28, డిసెంబర్ 2022, బుధవారం

సాహితీప్రియుడు – నిస్వార్థపరుడు - 65

 ***సాహితీప్రియుడు – నిస్వార్థపరుడు - 65  ***

*** జుజ్జవరపు చంద్రమౌళిగారు ***
*** పుస్తకాలంటే ప్రాణం***


ఇన్నయ్యగారు నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి “నాగలక్ష్మీ...! మనం ఇప్పటి వరకూ చేసిన పుస్తకాల పిడిఎఫ్ ఫైల్స్ ఒక సిడిలో పెట్టి, మీకొక ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ చేసి వాళ్ళింటికి వెళ్ళి ఇచ్చెయ్యండి. ఆయన పేరు చంద్రమౌళి” అన్నారు.

ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేశాను. “నేను చంద్రమౌళిని మాట్లాడుతున్నాను. ఎవరమ్మా మాట్లేది...?”
“నా పేరు నాగలక్ష్మి సర్! ఇన్నయ్యగారు సిడి ఇవ్వమన్నారు” అన్నాను.

చంద్రమౌళిగారు బేగంపేటలో సెంట్ ఫ్రాన్సిస్ వుమెన్స్ కాలేజీ పక్కన అని ఇంటి అడ్రస్ చెప్పారు.

చాలా తేలికగానే గుర్తుపట్టాను. పెద్ద ఇల్లు. ఇంటిముందంతా ఖాళీ స్థలం. చంద్రమౌళిగారు ఇంటిబయట ఉన్న వరండాలాంటి చోట కుర్చీలో కూచున్నారు. నాలుగు కుర్చీలు ఉన్నాయి. ఒక చిన్న టీపాయి, రాక్ వున్నాయి.

నేను వెళ్ళగానే కూచోమన్నారు. పెద్ద పెద్ద చెట్లుండడంతో గాలి బాగా వస్తోంది. కాలేజీ విడిచి పెట్టినప్పుడు మాత్రమే కిలకిలలాడుతూ అమ్మాయిల సందడి వినిపిస్తుంది. లేకపోతే ప్రశాంతమైన ప్రదేశం.

“ఏదమ్మా... సిడి ఇయ్యి!” అంటూ చెయ్యి జాపి, నేను వాటర్ వర్క్స్ లో ఛీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యాను. “నువ్వేం చేస్తుంటావు?” అన్నారు. అప్పటికే ఆయనకి 77 సంవత్సరాలు వుంటాయేమో...

నేను మేం చేసే వర్కుల గురించి చెప్పాను. ఆయన “బలే వచ్చావమ్మా...! నేను చాలా పుస్తకాలు చేయిస్తుంటాను. నాకు ఇష్టమైనవి పేపర్ మీద రాసి అందరికీ పంపిస్తుంటాను. ఇప్పుడు నాకు రాసే పని తప్పింది” అని లోపలికి వెళ్ళి ఆయన శ్రీమతి ఝాన్సీగారిని పిలుచుకు వచ్చారు. ఆవిడ కూడా కాసేపు మాట్లాడి “ఉండు కాఫీ తీసుకువస్తాను” అని వెళ్ళిపోయారు.

చంద్రమౌళిగారు రెండు పేపర్ల మీద ఆచంట జానకిరాం గారి గురించి రాసిన మేటర్ ఇచ్చారు. రేపు టైప్ చేసి ప్రింట్ తెచ్చి పెట్టు అన్నారు. “సరే సర్” అని ఝాన్సీగారిచ్చి కాఫీ తాగేసి వచ్చేశాను.

నేను మర్నాడు తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఒక్క తప్పు కూడా లేని ఆ రెండు పేపర్లు చూసుకుని చాలా సంతోషించారు. అప్పటి నుంచీ ఆయన మాకు ఇలా పేపర్లు చేసి పెట్టమని, ఆ పేపర్లు జిరాక్స్ తియ్యడానికి ఒక మనిషిని పెట్టుకుని, వాటిని అన్నీ ఓపికగా మడతపెట్టి రెగ్యులర్ గా ఆయన ఇంటికి వచ్చే పోస్ట్ మాన్ కి ఇచ్చి ఫ్రండ్స్ అందరకీ పంపించేవారు. పోస్ట్ మాన్ కి కూడా నెలకి ఎంతో కొంత ఇస్తుండేవారు.

ఆయన ప్రింట్ చేసిన పుస్తకమే కాకుండా... ఆయనకి ఎవరి దగ్గరైనా పుస్తకాలు నచ్చితే... అవి డబ్బులిచ్చి కొని వాటిని కూడా ఫ్రెండ్స్ అందరికీ తన పోస్టల్ ఖర్చులు పెట్టుకుని మరీ పంపించేవారు. ఆయన పెన్షన్ లో చాలా వరకు వాటికే అవుతుందని సునందగారు చెప్పారు. ఒక పోస్ట్ మాన్ రెగ్యులర్ గా రమ్మని జీతంలా ఇచ్చేవారు.

ఆయన మాకు టైపు చెయ్యమని ఇచ్చే మేటర్ – వెడ్డింగ్ కార్డుల కవర్లమీద, లేకపోతే తనకి పోస్టులో వచ్చిన కవర్ల మీద రాసి ఇస్తుండేవారు. “నాగలక్ష్మి గారూ... ఎన్నింటికి వస్తారు?” అని అడిగేవారు. నేను వెళ్ళేసరికి ఆ టైముకి బయట కుర్చీలో కూచుని వుండేవారు. ఝాన్సీ గారు కాఫీ ఇస్తానంటే... “నాగలక్ష్మి వచ్చాక ఇద్దరికీ ఇద్దువు గాని” అని చెప్పేవారుట. నేను వెళ్ళాక ఆవిడ మా ఇద్దరికీ కాఫీ ఇచ్చేవారు. అప్పటి నుంచీ నేను వాళ్ళకి బాగా అలవాటయిపోయాను.

ఒకరోజు నేను వస్తానని చెప్పాను కానీ, ఇంటికి ఎవరో రావడంతో వెళ్ళలేకపోయాను. “రేపు పొద్దున్నే వస్తాను సర్” అని చెప్పాను. “మీరు ఇంక నా డిటిపి చెయ్యద్దు. నా వర్కులన్నీ సిడి లో పెట్టి, ఇప్పటి వరకూ ఎంతయ్యిందో చెప్తే రేపు డబ్బులు ఇచ్చేస్తాను. రేపు సిడీతో పాటు లెక్క కూడా తీసుకురండి” అని కోపంగా ఫోన్ పెట్టేశారు.

నేను మొత్తం వర్కంతా సిడిలో పెట్టి, ఒక పేపరు మీద లెక్కంతా రాసి పట్టికెళ్ళి ఇచ్చాను. “ఇలా రా కూచోమ్మా.. ఆ సిడి పక్కన పెట్టు. డబ్బులు ఇస్తాలే... నువ్వు, మీ ఆయన ప్రూఫ్ రీడింగ్ చేసి తప్పులు లేకుండా ఇస్తున్నారు కదా... నాకు చాలా పని తప్పించారు. ఇదిగో ఈ మేటర్ రెడీ పెట్టాను. చేస్తావా చెయ్యవా...? పెద్దవాడిని. అర్థం చేసుకో...” అన్నారు. నాకు ఏమనాలో అర్థం కాలేదు.

మా చేత ఆయన చేయించిన మొదటి పుస్తకం 1800 సంవత్సరంలో వెన్నెలకంటి సుబ్బారావుగారు రాసిన VANGAVOLE పుస్తకం, తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ చేశాం. అవి ప్రింటింగ్ కూడా మేమే చేయించి ఇచ్చాం. అలా ఆయన దాదాపు 10 పుస్తకాల దాకా డిటిపి, ప్రింటింగ్ చేశాం.

మధ్య మధ్యలో కోపాలు, మళ్ళీ ఆయన మామూలుగా అవడం ఇలా జరిగిపోతుండేది. ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కాయలు కాసినప్పటి నుంచీ, పళ్ళయ్యేవరకు మాకోసం ఆయన సెపరేట్ గా తీసిపెట్టి ఇచ్చేవారు. ఇంట్లో ఉన్న పెద్ద కరివేపాకు చెట్టు ఆకు కోయించి వెళ్ళినప్పుడల్లా ఇచ్చేవారు.

అబ్బూరి ఛాయాదేవిగారి ‘మృత్యుంజయ’ పుస్తకం మళ్ళీ ప్రింట్ చేయించాలని వుందని చెప్పారు. నేను వెళ్ళినప్పుడు ఆ పుస్తకం ఇచ్చి డిటిపి చెయ్యమన్నారు. నేను ఆవిడ పేరు వినడమే కానీ, ఆవిడని ఎప్పుడూ చూడలేదని చెప్పాను. “అయితే సరే రేపు పొద్దున్న ఆ పుస్తకం తీసుకుని వచ్చెయ్యి. మనం సిఆర్ ఫౌండేషన్ కి వెడదాం. నేనూ ఆవిడని చూసి చాలా రోజులైంది” అన్నారు. వాళ్ళ ఫ్రెండ్ కారులో నన్ను సిఆర్ ఫౌండేషన్ కి తీసుకుని వెళ్ళారు. ఛాయాదేవిగారు కిందకి వచ్చారు. అక్కడ చెట్లకింద కూచుని చాలాసేపు మాట్లాడుకున్నారు. పుస్తకం ఆవిడ ప్రింటింగ్ చేయించమన్నారు.

వచ్చేస్తుంటే ఆయనకి తెలిసిన ఆయన ఎవరో కలిశారు. ఇద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు. ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ చూసుకోకుండా డోర్ వేశారు. చంద్రమౌళిగారి చెయ్యి నలిగింది. ఇంక బాధతో, కోపంతో ఆయన అరిచిన అరుపులకి నాకు చాలా వణుకు పుట్టింది. అప్పటి వరకూ ప్రేమగా మాట్లాడిన ఆయన్ని బాగా తిట్టారు. "నీకోసమే వచ్చానమ్మా.... నాకు దెబ్బతగిలింది. నన్ను చంపేసినట్టయ్యింది" అన్నారు. పాపం అప్పటికే ఆయని ఒంట్లో ఓపిక ఉండట్లేదు. మొత్తానికి గబగబా అక్కడ నుంచి బయల్దేరి వచ్చేశాం.

మర్నాడు వెళ్ళి ఆయన్ని పలకరించి వచ్చాను. అప్పుడు మామూలుగానే మాట్లాడారు. “నేను ఏమైనా అంటే పెద్దవాడిని కదా... పట్టించుకోకు. నువ్వన్నా, మీ ఆయన అన్నా నాకు అస్సలు కోపం లేదు” అన్నారు.

ప్రింటింగ్ వర్కులు గురించి మాట్లాడడానికి మావారు వెళ్ళేవారు. ఆయన కూడా చంద్రమౌళిగారికి బాగా నచ్చారు. మీకు ఏదో ఒకరకంగా నేను సాయపడతాను అన్నారు. మేము వినేసి వూరుకునేవాళ్ళం. కానీ ఆయన మాకు జీవితంలో మరిచిపోలేని చాలా గొప్ప సాయం చేశారు.

మేము బల్కంపేటలో ఉండేవాళ్ళం. ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చారు. "ఎన్ని రూములు?" అన్నారు. "మూడు రూములు" అన్నాం. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మర్నాడు మా వారిని పిలిచి శ్రీనగర్ కాలనీలో మాది త్రీ బెడ్ రూం ఫ్లాట్ వుంది. అది ఖాళీ అయ్యింది. మీరు అందులోకి వెళ్ళండి. ఒకసారి చూసి రండి అని మా వారికి తాళాలు ఇచ్చారు. మా వారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అది చూసి వచ్చారు. ఆయనకి బావుందని చెప్పారు. మర్నాడు ఇద్దరం వెళ్ళాం. అందులోకి ఎందుకు మారమన్నారో అర్థం కాని పరిస్థితి.

చంద్రమౌళిగారు "నాకు మీరు ఒక్క పైసా రెంట్ ఇవ్వద్దు. ఆ ఫ్లాట్ మీకే. మిమ్మల్ని ఎవరూ అడ్డు పెట్టరు" అన్నారు. కానీ ఆయన మాటలకి వెంటనే ఒప్పుకోక ఒక రెండు నెలలు తాత్సారం చేశాం. ఆయన ఎంత చెప్పినా వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించాలి కదా... అనుకున్నాం. కానీ ఆయన మేము అందులోకి మారే వరకూ ఊరుకోలేదు.

అస్సలు ఆ విషయంలో ఆయన మమ్మల్ని నోరెత్తనివ్వలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా “మీరెవరూ ఈ విషయంలో అడ్డు రావద్దు. నా డబ్బులు నా ఇష్టం” అన్నారు.

మా ఆ ఇల్లు చాలా నచ్చింది. కానీ మేము దాన్ని మా సొంతం చేసుకోవాలని మాత్రం అనుకోలేదు. నాలుగు నెలలు గడిచాయి.

క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం బలహీనమవడం మొదలు పెట్టింది. ఆయనకి ఇంట్లోనే ఒక అటెండర్ ని పెట్టి హాస్పిటల్లో లాగా బెడ్ అవీ ఏర్పాటు చేశారు. ఒకసారి నేను ఆయన రమ్మంటున్నారు అని చెప్తే వెళ్ళాను. “ఇదిగో అమ్మా... నీకోసం ఈ అలారం వాచ్ కొని వుంచాను. ఇది చూసినప్పుడు నీకు నేను గుర్తుకు వస్తాను” అని నాకు ఇచ్చారు. దాన్ని తీసుకుని వచ్చేశాను.

మర్నాడు పొద్దున్నే వాళ్ళ మనవడు – “తాతగారికి రాత్రి సీరియస్ అయ్యింది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. పొద్దున్న చనిపోయారు. తొందరగా రండి. ఆయన కోరిక ప్రకారం ఉస్మానియా హాస్పిటల్ కి డొనేట్ చేస్తున్నాం” అన్నారు. ఇలా ఒక పుస్తక ప్రియుడు, సాహితీ ప్రియుడు లోకానికి దూరమయ్యారు. చాలా బాధ అనిపించింది.

ఇంతలోకే మా అమ్మాయి పెళ్ళి కుదిరింది. ఆ ఇంట్లోనే పెళ్ళికూతురిని చేసి, ఘనంగా పెళ్ళిచేశాం. అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. నేను శ్రీమతి చంద్రమౌళిగారికి ఫోన్ చేసి మాకు ఒక మూడు నెలలు టైం ఇవ్వండి మేము వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం అని చెప్పాం. రెంట్ ఇస్తామంటే సార్ వద్దన్నారు కానీ, మీకు ఇప్పటి వరకూ అయిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తామని చెప్పాం. కానీ వాళ్ళు ఇల్లు ఇచ్చేస్తామంటే సంతోషపడ్డారు. ఆయన మాటే మా మాట అని అప్పటి వరకూ అయిన రెంట్ మాత్రం తీసుకోలేదు. మేము అదే కాపౌండ్ లో వేరే ఫ్లాట్ లోకి మారాం. రెండు స్థలాలు వున్నా... పిల్లల చదువుల విషయంలో పడి ఇల్లు కట్టే ఆలోచన చెయ్యలేకపోయాం.

కానీ ఓ మహానుభావుడి ప్రోద్బలంతో ఒక మంచి చోటికి వచ్చామని అనుకున్నాం. రోజూ మనసులో ఆయనకి ఓ నమస్కారం పెట్టుకుంటాను.
ఆయన ముద్రించిన కొన్ని..... ఇంకా కొన్ని ఆగిపోయాయి. ఆయన మాచేత చాలా పుస్తకాలు డిటిపి చేయించి, ప్రింట్ చేయించారు.
1. తుమ్మపూడి, 2. జానకితో జనాంతికం, 3. సురపురం, 4. అమ్మకి జేజే, 5. నాన్నకి జేజే, గురువుకి జేజే, 6. రామతీర్థస్వామి, 7. ఎ.జి.కె. సూక్తులు, 8. ఎజికె - నా అమెరికా పర్యటన, 9. ఆర్కాటు సోదరులు, 10. వంగవోలు - ఇంగ్లీషు, (మొదటిసారిగా వెన్నెలకంటి సుబ్బారావుగారి ఆటోబయోగ్రఫీ ఆంగ్లంలో ముద్రింపబడింది) 11. తెలుగులో వెన్నెలకంటి సుబ్బారావు జీవయాత్రా చరిత్ర, 12. వినదగు నెవ్వరు చెప్పిన (అండవిల్లి సత్యనారాయణగారి ఆకాశవాణి ప్రసంగాలు), 13. కులపతి - ఎస్.టి.జె. వరదాచార్యులుగారి జీవితచరిత్ర (కొత్తసత్యనారాయణ చౌదరి) 14. ప్రజ్ఞానిధి తెన్నేటి విశ్వనాథం (డిటిపి పూర్తయ్యాక అముద్రితంగా వుండిపోయింది) 15. రమణీయ భాగవత కథలు (ముళ్ళపూడి వెంకటరమణ), 16. సంజీవదేవ్ రచనా రుచులు, 17. ఆచంట జానకిరామ్ గారి రేడియో ప్రసంగాలు, 18. మృత్యుంజయ (లేఖాసాహిత్యం)

23, డిసెంబర్ 2022, శుక్రవారం

ఆత్మనిబ్బరమే వారి గెలుపు - 64


ఆత్మనిబ్బరమే వారి గెలుపు - 
64


నా జీవనయానంలో నాకు పరిచయమయిన ఎందరో మహామహుల గురించి తెలియచేస్తూనే... నా దగ్గిర వర్కు నేర్చుకుని వాళ్ళ పరిస్థితులని ఆత్మనిబ్బరంతో సరిదిద్దుకున్న నా శిష్యురాళ్ళ గురించి కూడా చెప్తాను. అయితే వాళ్ళ పేర్లు చెప్పద్దన్నారు కాబట్టి వేరే పేర్లతో వాళ్ళ గురించి చెప్తాను.

మాకు దగ్గరలో ఉన్న అన్నపూర్ణ డిగ్రీ చదివింది. వాళ్ళాయన టీచరు. తను రోజూ నా దగ్గిరకి నేర్చుకోవడానికి వచ్చేది. ఇద్దరు ఆడ పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళని కూడా తీసుకుని వచ్చేది. నేను నేర్పించి పక్కకి వెళ్ళగానే... వాళ్ళిద్దరూ వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసేవారు. ఆంటీ కంప్యూటర్ రావట్లేదు అని చెప్పింది. వెళ్ళి చూద్దును కదా... ఇద్దరూ బుద్ధిమంతుల్లా దూరంగా కూచుని చూస్తున్నారు. నేను చూస్తే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి వుంది. “ఎవరు ఆఫ్ చేశారు?” అన్నాను. వాళ్ళు కిక్కురుమనకుండా కూచున్నారు. అన్నపూర్ణ వెనక్కి తిరిగి “ఈ రాక్షసులే ఆంటీ...” అంది. పిల్లలకి తల్లులుచేసే కొన్ని పనులు ఇష్టం వుండవు. ఇలా ఏదో ఒక పిచ్చిపని చేస్తుంటారు. వాళ్ళ మీద అరిచి కూడా వేస్టే. నేనేమీ అనకుండా తను నేర్చుకునేవరకు అక్కడే కూచున్నాను. అలా అన్నపూర్ణ వర్కు నేర్చుకుంది.

ఇంక రెండురోజుల్లో అన్నపూర్ణ నేర్చుకోవడం అయిపోతుందనగా దగ్గరలోనే వున్న సునీత వచ్చింది. అన్నపూర్ణకి నేర్పడం చూసింది. అన్నపూర్ణ వెళ్ళగాన “ఆంటీ నాకూ నేర్పిస్తారా అంది. నాకు ఆశ్చర్యం వేసింది. నీకెందుకమ్మా... మీ ఆయన సంపాదిస్తున్నాడు. సొంతిల్లు. పిల్లలని చక్కగా చూసుకుంటున్నావు” అన్నాను. తను ఎం.ఏ. చేసింది. తనకీ ఇద్దరు ఆడపిల్లలు. చిన్నవాళ్ళు.

తను కళ్ళనిండా నీళ్ళు పెట్టుకుని, “నాకు నేర్పండి ఆంటీ...” అంది. సరే విషయం తర్వాత తెలుసుకోవచ్చని వర్కు నేర్పించడం, నాకు వచ్చిన వర్కులు తన చేత చేయించడం మొదలు పెట్టాను. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి వర్కు చెయ్యమంటే తనని పంపిస్తుండేదాన్ని. మొత్తానికి పర్ ఫెక్ట్ అయిపోయింది.

ఒకరోజు వచ్చి “ఆంటీ… నేను మీకు చెప్పలేదు కదా... మా ఆయన మీకూ తెలుసు కదా... ఆయన ఉద్యోగం చెయ్యడం అంతా అబద్ధం. తనకున్న డిగ్రీలన్నీ దొంగవే. తను ఏవేవో వర్కులు ఇస్తానని చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. వాటికి రెట్టింపు ఇస్తానన్నాడు. నాకు ఈ విషయాలేవీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకరోజు వాళ్ళందరూ ఇంటిమీదకి వస్తే కానీ నాకు తెలియలేదు. వాళ్ళు పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత జైల్లో పెట్టడం లాంటివి చాలా జరిగాయి. నేను కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. సూసైడ్ చేసుకుందామనుకుని ప్రయత్నించాను. అందరూ కలిసి హాస్పిటల్ లో చేర్పించారు. మళ్ళీ పిల్లలకోసం అన్నట్టు బతికి బయటపడ్డాను. మా నాన్న నాకోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఇంక ఆయన వల్ల కాదు. నాన్న ఒకటే మాట అడిగాడు –" ఇక్కడ వుండి కష్టాలు పడతావా...! నా దగ్గిరకి వస్తావో ఆలోచించుకో... " అన్నాడు. నేను మిమ్మల్ని అందుకే వర్కు నేర్పించమన్నాను. నేను నాన్నదగ్గిరకి వెళ్ళిపోతున్నాను. మీకు చాలా థాంక్స్ ఆంటీ. ఫోనులో మీతో మాట్లాడుతుంటాను. నేను తీసుకున్న నిర్ణయం మంచిదే కదా...” అంది.

నేను “నిర్ణయం మంచిదా... కాదా... అంటే... దూకడమా... వద్దా... అన్నట్లు వుంది. దూకితే దూకెయ్యాలి. అప్పుడు ఎలా బయటికి వస్తామని ఆలోచిస్తాము. దూకలేదనుకో... ఎలా ఎలా... అనే సందిగ్ధంలోనే వుంటాం. నీ నిర్ణయం నీకు మంచిదనిపించినపుడు అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నించు. ఇద్దరూ ఆడపిల్లలు, నాన్న సపోర్టు వుంది కదా... ” అన్నాను.

తను నాకు థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళ వూళ్ళో కలక్టర్ ఆఫీసులో టెంపరరీగా ఉద్యోగం వచ్చింది. అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. శాలరీ కూడా బాగా పెరిగింది. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. మంచి చదువులు చదువుతున్నారు. ఫోన్ చేసినప్పుడు మిమ్మల్ని రోజూ తలుచుకుంటానాంటీ... అంటుంది. ఏది ఏమైనా వాళ్ళ నాన్న సపోర్టు వున్నా ధైర్యంగా ఉద్యోగంలో సెటిల్ అయి ఏమాత్రం ఆత్మవిశ్వాసం సడలకుండా జీవితం గడుపుతోంది.

మరొక శిష్యురాలు త్రివేణి. తనకి ఇద్దరు మొగపిల్లలు. చిన్నపిల్లాడు 6 నెలలు ఉన్నప్పుడు షేర్ ఆటోలో మా ఇంటికి వచ్చి, వాణ్ణి పడుకోపెట్టి. వర్కు నేర్చుకుంది. తను నేర్చుకోవడం మొదలు పెట్టాక మేము ఇల్లు మారిపోయాం. దూరం అయినా రెండురోజులకి ఒకసారి వచ్చి నేర్చుకుని, మొత్తానికి ఇప్పుడు తన సొంతంగా కంప్యూటర్ పెట్టుకుని వర్కు చేసుకుంటోంది. ఇప్పటికీ నా దగ్గిరకి వచ్చి డౌట్స్ అడిగి తెలుసుకుంటుంది. నేను కూడా తనకి చాలా వర్కు ఇచ్చాను. చదివింది టెన్త్ క్లాసే కానీ... తప్పులు లేకుండా చేస్తుంది.

వీళ్ళు కాకుండా ఇంతకు ముందు నేర్చుకున్నవాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. వీళ్ళ బాచ్ కూడా బాగా సెటిల్ అయినట్లే.

16, డిసెంబర్ 2022, శుక్రవారం

సోమరాజు సుశీలగారితో నా అనుబంధం - 63

*** సోమరాజు సుశీలగారితో నా అనుబంధం - 63***



సాయంత్రం నాలుగు గంటలకి తెలియని ఫోన్ నెంబర్ తో ఫోన్. ఫోన్ తీశాను. అవతలి నుంచీ “హలో! నాగలక్ష్మిగారేనా!” ఎవరిదో ఆడవాళ్ళ గొంతు. “నాగలక్ష్మినే మాట్లాడుతున్నానండీ…” అన్నాను.

“నేను సోమరాజు సుశీలని మాట్లాడుతున్నాను. నరిసెట్టి ఇన్నయ్యగారు మీ నెంబర్ ఇచ్చారు. నేను పుస్తకాలు, వ్యాసాలు రాస్తుంటాను. చేత్తో రాయలేకపోతున్నాను. మీకు ఫోన్ లో చెప్తే చేసేస్తారని చెప్పారు. ఒకసారి మా ఇంటికి రండి. ఇద్దరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేద్దాం. అన్ని విషయాలూ మాట్లాడుకోవచ్చు” అన్నారు.

చాలా రోజుల తర్వాత ఒక స్నేహితురాలెవరో మాట్లాడుతున్నట్లు అనిపించింది. సుశీలగారి పుస్తకాలు చదివాను. ఎప్పుడూ చూడలేదు. ఆవిడ మాట్లాడే పద్ధతికి ఆవిడని కలవాలనే ఆసక్తి పెరిగింది. “అలాగే మేడమ్!” అన్నాను. వచ్చేముందు ఫోన్ చెయ్యమన్నారు. నేను వీలుచూసుకుని వెడదామని అనుకున్నాను.

ఒక రోజు ఫోన్ చేసి “వెంగళరావు నగర్ లో మా ఉమా పబ్లికేషన్స్ ఆఫీసు వుంది. మధ్యాహ్నం 3 గంటలకి అక్కడికి రండి. తర్వాత, నేను చెప్తుంటే ఇంగ్లీష్ రాసేవాళ్ళుంటే ఎవరైనా తీసుకురండి” అన్నారు. ముఖ పరిచయం ఏమాత్రం లేదు. అసలు ఆవిడ ఎలా వుంటారో కూడా తెలియదు. నేను “సరే మేడమ్” అని చెప్పి- ఇంగ్లీష్ ఎం.ఎ. చేసి ఖాళీగా (పిల్లలు సెటిల్ అయిపోయారు) వుంటున్నాను ఏదైనా పని చెప్పమంటున్న ఉషగారిని తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళాను.

మేము వెళ్ళేసరికి శ్రీరమణ గారు వచ్చి వున్నారు. ఆయన పేరు వినడం, ఫోటోలు చూడ్డమే కానీ డైరెక్ట్ చూడలేదు. అనుకోకుండా గొప్ప రచయితని చూసినందుకు సంతోషంగా అనిపించింది. ఆయనకి నమస్కారం చెప్పి “సుశీల గారు రమ్మన్నారు” అని చెప్పాను. “కూచోండి పది నిమిషాల్లో వస్తారు” అన్నారు శ్రీరమణగారు.

సరిగ్గా పదినిమిషాల్లో సుశీలగారు వచ్చారు. నన్ను నేను పరిచయం చేసుకుని, నాతో వచ్చిన ఉషగారిని పరిచయం చేశాను. ఒక్క నిమిషం అని చెప్పి, ఆవిడ పక్కన టేబుల్ వుంటే అక్కడ ఏదో హడావుడి పడుతున్నారు. నేను వెళ్ళి చూశాను. పెద్ద టిఫిన్ బాక్సులో పెరుగు వడలు, రవ్వ కేసరి అందరికీ పెట్టడానికి సద్దుతున్నారు. ఇప్పుడెందుకు తెచ్చారో అనుకుంటూ... నేను సుశీలగారికి సాయం చేశాను. (ఒక్క నిమిషం మా మూడో అక్క గుర్తుకు వచ్చింది. తను ఇలాగే అందరికీ పెడుతుంది.) “ఫర్వాలేదమ్మా నేను పెడతాను” అన్నారు. మేము కాకుండా ఇంకో ఇద్దరు ఎవరో వచ్చారు. అందరికీ నేను తీసుకెళ్ళి ఇచ్చాను. అలా ప్రారంభమైంది మా పరిచయం. ఆవడలు, రవ్వకేసరి చాలా రుచిగా వున్నాయి. అందరూ వస్తున్నారు కదా అని తీసుకువచ్చాను అన్నారు.

అసలు విషయంలోకి వస్తూ... “కొన్ని పుస్తకాలు “ఉమా పబ్లికేషన్స్” తో వేద్దామనుకుంటున్నాం” అన్నారు. విశ్వహిందూపరిషత్ వాళ్ళది ఇంగ్లీష్, తెలుగు రెండూ చెయ్యాలని చెప్పారు. ఉషగారిని పరిచయం చేశాను. ఇంక అప్పటి నుంచీ నేను రోజూ లంచ్ టైం వరకు వెళ్ళి ఆవిడ రాసినచ్చినవి టైప్ చేసి పెట్టేదాన్ని. శ్రీరమణగారు అప్పుడప్పుడు వచ్చేవారు.

రెండో రోజు నేను వర్కు చేస్తుంటే “లంచ్ చేద్దాం రండి. నాకు ఆకలి వేస్తోంది” అన్నారు. “మేడమ్ నేను వెళ్ళిపోతాను కదా అని తెచ్చుకోలేదు” అన్నాను. “ఫర్వాలేదు రండి. నేనూ మీకు చెప్పలేదు కదా... ఎక్కువే తెచ్చాను. ఇద్దరం కలిసి తిందాం” అన్నారు. నేను వర్కు ఆపేసి వెళ్ళాను. అన్నీ ఇద్దరికీ షేర్ చేశారు. తినేటప్పుడు “అమ్మయ్య! బెట్టు చేస్తారు, బతిమాలించుకుంటారు అనుకున్నాను. చాలా మాములుగా అలవాటయినట్టు వచ్చేశారు. ఇలా వుంటే బావుంటుంది” అన్నారు. నేను నవ్వాను.
ఇంక మర్నాడు నేనూ బాక్స్ పట్టికెళ్ళాను. లంచ్ టైంలో అరటి కాయ ఆవకూర, ఆనపకాయ పెరుగు పచ్చడి తీసి బయట పెట్టాను. రెండూ వేసుకుని తిని “చాలా బావున్నాయి. ఆనపకాయ పెరుగుపచ్చడి చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు చేసినా ఇంత బాగా రాదు” అని రెండోసారి వేసుకున్నారు. ఆనపకాయ పెరుగు పచ్చడి చేసినప్పుడల్లా సుశీలగారే గుర్తుకువస్తారు. ఆవిడతో కలిసి లంచ్ చెయ్యడం చాలా సరదాగా వుండేది. ఆ కాసేపట్లో ఏ కూరలు ఇష్టమో... వాళ్ళింట్లో వుండే వెంకటమ్మ ఎలా చేస్తుందో అన్నీ చెప్పేవారు. నాకు కూరగాయలు కొనడం ఇష్టం అని చెప్పాను. ఆవిడకి కూడా కూరలు కొనడం ఇష్టమని ఎక్కడెక్కడికి ఎలావెళ్ళేవారో... ఆవిడకి కూరగాయలవాళ్ళతో కొన్ని సంఘటనల గురించి చెప్పారు.

మేము బల్కంపేటలో వుండేవాళ్ళం వెళ్ళేదారిలో నన్ను కారెక్కించుకుని తీసుకుని వెళ్ళేవారు. వచ్చేటప్పుడు దింపేవారు. కానీ అక్కడికి రెగ్యులర్ గా రావడానికి శ్రీరమణ గారికీ, సుశీలగారికీ ఇద్దరికీ టైములు కుదిరేవి కాదు. ఇంక నాకు ఇంటికి పంపిస్తుండేవారు. ఇంక ఆఫీసుకి వెళ్ళడం మానేశాం. ఇంగ్లీష్ వర్కు చెయ్యడానికి ఉషగారికి కారు పంపించి వాళ్ళింటికి పిలిపించుకునేవారు. ఒకరోజు నాతో “ఆవిడ వల్ల ఎక్కువ ఉపయోగం అనిపించట్లేదు. కానీ నాకు ఎంతో కొంత సహాయపడుతున్నారు” అన్నారు. వర్కంతా అయిపోయాక ఉష గారితో ఎక్కువ పని చేయించుకోకపోయినా... ఆవిడకి పదివేలు ఇచ్చారు. అక్కడ ఆవిడ మంచితనం అర్థం అయ్యింది. ఉషగారు కూడా చాలా సంతోషించారు.

ఆ వర్కు అక్కడితో అయిపోయింది. నాకు ఒక్కోరోజు ఫోన్ లో వ్యాసాలు చెప్తుంటే నేను టైప్ చేసి ఇ-మెయిల్ పంపించేదాన్ని. అలా ఎన్నో వ్యాసాలు చేశాం. అప్పుడే సుశీలగారు, రంగారావుగారు, వాళ్ళమ్మగారు అమెరికా వెళ్ళినప్పటి విశేషాలతో అమెరికా ప్రయాణం పుస్తకం చెయ్యాలని మొదలు పెట్టారు. ఆ పుస్తకం చేసేటప్పుడు రాసినది ఒక్కటే కాకుండా ఆవిడ నాకు ప్రతి ఒక్కటీ వర్ణించి చెప్తుండేవారు. వెళ్ళివచ్చిన 15 సంవత్సరాల తర్వత ఇప్పుడు అవుతోంది అని చెప్పారు.

అందులో రాసిన ప్రతి సంఘటన హాస్యమిళితం, ఆనందసందోహం. వాళ్ళమ్మాయి శైలజతో జరిగిన చిన్న చిన్న వాదనలతో చాలా బావుంది. ఒకోసారి శైలజ ఆవిడకన్నా పెద్దది అయి వుంటే ఎలా వుండేదో అనిపించింది. మనం అమెరికా వెళ్ళి అక్కడివన్నీ చూసిన అనుభూతినిస్తుంది ఆ పుస్తకం.

***వీళ్ళింటికి ఏదో పనికి వచ్చిన ఒక కార్పెంటర్ ఇంటి వెళ్ళి, అతను ఎలా కట్టుకున్నాడో వర్ణించారు. నాకయితే అక్కడికి వెళ్ళిన అనుభూతి కలిగింది. ఎంత అద్భుతమైన ప్రదేశమో...*** మొత్తానికి అద్భుతమైన అనుభూతులు, అందమైన జ్ఞాపకాలతో ఆ పుస్తకం తయారయ్యింది. దానికి “ముగ్గురు కొలంబస్ లు” అని పేరు పెట్టారు. ఈ పుస్తకం ఆవిష్కరణకి శైలజ కూడా వచ్చింది. హిమాయత్ నగర్ చట్నీస్ లో మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా జరిగింది. నాకు చిరు సత్కారం చేసి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా పుస్తకాన్ని, ఒక చక్కటి అందమైన హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్ నాకు చాలా ఉపయోగపడింది.

ముగ్గురు కొలంబస్ లు చేసినప్పుడు వాళ్ళింటికి వెడుతుండేదాన్ని, అప్పుడప్పుడు సుశీలగారు మా ఇంటికి వచ్చేవారు. వెళ్ళినప్పుడల్లా వెంకటమ్మ చేతి వంట తినేదాన్ని. సుశీలగారి దగ్గర నేర్చుకున్న వెంకటమ్మ చాలా బాగా చేసేది. భోజనం అయ్యాక స్వీటు ఒవెన్ లో వేడి చేసి పెట్టేవారు. ఒకవేళ సాయంత్రం వరకు ఉండాల్సి వస్తే పకోడీలో, బజ్జిలో వెయ్యమని అవీ, మంచి కాఫీ ఇచ్చేవారు. వాళ్ళింట్లో ఉన్న రకరకాల పువ్వుల మొక్కలు చాలా బావుండేవి. కాసేపు వాటిమధ్య తిరిగి వచ్చేదాన్ని.

ముగ్గురు కొలంబస్ లు అయిపోయాక సుశీలగారు రంగారావుగార్ల పెళ్ళితో మొదలుపెట్టి, మిత్రుల, బంధువుల ఇళ్ళలో జరిగిన పెళ్ళిళ్ళన్నింటి గురించీ తు.చ. తప్పకుండా ఆవిడ చెప్తుంటే నేను టైపు చేసేదాన్ని. మనం చేస్తున్న పుస్తకాలకి మొదటి పాఠకురాలు మీరే. ఏమైనా మార్చాలంటే చెప్పమనేవారు. ఆవిడ అలా అనడమే ఆనందంగా అనిపించేది. తప్పులు లేకుండా అప్పటికప్పుడు వెంటనే అయిపోవడం ఆవిడకీ తేలికగానే వుండేది. ప్రతిదీ కూడా శైలజకి చూపించి తన అభిప్రాయం తీసుకుంటేనే ఫైనల్ చేసేవారు. ఇద్దరికీ ఈ విషయాల్లో చర్చలు బాగానే జరిగేవి. ఒకో పెళ్ళి, వాటిలో జరిగిన విషయాలన్నీ చదువుతుంటే అంత సునిశితంగా పరిశీలించారనిపించింది. ఈ పెళ్ళిళ్ళలో *** వైజాగ్ సముద్రం ఒడ్డున జరిగిన పెళ్ళి టైముకి తుఫాను రావడం. షామియానా కుర్చీలతో సహా అన్నీ కొట్టుకుపోవడం – ఇక్కడ సుశీలగారి వర్ణన ఆ సందర్భం మన కళ్ళముందు కనిపించేలా చేసింది*** నాకు బాగా నచ్చింది. అది చదివితేనే బావుంటుంది.

మొత్తానికి రకరకాల పెళ్ళిళ్లతో “పెళ్ళిపందిరి” పేరుతో ఆ పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం రిలీజంగ్ బయట పెట్టుకుందామనుకున్నారు కానీ, రంగారావుగారికి ఒంట్లో బావుండలేదని ఇంట్లోనే పెట్టారు. కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఆరోజు వాళ్ళ పెళ్ళిరోజు కూడా కావడం విశేషం.

సుశీల గారు మా అమ్మాయి ఎంగేజ్ మెంట్ కి పిలవగానే వచ్చారు. శ్రీరమణగారి కుటుంబం కూడా వచ్చారు. ఆ రోజు నేను వర్కు చేస్తున్న సాహితీపరులందరినీ పిలిచాను. అందరూ చాలా ఆప్యాయంగా వచ్చారు. వాళ్ళందరూ అమ్మా మీ అమ్మాయి ఎంగేజ్ మెంట్ కాదు మాకు సాహితీ సమావేశంలా వుంది. అనుకోకుండా అందరం కలిశామని చాలా సంతోషించారు. వాళ్ళలో కొంతమంది నా పర్మిషన్ అడిగి అమ్మా నువ్వేమీ అనుకోకపోతే మా ఫ్రెండ్స్ ని తీసుకుని వస్తాం అన్నారు. వాళ్ళందరితో నాకున్న పరిచయం అలాంటిది. అందరూ కుటుంబసభ్యులే అయ్యారు మరి.





తర్వాత ఆవిడ రాసిన చిన్న చిన్న కథలన్నీ కలిపి ఒక పుస్తకం వేద్దామని అన్నీ రెడీ ప్రూఫ్ కరక్షన్ కూడా అయిపోయింది. ఒకరోజు మీ ఇంటికి వస్తాను ఫైనల్ చేసేద్దాం అన్నారు. ఇంతలోనే నేను మా అమ్మాయి డెలివరీకి ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేలోపున సుశీలగారిని కలుద్దామనుకున్నాను కానీ కుదరలేదు. ఫోన్ లోనే మాట్లాడాను. సరేలెండి నాకూ ఒంట్లో బావుండట్లేదు. మీరు వచ్చాకే ప్రింట్ కి ఇద్దాం అన్నారు. మళ్ళీ వెళ్ళేముందు ఫోన్ చేస్తే.... “నేను ఇంత పెద్ద వయసు వచ్చాక మంచం మీద సరిగా పడుకోవడం చేత కాక కింద పడ్డాను. మా ఆయన కూడా తలగడాలు అడ్డం పెట్టుకో అని జోక్ చేశారు. చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. పది రోజులు హాస్పిటల్ లో వుండి ఇందాకే వచ్చాను. మీరు వచ్చాక పుస్తకం చేసేద్దాం ” అని ధీమాగా చెప్పారు. కానీ మాట బాగా తడబడుతోంది. సరే ఒంట్లో బాగాలేదుకదా అనుకున్నాను.

నేను 2019 సెప్టెంబర్ 5వ తేదీన ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. వెళ్ళిన కొన్ని రోజులకే వాళ్ళబ్బాయి శ్రీకాంత్ మెసేజ్ పెట్టాడు – “సుశీలగారు ఇక లేరని”. చాలా బాధగా అనిపించింది. ఆవిడ పుస్తకాలు పూర్తి చెయ్యలేకపోయాను. నేను ఆవిడతో ఉన్న అనుబంధం చాలా టూకీగా రాశాను. చాలా విషయాల్లో ఆవిడ గుర్తుకు వస్తూనే వుంటారు. ఒక గొప్ప వ్యక్తి దూరమయ్యారని చాలా బాధేసింది.

అసలు నేను చేసినన్నాళ్ళు ఆవిడలో కోపం చూడలేదు. వర్కు చేసేటప్పుడు మాత్రం నవ్వుకుంటూ, జోక్స్ వేస్తూ వుండేవారు. రాయాలంటే ఎంతో మరి....

8, డిసెంబర్ 2022, గురువారం

గుర్తుండిపోయిన రోజు - 62

 

గుర్తుండిపోయిన రోజు - 62


పొద్దున్నే లాండ్ లైన్ కి ఫోనొచ్చింది.


మేడమ్ నా పేరు రత్నాకర్. ప్రగతి ప్రింటర్స్ (*** ప్రగతి ప్రింటర్స్ వాళ్ళకి హిందీలో భగవద్గీత, తెలుగులో విఎకె రంగారావుగారి జీవిత చరిత్ర, ప్రగతి ప్రింటర్స్ స్వర్ణోత్సవ సంచిక, ఇంకా చాలా వర్కులు చేశాను ***) వాళ్ళు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు.. వెలిచాల జగపతి రావుగారు, కరీంనగర్ మాజీ శాసనసభ్యులు పేరు మీరు వినేవుంటారు. తెలుగు అకాడమీ డైరెక్టర్ గా చేసిన వెలిచాల కొండలరావుగారి తమ్ముడు. మేము కరీంనగర్ నుంచి వచ్చాం. నేను జగపతి రావుగారి పి.ఎ., సారు మీ ఇంటికి వచ్చి, ఆయన తెలంగాణ చరిత్ర పుస్తకం టైపింగ్ కి ఇద్దామనుకుంటున్నారు. ఎప్పుడు రమ్మంటారు?” అన్నారు రత్నకర్ గారు.

 

మేము ఇంట్లోనే వున్నామండీ. రండిఅన్నాను.

 

ఒక అరగంటలో జగపతి రావుగారు, ఆయన పి.ఎ. రత్నాకర్ గారు వచ్చారు. ఆయనకి వయసు 70 పైనే వుంటుంది. ఆయన చాలా పరిచయం ఉన్న వ్యక్తిలాగా ఏమ్మా.... నా తెలంగాణ చరిత్ర తప్పులు లేకుండా చెయ్యాలి. ఇదిగో మేటర్ అని ఇచ్చి, నేను మళ్ళీ రేపు సాయంత్రం వస్తాను. చేసి పెట్టెయ్యండి అన్నారు. వంద పేజీలు ఉన్నాయి.

 

ఇంతకీ నేను ఎవరో రత్నాకర్ చెప్పాడా?” అన్నారు. ఆయన గంభీరమైన గొంతుతో, స్పీడుగా మాట్లాడేస్తుంటే ఏమీ మాట్లాడకుండా కూచున్నాను. ఆయన ఒక పేపర్ ఇచ్చి, ఇవి పుస్తకంలో ముందు వస్తాయి అన్నారు.

అందులో –

 

*** కరీంనగర్ కి మాజీ శాసనసభ్యుడు. చిన్నప్పటి నుంచీ తెలంగాణ స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ గురించిన ఉద్యమవ్యాసాలు రాసి, పుస్తకాల ముద్రణ. జర్నలిస్టు, కవి. మూడు యూనివర్సిటీలకి సెనేట్ మెంబర్ చేశారు. మార్క్ ఫెడ్ ఛైర్మన్. జగిత్యాలకి, కరీంనగర్ కి శాసనసభ్యుడు. రెండుసార్లు లండన్‌లో జరిగిన సహకార సంబంధిత ప్రపంచ సెమినార్లకు భారత దేశ ప్రతినిధిగా 1973, 1976లో *** ఉన్నాయి. కూచుని ఒక మామూలు కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతున్నారు.

 

కాఫీ ఇస్తానంటే వద్దన్నారు. నేను డైటింగ్ లో ఉన్నాను. ఒక టైం ప్రకారం తీసుకుంటాను. నాకేమీ వద్దు అన్నారు. ఆయన రాసిన కవితలు కొన్ని వినిపించారు. జర్నలిస్టుగా ఆయన అనుభవాలు చెప్పారు.

 

ఆయనని సాగనంపడానికి కిందవరకూ వెళ్ళాం. ఆయన వెడుతూ వెడుతూ కరీంనగర్ లో మాకు ***పుష్పాంజలీ రిసార్ట్స్*** ఉన్నాయి. మీ కుటుంబమంతా రండి ఒక రెండురోజులు ఉండి వెళ్ళండి అన్నారు. అలాగే సర్ అని వచ్చేశాం. మర్నాడు సాయంత్రం ప్రింట్స్ తీసుకోవడానికి వచ్చి మళ్ళీ కరీంనగర్ రమ్మని చెప్పారు. మాకు ఆయన అన్నిసార్లు చెప్పడం ఆశ్చర్యం వేసింది. అప్పటికీ మేము సీరియస్ గా తీసుకోలేదు. కరీంనగర్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన పి.ఎ. రత్నాకర్ ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నారో కనుక్కోమన్నారు. వచ్చేటప్పుడు రెండురోజుల ముందు ఫోన్ చెయ్యండి అన్నారు.

 









పెద్దాయన అన్నిసార్లు చెప్పారని - మార్చి 2వ తేదీ మా అబ్బాయి పుట్టినరోజుకి వెడదామని ఫోన్ చేసి, ముందురోజు సూర్యోదయపు వేళ అందాలని, చల్లదనాన్ని ఆస్వాదిస్తూ..... బస్ లో కరీంనగర్ పుష్పాంజలీ రిసార్ట్స్ కి వెళ్ళాం. వెళ్ళిన దగ్గర నుంచీ మాకు విఐపి ట్రీట్ మెంట్. ఒక పదిమంది పట్టేంత పెద్ద రూం మాకు ఏర్పాటు చేశారు. చాలా బావుంది. వెళ్ళి మేము కొంచెం రెస్ట్ తీసుకుని రెడీ అయ్యేలోపున టిఫిన్ తెచ్చిపెట్టారు.


టిఫిన్ తిని వాళ్ళు పెంచుతున్న మొక్కలు చూడ్డానికి వెళ్ళాం. దాదాపు 200 రకాల పువ్వుల మొక్కలున్నాయి. చాలా చక్కగా పెంచుతున్నారు. అక్కడంతా పచ్చికతో ఖాళీ ప్రదేశం వుంది. అక్కడు కుర్చీలు, టేబుల్స్ వున్నాయి. సాయంత్రమప్పుడు అక్కడ సినిమా వేస్తారు. అక్కడ కూచుని తింటూ సినిమా చూస్తారు అక్కడికి వచ్చినవాళ్ళు. చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వుంది. మేము అవన్నీ తిరిగి వచ్చేలోపున లంచ్ టైం అయ్యింది.


వాళ్ళ రెస్టారెంట్ కి తీసుకుని వెళ్ళారు. ఆ చివర నుంచి ఈ చివర దాకా పెద్ద టేబుల్ దాని మీద రకరకాల వంటకాలు. అన్నీ వెజిటేరియన్. బఫే కాబట్టి మాకు కావలసినవి అన్నీ వేసుకుని తిన్నాం. ఇంట్లో భోజనం లాగే అనిపించింది. అది అయ్యాక ఐస్ క్రీం, మిల్క్ షేక్ తెచ్చి ఇచ్చారు. ఇవన్నీ వద్దు అంటే - సార్ మీకు ఏమేం ఇవ్వాలో చెప్పారు అన్నారు. కొద్ది కొద్దిగా తీసుకున్నాం.

 

ఆ రోజుకి రెస్ట్ తీసుకుని మర్నాడు వాళ్ళు ఏర్పాటు చేసిన కారులో - కరీంనగర్ కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగందల్ కోటకి వెళ్ళాం.

 

*** ఎలగందల్ కోటను వెలగందుల అని కూడా పిలుస్తారు. దీనిని కాకతీయుల (1083-1323) కాలంలో నిర్మించారు. శత్రువుల నుండి దాడులను నిరోధించడానికి ఎలగందల్ పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్లు ( 16 అడుగులు) వెడల్పు, 4 మీటర్లు (13 అడుగులు) లోతైన నీటి కందకాన్ని ఏర్పాటుచేసి అందులో మొసళ్లను వదిలేవారుట*** దీనికి చాలా చరిత్రే వుంది. మొత్తం అంతా చూడలేకపోయాం. మిగిలిన వాటికి టైం సరిపోదని మళ్ళీ ప్రయాణం కొనసాగించాం. దారిలో మానేరు ప్రాజెక్ట్ చూశాం.

 

తర్వాత చాళుక్యుల కాలం నాటి ***వేములవాడ***, ప్రాచీన చరిత్ర ఉన్న ***కొండగట్టు ఆంజనేయస్వామి గుడి***కి వెళ్ళాం. దారంతా పచ్చటి చెట్లతో చాలా అందంగా వుంది. ఇవన్నీ చూసి తిరిగి రిసార్ట్స్ కి వచ్చాం. డిన్నర్ రెండు రోజులూ చాలా బావుంది. వాళ్ళు మేమున్న రెండురోజులూ మాకు ఎటువంటి లోటూ లేకుండా చూసుకున్నారు. వచ్చేసే ముందు డబ్బులు ఇవ్వబోతే... మా దగ్గిర డబ్బులు తీసుకోవద్దని చెప్పారుట.

బయల్దేరుతుంటే జగపతిరావుగారు వచ్చారు. ఆయనకి, వాళ్ళ రెస్టారెంట్ స్టాఫ్ కి ధన్యవాదాలు చెప్పి హైదరాబాద్ కి తిరిగి వచ్చాం. అది మాకు మరిచిపోలేని మధురస్మృతి.