26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 13

    మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 13

మేం బయల్దేరే లోపున టీవీలో చైనాలో కరోనా గురించి ఒకటే చెప్తున్నాడు. ఆంటీ సింగపూర్ లో కూడా చాలా వుందిట అంటూ శేఖర్ న్యూస్ గురించి రోజూ చెప్తూనే వున్నాడు. నేను ఇంతకు ముందు స్వైన్ ఫ్లూ గురించి కుడా ఇలాగే చెప్పారు. అది కూడా ఇలాంటిదేలే అని తీసి పారేశాను. ముందు ముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందని తెలియదు. ఏది ఏమైనా ఇండియా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను.

మా అమ్మాయితో నేను వెళ్ళిపోతాను నువ్వుండిపో అన్నాను. ఒక్కసారి షాకయ్యింది. ఫీలయ్యింది. కానీ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి 12 గంటలు ప్రయాణమే అయినా 3 నెలలు పూర్తయిన పాపని తీసుకుని వెళ్ళాలంటే ఇద్దరికీ భయంగానే వుంది.  ఫ్లైట్ లో ఎలా వుంటుందోనని. వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది మేము నెల రోజులకే వెళ్ళిపోయాం ఏం ఫరవాలేదు అని చెప్పారు.

సరే మేము బయల్దేరే రోజు వచ్చింది. శేఖర్ ఎయిర్ పోర్టు వరకు వచ్చాడు. ఈ మూడు నెలల్లో శేఖర్ కి పాప బాగా అలవాటయిపోయింది. తను పడుకోబెడితేనే పడుకునేది. ఎయిర్ పోర్టులో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. మా అమ్మాయి కూడా 3 సంవత్సరాల తర్వాత వస్తోందేమో తనూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

మొత్తానికి సింగపూరు ఫ్లైట్ ఎక్కాం. మా ఇద్దరికీ ముందు సీట్లు ఇచ్చారు. ఇక ముందు సీట్లు లేకపోవడంతో ఫ్రీగానే వుంది. పాప అస్సలు ఏడవలేదు. చాలా బాగా  సహకరించింది. సింగపూర్ లో దిగాం. అప్పట్లో మాస్కులు  ఏవో పేపర్ వి దొరికాయి. సరే అవే పెట్టుకున్నాం. ఎయిర్ పోర్టులో వాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గింది. అందరూ మాస్కులు తీసేసి తిరుగుతున్నారు ఏం భయంలేదు అని చెప్పారు. ఏదైనా తప్పదు కదా.  

పాపతో ఎలా వుంటుందోనని 8 గంటలు బ్రేక్ వుండేలా ఫ్లైట్ బుక్ చేశారు. సింగపూర్ లో ఎయిర్ పోర్ట్ లో రూం బుక్ చేసుకున్నాం. మేము డైరెక్ట్ గా రూం కి వెళ్ళి, ఫ్రెషప్ అయి ఫుడ్ కోసం బయటికి వెడుతుంటే హోటల్ మేనేజర్ రూం బుక్ చేసుకున్నవాళ్ళకి ఫ్రీ ఫుడ్ అని చెప్పి వాళ్ళ హోటల్ చూపించాడు. అక్కడ బఫే సిస్టమ్.  రకరకాల బ్రెడ్ లు, బిస్కట్లు, ఐస్ క్రీంలు, పప్పు, అన్నం, శాండ్ విచ్ లు, స్వీట్లు, చాక్ లెట్స్ ఇంకా ఏవేవో వున్నాయి. సరే మేం తినగలిగినవి తిని రూంలో 4 గంటలు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ వేరే టెర్మినల్ కి వెళ్ళాలి కాబట్టి ముందే బయల్దేరాం.

ఇంకో టెర్మినల్ కి వెళ్ళాలంటే మా చిట్టిపాప, హ్యాండ్ లగేజి, పాప బ్యాగ్ ఒకటి కొంచెం కష్టమే అయింది. మొత్తానికి ఇండియా వచ్చే ఫ్లైట్ ఎక్కాం.  ఈ ఫ్లైట్ లో కూడా మాకు అనుకూలంగానే సీట్లు వున్నాయి. పాప అస్సలు ఏడవలేదు. ఇప్పటి వరకూ ఈ ప్రయాణం చాలా బాగా జరిగింది.  ప్రతిచోటా టెంపరేచర్ చెక్ చేసి పంపించారు. మొత్తానికి ఇండియా చేరుకున్నాం.



23, ఫిబ్రవరి 2021, మంగళవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 12

   మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 12






మూడవ నెలలోకి అడుగుపెట్టిన ఆర్ణ కొంచెం కొంచెం ఆటలు నేర్చింది. ఏడుపు కూడా తగ్గింది. వాళ్ళమ్మ ఆనుపానులని గుర్తుపడుతోంది. అటూ ఇటూ తిరుగుతుంటే గుర్తుపట్టి అటే చూడ్డం మొదలుపెట్టేది.

కొత్తపాపతో (2020) కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం.  మా అమ్మాయి జనవరి నెల ఎప్పుడు వస్తుందా పాపకి సంక్రాతికి భోగిపళ్ళు పోయాలని చాలా ఉత్సాహంగా వుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కుటుంబాలు ఇద్దరు ముగ్గురిని పిలిచారు.  నేను పాపాయికోసం తెచ్చిన బుజ్జి పట్టులంగా వేసింది. వాళ్ళత్తగారు చేయించిన, గాజులు గొలుసు వేసింది. ఏ కళనుందో పాప అస్సలు ఏడవలేదు. భోగిపళ్ళు పోసినంతసేపూ కదలకుండా కూచుంది.  అందరం కలిసి పాపకి భోగిపళ్ళు పోసి, చిన్నగా పేరంటం చేశాం. అది అయిన తర్వాత వాళ్ళు డిన్నర్ మా ఇంట్లోనే చేసి కాసేపు కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోయారు.  ఆస్ట్రేలియాలో వాళ్ళు పేరంటమైనా, ఫంక్షనైనా లంచ్ కానీ, డిన్నర్ కానీ తప్పనిసరిగా వుంటుంది. వేరే దేశాల్లో కూడా వుండచ్చు.

ఇంక నాకు ఇండియా మీద దృష్టి మళ్ళింది. ఎప్పుడు వెళతామా అని ఎదురు చూస్తూ కూచున్నాను. మా అమ్మాయి పెళ్ళయిన తర్వాత  మూడేళ్ళయిపోయింది. ఇండియా రాలేదు. సరే ఎలాగా లీవులో వుంటాను కదా ఇండియా వస్తాను అంది. జనవరి నాటికే వెళ్ళిపోవాలని అనుకున్నాము కానీ, పాపా ఫ్లైట్ లో ఎలా వుంటుందో అని భయం. అదీ కాకుండా మా అబ్బాయి హైదరాబాద్ లో డెంగ్యూ బాగా వుంది. దోమలు బాగా వున్నాయి ఇప్పుడు రాకండి అన్నాడు.

ఫిబ్రవరి 15 తేదీన మా అబ్బాయిది నిశ్చితార్థం అనుకున్నాం. అదో హడావుడి. మొత్తానికి ఫిబ్రవరి 10వ తేదీన ఇండియాకి టికెట్లు బుక్ చేశారు. అమ్మయ్య అనుకున్నాను.  రోజులు లెక్కపెట్టుకుంటూ కూచున్నాను.

17, ఫిబ్రవరి 2021, బుధవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 11

  మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 11



శేఖర్, వీణా వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలందరినీ  ఎత్తుకుంటుండేవారు. వాళ్ళందరూ ఎవరు ఎత్తుకున్నా కుయ్ కయ్ మనేవాళ్ళు కాదు.  మా అమ్మాయి ఫ్రెండ్ సవితా అని వుంది.  వాళ్ళమ్మాయి 5వ నెల వచ్చినా  చడీ చప్పుడు లేకుండా కదలకుండా ఒళ్ళో పడుకునేది.  అలా చూస్తూ వుండేది అంతే... నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే మా అమ్మాయి వీణాతో అంటే ఆస్ట్రేలియాలో పిల్లలు ఇలాగే వుంటారు చాలామందిని చూశాం కదా అంది. నేను నిజమే అనుకున్నాను.

కానీ వీళ్ళు పాప అంత ఏడుస్తుందని వూహించలేదు.  శేఖర్ వేరే రూంలో పడుకున్నా... కూడా అర్థరాత్రి లేచి వచ్చేవాడు. పాప ఏడుపు వినిపిస్తున్నట్లే వుందని. కానీ పాప నిద్రపోతుండేది.

అక్కడ తప్పనిసరిగా వారానికి ఒకసారి నర్స్ అప్పాయింట్ మెంట్ కి వెళ్ళాలి. వాళ్ళు పిల్లల బరువు, పొడుగు చూసి దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా వున్నారో చెప్పేవారు.  వాళ్ళు చెప్పడం అటుంచి మా అమ్మాయి వాళ్ళని సవాలక్ష ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకునేది. ఎన్ని అడిగినా నవ్వుతూ ఓపికగా సమాధానం చెప్పేవారు.

మూడవ నెల వచ్చింది. కొంచెం ఏడుపు తగ్గింది. ఒకరోజు పాపకి వాక్సిన్ వేయించడానికి నర్స్ అప్పాయింట్ మెంట్ కి వెళ్ళాం. చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకు వచ్చారు. లోపల ఒక బాబుకి ఇంజక్షన్ చేస్తుంటే వాడు బాగా గట్టిగా ఏడుస్తున్నాడు.  నేను ఎందుకో పాప మొహంలోకి చూస్తే. బిక్కమొహం వేసుకుని వుంది. కళ్ళనుంచి ధారాపాతంగా నీళ్ళు కారిపోతున్నాయి. చాలా ఆశ్చర్యం వేసి వీణాకి చెప్పాను. తన భుజం మీద వుండడంతో వీణా చూడలేదు. తను కూడా చూసి ఆశ్చర్యపోయి కళ్ళు తుడిచింది.

ఇంతలోకే ఆ వాక్సిన్ వేయించుకున్న బాబు, వాళ్ళమ్మ బయటికి వచ్చారు. అసలే అక్కడవాళ్ళు తెల్లగా వుంటారేమో... పిల్లాడి బాధ చూడలేకపోయిందేమో ఆ అమ్మాయి మొహం ఏడ్చి, ఎరుపెక్కిపోయింది. మొత్తానికి కాసేపటికి నవ్వారు. పాప కూడా వాళ్ళని చూసి నవ్వింది.  కానీ పాపకి ఇంజెక్షన్ చేసినప్పుడు మాత్రం కొంచెం కుయ్ మని మామూలుగా వుంది.  అమ్మయ్య అనుకున్నాం. ఎంత ఏడుస్తుందో అని భయపడ్డాం. 

వాక్సిన్ వేయించాక జ్వరం కూడా ఏమీ రాలేదు. నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే శేఖర్ వీణాలకి మొదటి సంతానం, కొత్త కావడంతో ప్రతి దానికీ కంగారు పడేవారు. 

 


14, ఫిబ్రవరి 2021, ఆదివారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 10

  మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 10



ఆర్ణకి డ్రెస్, డైపర్స్ మార్చడానికి ఒక ట్రాలీ వుండేది.  అప్పుడప్పుడు ఏడ్చినప్పుడు దానిమీద పడుకోపెట్టి అటూ తిప్పుతూ వుండేదాన్ని. కాసేపు ఏడుపు మానేసేది. మళ్ళీ కాసేపటికి మామూలే.

పాప చేష్టలు వింతగా వుండేవి. ఒక నెల రోజులు అయి ఊ ఊ అంటూ ఊ కొట్టేది. ఎవరైనా వీడియో కాల్ చేస్తే ఏడుపు మానేసి ఊ ఊ ఊ అంటూ కబుర్లు చెప్పేది. అవతల రెగ్యులర్ గా కనిపించే వాళ్ళ తాతా, నానమ్మలని బాగా గుర్తు పట్టి కేరింతలు కొట్టేది.

నేను ట్రాలీ మీద పడుకోపెట్టి కాకి, పిచుక కథ చెప్పేదాన్ని. గట్టిగా నెల రోజుల పిల్ల. ఏడుపు ఆపి నేను చెప్తున్నంతసేపూ అలా చూసేది. నేను జంతువుల అరుపులు చెప్తూ కాకి కావు కావు మంటుంది. పిచుక కిచకిచ అంటుంది అని చెప్పి.

కాకేమంటుందీ అనగానే ఆవ్ ఆవ్ అనేది. నాకు ఆశ్చర్యం వేసి, మా అమ్మాయిని పిలిచి చూడు చూడు అని మళ్ళీ కాకి ఏమంటుంది. అంటే ఆవ్ ఆవ్ అంది.  ఎందుకు అలా రిపీట్ చేసేదో.... దానికి ఏమర్ధమయ్యేదో తెలియదు.

నాకు అదేదో అంటే మేము ఊహించుకున్నామేమో అనుకుని డౌట్ వచ్చి మర్నాడు మళ్ళీ అడిగాను. మళ్ళీ అలాగే అంది. కానీ వీళ్లు రికార్డు చేద్దామనుకునేసరికి ఫోను వంక చూసి అనేది కాదు.  

అలా రెండోనెల గడిచిపోయింది. నేను సాయంత్రం అప్పుడు వీణ, శేఖర్ పాపని చూసుకుంటుంటే వాళ్ళకి దగ్గరలో వున్న పార్కుకి వాకింగ్ కి వెళ్ళి ఒక రెండు కిలోమీటర్లు తిరిగి వచ్చేదాన్ని.

రాగానే వంట కార్యక్రమం అయిన తర్వాత పాపని ఎత్తుకుంటే వీణా, శేఖర్ తినిసేవాళ్ళు. లేకపోతే వీణా పాపని ఎత్తుకుంటే తనకి నేను పెట్టేసి, తర్వాత నేను తినేదాన్ని. అస్సలు వీణా దగ్గర నుంచి వచ్చేదే కాదు. రెండు నెలలు నిద్ర లేని రాత్రులతో, పాప ఆపని ఏడుపులతో ఎలా గడిచిపోయాయో తెలియదు.  

 


12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 9

 మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 9

ఉయ్యాల్లో... పాప... 

21వ రోజున తెలిసిన కుటుంబ మిత్రులు వుంటే వాళ్ళని మాత్రమే పిలిచి ఉయ్యాల్లో వేశాం. 





ఈ కార్యక్రమం అంతా జరిగినంతవరకూ ఏడవకుండా నిద్రపోతూనే వుంది ఆర్ణ. కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. భోజనాలు కూడా పెద్ద ఆర్భాటం చెయ్యకుండా మామూలుగానే చేశాం. అందరం కలిసి సరదాగా భోజనం చేసి ఆ కాసేపు ప్రశాంతంగా గడిపాం.

మర్నాడు పొద్దున్న అమ్మా మనం రేపు ఫోటో షూట్ కి వెళ్ళాలి అంది. ఇప్పుడు ఏమిటి అంటే పాపకి అంది. వేరే దేశాలన్నిటిలోనూ వీళ్ళకి ఇదొక ముచ్చట. మా అమ్మాయి ప్రెగ్నెంట్ గా వుండగా కూడా బయట ఒక చక్కటి పార్కులో రకరకాల డ్రెస్సులు వేసి, రకరకాల పోజుల్లో ఫోటోలు తీశారు. 

సరే పొద్దున్నే 8 గంటలకల్లా బయల్దేరి వెళ్లాం. ఒక పాతికేళ్ళ అమ్మాయి ఇంట్లో ఒక చిన్న రూంలో  కెమేరా, పిల్లలని పడుకోపెట్టి తియ్యడానికి రకరకాల వస్తువులని ఏర్పాటు చేసి పెట్టుకుంది.  చాలా ఆశ్చర్యం అనిపించింది. పోనీ పెద్ద శుభ్రంగా కూడా లేదు.  మొత్తానికి ఏదోరకంగా సంపాదన మాత్రం వుంటుంది. 

సరే పాపని తీసుకుంది. పాపకి రకరకాల డ్రెస్సులు మారుస్తూ మధ్య మధ్యలో పాప లేవకుండా మొహం మీద చేతులతో తిప్పుతూ  చాలా నైపుణ్యంతో ఫోటోలు తీసింది. మొత్తానికి ఒక పది పన్నెండు ఫోటోలు తీసింది. ఆశ్చర్యం ఆ అమ్మాయి ఫోటోలు తీస్తున్నంతసేపూ అస్సలు కదలలేదు.  ఫోటోలన్నీ చాలా బాగా వచ్చాయి. ఇలా ఫోటోలు తియ్యాలంటే నెలలోపల తీస్తేనే కుదురుగా వుంటారుట. 

ఎవరి ముచ్చట్లు వాళ్ళవి.  

11, ఫిబ్రవరి 2021, గురువారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 8

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 8

వీణా లేచేలోపున టిఫిన్ రెడీ చెయ్యాలని తనకంటే ముందుగానే లేచి రెడీ చేశాను.  పాప కదిలితే లేస్తుందని తనూ చివరకి ఒదిగి పడుకునేది. దాంతో తనకీ సరిగా నిద్ర వుండేది కాదు.  వీణా లేస్తుండగానే పాప కూడా లేచేసేది.  ఈ లోపున మా టీలు, టిఫిన్ లు అయిపోయేవి. నేను పాపని ఎత్తుకుంటే తను టిఫిన్ తినేసేది. 

కానీ తల్లిపాలు అవడం వల్ల తన దగ్గిరే వుండేది. నేను కానీ, శేఖర్ కానీ తీసుకుందామనుకుంటే ఇంటి కప్పు ఎగిరిపోయేలా ఒళ్ళు విరుచుకుంటూ ఏడ్చేసేది. ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇంక బలవంతంగా ఎత్తుకుని ఒళ్ళో పడుకోపెట్టుకుని 'జయ జనార్ధనా కృష్ణ జానకీ పతే... జయ విమోచనా కృష్ణ జన్మ మోచనా...టhttps://www.youtube.com/watch?v=cdf-bscP324' పాట పాడితే కళ్ళు పెద్దవి చేసుకుని మొహంలోకి చూస్తూ వింటూ నిద్రపోయేది. 

ఆ ముచ్చట కూడా ఎన్నో రోజులు లేదు. మళ్ళీ మామూలే. నేను పాపకి, వీణాకి అన్నీ చేసి పెట్టి మధ్యాహ్నం రెండున్నర వరకూ తనతోనే వుండేదాన్ని. రెండున్నరకి శేఖర్ వచ్చాక నేను కంప్యూటర్ రూంలోకి వెళ్ళి నేను ఇండియా నుంచి తెచ్చుకున్న వర్క్ చేసుకుంటూ కూర్చునేదాన్ని. 

కానీ వీణాకి పాప ఎంత సేపూ తన దగ్గిరే వుండేసరికి అస్సలు ఓపిక వుండేది కాదు.    ఆ ఓపిక లేని తనంతో కోపం కూడా వచ్చేది. కోపంతో ఉక్రోషం వచ్చేది.  ఒకలాంటి డిప్రెషన్. అది పోగొట్టడానికి దగ్గర కూచుని తన చిన్నప్పటి కబుర్లు అన్నీ చెప్తూ వుండేదాన్ని.  పాప చాలా వరకు ఏడుస్తూనే వుండేది.

21వ రోజున బారసాల చాలా గ్రాండ్ గా చేద్దామనుకున్నాం. కానీ, పాప ఏడుపు చూసి పిలవాలనుకున్న వాళ్ళని ఎవరినీ పిలవలేదు. 

10, ఫిబ్రవరి 2021, బుధవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 7

  మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 7

రాత్రి బాగానే నిద్రపోయింది. మూడు రోజులు పాపాయి ఇంట్లో వుందా లేదా అన్నట్లు వుండేది. 

వీణాకి కూడా తినవలసినవి అన్నీ టైం ప్రకారం చేసి పెట్టాను.  డిష్ వాషర్ అంటారు కానీ, అందులో గిన్నెలు సద్దడం, మళ్ళీ డ్రై అయిన గిన్నెలు తియ్యడం పెద్ద పనే. 

ఇల్లంతా తెల్లటి మార్పుల్ కాబట్టి కొంచెం కిందపడినా మరకలు కనిపిస్తుంది. ఇల్లంతా క్లీనింగ్ శేఖర్ చూసుకునేవాడు.  అంత పెద్ద ఇల్లు క్లీన్ చెయ్యడానికి చిన్న రౌండ్ గా వుండే Robot ని తీసుకున్నారు. డస్ట్ అంతా క్లీన్ అయిపోయేది.  

 నేను వీణా ఒక రూంలో పడుకునేవాళ్ళం.  పాపని మధ్యలో పడుకోపెట్టేది. గుడ్డలో ర్యాప్ చేసి పడుకోపెట్టేది కాబట్టి కదలకుండా పడుకునేది. అయినా కూడా నేను పాపమీదకి వెళ్ళిపోతానేమోనని మంచం చివరికి పడుకునేదాన్ని. రాత్రి కిందపడతానేమోనని భయం.  మళ్ళీ వీణాకి ఆకలి వేస్తుంది కాబట్టి తొందరగా లేవాలని ఆరాటం. సరిగా నిద్ర పట్టేది కాదు.

నాలుగోరోజు రాత్రి పాప బాగా ఏడవడం మొదలుపెట్టింది. వీణా కంగారుగా శేఖర్ రూంలోకి వెళ్ళి లేపింది. నేను చెప్తూనే వున్నా... అలాగే ఏడుస్తారు కంగారు ఏం లేదు. ఇప్పుడే బయటి ప్రపంచంలో అడుగు పెట్టింది కదా.... వాతావరణం అన్నీ అలవాటు అవ్వాలి కదా అని.  నాకు ఆ విషయాలు పాత అయినా వాళ్ళకి కొత్త కదా... రాత్రి 1 గంట అయ్యింది.  ఇద్దరూ కలిసి పాపని తీసుకుని కారులో 20 కిలో మీటర్ల దూరంలో    తనకి డెలివరీ అయిన God Murdoch Hospital వెళ్ళారు. 

వాళ్ళు తిరిగి వచ్చేసరికి తెల్లవారు జామున 3 గం. అయింది.  హాస్పిటల్ వాళ్ళు పిల్లలు పుట్టిన కొత్తలో అలాగే ఏడుస్తారు. కంగారేం లేదు అని చెప్పారుట.  అప్పుడు శంఖంలో పోస్తే తీర్థం అయినట్లు అయింది. 

శేఖర్ కి కూడా నెల రోజులు లీవు ఇచ్చారు. పొద్దున్న అందరం లేటుగా లేచాం. 



8, ఫిబ్రవరి 2021, సోమవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 6

 మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 5





ఆ రోజు రాత్రి అలా నిద్రపోయాను. పాపని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలని స్కెచ్ వేసుకున్నాను. పొద్దున్నే 6 గంటలకి మెలకువ వచ్చేసింది. వాళ్ళు హాస్పిటల్ నుండి రావడానికి 10.30 అవుతుందని చెప్పారు. 

కొంచెం టీ కలుపుకుని తాగి, ఇంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ పువ్వులదండలన్నీ తెచ్చి చక్కగా అలంకరించాను. వాళ్ళు వచ్చేలోపున టిఫిన్ తినేసి రెడీగా వున్నాను. 

సరిగ్గా 10.30కి వాళ్ళు ఇంటికి వచ్చారు. మెయిన్ డోర్ నుంచి స్వాగతం చెప్పాలి కదా... ఆ డోర్ ఓపెన్ చేసి పాపకి దిష్టి తీశాను. 

వీణ, శేఖర్ పాపని తీసుకుని లోపలికి వస్తూ షాక్ అయ్యారు. వాళ్ళు ఊహించని ఆహ్వానం. అందమైన ఆహ్వానం.  చాలా సంతోషించారు. 

పాప ప్రస్తుతం ఏడవకుండానే వుంది.  వీణాకి తినడానికి వెజిటబుల్ కిచిడి చేసి పెట్టాను.  ఇంటి భోజనం చాలా ప్రేమగా, ఆప్యాయంగా తింది. 

పాపని తీసుకుని పడుకోబెట్టడానికి వెళ్ళింది. ఈలోపున నేను వంట చేశాను. డెలివరీ అయ్యాక ఎలాంటి కూరలు పెట్టాలో తెలుసు కాబట్టి అన్నీ చేసి దగ్గరుండి తినిపించాను. 

వాళ్ళు ఒక పిల్లకి తల్లి అయినా నాకు నా కూతురు చిన్న పిల్లే.  

అలా ఆ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు. 

7, ఫిబ్రవరి 2021, ఆదివారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 5

 మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 5






మర్నాడు పొద్దున్న మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాను. పాప పడుకుని నిద్రపోతూనే వుంది. చాలా చక్కగా వుంది.  వాళ్ళు నాకు లంచ్ వాళ్ళు రైస్, పప్పు, మిక్స్ డ్ వెజిటబుల్ చట్నీ, ఐస్ క్రీం, పళ్ళ ముక్కలు, వెజిటబుల్ కట్ లెట్ ఇచ్చారు. అన్నీ బావున్నాయి. 

పాపని కాసేపు ఎత్తుకుని పాలు పట్టాను. ఎందుకో ఒక రెండు రోజులు అలా పట్టమన్నారు. సాయంత్రం శేఖర్ నన్ను ఇంటి దగ్గర దింపుతానని చెప్పాడు. అక్కడ ఒక చోట శేఖర్ వచ్చే వరకూ వెయిట్ చేశాను. 

అనుకోకుండా కళ్ళపడిన దృశ్యం. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాననుకుంటున్నారా.... మధ్యలో ఏం జరిగిందో తెలియాలి కదా....

చిన్న ప్రదేశం....
ఎంత అందమో....
చిన్న కొలను, కొలను పక్కన చిన్నకొండ
కొండమీదకు వంగి వూసులాడుతున్న చెట్లు
చెట్ల చాటునుంచి రంగులీనుతున్న సూర్య కిరణాలు
ఆ కిరణాలతో చెరువులో అందంగా ఏర్పడిన ఇంద్రధనుసు
ఆ కిరణాల మధ్య ఈదులాడుతున్న చేపలు
నీటిలో తమ నీడల అందాలు చూస్తూ మురిసిపోతున్న చెట్లు
అక్కడే ఉండాలనిపించేంత అందం. ఇది ఎక్కడో వూరవతల కాదు.
సిటీ మధ్యలో ఒక హాస్పిటల్ పక్కనే వుంది ఈ అందమైన దృశ్యం

దీన్ని వెంటనే ఫోనులో బంధించేసి శేఖర్ తో కలిసి ఇంటికి వచ్చేశాను. రాత్రి ఎవరింటికీ వెళ్ళను ఒక్కదాన్నే వుంటాను. ఫర్వాలేదు అని చెప్పాను. నన్ను దింపేసి వెళ్ళిపోయాడు.

కొంచెం భయం వేసింది అంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నీ వుంటాలంటే... పైగా చివరి బెడ్ రూం. ఫ్రెంట్ డోర్ కి నేను పడుకున్న బెడ్రూంకి చాలా దూరం. ముందర ఏమవుతుందో వెనక ఉన్నవాళ్ళకి తెలియదు. సరే అన్ని డోర్ లు లాక్ వేసుకుని డిన్నర్ చేసి రూంలోకి వెళ్ళి ఇండియాలో మా వాళ్ళతో కాసేపు ఫోన్ మాట్లాడాను. మొత్తానికి రాత్రి పదకొండున్నరకి ఎలాగో నిద్ర పట్టేసింది.



5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 4

 మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 4


ఆస్ట్రేలియాలో హాస్పిటల్ లో పాపని తల్లి పక్కన పడుకోనివ్వరు. పాలివ్వడానికి మాత్రమే తల్లి తీసుకోవాలి. పక్కన ఉయ్యాలలోనే పడుకోపెడతారు.  అందుకని ఆ రాత్రి నేను మా అమ్మాయి పక్కనే పడుకున్నాను. కొత్తచోటు కాస్త ఇబ్బందిగానే అనిపించింది. పడుకుంటే జారిపోయే పరుపులు. అందులోను సిల్కు చీర కట్టుకున్నానేమో చాలా ఇబ్బందిగా అనిపించింది. 

శేఖర్ ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్న హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన వెజిటబుల్  శాండ్ విచ్, పళ్ళ ముక్కలు తిన్నాను. పాపకి వాళ్ళు తల్లి దగ్గర అలవాటయ్యేలోపున చిన్న సీసాతో పాలు పట్టమని ఇచ్చారు. పాలు తాగి మళ్ళీ పడుకుంది. పడుకునే ప్రతిసారీ ర్యాప్ చేసేవారు. కదలకుండా పడుకునేది. పొద్దున్న 10 గంటలకి చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ వచ్చారు. ఆయన కూడా ఆస్ట్రేలియన్ ఆరడుగుల పొడుగు వున్నారు. పాపని అంతా చెక్ చేసి, తన రెండు చేతుల వేళ్ళు పాప చిట్టి చేతుల మధ్య పెట్టి పట్టుకోగానే పైకి లేచింది. రెండు రోజుల పిల్ల అలా లేచేసరికి డాక్టర్ కి చాలా ఆశ్చర్యం వేసింది. నవ్వుతూ వెరీ స్ట్రాంగ్ అని మళ్ళీ పడుకోపెట్టేశాడు. ఆయన 3.5 కిలోల పాపని అరిచేతిలో ఎత్తేసుకున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. 

డెలివరీకి ముందు మా అమ్మాయి వీణ బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బాదం పప్పులు, పిస్తా వేసిన జ్యూస్ తాగేది. శేఖర్ చాలా శ్రద్ధగా చేసి ఇచ్చేవాడు. బహుశ దాని ప్రభావం అనుకుంట పాప హెల్దీగా వుండడానికి అనుకున్నాం.

రెండోరోజు మధ్యాహ్నం నాకు లంచ్ కి వెజిటబుల్ కట్ లెట్ రోటీ, రాజ్ మా కర్రీ, పెరుగు, ఉడక పెట్టిన పండు గుమ్మడి ముక్క, ఒక గ్లాస్ నిండా బాదం పాలు ఇచ్చారు. చాలా హెవీ అయిపోయింది.

నేను లంచ్ చేసిన తర్వాత శేఖర్ నన్ను ఇంటి దగ్గర దింపాడు. ఆరోజు రాత్రి అంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నీ వుండడానికి భయం వేసి. దగ్గరలోనే వున్న వీళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి పడుకున్నాను. 

అలా పాప పుట్టి రెండో రోజు అయ్యింది. 

2, ఫిబ్రవరి 2021, మంగళవారం

మనవరాలా... మజాకానా... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 3


మనవరాలా... మజాకానా... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 3


వీణాకి సీమంతం అయిపోయింది.  9వ నెల వచ్చేసినా అలాగే ట్రెయిన్ లో ఆఫీసుకి వెళ్ళి వస్తోంది. నాకేమో భయం. ఎలావుంటుందో అని. కానీ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ఎవరికైనా ఏ సహాయమైనా చాలా బాగా చేస్తారు. అదొక ధైర్యం. 

నన్ను అన్నం కలిపి పెట్టమనేది. శనివారం రోజు అంటే అక్టోబరు 24, 2019 నేను తనకి అన్నం పెట్టాను. పడుకుంటానని చెప్పి వెళ్ళింది. ఇంతలోనే శేఖర్ ఆంటీ వీణాకి బాగాలేదు. హాస్పిటల్ కి వెడతాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళమ్మని నాకు సాయం ఉండమని చెప్పి వెళ్ళిపోయారు.  నాలుగు బెడ్ రూముల పెద్ద ఇల్లు. ఈ చివర వుంటే ఆ చివర ఏమవుతుందో తెలియదు. పైగా గాలి చప్పుడు బాగా వినిపిస్తుంది. ఒక్కదాన్నీ వుండడానికి భయం వేసింది. 

రాత్రంతా హాస్పిటల్ లోనే వున్నారు.  నేను గంట గంటకీ ఫోన్ చేస్తూనే వున్నాను. మొత్తానికి పొద్దున్న ఎనిమిది గంటలకి ఫోన్ చేస్తే కేర్ కేర్ మని ఏడుపు వినిపించింది.  అవతలి నుంచి శేఖర్ ఆనందంతో గొంతు పూడుకుపోయి మాటలు తడబడుతూ మాట్లాడుతున్నాడు.  మా ఇంట్లో ఓ చిన్నారి అడుగు పెట్టిందంటే అందరికీ ఆనందంగా అనిపించింది. నాకు వీడియో కాల్ లో చూపించారు. 

నాకు ఎప్పుడు డైరెక్ట్ గా చూస్తానా అని ఆత్రంగా అనిపించింది. సాయంత్రం వీళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళారు. 

బుజ్జి పాపాయిని చూసేసరికి నా ఆనందానికి అంతులేదు. చక్కగా గుడ్డల్లో ర్యాప్ (చుట్టేసి) చేసేసి పడుకోపెట్టారు. నేను అదే మొదటిసారి అలా చూడడం. ఆశ్చర్యం వేసింది. ఏంటలా చుట్టేశారు అని అడిగాను. వాళ్ళు అలా అయితే కదలకుండా పడుకుంటారని చెప్పారు.  

ఆరోజు రాత్రి నేను ఆసుపత్రిలోనే వున్నాను. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఉడకపెట్టిన గుమ్మడికాయ ముక్క, బన్, ఉడకపెట్టిన గింజలు, సూప్, పాలు, పళ్ళ ముక్కలు. మొత్తం అన్నీ ఒకసారి తినలేం. ఆకలికి ఏదో ఒకటి తినాలి. 

తనకి డెలివరీ చేసిన డాక్టర్ రౌండ్స్ కి వచ్చింది. ఆస్ట్రేలియన్ నార్మల్ డెలివరీలు చెయ్యడంలో స్పెషలిస్ట్. 6.5 ఫీట్ హైట్. అందంగా వుంటుంది. చక్కగా మాట్లాడుతుంది. 

ఆవిడ దగ్గిరకి వీణా చెకప్ కి వెళ్ళినప్పుడు రెండు మూడుసార్లు వెళ్ళాను. డాక్టర్ చెక్ చేస్తుంటే పాప కాళ్ళతో చేతులని తన్నేది. పాపని వీడియోలో చూపించేవారు.  అలా నేనూ ఆవిడకి పరిచయం.