2, ఫిబ్రవరి 2021, మంగళవారం

మనవరాలా... మజాకానా... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 3


మనవరాలా... మజాకానా... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 3


వీణాకి సీమంతం అయిపోయింది.  9వ నెల వచ్చేసినా అలాగే ట్రెయిన్ లో ఆఫీసుకి వెళ్ళి వస్తోంది. నాకేమో భయం. ఎలావుంటుందో అని. కానీ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ఎవరికైనా ఏ సహాయమైనా చాలా బాగా చేస్తారు. అదొక ధైర్యం. 

నన్ను అన్నం కలిపి పెట్టమనేది. శనివారం రోజు అంటే అక్టోబరు 24, 2019 నేను తనకి అన్నం పెట్టాను. పడుకుంటానని చెప్పి వెళ్ళింది. ఇంతలోనే శేఖర్ ఆంటీ వీణాకి బాగాలేదు. హాస్పిటల్ కి వెడతాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళమ్మని నాకు సాయం ఉండమని చెప్పి వెళ్ళిపోయారు.  నాలుగు బెడ్ రూముల పెద్ద ఇల్లు. ఈ చివర వుంటే ఆ చివర ఏమవుతుందో తెలియదు. పైగా గాలి చప్పుడు బాగా వినిపిస్తుంది. ఒక్కదాన్నీ వుండడానికి భయం వేసింది. 

రాత్రంతా హాస్పిటల్ లోనే వున్నారు.  నేను గంట గంటకీ ఫోన్ చేస్తూనే వున్నాను. మొత్తానికి పొద్దున్న ఎనిమిది గంటలకి ఫోన్ చేస్తే కేర్ కేర్ మని ఏడుపు వినిపించింది.  అవతలి నుంచి శేఖర్ ఆనందంతో గొంతు పూడుకుపోయి మాటలు తడబడుతూ మాట్లాడుతున్నాడు.  మా ఇంట్లో ఓ చిన్నారి అడుగు పెట్టిందంటే అందరికీ ఆనందంగా అనిపించింది. నాకు వీడియో కాల్ లో చూపించారు. 

నాకు ఎప్పుడు డైరెక్ట్ గా చూస్తానా అని ఆత్రంగా అనిపించింది. సాయంత్రం వీళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళారు. 

బుజ్జి పాపాయిని చూసేసరికి నా ఆనందానికి అంతులేదు. చక్కగా గుడ్డల్లో ర్యాప్ (చుట్టేసి) చేసేసి పడుకోపెట్టారు. నేను అదే మొదటిసారి అలా చూడడం. ఆశ్చర్యం వేసింది. ఏంటలా చుట్టేశారు అని అడిగాను. వాళ్ళు అలా అయితే కదలకుండా పడుకుంటారని చెప్పారు.  

ఆరోజు రాత్రి నేను ఆసుపత్రిలోనే వున్నాను. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఉడకపెట్టిన గుమ్మడికాయ ముక్క, బన్, ఉడకపెట్టిన గింజలు, సూప్, పాలు, పళ్ళ ముక్కలు. మొత్తం అన్నీ ఒకసారి తినలేం. ఆకలికి ఏదో ఒకటి తినాలి. 

తనకి డెలివరీ చేసిన డాక్టర్ రౌండ్స్ కి వచ్చింది. ఆస్ట్రేలియన్ నార్మల్ డెలివరీలు చెయ్యడంలో స్పెషలిస్ట్. 6.5 ఫీట్ హైట్. అందంగా వుంటుంది. చక్కగా మాట్లాడుతుంది. 

ఆవిడ దగ్గిరకి వీణా చెకప్ కి వెళ్ళినప్పుడు రెండు మూడుసార్లు వెళ్ళాను. డాక్టర్ చెక్ చేస్తుంటే పాప కాళ్ళతో చేతులని తన్నేది. పాపని వీడియోలో చూపించేవారు.  అలా నేనూ ఆవిడకి పరిచయం. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి