31, మే 2023, బుధవారం

***కొత్త జీవితంలో అడుగుపెట్టిన మా అమ్మాయి వీణాధరి. ఇది నా జీవనయానంలో ఒక అపురూపమైన ఘట్టమే*** - 87

 ***కొత్త జీవితంలో అడుగుపెట్టిన మా అమ్మాయి వీణాధరి.

ఇది నా జీవనయానంలో ఒక అపురూపమైన ఘట్టమే***
జీవితంలో నేను ప్రతిదాన్నీ ఆనందంగానే ఆస్వాదించాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగానే నిలబడ్డాను. ఇక చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే...

మా అమ్మాయి వీణాధరి బిటెక్ అయిన తర్వాత మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాలనుకుంది. అనుకున్నట్టే మూడు నెలలకి మంచి శాలరీతో కాగ్నిజెంట్ లో చేరింది ఒక ఆరునెలలు చెన్నైలో ట్రైనింగ్. అక్కడ మా అత్తగారూ వాళ్ళు ఉన్నా... తన ట్రైనింగ్ ప్లేస్ కి 2 గంటల ప్రయాణం. మొత్తానికి తనని అక్కడ దింపేసి వస్తుంటే కళ్ళనించీ నీళ్ళు బొటబొటా కారిపోయాయి. నేను అలా అయినందుకు నాకే ఆశ్చర్యం వేసింది.

కానీ అలా దూరంగా వుండడం వల్ల చాలా విషయాలు తెలుసుకుంది. కుటుంబానికి దూరంగా వుంటే ఎలావుంటుందో అర్థం అయ్యింది. నలుగురితో ఎలావుండాలో తెలుసుకుంది. వేరే దేశాలు కాకపోయినా కనీసం ఇల్లు దాటి వెడితే ప్రపంచం ఎలా వుంటుందో తెలుస్తుంది.

ఆరు నెలలు ట్రైనింగ్ అయి హైదరాబాద్ వచ్చేసింది. రోజూ ఉద్యోగానికి వెళ్ళిరావడం అలవాటయ్యింది. కానీ చదువంటే చాలా ఇష్టం. ఒక రెండు సంవత్సరాలు ఆడుతూపాడుతూ ఉద్యోగం చేసింది. పైకి కనిపించినంత అందమైనవి కాదని, ఎక్కడయినా రాజకీయాలు ఉంటాయని అర్థం చేసుకుంది. చదువంటే చాలా ఇష్టం. ఎమ్మెస్ చేయడానికి ఆస్ట్రేలియా వెడతాను అంది. తన జీవితంలో మరో మలుపుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం.

2013 జనవరిలో వీణా ఆస్ట్రేలియా వెడితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని గోదావరి జిల్లాలలో పర్యటన పెట్టుకున్నాం. పిల్లలు పచ్చదనాన్ని పల్లెటూర్లని బాగా ఆస్వాదించారు. నేను మా తాతగారి వూరు, మేము తిరిగిన ప్రదేశాలు పాతకాలం సినిమా థియేటర్ అన్నీ చూపించాను. చూస్తుండగా రోజులు గడిచిపోయాయి. ఇక వీణా ప్రయాణానికి సన్నద్ధాలు మొదలుపెట్టాం.
దేశం దాటి వేరే దేశానికి వెళ్ళాలంటే చాలా హడావుడి వుంటుంది కదా... చివరి నిమిషం వరకూ టెన్షనే. ఆగస్ట్ 5వ తేదీకి తను ఫ్లైట్ ఎక్కాలి. 7వ తేదీ నుంచి క్లాస్ లకి వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్ కూడా సింగపూర్ లో 12 గంటల బ్రేక్ తో దొరికింది. ఆస్ట్రేలియా పెర్త్ కి మొత్తం ప్రయాణం 9 గంటలే... కానీ అదే టికెట్ తీసేసుకున్నాం. అది కాక పోతే మళ్ళీ వారం వరకూ టికెట్ లేదు. మొదటిసారి దేశం దాటి వెళ్ళడం. అదీ కొత్త చోటులో. టికెట్ అయితే తీసేసుకున్నాం.

రాత్రి 9 గంటలకి ఫ్లైట్ ఎక్కాలంటే సాయంత్రం నాలుగు గంటల వరకూ ఆఫీసు వాళ్ళు రెజిగ్నేషన్ లెటర్ యాక్సెప్ట్ చెయ్యలేదు. ఇంటికి రాగానే నాకు హెర్నియా ఆపరేషన్ చేసిన డాక్టర్ కి ఫోన్ చేసి “మా అమ్మ విషయంలో ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, మేము ఇప్పుడు హాస్పిటల్ కి వస్తున్నాం ఉన్నారా…? అంది.

ఆయన “నేను సికింద్రాబాద్ సన్ షైన్ హాస్పిటల్ లో ఉన్నాను. మీరు ఎర్రగడ్డ నీలిమాలో వెయిట్ చెయ్యండి వస్తాను” అని ఆయన కొన్ని పనులు పక్కకి పెట్టుకుని మాకోసం ట్రాఫిక్ లో వెయిట్ చేసుకుంటూ... ఎర్రగడ్డ వచ్చి నన్ను చెక్ చేసి, “మీ అమ్మకి ఏమీ భయం లేదు. అంతా నార్మల్ గా వుంది. ఏదైనా వుంటే నేను చూసుకుంటాను. ఆల్ ద బెస్ట్” అని మా అమ్మాయికి ధైర్యం చెప్పారు. అప్పుడు నిశ్చింతగా ఇంటికి వచ్చాం. ఆయన మా అమ్మాయితో ఒక ఫ్రెండ్ లా మాట్లాడతారు. (అవసరం ఉన్నా లేకపోయినా నేను ఇప్పటికీ ఆయనతో ఫోన్ లో మాట్లాడతాను.)
ఈ హడావుడిలో కరెంట్ పోయింది. తను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేదు. మేము 7 గంటలకి ఎయిర్ పోర్ట్ లో వుండాలి. అన్నీ సద్దుకుని బయల్దేరే టైం కి కరెంట్ వచ్చింది. ఇంకేం చెయ్యలేం. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాం. ఆగస్ట్ 15కి వారం రోజుల ముందు అన్ని చోట్లా హై అలర్ట్ చేశాడు. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. కొంచెం దూరంలో ఒకచోట గుంపులో గోవిందాలా కనిపించింది. ఏదో ఇంక బై చెప్పేసి వచ్చేశాం.

మా అబ్బాయి మాత్రం చాలా ఏడ్చాడు. తిట్టుకున్నా ఏం చేసినా ఇద్దరూ కలిసి వుండేవారు. ఇక ఇలాంటివి తప్పవులే అని మనసుకి నచ్చచెప్పుకుని బయటికి వచ్చాం.



ఆస్ట్రేలియా గవర్నర్ తో

ఆస్ట్రేలియాలో ప్రముఖ సైంటిస్ట్ తో
ఎడమవైపు ప్రొఫెసర్ 80 సంవత్సరాలు, కుడివైపు ప్రొఫెసర్ 60 సంవత్సరాలు



మా అమ్మాయి, అబ్బాయి గోదావరి జిల్లాల పచ్చదనంలో


అలా మా అమ్మాయి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. ఎమ్మెస్ చేసిన యూనివర్సిటీ కూడా చాలా పేరున్న యూనివర్సిటీ. వాళ్ళ ప్రొఫెసర్ 80 సంవత్సరాల ముసలి ఆయన అంది. తీరా తన ఫోటోలో చూస్తే 80 సంవత్సరాలు ఉన్నట్లే లేరు. మంచి స్టూడెంట్ గా పేరు తెచ్చుకుంది.

బెస్ట్ స్టూడెంట్ గా యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్ ఇచ్చారు. క్లాసులు లేనప్పుడు వేరే చోట చేసేది. ఇలావుంటూనే Australian Computer Society Volunteer (Secretary) గా పనిచేస్తూ ఎన్నో ప్రోగ్రామ్స్ కి వెడుతూ వుండేది. ఎంతోమంది ముఖ్యమైన వాళ్ళని కలిసే అవకాశం కలిగింది.

ఛీఫ్ సైంటిస్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, గవర్నర్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాని కలిసింది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మాతో పంచుకుంటుంది. ఆస్ట్రేలియాలో ప్రతిదీ ఆస్వాదిస్తూ మీకు ఇవన్నీ చూపించాలి అనేది. తమ్ముడికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ వుంటుంది.

మొత్తానికి తనకి నచ్చిన మంచి అబ్బాయి శేఖర్ ని పెళ్ళిచేసుకుంటానని చెప్తే పెద్దలందరం పెళ్ళిచేశాం. ఒక చక్కటి ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఆస్ట్రేలియా సిటిజన్లయ్యారు. చిట్టి పాప ఆటపాటలు ముద్దుముచ్చట్లతో అసలు టైమే తెలియదు. వీణా ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వడానికి తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు ఇంకా చాలా వున్నాయి. తన ఆస్ట్రేలియా జీవితం పుస్తకం రాయచ్చు.

మా అమ్మాయి కోరిక ప్రకారం 2019లో విజిటింగ్ వీసా మీద ఆస్ట్రేలియా వెళ్ళాం. మా అల్లుడు ఓపికగా ఎన్నో చూపించాడు. ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు. అవన్నీ ఒక పుస్తకంగా తీసుకు వచ్చాను. ముద్రణకి ఇవ్వాలి.

రెండోసారి నేను 2019 సెప్టెంబర్ లో మా అమ్మాయి డెలివరీకి వెళ్ళాను. అప్పుడు కూడా చాలా ప్రదేశాలు చూశాను. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ “మళ్ళీ తొందరగా రండి అంటీ...” అంటే “రెండు, మూడు సంవత్సరాల తర్వాత వస్తాను” అని చెప్పాను. అదే నిజమైంది. కరోనాతో మధ్యలో వెళ్ళడానికే అవలేదు.

2020 ఫిబ్రవరి 15వ తేదీన మా అబ్బాయి ఎంగేజ్ మెంట్ వుందని మేము పదవ తేదీన ఇండియా వచ్చాం. మా అల్లుడు తర్వాత వస్తానన్నాడు. తను 14వ తేదీకి టికెట్ బుక్ చేసుకుని వద్దామనుకుంటుండగా మొత్తం లాక్ డౌన్ పెట్టేశారు. మేమందరం చాలా డిసప్పాయింట్ అయ్యాం.
మన చేతుల్లో ఏమీ లేనప్పుడు ఏమీ చెయ్యలేం కదా....

మొత్తానికి ఎంగేజ్ మెంట్ బాగా జరిగింది. ఇక ఇండియాలో మా అమ్మాయి, ఆస్ట్రేలియాలో అల్లుడు విరహగీతాలు పాడుకుంటూ బెంగటిల్లిపోయారు. తను ఏప్రిల్ 29న ఆస్ట్రేలియా పాపతో వెళ్ళిపోయింది. ఇదంతా ఓ సాహసయాత్ర.

ఈ కథ అంతా మళ్ళీ ఇంకోసారి.

25, మే 2023, గురువారం

గుర్తుపట్టలేని ప్రదేశాలు – పాత జ్ఞాపకాలు - 86

 గుర్తుపట్టలేని ప్రదేశాలు – పాత జ్ఞాపకాలు - 86

***
22వ తేదీ మా బాబాయి పుట్టినరోజు అయ్యింది. తనకి 82వ రెండవ పుట్టినరోజు. ఆరోజు వర్కింగ్ డే అవడం వల్ల శనివారం 25వ తేదీ క్రిస్మస్ రోజున అందరం కలుద్దాం రమ్మన్నారు.

25వ తేదీ ఉదయం 10 గంటలకి శ్రీనగర్ కాలనీ నుంచీ వనస్థలిపురంకి ఆటో బుక్ చేసుకున్నాం. దాదాపు 21 కిలోమీటర్ల దూరం.


ఆటో ఆబిడ్స్ దగ్గిరకి వచ్చింది. ఒక్కసారి ఆ రోడ్లన్నీ పరికించి చూశాను. ఎంత మారిపోయిందో... గుర్తుపట్టలేనట్టుగా వుంది. ఖాళీగా వుండబట్టి ఆమాత్రం చూశాను. ఇంతలోకే.... దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను.

***
***





ఆబిడ్స్ సిగ్నల్ కి దగ్గరలో నేను, మా చెల్లెలు ప్రభావతి పొట్టలు పట్టుకుని ఊపిరాడకుండా నవ్వడం గుర్తుకు వచ్చింది. నా పెదవుల మీద చిరునవ్వు, నా లోపల నరాలు కదిలిపోయే నవ్వు. ఆ నవ్వుకి ప్రతిస్పందించిన నా శరీరపు కదలిక ఆటో కుదుపుల్లో కలిసిపోయింది.

విజయవాడలో ఉన్న మా పెద్ద బావగారు ఫోన్ చేసి ఆబిడ్స్ లో షాపు వుంటుంది – అక్కడ స్వెట్టర్స్, గ్లౌవ్స్ బావుంటాయి... నాకు ఒకటి కొని వుంచండి నేను వచ్చినప్పుడు తీసుకుంటాను. అన్నారు. ఆయన ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నారు. దానికోసం ఈ హడావుడి. సరే అన్నాం.

మేమిద్దరం ఆబిడ్స్ సిగ్నల్ దగ్గిరకి వస్తూండగా దూరంగా “సైకిల్ సొట్టర్. సంప్పాయించండి” (సైకిల్ స్టోర్స్ సంప్రదించండి) అని అడ్రస్ వుంది. ఆరోజుల్లో అంత ట్రాఫిక్ లేదు. గోడమీద వున్న ఆ ప్రకటన చూసిన ఇద్దరం మొహాలు చూసుకుని ఒకటే నవ్వు. ఆ నవ్వు తరంగా తరంగాలుగా ఉబికి వచ్చింది. ఇద్దరం రోడ్డు మీద నడవలేనంతగా పొట్టలు పట్టుకుని నవ్వుతున్నాం. ఇక ఇది కాదని రోడ్డు పక్కగా నడుస్తూ నవ్వుతూనే వున్నాం. కళ్ళనించీ నీళ్ళు కారుతున్నాయి. అందరూ ఏమైందో అర్థంకాక మావంక చూసుకుంటూ వెడుతున్నారు. అది ఆ వయసులో వుండే ఉత్సాహం, ఉద్రేకం మరి. మొత్తానికి నవ్వు ఆపుకుని ముందుకి నడిచాం.

అక్కడ ఒకతను కనిపిస్తే ‘ఆప్రికాన్ షాపు’ ఎక్కడ అన్నాం. నాకు తెలియదు అన్నాడు. ఇలాగే ముగ్గురినో నలుగురినో అడిగాం... చెప్పలేదు. ఒకతను విని – ఓ వికటాటహాసం చేసి ‘ఆప్రికాన్’ కాదండీ ‘ఎఫ్.డి.ఖాన్’ అని, నాలుగు షాపుల అతల వుందని మళ్ళీ గట్టిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.



ఆ నవ్వు మమ్మల్ని వెక్కిరించినట్లు వుంది. మేము తప్పు చూసి నవ్వాం. తప్పుమాట్లాడామని అతను నవ్వాడు. చెల్లుకి చెల్లు. మేము తప్పు మాట్లాడడానికి కారణం –

***
***
మా బావగారు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. ఆయన చెప్పిన మాట ఉచ్ఛారణ (pronunciation )ని మాత్రం గుర్తుపెట్టుకుని ఓహో ఇదే అయ్యుంటుంది అనుకున్నాం. ఆ మాటని పట్టుకుని షాపు వెతుక్కుంటూ వెళ్ళాం. పైగా అప్పట్లో స్వెట్టర్స్ అవీ రోడ్డు మీద ఎక్కడా అమ్మేవారు కాదు. ఊలు దుస్తులకి ఎఫ్.డి.ఖాన్ షాప్ పేరున్నది.

ఇద్దరం మరోసారి నవ్వుకుంటూ ఆ షాపులో అడుగుపెట్టాం. మేము ఆనందంగా రావడం చూసిన షాపువాళ్ళు... మమ్మల్ని నవ్వుతూ ఆహ్వానించారు. మాకు కావలసినవి తీసుకున్నాం. ఇప్పుడు ఆ షాపు బాగా పెద్దది చేశారు. బ్రాంచిలు కూడా పెట్టినట్టున్నారు.

కారు కొట్టిన హారన్ చప్పుడికి మళ్ళీ ఇప్పటి ఆబిడ్స్ రోడ్డు దాటేశామని అర్థం అయ్యింది. మెల్లిగా బడేచౌడీ, సుల్తాన్ బజార్, మూసారంబాగ్, దిల్ సుక్ నగర్ దాటి వనస్థలిపురం కమాన్ దగ్గిరికి వచ్చింది ఆటో.... చాలా రోజుల తర్వాత వచ్చామేమో.... అదో పెద్ద ఊరులా వుంది. అమ్మో ఎంతమారిపోయింది అనుకున్నాను. ఒక్కసారి మళ్ళీ 30 సంవత్సరాల కిందటి వనస్థలిపురం గుర్తుకు వచ్చింది.

***
***

***బస్ స్టాప్ తప్ప నిర్మానుష్యంగా వుండే దిల్ సుక్ నగర్ నుంచీ వనస్థలిపురానికి ఒక బస్ వుండేది. అదీ మెయిన్ రోడ్డు మీద ఆపేసేవాడు. మా చెల్లెలు ప్రభావతి ఫ్రెండ్ లక్ష్మి ఇల్లు వనస్థలిపురం మెయిన్ రోడ్డు మీద ఉన్న గణేష్ టెంపుల్ దగ్గరలో వుండేది. (ఇప్పుడు ఆ గుడి చాలా పెద్దది చేశారు.) అంతా మట్టిరోడ్లు, మట్టిదిబ్బలు. దూరంగా హూడా కాలనీ... ఎండ కూడా బాగా వున్నట్టుంది. వాళ్ళింటికి వెళ్ళి కుండలో నీళ్ళు తాగి సేదతీరాం... వాళ్ళమ్మగారు మామిడికాయపప్పు, వంకాయ అల్లం, పచ్చిమిరపకాయ వేసిన కూర, వేయించిన గుమ్మడి వడియాలు వేసి వేడి వేడి అన్నం పెట్టారు. చాలాసేపు కబుర్లు చెప్పుకుని మళ్ళీ ఇంటికి వచ్చాం. ***


***
***

ఇప్పటికి వనస్థలి పురంలో ఎన్ జి వోస్ కాలనీలో ఉన్న పిన్నీ వాళ్ళింటికి చాలా సార్లు వచ్చాను. వచ్చినప్పుడల్లా అడ్రస్ వెతుక్కోవడమే... అలా మారిపోయింది ఆ వనస్థలిపురం. వాళ్ళిల్లు ఇల్లులాగే వుంది కానీ.... చుట్టుపక్కలంతా మారిపోతూనేవుంది.
మొత్తానికి మేము మా చెల్లెళ్ళు, మా అక్కల పిల్లలు, మా కొడుకు, కోడలు అందరం పిన్నీవాళ్ళింటికి చేరాం. డెబ్బయి సంవత్సరాలు పైన వున్న పిన్ని అందరికీ వంట తనే చేసింది. అందరం భోజనం చేసి కబుర్లతో, నవ్వులతో సందడిచేశాం. ఇంతకీ పిన్ని మా అమ్మకి చెల్లెలు, బాబాయి మా నాన్నకి బాబాయి కొడుకు.
నేను బొంబాయిరవ్వ, రాగిపిండి, సగ్గుబియ్యం పిండి వేసి వెజిటబుల్ హాట్ కేకు తయారు చేశాను. పిల్లలందరూ మామూలు కేకు తెప్పించారు. రెండు కేకులు బాబాయి చేత కట్ చేయించాం. చాలా రోజుల తర్వాత అందరం బాగా గడిపాం.



15, మే 2023, సోమవారం

*** జూబిలీ హిల్స్ లో అందాల పర్ణశాల – చిరు సాహితీ సదస్సులకి ఆలవాలం *** - 85

 *** జూబిలీ హిల్స్ లో అందాల పర్ణశాల – చిరు సాహితీ సదస్సులకి ఆలవాలం *** - 85


నా జీవనయానంలో చాలామంది పరిచయాలు మా రెండో అక్క రమాసుందరి (స్టేట్ బ్యాంక్) ద్వారా అయ్యాయి. అక్క స్టేట్ బ్యాంక్ లో పనిచేసినప్పుడు తన సహఉద్యోగిని మైనంపాటి విమల గారు. ఆవిడ ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్ గారి శ్రీమతి. తనకి వాళ్ళ కుటుంబంతో చాలా సాన్నిహిత్యం వుండేది. వాళ్ళు యూసఫ్ గూడాలో వున్న కె.కె.టవర్స్ లో వుండేవారు.


వాళ్ళకి “జూబిలీ హిల్స్ రోడ్ నెం. 39లో పర్ణశాల అని ఒక ఇల్లు వుంది. అప్పుడప్పుడూ ఒకవారం పదిరోజులు వాళ్ళు అక్కడ గడుపుతుంటారు. అది ఒక కుటీరంలా వాళ్ళు కట్టుకున్నారు. ఇంటి చుట్టూరా చెట్లు. ఊళ్ళలో ఇల్లులా వుంటుంది. ఆ ఇంటి మూల ఒక చిట్టి నీటి గుంట వుంది. దాంట్లో వర్షానికి నీళ్ళు నిండుతూ వుండేవి. ఆ నీళ్ళలో జలకాలాడడానికి చిన్న చిన్న పక్షులు సందడి చేస్తుంటాయి. అక్కడ స్నేహితులందరం సరదాగా గడుపుతాం” అని అక్క చాలాసార్లు చెప్పింది.

నాకూ చాలా చూడాలనిపించేది. అనుకోకుండా ఒకసారి అక్కడ మైనంపాటి భాస్కర్ గారు, విమలగారు ఒక 20 మందితో చిరు సాహితీ సదస్సు ఏర్పాటు చేశారు.

రెండు పడక గదుల ఒక బంగాళ పెంకు ఇల్లు. చుట్టూరా ఖాళీస్థలం. వెళ్ళేదారంతా బాదం చెట్లు, మామిడి చెట్లు, ఉసిరి చెట్లు, అరటి చెట్లు, అక్కడక్కడ పువ్వుల మొక్కలు. అక్క చెప్పిన నీటి గుంట కూడా చాలా బావుంది. దాంట్లో చిట్టికప్పలు వేసే గంతులకి నీళ్ళు చెల్లాచెదురై ఒక వింత శబ్దాన్ని చేస్తున్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న పక్షులు ఆ నీటి దగ్గర సందడి చేస్తున్నాయి. ఇంటిముందు ఒక పెద్ద అరుగు చుట్టూరా పిట్టగోడలు. లోపలికి వెళ్ళగానే చిన్న హాలు, వంటగది, రెండు పడకగదులు. అసలు అక్కడ అలాంటి ఇల్లొకటి వుందని ఎవరికీ తెలియదు.



అక్కడ ఆ అరుగుమీద ఆందరం కూచుని సమావేశం మొదలు పెట్టాం. కొంతమంది కవితలు చదివారు, కొంతమంది పాటలు పాడారు, మరికొంతమంది కథలు చదివారు. సరస్వతి అని ఒకావిడ చక్కటి నృత్యం చేసి ఆనందపరిచారు. చాలా ప్రశాంతంగా జరిగింది. మధ్య మధ్యలో కోయిల కూతలు, పక్షుల కిలకిలారావాలు, అప్పుడప్పుడు రాలిపడే ఎర్రటి బాడిద పువ్వులు, గాలితో కలిసి వెదజల్లుతూ నాసికని తాకి వెడుతున్న జాజిపూల సువాసనలు. చాలా చక్కటి వాతావరణం. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దొరకనిది. కానీ వాళ్ళు చెప్పిన ఒక విషయం మాత్రం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అప్పుడప్పుడు పాములు వచ్చి ఆ అరుగుమీద విశ్రమిస్తాయిట. వీళ్ళని ఏమీ అనేవి కాదుట. అది చెప్పాక కొంచెం భయం వేసింది. కాళ్ళతో చప్పుడు చేస్తే వెళ్ళిపోతాయని చెప్పారు.

సమావేశం అయ్యాక అందరం తీసుకువచ్చిన తలొక వంటకం ఆ పిట్ట గోడల మీద పెట్టి ఎవరికి కావలసినది వాళ్ళు తిని భోజనం కానిచ్చాం. అన్నీ ఇంట్లోచేసినవే కాబట్టి విందు మహా పసందుగా వుంది.


ఈ సమావేశానికి దగ్గరలోనే వున్న ఆయన స్నేహితుడు రాజారావుగారిని పిలిచారు. ఆయన రాలేదు. ఎందుకు రాలేదో అని ఫోన్ చేస్తే మీరందరూ మా ఇంటికి రండి అన్నారు.

***
***

*** రాజారావుగారి ఇల్లు సంగీత సాహిత్యాలకి నిలయం***

మేమేం రాజారావుగారి గురించి ఎక్కువ ఊహించుకోలేదు. ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ అధిపతి అని మాత్రం తెలుసు. కానీ భాస్కర్ గారితోబాటు మేమందరం వాళ్ళింటికి వెళ్ళాం. వెళ్ళేదారి ఒక పెద్ద కారు పట్టేంత వుంది. అది దాటి లోపలికి వెడితే ఇంద్రభవనంలాంటి పెద్ద భవనం.

అందరం ఇంటి లోపలికి వెళ్ళాం. మీరు నమ్మరు రెండు పెద్ద పెద్ద సింహాలలాంటి కుక్కలు. విలాసంగా నడుచుకుంటూ వచ్చాయి. అయిదడుగుల పొడవు వున్నాయి. అవి అందరి దగ్గరకీ వచ్చి, మొహాల్లోకి చూస్తూ ఒకసారి తగిలుతూ, వాసన చూస్తున్నాయి. మా అమ్మాయి ఇంటర్ చదువుతోంది. తను గబగబా సోఫా ఎక్కి నుంచుంది. ఇంతలోనే ఆ రావుగారు వచ్చారు. ఆయన ఏడడుగుల పొడవు వున్నారు. సోఫాల్లో బిగదీసుకుని కూచున్న మమ్మల్ని చూసి, “ఏమీ ఫర్వాలేదు. అవి ఏమీ చెయ్యవు. సుందరీ, సుబ్బారావు అలా కూచోండి” అన్నారు. ఆ కుక్కలపేర్లు సుందరి, సుబ్బారావు.

మమ్మల్నందరినీ పలకరించి పేర్లు తెలుసుకుని, మా అమ్మాయిని వీణాధరి పేరు చక్కగా వుంది. నీకు పాటలు వచ్చా అన్నారు. సంగీతం నేర్చుకుంటున్నాను అని చెప్పింది. ఆయనికి సంగీతం అంటే చాలా ఇష్టంట. కొన్ని పాటలు పాడించుకున్నారు.

ఆయన ఇల్లంతా అడుగడుగునా చూపించి, ఏది ఎలా కట్టారో వర్ణించి చెప్పారు. పైకి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆయన సంగీత సాధన చేసుకునే హాలు వుంది. వీణ పట్టుకుని కూర్చుని కొన్ని పాటలు వాయించి వినిపించారు. మళ్ళీ మా అమ్మాయిచేత కొన్ని అన్నమాచార్య కీర్తనలు పాడించుకున్నారు. సంగీతం మా ఇంట్లో ప్రతిధ్వనిస్తుంది అన్నారు. సుందరీ, సుబ్బారావు (కుక్కలు) ఆయన ఎక్కడికి వస్తే అక్కడికే వస్తున్నాయి. వాటికి జయ, విజయ అనే పిల్లలు.

ఆ తర్వాత చెక్కమెట్ల మీద నుంచీ పైన ఉన్న అతి చిన్న ఇల్లు చూపించారు. ముచ్చటగా డైనింగ్ హాలు, ఒక బెడ్ రూము. టీవీ, ఎసి – మొత్తానికి ఒక భార్యా, భర్త ఉండడానికి సరిపడిన ఇల్లు. బావుంది. మేము ఆ మెట్లు ఎక్కేలోపునే సుబ్బారావు (కుక్క) గబగబా పైకి ఎక్కేసి రావుగారి దగ్గరికి వెళ్ళి ఆయి బుజాల మీద చేతులు వేసి ఆయనంత పొడుగు సాగింది. మేము నోళ్ళు తెల్లబెట్టి చూస్తూండిపోయాం.

ఆ ఇంట్లో ఆ నలుగురు సినిమా తీశారు. సినిమావాళ్ళు అప్పుడప్పుడు షూటింగులు చేస్తుంటారు అని చెప్పారు. మాకు వాళ్ళింట్లో చిరు ఆతిథ్యం ఇచ్చారు. ఇంటి వెనక వైపు ఒక చిన్న స్టేజి, లాన్ వున్నాయి. అప్పుడప్పుడు లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ నుంచి పిల్లలని, రకరకాల సంగీత, సాహిత్యకారులని పిలిచి చిన్న చిన్న సమావేశాలు చేస్తుంటానని చెప్పారు. వాళ్ళకి చిరు సత్కారాలు చేస్తారుట.

పర్ణశాల తర్వాత మళ్ళీ - సంగీత, సాహిత్యకారుడి ఇల్లు చూశాం. ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. ఒకసారి మా అడబడుచు (నండూరి రామమోహనరావుగారి పెద్దకోడలు) కూతురు అమెరికా నుంచి వస్తూ నెలరోజులకి ఒక ఇల్లు ఏదైనా కావాలన్నారు. మైనంపాటి భాస్కర్ గారిని అడిగి ఈ పర్ణశాలని వాళ్ళకోసం ఏర్పాటు చేశాం. వాళ్ళు నెలరోజులూ అక్కడ చాలా ఆనందంగా గడిపారు.

*** నండూరి రామమోహనరావుగారంటే మైనంపాటి భాస్కర్ *** గారికి అంతులేని అభిమానం. రామమోహనరావుగారి మనవరాలి పెళ్ళి హైదరాబాదులో జరుగుతోందని తెలిసి, ఆయన గురించి తెలుసు కానీ, ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. మాకు పరిచయం చెయ్యండి అని అడిగారు. మా వారికి చెల్లెలికి మామగారే కాబట్టి, ధైర్యంగా విమలగారినీ, భాస్కర్ గారినీ పెళ్ళికి రమ్మని ఆహ్వానించాం. వాళ్ళు నండూరి రామమోహనరావుగారిని కలిసి చాలా సేపు మాట్లాడారు. పెళ్ళి అంతా చూశారు.

తర్వాత నేను మైనంపాటిగారిని కలిసినప్పుడల్లా ఎంతోసంతోషంగా మీమూలంగానే మేము నండూరి గారితో మాట్లాడగలిగాం అని చెప్పారు. ఆయన సంతోషం చూసి నేనూ సంతోషించాను, ఆశ్చర్యపోయాను.

తర్వాత రామ్మోహనరావుగారి మనవరాలు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఒక గెస్ట్ హౌస్ లాగా ఫర్నిచర్ తోపాటు ఒక నెలరోజులకి ఆ ఇల్లు ఇచ్చారు. అక్కడ అందరం చాలా ఆనందంగా గడిపాం. మా అత్తగారికి చాలా బాగా నచ్చింది.






***
***

భాస్కర్ గారు 68 సంవత్సరాల వయసులో కిడ్నీ సమస్యతో డయాలసిస్ మీద వుండేవారు. కానీ అలా వున్నా కూడా ఆయన బస్ పాస్ తీసుకుని వాళ్ళింటి దగ్గర బస్ ఎక్కి, అది ఎక్కడికి వెడితే అక్కడికి చివరి వరకూ వెళ్ళి, మళ్ళీ అదే బస్సులో ఇంటి దగ్గర దిగేవారు. ఇలా రోజుకి ఒక చోటికి వెళ్ళేవారు. ఇంట్లో కూచుంటే నా సమస్యతోనే సతమతమవుతాను. బయటికి వెడితే అందరి సమస్యలు తెలుస్తాయి అనేవారు. చివరి నిమిషం వరకూ ఆనందంగానే గడిపారు.

దాదాపు 30 నవలలు, 100కిపైగా కథలు రచించారు. ఆయన రచనల్లో ఎక్కువ సైన్స్ ధృక్ఫథం (ఫిక్షన్)తో ఉన్నా యి. 1994లో ఆయన రచించిన బుద్ధిజీవి అనే నవల ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఆయన నవలల్లో బివేర్ ఆఫ్ గాడ్స్ అనేది పలు భాషల్లో ప్రచురించబడింది. వెన్నెలమెట్లు నవల ఆధారంగా ‘అరుణకిరణం' సినిమా తీశారు. మైనంపాటి రచించిన సైన్స్ ఫిక్షన్ నవలలు కొన్ని వా షింగ్టన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో భద్రపరిచారు. సినిమా సమీక్షలను కూడా రాసి ఆ రంగం వారి ఆదరాభిమానాలను పొందారు. కొంత కాలం ఇఎస్ఐ ప్రభుత్వ ఉద్యోగం చేసిన మైనంపాటి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆ మిగిలిన సమయాన్ని రచనలు కోసం వినియోగించారు. ఆయన రచించిన నవలలు, కథలు దేశ, విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాయి.







10, మే 2023, బుధవారం

ఏది ఎలా జరుగుతుందో... ఎవరికీ తెలియదు... 84

 ఏది ఎలా జరుగుతుందో... ఎవరికీ తెలియదు... 84


నేను తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేషీలో పనిచేస్తున్నరోజులు.

ఒకరోజు లంచ్ టైమ్ లో నేను పనిచేసే చోటికి ఒక పాతికేళ్ళ అబ్బాయి వచ్చాడు.

పేషీలో రాజుగారని సీనియర్ మోస్ట్ ఆఫీసర్ వున్నారు. ఆయన నాకోసం ఎవరో వచ్చారనుకుని తన పని తను చూసుకుంటున్నారు. సాధారణంగా ఎవరి విషయాల్లో కల్పించుకునే మనిషి కాదు. నేను ఆయనకోసం వచ్చాడని అనుకున్నాను.

అతను నా దగ్గిరకి వచ్చి - “మేడమ్ బావున్నారా... మీరు కొత్తగా వచ్చారు కదా... మిమ్మల్ని రోజూ బస్సెక్కేప్పుడు చూస్తూ వుంటాను. మీరు సంజీవరెడ్డి నగర్ నుంచి ఒకోసారి బస్ లోనూ, చాలా సార్లు ట్రెయిన్ లోనూ వస్తుంటే చూశాను. మీరు సంజీవరెడ్డి నగర్ లో ఫలానా రోడ్డులో, ఫలానా ఇంట్లో వుంటారు. అక్కడ మీ ఇంటి ఎదురుగా రోడ్డు చివర ఒక ఇంట్లో రోజూ ఆంజనేయస్వామి పూజలు చేస్తూ వుంటారు. నేను అక్కడే వుంటాను. నా పేరు శ్రీనివాస్. మాది హన్మకొండ” అన్నాడు.

నేను అన్నీ విని “ఓహో అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అన్నాను.

“మాకు హన్మకొండలో పొలాలు ఉన్నాయి. మాకు రైస్ పండుతుంది. నేను ఈ ఆఫీసులో చాలామందికి ఇస్తుంటాను” అన్నాడు. అక్కడ జిరాక్స్ రూములో ఒకతను పనిచేస్తుంటాడు. అతన్ని చూపించి “ఈసారు కూడా తీసుకుంటాడు” అన్నాడు. అలా అనగానే అతను మా వంక చూసి వెళ్ళిపోయాడు.

నేను “ఇంట్లో సార్ కి చెప్పాలి. తర్వాత చెప్తాలే” అనేసి నా పని నేను చూసుకుంటూ కూచున్నాను. వరసగా నాలుగు రోజులు వచ్చాడు. ఒకరోజు మా వారితో చెప్పాను. బియ్యం ఇంటికి తీసికెళ్ళి చూపించాను. చాలా తక్కువ రేటు చెప్పాడు.

మా వారు యూనివర్సిటీకి వచ్చారు. లంచ్ టైమ్ లో ఆ శ్రీనివాస్ మళ్ళీ వచ్చాడు. మమ్మల్ని ఇద్దరినీ ఎల్.బి. స్టేడియంకి రమ్మన్నాడు. ఇద్దరం వెళ్ళాం.

వాడు “ఒక రెండు వేలు ఇవ్వండి. మా మనిషి మీకు బస్తాలు ఇస్తాడు. అదిగో ఆ ఎదురుగా వున్నదే గొడౌన్. ఆ షాపులో తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టుకుంటాను” అన్నాడు.

“మీకు ఐస్ క్రీం కావాలా... మా మామకి ఐస్ క్రీం పార్లర్ వుంది. మీకు కసాటా, వెనిల్లా, అమూల్ ఐస్ క్రీం ఫ్యామిలీ ప్యాక్ తెచ్చిస్తాను ఇక్కడే వుండండి. మీరు డబ్బులు కూడా ఇవ్వక్కరలేదు” అంటూ ఒక ఐస్ క్రీం పార్లర్ చూపించాడు. ఐస్ క్రీం అంటే ఇష్టమయిన నేను నోట్లో నీళ్ళు వూరించుకుంటూ కూచున్నాను. అది కరిగిపోకుండా ఆఫీసు ఫ్రిజ్ లో పెట్టి, ఇంటికి ఆటోలో వెడదామనుకున్నాం.





మేము అక్కడ ఓ గట్టులాంటిది వుంటే అక్కడ కూచున్నాం. వాడు ఆ పార్లర్ దగ్గిరకి వెళ్ళాడు. తర్వాత లోపలికి వెడుతూ కనిపించాడు. ఒక 40ని. అవుతోంది రావట్లేదు. అర్థం కాలేదు. ఇద్దరం కలిసి ఆ ఐస్ క్రీం పార్లర్ లో ఉన్నాయన్ని అడిగాం. “నేనెవరికీ మామని కాదు. అసలు అలాంటి వాళ్ళు ఎవరూ నాకు తెలియరు” అంటూ... సెక్యూరిటీ అతన్ని పిలిచాడు.

ఈమాటలు విని స్టేడియం సెక్యూరిటీ అతను వచ్చాడు. అతనికి చెప్పాం. అతను తల కొట్టుకుని “అయ్యో... సర్. అలా ఎలా విన్నారు. ఇక్కడ గొడౌన్లు లేవు. వాడు చెప్పినటువంటి షాపులు లేవు. వాడు ఈ పాటికి స్టేడియం అటువైపు దారి నుంచీ వెళ్ళిపోయివుంటాడు. రకరకాల మోసాలు సర్. వాడు అంత తేలిగ్గా మోసం చేశాడంటే ఎంతమందిని ముంచాడో ఈపాటికి” అన్నాడు.

ఒక్కసారి నాకయితే సినిమాలో బ్రహ్మానందం గుర్తుకువచ్చి, అద్దంలో చూసుకుంటే మా మొహాలు అలాగే వుంటాయేమో అనిపించింది.

ఇద్దరం ఈ చేసిన ఘనకార్యానికి మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి వచ్చి, అక్కడ క్యాంటీన్ లో టీ తాగాం. ఆఫీసులో వాళ్ళకి చెబితే... మీకు, లక్ష్మి (రిజిస్ట్రార్ పి.ఎ., నాకు ఫ్రెండ్) గారికి తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడూ వస్తున్నారు కదా... అనుకున్నాం అన్నారు.

ఇంటికి వచ్చి, వాడు చెప్పిన ఆంజనేయస్వామి పూజ చేసేవాళ్ళింటికి వెళ్ళి అడిగితే. “మా ఇంట్లో కిరాయికిచ్చే పోర్షనే లేదు. శ్రీని వాసా.... ఎవడూ లేడు” అన్నారు.

రెండు వేలు గోవిందా... 2005లో రెండువేలు అంటే చాలా ఎక్కువే మరి. ఐస్ క్రీం చూసినప్పుడల్లా... ఇదే గుర్తుకు వస్తుంది.

ఏది ఎలా జరుగుతుందో... ఎవరికీ తెలియదు...

మనం చేతకాని వాళ్ళం అని తెలిసేవరకూ...

అందంగా మోసం చేస్తారు

6, మే 2023, శనివారం

పేరు అన్నపూర్ణ – సార్థక నామధేయురాలు – ఆదరణకి ఆప్యాయతకి పెట్టింది పేరు - 83

 పేరు అన్నపూర్ణ – సార్థక నామధేయురాలు – ఆదరణకి ఆప్యాయతకి పెట్టింది పేరు - 83



మా అపార్ట్ మెంట్స్ లో ఉన్న అన్నపూర్ణ (సినీనటి) గారిని కలిసి, మాట్లాడి చాలా రోజులైందని నిన్న ఫోన్ చేశాను. ఎప్పుడు కలుస్తున్నారు చాలా రోజులైంది అన్నారు. ఇవాళ దబ్బకాయ, ఉసిరికాయ వూరగాయలు తీసుకుని వాళ్ళ ఫ్లాట్ కి కాసేపు వెళ్ళాను. నేనూ ఎంతసేపూ కంప్యూటర్ ముందు కూచుంటాను కదా కొంచెం మార్పుకోసం, కాసేపు కూచుని వద్దామనుకుని దాదాపు గంటసేపు కూచుండి పోయాను. వెళ్ళగానే మీ అత్తగారు ఎలా వున్నారు అని అడుగుతారు.

95 సంవత్సరాల వయసులో కూడా పుస్తకాలు చదువుకుంటూ ఓ చోట కూచునే మా అత్తగారు అంటే అన్నపూర్ణగారికి ఇష్టం. ఎవరికైనా ఆవిడ గురించే చెప్తాను అన్నారు.


ఇలా ఇద్దరిమధ్య కబుర్లు ఆగట్లేదు. ఇంక లంచ్ టైం అవుతోందని బయల్దేరాను. ఒకోసారి మనకి అయ్యే పరిచయాలు విచిత్రంగా వుంటాయి.

మేము శ్రీనగర్ కాలనీకి వచ్చిన కొత్తలో ఇల్లు సద్దుకోవడం ఆ హడావిడిలో వున్నాం. మాకు తెలిసిన కొంచెం అవతల ఉన్న ఫ్లాట్ ఆవిడ ఎంతవరకు వచ్చాయి పనులు అని పలకరించారు. తర్వాత మీపక్క ఫ్లాట్ లో సినిమాల్లో వేస్తారు అన్నపూర్ణగారు ఉన్నారు. పలకరించారా... అన్నారు. అవునా... మాకు తెలియదు. మా పనయ్యాక సాయంత్రం పలకరిద్దామని వెడితే... ఎక్కడికో వెళ్ళే హడావుడిలో వున్నారు... మమ్మల్ని చూసి ఒకసారి నవ్వి. ఇక్కడే వుంటారుగా మళ్ళీ కలుద్దాం. బయటికి వెళ్ళాలి అని మర్యాదగా చెప్పారు.

సినిమాల్లో పెద్దావిడగా పెద్ద బొట్టు, పెద్ద ముడితో నిండుగా వుండే మనిషిని అలాగే ఊహించుకున్నాం. (దాదాపు ఏడు సంవత్సరాల కిందటి సంగతి.) కానీ ఆవిడ చక్కగా చిన్న బొట్టుతో, చెవులకి చిన్న రింగులు పెట్టుకుని, మంచి పొడవుతో, మొహం నిండా నవ్వుతో – అసలు సినిమాలో మొహానికి ఈవిడకి పోలికే లేదు – కనిపించేసరికి చాలా అశ్చర్యం వేసింది. సరే ఇక మేము కూడా మా పనుల్లో వుండిపోయాం.

కొత్త చోటుకి మెల్లిమెల్లిగా అలవాటు పడ్డాం. చుట్టూరా పచ్చటి చెట్లతో విశాలమైన ప్రాంగణంలో ఉన్న అపార్ట్ మెంట్ మాకు చాలా నచ్చింది. అన్నపూర్ణగారు, వాళ్ళమ్మగారు తలుపు తీసుకునే కూచునేవారు. మా ఇంట్లోకి వెళ్ళాలంటే వాళ్ళ గుమ్మానికి ఎదురుగా నడుచుకుంటూ పక్కనున్న మా ఇంట్లోకి వెళ్ళాలి. అందుకని దాదాపు రోజూ ఆవిడ నవ్వు మొహం, వాళ్ళమ్మగారి ఆప్యాయకరమైన మాటలు మాకు అలవాటయ్యాయి.

నాకు అందరితో తొందరగా కలిసిపోయే అలవాటు కాబట్టి వాళ్ళు మేమూ ఒక కుటుంబం అన్నట్టు అయిపోయాం. నేను అప్పుడప్పుడూ నేను చేసిన వంటలు, పచ్చళ్ళు ఇస్తూ వుండేదాన్ని. వాళ్ళకి బాగా నచ్చేవి. వాళ్ళింట్లో ఏ పిండివంట చేసినా మాకు ముందు ఇచ్చేవారు.

అన్నపూర్ణగారు ఆప్యాయతకి పెట్టింది పేరు. మాటమీద నిలబడే తత్వం. ఎవరికైనా ఏదైనా అవసరం అంటే ఆదుకునే మనసు. మనం ఏదైనా విషయం మాట్లాడి నప్పుడు పూర్తిగా విని, మనసుకి బాగా నచ్చిన వాళ్ళు అంటే ఆవిడకి తోచిన సలహా చెప్తారు. మొదటి నుంచీ అక్కడే వున్నారు, ఎవరి విషయాల్లో కల్పించుకోరు కాబట్టి, అందరికీ ఆవిడంటే ఇష్టమే.

మేము అక్కడికి వెళ్ళిన కొత్తలోనే మా అమ్మాయి పెళ్ళి కుదిరింది. మాకు బాగా సహకరించారు. పెళ్ళి కూతురుని చేసినప్పుడు వచ్చినవాళ్ళందరికీ భోజనాలు వాళ్ళింట్లోనే ఏర్పాటు చేసుకోమని చెప్పారు. మా ఇల్లు వాళ్ళిల్లు ఒకటిలాగా గడిచింది. మా అమ్మాయి ఎంగేజ్ మెంట్ కి వచ్చారు. పెళ్ళి హడావుడి అయిపోయింది.

మాకు ఎక్కడ ఉన్నా... రాత్రి 12 వరకు తలుపులు వేసుకునే అలవాటు లేదు. వాళ్ళు కూడా చాలాసేపు వుండేవారు. మాతో వాళ్ళకి సందడి సందడిగా వుండేది. వాళ్ళింటికి (సినీనటి) శ్రీలక్ష్మిగారు కూడా వచ్చేవారు. ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడేవారు.

ఒకసారి వైజాగ్ వెడుతూ విజయవాడలో దిగి వెడతాం అని చెప్పాం. ఎక్కడికో ఎందుకో మా వాళ్ళింటికి వెళ్ళండి అని చెప్పారు. విజయవాడలో అన్నపూర్ణగారి తమ్ముడి ఇంటికి వెళ్ళాం. ఒకరోజు వుండాల్సి వచ్చింది. వాళ్ళు మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. మేమున్న రోజున వాళ్ళింటి పైనున్న సింగిల్ బెడ్ రూం పోర్షన్ మాకు ఇచ్చేశారు. రకరకాల పిండివంటలతో మంచి భోజనం పెట్టారు. ఆ రోజూ అన్నపూర్ణగారు, వాళ్ళమ్మగారూ కూడా మమ్మల్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారనే విషయాలు కనుక్కుంటూనే వున్నారు. వాళ్ళ ఆప్యాయత మరిచిపోలేనిది.

అలా ఆవిడతో, వాళ్ళ కుటుంబంతో అనుబంధం పెరిగిపోయింది. పక్కనే వున్న మేము వేరే బ్లాక్ లోకి మారాల్సి వచ్చింది. అయినా కూడా ఆవిడైనా ఫోన్ చేస్తారు. నేనైనా ఫోన్ చేస్తాను. ఎప్పుడూ ఆవిడ షూటింగ్ ల హడావుడిలో వున్నా... పలకరించడం మాత్రం మానరు. నేను ఆవిడకి నా వంటలు ఇస్తూనే వుంటాను. చాలారోజులైతే ఈమధ్య మీ వంట తిని చాలా రోజులైంది అంటారు. నేనే ఏంచేసి ఇచ్చినా ఆవిడకి సంతోషమే.

మనసుకి నచ్చిన పని చేస్తే అదో ఆనందం.