30, జనవరి 2021, శనివారం

మనవరాలా... మజాకానా... - మనవరాలు ఆర్ణ ముచ్చట్లు 2

 

ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి వచ్చి మా అమ్మాయిని వీణాని చూడగానే చాలా ఆనందం అనిపించింది. అల్లుడు శేఖర్, వీణ అందరం కలిసి ఇంటికి వెళ్ళాం.  నాలుగు పడక గదుల ఇండిపెండెంట్ హౌస్. చాలా పెద్దది. అంతకు ముందే జనవరిలో ఒకసారి రావడంతో కొత్తగా అనిపించలేదు. 

అంత పెద్ద ఇంట్లోకి ఓ బుజ్జి పాపాయి వస్తోందంటే అందరికీ ఆనందమే.  వాళ్ళకి పుట్టబోయే పిల్లలు ఎవరో ముందే చెప్తారు కదా....  చాలా ఆర్భాటంగా, సందడి సందడిగా జెండర్ (ఆడపిల్లా, మగపిల్లాడా....) ఫంక్షన్ చేసేసుకోవడంతో అమ్మాయని తెలిసిపోయింది. 

నేను ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు సీమంతానికి కావలసిన రకరకాల వస్తువులన్నీ నాతోబాటు కొన్ని, కొరియర్ కొన్ని ఆస్ట్రేలియా చేరాయి.  

ఈలోపున పాపాయి వాళ్లమ్మ పొట్టలో రకరకాల విన్యాసాలు చేస్తోంది.  వాళ్ళమ్మకి సంగీతం వచ్చు కాబట్టి తను పాడే పాటలన్నింటికీ లోపల గంతులేసేది.  

నేను వెళ్ళిన వారం రోజులకి సీమంతం అనుకున్నాము.  నేను మా అమ్మాయి కలిసి కాజాలు, బర్ఫీ చేశాము. నేను ఇండియా నుంచి పట్టుకెళ్ళిన స్వీట్స్ కొన్నివున్నాయి.  

ఇండియా నుంచి పట్టుకెళ్ళిన ఆర్టిఫిషియల్ పువ్వుల దండలతో అలంకరణ చేసి ఐదు రకాల స్వీట్సు, పళ్ళు పెట్టి సీమంతం చేశాము.  ఒక ముప్పయి మందికి వంట నేను, మా అల్లుడు, వాళ్ళ ఫ్రెండ్ కలిపి చేశాము. ఇండియన్  ఇంటి వంట దొరకదు కాబట్టి అందరూ చాలా ఆనందంగా, ఆస్వాదిస్తూ తిన్నారు. 

ఇలా సీమంతం హడావుడి బాగా జరిగింది. 

28, జనవరి 2021, గురువారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు -1


మనవరాలి పేరు ఆర్ణ. వాళ్ళమ్మ వీణాధరి.

ఇప్పుడు ఆర్ణకి ఏడాది మీద 3 నెలలు. 

ఇన్ని నెలల్లో ఎన్ని ముచ్చట్లో 

నేను, మా వారు జానకిరాం గారు 2019 జనవరిలో మా అమ్మాయి చూడడానికి రమ్మంటే ఆస్ట్రేలియా వెళ్ళాం. మేము తిరిగి మార్చి 8వతేదీన ఇండియా బయల్దేరాం. మార్చి రెండవ తేదీన తను గర్భవతి అయినట్లు తెలిసింది. చాలా సంతోషం వేసింది. కానీ అప్పటి నుంచీ అక్కడ వుండే పరిస్థితిలేదు. వుండలేము. ఎందుకంటే తరవాతి అవసరం ఎక్కువ కాబట్టి ఇండియా వచ్చేశాం.

నేను తిరిగి సెప్టెంబరు 5వ తేదీన ఆస్ట్రేలియా అమ్మాయి డెలివరీ వెళ్ళాను. అప్పటికి తను నిండు నెలలతో వుంది. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళాయనతో ఎయిర్ పోర్ట్ కి వచ్చింది. ఫ్లైట్ దిగినప్పటి నుంచీ నాకు వాళ్ళు ఏర్పాటు చేసిన అటెండర్ నన్ను సామానుతో సహా బయటికి తీసుకువస్తోంది. ఆవిడ ఆస్ట్రేలియన్. చాలా చక్కగా వుంది. మాట తీరు కూడా బావుంది. ఆవిడతో నేను మా అమ్మాయి డెలివరీకి వస్తున్నానని, ఫస్ట్ ఒకసారి వచ్చామనీ ముచ్చట్లు చెబుతూ వచ్చాను. చాలా బాగా మాట్లాడింది. బయటికి వచ్చాక మా అమ్మాయిని చూసి. మీ అమ్మ చాలా సంతోషంగా వుంది అని చెప్పింది. 

అలా నేను రెెండోసారి ఆస్ట్రేలియాలో మా మనవరాలి కోసం వచ్చాను. ఇదో పెద్ద కథ 

(ఇంకా వుంది).



25, జనవరి 2021, సోమవారం

నేరేడు పళ్ళు - జ్ఞాపకాలు

 నేరేడు పళ్ళు - జ్ఞాపకాలు



అదొక పెద్ద ఆకుపచ్చ గేటు ఉన్న పెద్ద కాంపౌండ్

గేటులోంచి లోపలికి వెడితే కుడిచేతి వైపున పెద్ద పెద్ద నందివర్ధనం చెట్లు విరగపూసి వుండేవి.

అందులో కొన్ని పెంకుటిళ్ళు, కొన్ని చిన్న చిన్న ఇళ్ళు.

బాలికోన్నత పాఠశాలలో తెలుగు టీచర్ అక్కడ ఒక ఇంట్లో వుండేవారు.

ఆవిడ వున్న ఇంటి ముందు చాలా పెద్ద మానున్న పేద్ద నేరేడు చెట్టు,

ఆ కాంపౌండ్ లో సగం ఆ నేరేడు చెట్టు ఆక్రమించుకుని వుండేది.

ఆ చెట్టు కింద రుషుల ఆశ్రమంలో లాగా ఒక పెద్ద మట్టి దిమ్మ వుండేది.

ఆవిడ దానిమీద కూచుని మాకు సాయంత్రాలు భగవద్గీత నేర్పేవారు

నలుగురం వుండేవాళ్ళం. చాలా చిన్న పిల్లలం.

టీచరుగారు భగవద్గీత నేర్పుతుంటే పై నించి నేరేడు పళ్ళు టపటపా పడేవి. లేచి వెళ్ళడానికి భయం. కూచున్న చోటు నుంచే అది నాది, ఇది నాది అని చెప్పుకునేవాళ్ళం.

టీచరుగారు చెప్పడం అయిపోయాక అవి తీసుకుని తినేవాళ్ళం.

ఇక వర్షం వచ్చిందంటే బకెట్ల నిండా వచ్చేవి.

నేరేడు పళ్ళు చూసినప్పుడు ఆ రోజులు బాగా గుర్తుకు వస్తాయి.