాలేదు. 7 గంటలైపోయింది. పటాన్ చెరు డిపోకి వెడదామంటే చాలా దూరం. ఇంతలోనే ఫ్యాక్టరీలో పనిచేసే ఒకతను వచ్చి అయ్యో అమ్మా ఇంకా వెళ్ళలేదా అని, నేను సైకిల్ మీద డిపోలో దింపుతాను. అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పాడు. ఇంకేం చేస్తాను మరి. సైకిల్ ఎక్కి డిపోకి వెళ్ళాను. అక్కడ కూడా బస్ ఎంతకీ రాలేదు. ఇంతలోనే ఒక సెట్విన్ బస్ బిహెచ్ ఇఎల్ వరకు వెళ్ళేది వచ్చింది. అందరితోబాటూ నేనూ ఎక్కాను.

బిహెచ్ ఇ ఎల్ వెడుతుంటే నా పక్కన కూచున్నావిడ ఎక్కడికి వెళ్ళాలమ్మా అంది. మెహదీపట్నం అన్నాను. అయ్యో అవునా... అని, బిహెచ్ ఇఎల్ లో నేను దిగిపోతాను. మా ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ ఇస్తాను. బస్ రాకపోతే ఫోన్ చెయ్యి మా ఇంటికి వచ్చేద్దువుగాని. రేపొద్దున్న మా అమ్మాయికి కూడా ఇలా జరగచ్చేమో... అంటూండగానే ఆవిడ దిగే స్టాప్ వచ్చింది. నేనూ అక్కడ దిగాను.



రోజూ బస్ బిహెచ్ ఇ ఎల్ మీదుగా వెళ్ళినా కూడా దిగేపనిలేదు కాబట్టి కొత్త ప్రదేశమే. రాత్రి 8 గంటలు అయ్యింది. ఫోన్లు లేవు. జనసంచారం అంతంతమాత్రమే. ఏంచెయ్యాలో తోచలేదు.

నేను లక్ష్మీకెమికల్ ఇండస్ట్రీస్ ఆఫీసుకు వెళ్ళేదారిలో ఫైర్ ఆఫీసు వుంది. అక్కడ ముగ్గురు పనిచేసేవాళ్ళు రోజూ నన్ను చూస్తుండేవారు. నా వెంట పడి పేరు అడిగేవారు. నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయేదాన్ని. నన్ను మా ఆఫీసు అబ్బాయి బస్ డిపోలో దింపినప్పుడు వాళ్ళు అక్కడే వుండి నేను పటాన్ చెరులో బస్ ఎక్కేవరకూ చూస్తూ ఎక్కాక టాటా చెప్పారు. నాకు భయం వేసింది. చూస్తూ కూచున్నాను.

ఇంక బి హెచ్ ఇ ఎల్ కూడా వచ్చారు. ఇదెక్కడి గోలరా అనుకున్నాను. అప్పుడు భయపడి నేను చేసేది ఏమీలేదు. సరేలే నాతోబాటు ఎవరో ఒకరు బస్ ఎక్కేవరకూ వున్నారు కదా... అనుకున్నాను.

ఇంతలోకే 117 వచ్చింది. అమ్మయ్య అనుకుని బస్ ఎక్కాను. వాళ్ళు మాత్రం బస్ ఎక్కలేదు. ఏదైతే ఏం లే. ఇంటికి వెళుతున్నానుగా అనుకున్నాను.

రాత్రి 9.30 అయ్యింది. మెహదీపట్నంలో బస్ దిగి గుడిమల్కాపూర్ లో ఉన్న ఇంటికి అర కిలోమీటరు దూరం లోపలకి నడవాలి. ఇళ్ళు కూడా అంతంతమాత్రమే. జనాలు ఎవరూ లేరు. అటూ ఇటూ చెట్లు, తుప్పలు వుండేవి. దారిలో లైట్లు కూడా అంత సరిగా వుండేవి కాదు. బిక్కు బిక్కుమంటూ ఇంటికి వెళ్ళేసరికి - అక్క ఆఫీసు వాళ్ళు దింపుతారులే అనుకున్నట్టుంది. ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటోంది.

నాకు నిజంగా ఇదొక సవాల్ లాగే అనిపించింది.

27, మే 2022, శుక్రవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 16 హైదరాబాద్ నగరంలో ఎదురీత

 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 16   హైదరాబాద్ నగరంలో ఎదురీత


పజిల్ గా మారిన బస్సులో వెనక సీటాయన నవ్వు



ఆఫీసులో చేరిన రెండో రోజు పొద్దున్న నన్ను ఆఫీస్ కి బస్ లో రమ్మన్నారు. ఇప్పుడు మెహదీపట్నం నుంచి చిలుకూరు వెళ్ళే బస్ స్టాప్ లో నేను బస్ ఎక్కాలని చెప్పారు. అక్కకి కూడా అంతగా తెలియదు ఏ బస్ ఎక్కాలో అక్కడికి వెళ్ళి కనుక్కోమంది. బస్ స్టాప్ లో వాళ్ళు పటాన్ చెరు బస్ నెం. 117 అని చెప్పారు. కానీ నేను దిగాల్సిన బస్ స్టాప్ పేరు ఆఫీసు వాళ్ళని అడగలేదు.

ఆ రోజులకి తగినట్లు బస్ స్టాప్ రష్ గా వుంది. అక్కడ ఒకబ్బాయిని పటాన్ చెరులో లక్ష్మీ కెమికల్ ఇండస్ట్రీస్ కి వెళ్ళాలి బస్ స్టాప్ దగ్గరలో ఏదైనా వుందా అని అడిగాను. అతను అదేమీ ఎడారి ప్రదేశం కాదు. మీరేం భయపడక్కరలేదు, మీరు దిగాక ఎవరో ఒకరు చెప్తారు అన్నాడు. కానీ బస్ ఎక్కినా ముందురోజు కారులో వెళ్ళిన ఆఫీసుని ఎలా గుర్తుపట్టాలి, ఎక్కడ దిగాలి...??? చూద్దాంలే అనుకుని 117 బస్ ఎక్కాను. అది కోటీ నుంచి వస్తుంది. చాలా రష్ గా వుంది.

బస్ లో పక్కనే నిలబడి ఒకమ్మాయి ‘’ఏమండీ మీరు శైలజకి బంధువులా, కొంచెం పోలికలు ఉన్నాయి’’ అంది. “శైలజా... అంటూ కాదండీ...” అని పరిచయం అయ్యిందే తడవుగా నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పాను.

తనపేరు వర్షధార అని చెప్పి, నేనూ అదే రూట్ - “మీకేం భయం అక్కరలేదు మెయిన్ బస్ స్టాప్ కి ముందు బస్ స్టాప్ మీరు దిగేదే వస్తుంది. నేను చెప్తానుగా అని, అక్కడ మీకు లక్ష్మీ కెమికల్ ఇండస్ట్రీస్ బోర్డు కనిపిస్తుంది” అని చెప్పింది. “మీ పేరు తమాషాగా వుంది” అన్నాను. ధారగా పడే పేద్ద వర్షం రోజు పుట్టిందిట. అందుకని ఆ పేరు పెట్టారుట. బలే ఆలోచన కదా... మా పరిచయం ఆరోజునుంచీ ధారాపాతంగా కొనసాగింది.

కానీ బస్ ఎక్కాక వెనక్కి చూద్దును కదా తట్టలు బుట్టలు పట్టుకుని పల్లెటూరు వాళ్ళు, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళతో ఫుల్ గా వుంది. మ్ మ్ సీటు దొరకడం కష్టం అనుకుని అలా వెనక్కి చూశాను. ఒకాయన చివరి సీటులో కూచుని నవ్వుతున్నారు. ఎవరో అర్థం కాలేదు. ఎందుకు నవ్వుతున్నారో తెలియదు. మళ్ళీ వెనక్కి తిరిగాను మళ్ళీ అదే నవ్వు. ఇలా ఎప్పుడు వెనక్కి చూసినా నన్ను చూసి నవ్వుతూనే వున్నారు. ఆ నవ్వులో స్వచ్ఛత స్పష్టంగా కనిపిస్తోంది.

మొత్తానికి దిగాల్సిన బస్ స్టాప్ వచ్చింది. తేలికగానే కనుక్కుని ఆఫీస్ కి వెళ్ళాను. ఆ నవ్వు మొహం నా కళ్ళ ముందు నుంచి పోవట్లేదు.

ఇంటికి వచ్చి నవ్విన ఆయన గురించి అక్కకి చెప్పాను. అక్క కూడా ఆశ్చర్యపోయింది.

మొత్తానికి ఈ పజిల్ ఎలా క్లియర్ అయ్యిందంటే....

ఒకరోజు మా మేనత్త కూతురు (తనని రామం అక్కా అనేవాళ్ళం) వాళ్ళింటికి వెళ్ళాం. మేము వెళ్ళగానే మా బావగారు “ఏమ్మా బస్ లో నవ్వితే నవ్వను కూడా నవ్వలేదు” అన్నారు. అప్పుడు గట్టిగా ఆపకుండా నవ్వాను. నేను హైదరాబాద్ వచ్చిన చాలా రోజుల వరకు వాళ్ళింటికి వెళ్ళలేదు అదీ కారణం. “చాలా రోజులైపోయింది ఎలా గుర్తుపడతాను” అన్నాను. మళ్ళీ నవ్వులు.

24, మే 2022, మంగళవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 15 హైదరాబాద్ నగరంలో ఎదురీత



 

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 15

హైదరాబాద్ నగరంలో ఎదురీత



ఇప్పటి నుంచీ అసలు కథ మొదలైంది. ఏదో ఒక స్థిరమైన ఉద్యోగం అయితే ఆ అనుభవాలు వేరే వుంటాయి. కానీ నాలాంటి వాళ్ళ అనుభవాలు వేరే వుంటాయి. ఒక్కోసారి వెనక్కి చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.


నేను హైదరాబాద్ వచ్చిన మూడు నెలలలో ఇంగ్లీష్ టైప్ ఎగ్జామ్ పాసయ్యాను. తెలుగు తాడేపల్లిగూడెంలోనే పాసయ్యాను. అక్కకి తెలిసిన వాళ్ళు టైపిస్ట్ ఉద్యోగం ఉందని చెప్పారు. మర్నాడు పొద్దున్న వాళ్ళింటికి రమ్మన్నారు.

ఉద్యోగం ఇచ్చే ఎం.బి.ఆర్. రెడ్డిగారు యూసఫ్ గూడా బస్తీ వెనక ఒక చక్కటి ఇంట్లో వుండేవారు. వాళ్ళింటికి వస్తే ఆఫీసుకి తీసుకెళ్తానన్నారు. సరే అక్క నన్ను దింపేసి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆఫీసులో చేసే వెంకటరత్నం అనే పెద్దాయన అక్కడ ఉన్నారు.

నేను వెళ్ళాక ముగ్గురం కలిసి రెడ్డి గారి నల్లటి ఫియట్ కారులో బయల్దేరాం. నాకు ఎక్కడో, ఏమిటో చెప్పలేదు కాబట్టి కారులో కూచుని అంతా బయటికి చూస్తూ కూచున్నాను. చుట్టూరా చెట్లు, అక్కడక్కడ విసిరిపారేసినట్లు ఇళ్ళు. కూకట్ పల్లి రూట్ లో వెళ్తున్నాం అని తెలిసింది వాళ్ళ మాటలని బట్టి.


అప్పట్లో కూకట్ పల్లి అంతా మట్టి దిబ్బలు. నిర్మానుష్యం. అక్కడక్కడ చెట్లు. మొత్తానికి గమ్యం చేరాం. చాలా పెద్ద కాంపౌండ్ లో చుట్టూరా పువ్వుల చెట్లు, నిమ్మచెట్లతో చాలా ప్రశాంతంగా వుంది. నాకు నచ్చినట్లు వుండేసరికి సంతోషంగా అనిపించింది.

ఇంతకీ ఆఫీస్ పేరు లక్ష్మీ కెమికల్ ఇండస్ట్రీస్. వాళ్ళు బేరైట్స్ అనే స్టోన్స్ తో కెమికల్ తయారు చేస్తారు. నాకు ఒక్క లెటర్ ఏదో టైప్ చెయ్యమని ఇచ్చారు. టైపింగ్ వచ్చినా కొత్త చోటు, కొత్త మనుషులు ఏదో అవస్థపడి నీట్ గానే టైప్ చేసి ఇచ్చాను.


బేరైట్ స్టోన్

సాయంత్రం 5 గంటలకి అంతకు ముందు చేసిన టైపిస్టు మాధవ్ వచ్చాడు. అతన్ని నాకు ఏది ఎలా చెయ్యాలో చెప్పమన్నారు. అతను ఆఫీసు లెటర్స్ టైప్ చెయ్యడంలో కొన్ని మెలకువలు చెప్పాడు. ఇదంతా అయ్యేసరికి సాయంత్రం 7 గంటలు అయిపోయింది. నాకు దారి తెలియదు. చీకటి పడుతోంది. వ వాళ్ళు దింపుతారు కదా అనే ధైర్యంతో కూచున్నాను.

7 గంటలకి పటాన్ చెరు నుంచి బయల్దేరి ట్రాఫిక్ లేకపోయినా సిటీకి వచ్చేసరికి 8.30 అయిపోయింది. సంజీవరెడ్డి నగర్ లో నన్ను, ఆ టైపిస్ట్ ని దింపేసి, అతనితో నన్ను ఇంటి దగ్గర ఆటోలో దింపమని చెప్పారు.

మేము మెహదీపట్నం గుడిమల్కాపూర్ లో వుంటున్నాం. ఫోన్ చేద్దామంటే అక్క దగ్గిర ఫోన్ లేదు. నేను మెహదీపట్నం ఆటోలో చేరేసరికి 9.30 అయ్యింది. అక్క, వాళ్ళ ఫ్రెండ్ శ్యామల బస్ స్టాప్ లో నాకోసం వెయిట్ చేస్తూ కనిపించారు. చాలా భయపడ్డారు ఇంకా రాలేదని. ఈ కథంతా చెప్పాను. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. కానీ తనకి సిటీ అలవాటే కాబట్టి ఇలాంటివి జరుగుతూనే వుంటాయి లే అంది. కాకపోతే ఆఫీసు అంత దూరం అనుకోలేదు అంది.
అలా ఆ రోజు అలా గడిచింది.

19, మే 2022, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 14


జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 14


ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ – బాలచంద్రిక

అప్పుడప్పుడు అక్కతోబాటు ఆఫీసుకి వెళ్ళేదాన్ని. నాకు ఏమీ తోచేది కాదు. నాకు సిటీ కొత్త. పక్కింట్లో ఉన్న గాయత్రి నాకన్నా చాలా చిన్నది. కాలేజీలో ఇంటర్ చదువుతోంది. తనకి శలవులని అక్క సిటీ చూపించమంది. గాయత్రికి పాస్ వుంది. కానీ నన్ను కూడా పాస్ అని చెప్పమంది. నాకు సిటీ గురించి అసలేం తెలియదు. తను చెప్పమన్నట్టు చెప్పేదానిని. రెండేసి స్టాపులకోసారి బస్ ఎక్కడం, దిగడం అక్కడ దగ్గరలో వున్నవి చూడడం. నాకు పబ్లిక్ గార్డెన్స్, వాళ్ళ కాలేజీ, చార్మినార్, మ్యూజియం ఇలా చాలా చూపించింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. నాకు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు. నన్ను చూస్తే నాకే వింతగా అనిపించేది.

ఒకరోజు చివరింట్లో ఉండే ముసలావిడ ఏడుపు వినిపించింది. ఏమైందో అని చాలా కంగారు పడ్డారు అందరూ... ఎక్కిళ్ళు బయటికి వినిపిస్తున్నాయి. వాళ్ళబ్బాయి ఆఫీసుకి వెళ్ళాడు. అందరం ఇంటి ముందుకు వెళ్ళేసరికి, ఆవిడ ఒళ్ళో పుస్తకం వుంది. "ఏమైందండీ... ?" అని అందరూ అడిగారు.

ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ చెప్పిన సమాధానం - "కథలో రాధని అత్తగారు చాలా కష్టాలు పెడుతోంది. పాపం పిచ్చిపిల్ల ఎవరితో చెప్పుకోలేకపోతోంది. ఆ బాధ చూడలేక నాకు ఏడుపు వచ్చింది" అని చెప్పింది.

అప్పుడు అందరూ "అంతేనా.... ఇంకా ఏమైందో అని కంగారు పడ్డాం. కథే కదా... ఏడవకండి మామ్మగారూ..." అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆవిడకి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. ఇంక అందులో లీనమైపోతే ఇలాగే వుంటుంది.

 ***

అక్క ప్రైవేట్ జాబ్ చేస్తూనే రకరకాల పోటీ పరీక్షలకి వెడుతూవుండేది. రైల్వేలో, ఎజి ఆఫీసులో, స్టేట్ బ్యాంక్ లో ఒకేసారి ఇంటర్వ్యూలు అయ్యాయి. అన్నింట్లో విజయం. కానీ తను స్టేట్ బ్యాంక్ నే ఎంచుకుంది. అక్క చాలా తెలివైనది. కథలు రాస్తుంది. కవితలు ఆశువుగా చెప్తుంది. పద్యాలు ఛందోబద్ధంగా రాస్తుంది.

అక్కకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నారాయణగూడాలో బ్రాంచ్ లో ఫస్ట్ అప్పాయింట్ మెంట్ వచ్చింది. ఆ బ్యాంక్ కి వచ్చిన గ్రేట్ మెజీషియన్ చొక్కాపు వెంకట రమణగారు తనకి పరిచయం అయ్యారు. వాళ్ళ ఆఫీసుకి నన్ను తీసుకురమ్మని చెప్పారట.

ఒకరోజు నన్ను బరకత్ పూరాలో వున్న ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీకి తీసుకుని వెళ్ళింది. రమణ గారిని నాకు పరిచయం చేసి తను ఆఫీసుకి వెళ్ళిపోయింది.

రమణగారు బాలచంద్రిక సంపాదకులు. నాతో మాట్లాడుతూ మీరు మా బాలచంద్రికకి కథలు రాస్తారా అన్నారు. రాస్తాను అని చెప్పాను. అప్పటివరకూ ఎప్పుడూ కథలు రాసిన అలవాటు లేదు. ఏదీ రాదని చెప్పకూడదని అమ్మ అనేది. ఆ ప్రకారమే సరే అని చెప్పేశాను.

సరే రండి మా డైరెక్టర్ గారికి పరిచయం చేస్తాను అని - అప్పటి డైరెక్టర్ బుడ్డిగ సుబ్బరాయన్ గారికి పరిచయం చేశారు. ఆయన బాలచంద్రికకి కథలు రాయడానికి ప్రోత్సహించారు. రోజూ రమ్మన్నారు. అది టెంపరరీ అని నాకు తెలుసు. కానీ చాలా సంతోషంగా అనిపించింది. మొదటిసారి అలా ఇద్దరు ప్రముఖ వ్యక్తులతో పరిచయం అయ్యింది.









అప్పటి నుంచి రోజూ బాలచంద్రిక ఆఫీసుకి వెళ్ళి అక్కడ కూచుని కొన్ని చిన్న చిన్న పిల్లల కథలు రాసిచ్చేదాన్ని. సహసంపాదకుడు రూప్ సింగ్ అని వుండేవారు. ఆయన కొన్ని ఇంగ్లీషు కథల పుస్తకాలు ఇచ్చి అందులో కథలు అనువదించమని చెప్పారు. పొద్దుటి నుంచీ సాయంత్రం వరకు ఉండేదాన్ని. అలా నా కథలు బాల చంద్రికలో వచ్చేవి. కొన్నిసార్లు నా పూర్తి పేరు పెట్టేవారు కాదు.

వాళ్ళకి వేరే వాళ్ళ నుంచి వచ్చిన కథలు కూడా ఎడిట్ చేసి మళ్ళీ రాసిపెట్టేదాన్ని. అప్పట్లో కంప్యూటర్ లేదు కాబట్టి మళ్ళీ రాసుకోవల్సి వచ్చేది.

అప్పుడప్పుడు సుబ్బరాయన్ గారు వాళ్ళ వర్కషాప్స్ కి రమ్మని చెబితే వెళ్ళేదాన్ని. అక్కడ చాలామందితో పరిచయం అయ్యింది.

రూప్ సింగ్ గారు నాకు ఎలా రాయాలో చెప్పేవారు. అవడానికి సింగ్ కానీ తెలుగు బాగా వచ్చు. అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాగా మాట్లాడేవారు.

అతనికి కొన్నాళ్ళకి పెళ్ళి అయ్యింది. ఏం గొడవలయ్యాయో తెలియదు కానీ, భార్యాభర్తా ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు. నా జీవితంలో ఇలాంటి విషాద సంఘటన వినడం మొదటిసారి.

11, మే 2022, బుధవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 13

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 13



అక్క వాళ్ళు హైదరాబాద్ రాగానే  కొన్ని రోజులయ్యాక ఇప్పుడు ఉన్న రూము మా మేనత్త కూతురు వాళ్ళు చూపించారు.  

ఒక పెద్ద కాంపౌండ్ మధ్యలో అంతా కుంకుడు, జామ, సపోట, చింత, సీతాఫలం వగైరా చెట్లన్నీ వుండేవి. చుట్టూరా రూములు. ఒక పక్క ఇల్లుగల వాళ్ళ పెద్ద పెంకుటిల్లు. రూములపైన బంగాళ పెంకులు. కానీ చుట్టూరా చెట్లు వుండడంతో చాలా చల్లగా వుండేది. 

అందరూ ఉద్యోగాలు చేసుకునేవారు ఉండేవారు. ఒక రూములో మాత్రం ఒకతను వాళ్ల అమ్మతో వుండేవాడు. ఈ కాంపౌండ్ కి పెద్ద ఆకుపచ్చ రంగు గేటు వుండేది. అదొక రక్షణ కవచంలా వుండేది. దీనికి పప్పుకోట అని పేరు. అంతకు ముందు అక్కడొక పెద్ద మిల్లు వుండేదిట. ఈ గేటులోపల పప్పులు ఆరపెట్టేవారుట. గేటు దాటి బయటికి వెడితే చిన్న చిన్న ఇళ్ళు.  ఆ ఏరియా పేరు మెహదీపట్నంలో ఉన్న గుడిమల్కాపూర్. 

అక్క మర్నాడు బ్యాంక్ కి వెడుతూ "ఏమైనా పుస్తకాలు చదువుకో... బయట షాపులో ముసలామె వుంటుంది సాయంత్రం జొన్న రొట్టె చేసి ఇస్తుంది తీసుకో" అని చెప్పి వెళ్ళిపోయింది. 

నేను అక్క ఆఫీసు నుంచీ వచ్చేలోపున షాపులో ఉన్న పెద్దామె దగ్గిరకి వెళ్ళి "అక్క జొన్నరొట్టె తీసుకోమంది" అన్నాను.

"అక్క కొలువుకు పోయినాది" అంది. నాకు అస్సలేమీ అర్థం కాలేదు. నేనేమీ మాట్లాకుండా చూస్తున్నాను. 

"ఈ దినం చెయ్యనీకి రాలేదు బిడ్డా. రేపు చేసిస్తాను"  అంది. 

ఆ తెలంగాణ భాష వినడం అదే మొదలు కావడంతో కొంచెం కన్ఫ్యూజన్ తో "సరే" అని ఇంటికి వచ్చేశాను. 

సాయంత్రం అక్క వచ్చాక చెప్పాను. "మెల్లిగా అర్థం అవుతుంది లే" అంది. 

మర్నాడు పొద్దున్న తనతో బాటు ఆఫీసుకి రమ్మంది. ఇద్దరం కలిసి బస్ స్టాప్ కి వెళ్ళాం. అక్క ఎక్కాల్సిన డబుల్ డెక్కర్ నెంబర్ 5 బస్ వచ్చింది. అక్క పరుగు పెట్టుకుంటూ "తొందరగా రా" అంటూ  ముందుకు వెళ్ళింది. నేను ఎక్కడ నిలబడ్డానో అక్కడే వుండిపోయాను. వెనక్కి తిరిగి చూసి "ఇక్కడే వున్నావా? ఇలా అయితే కష్టం. చూడు నీ మూలంగా బస్ మిస్ అయిపోయింది" అని విసుక్కుంది. 

నాకు అంత మంది జనాన్ని చూస్తే ఇబ్బందిగా అనిపించింది. పరిగెత్తడానికి నామోషీగా అనిపించింది. 

మొత్తానికి ఇంకో బస్ ఎక్కి అక్కావాళ్ళ ఆఫీసుకి వెళ్ళాం. అక్కడ నాకేం తోచలేదు. తను చాలా బిజీగా వుంది. వాళ్ళ ఆఫీసులో అటెండర్ ని ఇచ్చి దగ్గర వున్న లైబ్రరీకి పంపించింది. కానీ సిటీ కొత్త కావడంతో నేను మళ్ళీ అతనితోనే అక్క ఆఫీసుకి వచ్చేశాను. 

ఇంతలోనే పెద్ద సౌండ్ వినిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే... విమానం పెద్ద సైజులో కనిపించింది. అప్పటి వరకూ ఊళ్ళలో చిన్న నక్షత్రంలా  ఆకాశంలో చూడడమే కానీ... అంత దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు. అప్పటికే నాలుగు సార్లు విమానాలు వచ్చాయి. చప్పుడయినప్పుడల్లా వెళ్ళి చూసేదాన్ని. 

మధ్యాహ్నం లంచ్ టైములో తను రెగ్యులర్ గా టిఫిన్ చేసే హోటల్ కి తీసుకెళ్ళింది. హోటల్ లో పుస్తకాలు చదువుకుంటూ టిఫిన్ తినేదిట. అక్కడొక సర్వర్ అక్క దగ్గిర రెగ్యులర్ గా పుస్తకాలు తీసుకుని చదివేసి ఇస్తుండేవాడుట. నాకు తమాషాగా అనిపించింది. అతనికి నన్ను పరిచయం చేసింది. ఒక నవ్వునవ్వి. తన డ్యూటీ చేశాడు. 

సాయంత్రం మళ్ళీ మెహదీ పట్నం వెళ్ళే బస్ ఎక్కి ఇంటికి చేరాం.  అక్కకి వంట మీద పెద్ద ఆసక్తి వుండేది కాదు. తనకి తోచినది ఏదో చేసింది. ఇద్దరం తిన్నాం. ఈ దినచర్య ఇలా వుండేది. 

నేను వచ్చింది ఉద్యోగానికి కాబట్టి అక్క ఒక ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుకి తీసుకెళ్ళింది. ఆ ఆఫీసులో వాళ్ళు "ఎకౌంట్స్ రాయడంలో ట్రైనింగ్ ఇస్తాం. మొదటి పదిహేను రోజులూ జీతం ఇవ్వం" అన్నారు.  అక్క ఆలోచించుకుని చెప్తాం అని వచ్చేసింది. ఆఫీసు మాత్రం చాలా పెద్దది. 

అక్క "వాళ్ళు జీతం ఇవ్వకపోతే బస్ ఛార్జీలకి డబ్బులు కావాలిగా... మనకి కుదరదు లే" అంది. 

సిటీ గురించి నాకు ఏమీ తెలియదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. 

తనకి తెలిసిన బాలకృష్ణ గారితో మా చెల్లెలికి ఉద్యోగం కావాలి అంది. 

ఆయన మర్నాడు పొద్దున్న రమ్మన్నారు. అక్క, నేను బాలకృష్ణగారితో కలిసి యూసఫ్ గూడాలో ఉన్న ఆయన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం. 

ఆయన పేరు ఎం.బి.ఆర్ రెడ్డి. ఇల్లు సినిమా సెట్టింగ్ లా వుంది. అక్కడే ఒక పెద్దాయన వున్నారు. ఆయన పేరు వెంకటరత్నం. ఆయన రెడ్డిగారి దగ్గర అకౌంటెంట్.  అన్ని పరిచయాలు అయ్యాక రెడ్డిగారు "నేను అమ్మాయిని పటాన్ చెరు తీసుకుని వెడతాను. అక్కడ టైపిస్ట్ గా ఉద్యోగం ఇస్తాను" అన్నారు. 

అప్పుడు నా పరిస్థితి గాలి ఎటు తోస్తే అటు వెళ్ళడంలా వుండేది. రెడ్డిగారు నల్లటి ఫియట్ కారులో నన్ను, వెంకటరత్నం గారిని  పటాన్ చెరు ఆఫీసుకి తీసుకుని వెళ్ళారు.