22, జూన్ 2023, గురువారం

ఎన్నో రకాలుగా ఎదురీదితేనే జీవితం - 91 ఉద్యోగాల్లో పడే ఇబ్బందులు కొన్ని, శారీరకమైన ఇబ్బందులు మరికొన్ని

 ఎన్నో రకాలుగా ఎదురీదితేనే జీవితం - 91

ఉద్యోగాల్లో పడే ఇబ్బందులు కొన్ని, శారీరకమైన ఇబ్బందులు మరికొన్ని
***
***
ఆపిల్ కంప్యూటర్స్ కొత్తగా వచ్చినప్పుడు వాటి ట్రైనింగ్ కోసం హిమాయత్ నగర్ లో ఉన్న ఇంటర్నేషనల్ గ్రాఫిక్స్ కి వెళ్ళేదాన్ని. అప్పుడు ఒక వారం కిందట మా చెల్లెలి పెళ్ళయ్యింది. కొంచెం పని, అలసట బాగానే అయ్యింది. కంప్యూటర్ మీద ట్రైనింగ్ అవుతుంటే ఉన్నట్లుండి కడుపులో తిప్పి తిన్నదంతా బయిటికి వెళ్ళిపోయింది.. అక్కడ ఉన్న ఒకమ్మాయిని తీసుకుని సంజీవరెడ్డినగర్ మా ఇంటికి బయల్దేరాను. దారిలో అంతా నానా అవస్థాపడ్డాను.


లకడీకాపూల్ టర్నింగ్ లో క్యూర్ వెల్ హాస్పిటల్ అని బోర్డ్ కనిపించింది. ఇక నావల్ల కాదని ఆటో అతన్ని అక్కడికి తీసుకెళ్ళమన్నాను. ఆ హాస్పిటల్ కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఆటో అతను లోపలికి తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడంతా పాడుచేశాను. వాళ్ళేమీ అనలేదు. నాతో వచ్చిన అమ్మాయి నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయింది. నన్ను లోపల బెడ్ మీద పడుకోపెట్టారు. మొత్తానికి ఫోన్ చేసి మా అక్కకి చెప్పాను.

ఈలోపున డాక్టర్లు వేళ్ళు చూపించి “ఎన్ని కనిపిస్తున్నాయి?” అన్నారు. “ఎన్నున్నాయో అన్నే” అన్నాను. వాళ్ళు నవ్వారు. అప్పట్లో మెదడువాపు వ్యాధి బాగా వుండేది అదీ వాళ్ళ డౌట్. అప్పుడే వచ్చిన అక్కతో రాత్రి వుండాలి. పొద్దున్న పంపిస్తాం అన్నారు. పొద్దున్న వాళ్ళు తేల్చినది ఏమిటంటే మీకు ఇయర్ డ్రమ్ ప్రాబ్లం అయ్యుంటుంది. కోటీ ఇఎన్ టి లో చెక్ చేయించుకోమన్నారు. అక్కడ వాళ్ళు ఎక్స్ రే తీసి, చెక్ చేసి నీకేం లేదుగా ఎందుకు వచ్చావ్ అన్నారు. మొత్తానికి పెళ్ళికి చేయించిన మిక్చర్ లో వేసిన పల్లీలే తినడం వల్ల ఇంతపని అయిందని తర్వాత అర్థం అయ్యింది.

***
***

ఈ పరిస్థితి నుంచీ కోలుకున్నాక అక్క కూతురు పెళ్ళని విజయవాడ వెళ్ళాం. అక్కడ పొద్దున్నే టిఫిన్ తిని అందరూ కూచున్న చోటుకి వెళ్ళి కూచుందామనుకుని నేనూ మా అమ్మాయి బయల్దేరాం. ఇద్దరం నడుస్తూనే వున్నాం. ఏమయిందో తెలియదు. ముందుకి ఢామ్మని పడ్డాను. ఆ పడడం చేతిమీద పడడంతో చెయ్యికి ఏదో అయిపోయిందని మాత్రం తెలుస్తోంది. తీరా హాస్పిటల్ కి వెడితే వాళ్ళు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అని చెయ్యికి కట్టుకట్టి మెళ్ళో ఓ తాడు వేశారు. రెండు నెలలు కంప్యూటర్ కి దూరం. ఆ చెయ్యి నెప్పి భరిస్తూ ఒంటిచేత్తో ఇంట్లో పనులు ఎలా చేసుకున్నానో. ఇప్పుడు ఆలోచిస్తే అది ఒక మరచిపోలేని నరకయాతననే చెప్పుకోవాలి. పిల్లలు, మావారు కొన్ని పనులు చేసేవాళ్ళు.

***
***

మొత్తానికి కొత్త కంప్యూటర్ మీద ట్రైనింగ్ అయ్యి కొన్ని చోట్ల ఉద్యోగం చేశాక - నాకు నేనే బాస్ ని అయితే బావుంటుదనిపించింది.
ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుని పని మొదలు పెట్టాం కానీ... ఆఫీసులో ఉద్యోగం వేరు ఇంట్లో కష్టపడడం వేరు. ఆఫీసులోలాంటి వీల్ ఛైర్లు కొనే పరిస్థితికాదు. కంప్యూటర్ కొత్తగా రావడంతో దాని ముందు ఎలా కూచుంటే అనుకూలంగా వుంటుందో ఎవరూ చెప్పలేదు. బల్కంపేటలో మేమే రారాజులం అవడంతో ఎవరి పనినీ కాదనలేకపోయేదాన్ని.
ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కంప్యూటర్ టేబుల్ మీద తల వాలిపోయేది. ఏమీ అర్థం అయ్యేది కాదు. కళ్ళు తిరిగినప్పుడు కాసేపు కూచోవడం మళ్ళీ పని చేసుకోవడం. ఒకోసారి వికారం వచ్చి శరీరం లోపలిదంతా బయటికి పంపేది. మా కజిన్ ఒకాయనతో అంటే అది స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ అని హోమియో మందులు ఇచ్చారు. నమ్మకమో... పనిచేశాయో తెలియదు. బాగానే అనిపించింది.

***
***

అమ్మయ్య అనుకునేలోపున ***చికెన్ గున్యా*** హలో... అంటూ మీదకి దూకింది. ఇంకంతే నాపని అయిపోయింది. జ్వరం. కాళ్ళు రెండూ బిగుసుకుపోయాయి. ఒకటే నెప్పులు. అడుగు పెట్టలేను. వారం రోజులు నరకం అనుభవించాను. నడవడానికి రాదు. కూచుంటే లేవడానికి రాదు. మొత్తానికి ఎలాగో మామూలు స్థితికి వచ్చాను కానీ... ఇప్పటికీ కుడికాలు మడత పెట్టి కింద కూచోవడానికి సహకరించదు. నాకే చిరాగ్గా వుంటుంది.

***
***

ఇవన్నీ అయ్యాయి. మళ్ళీ నా పనిలో నేను తలమునకలవుతున్నాను. ఉన్నట్టుండి కడుపులో పోట్లు. గిలగిలలాడిపోయేదాన్ని. పిల్లలు కంగారు పడతారని కంట్రోల్ చేసుకునేదాన్ని. పిల్లలు ఇనో నీళ్ళలో కలిపి ఇచ్చేవారు. అయినా తగ్గలేదు. ఏదైనా తింటే అది అన్ని రకాలుగాను బయటి వెళ్ళిపోయేది. ఎవరింటికైనా వెళ్ళాలంటే భయం. అక్కడ ఏం ఇబ్బంది పడతానోనని. పొట్టమీద చిన్నసైజు బత్తాయికాయంత ఉండ తగిలింది. నాకు ఏదో కాన్సర్ లాంటిది వచ్చేసింది. నా పిల్లలకి దిక్కెవరు. నేను చెయ్యాల్సిన పనులు ఏమైనా ఉంటే అవి చేసేసుకుంటే బావుంటుందేమో... ఇలా ఎన్నో ఆలోచించాను.



నన్ను బాగా ఇష్టపడే సత్యవాణిగారికి చెప్పాను. ఆవిడ నీలిమ హాస్పిటల్, మారుతీనగర్ కి వెళ్ళమ్మ అక్కడ మా మేనగోడలు నీలిమ అని వుంటుంది. తనకి చూపించుకో అన్నారు. సరే అని ఆవిడ దగ్గిరకి వెడితే చూసి, ఇది హెర్నియాలా వుంది. ఎర్రగడ్డలో మా హాస్పిటల్ లో ఫేమస్ గాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఆనంద్ డాక్టర్ అని వుంటారు. ఆయన్ని కలవండి అని చెప్పారు. ఆనంద్ డాక్టర్ దగ్గిరకి వెళ్ళాను. ఆయన నిజంగానే చక్కటి నవ్వుతో ఆనందంగా వున్నారు. సమస్య చెప్పాను. చూసి “ఇది హెర్నియా మీరు తీయించుకోపోతే ముందు ముందు చాలా సమస్యలు వస్తాయి. వీలైనంత తొందరలో ఆపరేషన్ కి రెడీ అవ్వండి” అన్నారు.

ఇంటికి వచ్చి పిల్లలకి, మా వారికి చెప్పాను. మా అమ్మాయి ఇంజనీరింగ్ అయి, కొత్తగా ఉద్యోగంలో చేరి సంవత్సరం అయ్యింది. తను ఇన్స్యూరెన్స్ కి అప్లయ్ చేసింది. (2012 జూన్ 18) ఆపరేషన్ కి డేట్ ఇచ్చారు. హాస్పిటల్ కి వెళ్ళాను రూమ్ ఇచ్చారు. నేను మా అమ్మాయి వెళ్ళాం. ఇంతలోనే ఒక జూనియర్ డాక్టరు వచ్చి, “ఆపరేషన్ చేయించుకోవడానికి పేషెంట్ వచ్చారుట ఎక్కడున్నారు?” అన్నాడు.

“నేనే” అన్నాను.

“మీరా???” అని తెల్లమొహం వేశాడు.

మరి డౌట్ రాక ఏమవుతుందీ... చక్కటి పసుపు రంగు ఇస్త్రీ చీర కట్టుకుని, పువ్వులా నీట్ గా వుండి మా అమ్మాయితో నవ్వుతూ కబుర్లు చెప్పేస్తున్నాను. ఏకోశానా పేషెంట్ రూపు రేఖలు అతనికి నా మొహంలో కనిపించలేదు. అప్పటికే పిల్లలు పుట్టినప్పుడు శరీరాన్నిరెండుసార్లు డాక్టర్ల కోతకి (మేజర్ ఆపరేషన్) అప్పగించాను. ఇక మూడోసారి మళ్ళీ ఏం చేసుకుంటే చేసుకోండిలే అని రెడీ అయిపోయాను.

మళ్ళీ అతను “అవునా... మీరు పేషెంట్ అనుకోలేదు. డాక్టరుగారు మీరు వచ్చారేమో చూసి ఆపరేషన్ కి రెడీ చెయ్యమన్నారు” అనేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక ఇంకో సిస్టర్, ఇంకెవరో వచ్చి అలాగే అడిగి వెళ్ళిపోయారు.

ఇంకోగంటలో అన్నీ సిద్ధం చేసుకుని... నా శరీరంలోంచి ఆ వ్యర్థ పదార్థాన్ని తీసేసి, నన్ను క్షేమంగా రూంలోకి పంపించారు. ఆ డా. ఆనంద్ మా అమ్మాయి అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చక్కగా చెప్పి, ఏ డౌట్ వున్నా ఫోన్ చెయ్యమని నన్ను ఇంటికి పంపించారు. ఇప్పటి వరకూ నేను ఎప్పుడు ఫోను చేసినా ఆయన మాట్లాడతారు. ఏవైనా డౌట్స్ వుంటే చెప్తారు.

ఇంటికి వచ్చాక నాకు తోడు వుంటానని వచ్చిన ఒకావిడ నాలుగు రోజులకే వెళ్ళిపోయింది. ఇక మా అమ్మాయి వారం రోజులు వుండి లీవు అయిపోయిందని ఆఫీసుకి వెళ్ళిపోయింది. ఇక తప్పదన్నట్లు ఆపరేషన్ అయిన 20 రోజుల నుంచే మెల్లిగా అన్ని పనులూ చేసుకుని అతి తొందరలో మళ్ళీ నా కంప్యూటర్ పనులు చేసుకోగలిగాను.

***
***

ఒకరోజు ఎవరో వర్కు గురించి రమ్మంటే... హడావుడిగా వెడుతున్నాను. మా ఇంటి దగ్గర వున్న టిఫిన్ సెంటర్ దగ్గిరకి వచ్చేసరికి కళ్ళుతిరిగి ఉన్నట్టుండి రోడ్డుమీద నరికిన చెట్టులా బోర్లా పడ్డాను. అందరూ వచ్చి నీళ్ళు చల్లండి, లేవతియ్యండి అంటుంటే... అందరినీ ఒక్క ఐదు నిమిషాలు ఆగమని నేన లేచి అక్కడ ఒక పక్కగా కూచుని తెలిసిన వాళ్లని ఇంటికి వెళ్ళి మా అబ్బాయిని పిలుచుకు రమ్మన్నాను. చెయ్యీ కాలూ మాత్రం విరగలేదు.

వాడు వచ్చాక దగ్గరలో వున్న హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ అన్ని చెకప్ లు అయ్యాక వాళ్ళు మీకేమీ లేదు పడడం వల్ల బిపి పెరిగింది. కొన్నాళ్ళు టాబ్లెట్స్ వాడమని ఇచ్చారు. ఇదీ అతిగా పని చెయ్యడం వల్ల అని తర్వాత తెలిసింది. కానీ, అది మెయిన్ రోడ్డు మీద పడివుంటే... నా మీద నుంచీ ఏ బస్సో వెళ్ళిపోయి వుంటే... అమ్మో ఆ ఆలోచనకే భయం వేస్తుంది.

ఇన్ని రకాల అనుభవాలు అయ్యాక, కంప్యూటర్ దగ్గర ఎలా కూచోవాలి. ఎలా కూచుంటే ఇబ్బంది అవదు అనేవన్నీ తెలుసుకుని ఆచరిస్తూ ఎంత పననయినా చెయ్యగలుగుతున్నాను. రాటుదేలిపోయాను. ఇప్పుడయితే కొంతసేపు పనిచేసి మధ్యలో రెస్ట్ తీసుకుంటాను. కూచునే కుర్చీ వెనక దిండు పెట్టుకుని అనుకూలంగా కూచుంటున్నాను. ఇప్పుడు పనిచేయడం వల్ల సమస్యలు లేవు. నాకు పని చెయ్యక పోతేనే తోచదు. చేసేటప్పుడు ఒళ్ళు తెలియదు.

ఈ మధ్య మా అపార్ట్ మెంట్ లో వాకింగ్ చేస్తూ బోర్లా పడ్డాను. కాళ్ళూ చేతులూ కొట్టుకు పోయాయి. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. తర్వాత తగ్గిపోయాక చెప్పాను.

ఇప్పటికీ ఈ డా. ఆనంద్ (గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్) , డా. నీలిమ (గైనకాలజిస్ట్), డా. రామకృష్ణ (జనరల్ ఫిజీషియన్), డా. సాయిబాబు (చెస్ట్ స్పెషలిస్ట్, ఎమ్.డి.) ఇలా కొంతమంది డాక్టర్ల నెంబర్లు అందుబాటులో పెట్టుకుంటాను. మధ్యలో పలకరిస్తూ వుంటాను.

18, జూన్ 2023, ఆదివారం

***పడిలేచే కడలి తరంగంలా నేను*** - 90

***పడిలేచే కడలి తరంగంలా నేను*** - 90

నా జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో... తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది.

అనారోగ్యాల మాటెలా వున్నా... నా చిన్నప్పుడు జరిగిన సంఘటన తలుచుకుంటే... నాజీవితం అప్పుడే ముగిసిపోయి వుంటే...

హైదరాబాదులో నా జీవనయానమూ వుండేది కాదు. నేను ఎఫ్.బిలో వుండేదాన్నీ కాదు. ఇంతమంది స్నేహితులయ్యేవారూ కాదు. ఏదో ఒక ఉద్ధరింపు ఉంటుంది జీవితానికి. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం-

చిన్నప్పుడు నేను చదివింది గవర్నమెంట్ స్కూలు. అవుట్ బెల్ (అప్పట్లో ఉ. 10 గంటలకి ఇచ్చే బ్రేక్ ని అవుట్ బెల్ అనే వాళ్లం) లో అందరం బయటికి పరిగెత్తి ఆడుకునేవాళ్ళం. మంచి నీళ్ళు కావాలంటే పక్కవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తాగేవాళ్ళం. స్కూల్లో ఒక ఇత్తడి డ్రమ్ తో నీళ్ళు పెట్టేవారు. స్కూలు దగ్గరలో కాలవ వుండేది. స్కూలుకి, కాలవకి మధ్య మెయిన్ రోడ్డు. ఒకసారి మాక్లాసు పిల్లలు ఇద్దరు కాలవకి వెళ్ళి నీళ్ళు తాగి వచ్చాం అన్నారు. నేనెందుకు ఆ సాహసం చెయ్యకూడదు అనుకున్నాను. అప్పుడు 4వ తరగతి చదువుతున్నాను. రెండు బలపాలు చేత్తో పట్టుకుని మెల్లిగా కాలవ దగ్గిరకి వెళ్ళాను. అప్పుడు ఒకాయన స్నానం చేస్తున్నాడు. బలపాలు మెట్టు మీద పెట్టి, నీళ్ళు తాగడానికి వంగాను. తర్వాత ఏమైందో తెలియదు. నిండుగా ప్రవహిస్తున్న కాలవలోకి కొంతదూరం కొట్టుకు వెళ్ళిపోయాను.


కానీ ఇంతలోకే మాటలు వినిపించాయి. ఒక సోడాబండీ నరసింహ నన్ను పైకి తీసుకువచ్చాడుట. నన్ను గట్టు మీద పడుకోపెట్టి ప్రథమచికిత్స చేస్తున్నారు. ఒక పోలీసు కూడా వచ్చాడు. చాలా భయపడ్డా... (పోలీసంటే నాకు చాలా భయం. ఎందుకో తెలీదు. కాకపోతే పోలీసు చచ్చిపోడనుకున్నా... ఒకసారి ట్రైన్ కిందపడి పోలీసు చచ్చిపోయాడన్నారు. అప్పుడు తెలిసింది వాళ్ళూ మనుషులే అని) అన్నీ అయ్యాక తడి గౌనుతో స్కూలుకి తీసుకెళ్ళారు. హెడ్మాస్టారు ఇద్దరు పిల్లలని ఇచ్చి ఇంటికి పంపించారు.

స్కూలవ్వకుండా తడి గౌనుతో వచ్చిన నన్ను చూసి అమ్మ గాభరాగా ఏమైందని అడిగింది. నాతో వచ్చినవాళ్ళు కాలవలో పడ్డానని చెప్పారు. అంతే!!! అమ్మ భద్రకాళి అవతారం ఎత్తి ముందు వీపుమీద నాలుగు ఉతికింది. ఆ పిల్లలిద్దరూ భయపడి పారిపోయారు.

తర్వాత అమ్మ నన్ను కాగలించుకుని భోరున ఏడుస్తూ “నీకు కాలవ దగ్గిర ఏం పని... అలా ఎందుకు వెళ్ళావు. నువ్వు కొట్టుకుని వెళ్ళిపోతే నేనేమైపోవాలి. ఇంకెప్పుడూ అలా చెయ్యకు. నీళ్ళు కావాలంటే ఇంటికి రా...” అని బట్టలు మార్చి, కాసేపు పడుకోమని చెప్పింది.

సాయంత్రం నాన్నగారు బ్యాంక్ నించి వస్తూండగానే రోడ్డు పొడుగూతా... “మీ అమ్మాయి కాలవలో పడిపోయింది. ఎవరో పైకి తీశారు. ఇప్పుడు ఇంట్లో వుంది” అని చెప్పారు. నాన్నకి ఒకటే కంగారు. గబగబా ఇంటికి వచ్చి “అలా ఎందుకు వెళ్ళావు నాగా.. చూశావా... నువ్వు రోజూ... ఆంజనేయస్వామికి దణ్ణంపెట్టుకుంటావు కదా... ఆయనే నిన్ను బయటికి తీశాడు. ఇంకెప్పుడూ అలా వెళ్ళకు. నీకు నీళ్ళు కావాలంటే ఇంటికి వచ్చి తాగు” అన్నారు. ఏమో మొత్తానికి బతికి బయటపడ్డా.

నాన్న ఊరుకున్నారా... మర్నాడు స్కూలుకి వచ్చి హెడ్మాస్టారుతో, మిగిలిన మాస్టార్లతో పిల్లలు ఎటువెళ్తున్నారో చూసుకుంటూ వుండండి. ఇవాళ మా అమ్మాయి... రేపు ఇంకొకళ్ళు అని గట్టిగా చెప్పి బ్యాంక్ కి వెళ్ళిపోయారు. మర్నాడు సోడాబండీ నరసింహని తగిన విధంగా సత్కరించారు.

మా ఊళ్ళో ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ రెండే వుండేవి. నాన్నగారు ఆంధ్రాబ్యాంక్ లో చేసేవారు. మాస్టార్లందరికీ అక్కడ అకౌంట్ వుండేది. ఆయనంటే గౌరవం వుండేది. అప్పుడప్పుడు స్కూలుకి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూండేవారు.

ఇదీ నా చిన్నప్పటి సంగతి మరి నా జీవనయానం మధ్యలో పలకరించిన అనారోగ్యాల సంగతి రేపు.

ఫోటోలో ఉన్నదే ఆ కాలవ, ఆ మెట్లు. కాలవ మీద చిన్న వంతెన.


నన్నుచూసి ఆ కాలవ పలకరింతగా నవ్వింది. నేను ఆనందంగా ఫోటోతీసుకున్నా మరి. చిన్ననాటి జ్ఞాపకం కదా...

11, జూన్ 2023, ఆదివారం

***స్వేచ్ఛా విహంగాలు విజయవంతమైన క్వారంటైన్ ఘట్టం*** - 89

 


***స్వేచ్ఛా విహంగాలు

విజయవంతమైన క్వారంటైన్ ఘట్టం***   - 89


మూడు రోజుల ప్రయాణం... ఎట్టకేలకు క్షేమంగా చేరిన గమ్యం.

గూటికి చేరేముందు దాటవలసిన మరో పెద్ద అగాధం క్వారంటైన్

అదో పంజరమా... అదో ఖైదా...

ఏమో... అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.

 

అదీ ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో... అన్నీ ఉచితంగానే ఇచ్చినా ఈ ప్రక్రియ కఠినంగానే వుంది కాబట్టే 400 మందీ ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళారు.

ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఫైవ్ స్టార్ హోటల్లో మెత్తటి పరుపులు, ఎ.సి., చలేస్తే హీటర్, వైఫై టీ.వీ. అన్ని హంగులూ ఉన్న అదోరకమైన ఖైదులో పెట్టేశారు.

 

* * *

 

మూడురోజుల ప్రయాణంలో బాగా అలిసిపోయి మూడురోజులు బాగా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నారు. ఇక నాలుగో రోజునుంచి మా చిట్టిపాపాయితో మా అమ్మాయి ఒక్కత్తీ నాలుగు గోడల మధ్యన ఎలా మేనేజ్ చేసుకోగలిగిందో... చెప్పాలంటే ఓ పెద్ద కథ రాయచ్చు.

 

పాపకి 7వనెల వచ్చింది. ఇప్పుడిప్పుడే అన్నీ బాగా తెలుస్తున్నాయి. 14 రోజుల ముందు వరకూ ఇంట్లో 5గురి మధ్య ఆనందంగా ఆడింది. ఎందుకు అక్కడుందో ఏమీ అర్థంకాలేదు. మా దగ్గరున్నప్పుడే పిల్లల పాటలు కంప్యూటర్ లో చూడ్డం అలవాటయ్యింది కాబట్టి. కాసేపు అవి చూసేది.


వాళ్ళ నాన్న - నానమ్మ, తాతయ్యలతో - మాతో నాలుగైదుసార్లు వీడియో కాల్స్, పేచీలు, ఏడుపులు, పలకరింపులు, ఆటలు, మేము చూస్తూ వుండడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. మేము మాట్లాడితే కొంత ఉపశమనం అంతే...

 

ఇక రోజులు గడుస్తున్నకొద్దీ తను అమ్మే ఎందుకున్నారో ఆ చిన్న మెదడులో ఆలోచనలు కావచ్చు. తెలియకుండానే వాళ్ళమ్మ బుగ్గలు కొరకడం, జుట్టు పీకడం, మీదపడి కుమ్మడం లాంటివి చేసింది.




కాకపోతే వాళ్ళమ్మ పాడిన పాటలకి నోరుమెదపడం, కూచోవడం, అన్నీ పట్టుకుని నుంచోవడం నేర్చుకుంది. వాళ్ళు ఇచ్చిన బేబీ ఫుడ్ ఇష్టంగా తినేది. నిజంగా ఎవరూ లేకుండా నాలుగు గోడల మధ్యన 14 రోజులు గడపడం చాలా కష్టం.

 

* * *

 

క్వారంటైన్ వివరాల్లోకి వెడితే

 

400 మందికి రూములు ఏర్పాటు చేసి, తలుపు తీసుకుని బయటికి రావద్దని చెప్పి నాలుగు గోడల మధ్య బంధించేశారు. ఎవరైనా బయటి వస్తారేమోనని ఒక్కో ఫ్లోర్ కి సెక్యూరిటీ గార్డ్ ని పెట్టారు.

 


వాళ్ళు పొద్దున్న అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏ టైముకి అవి గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. వీళ్ళు మ్యూజియంలో బొమ్మ గడియారం కొట్టి డింగ్ మని లోపలికి వెళ్ళిపోయినట్లు అవి తీసుకుని వెంటనే లోపలికి వెళ్ళిపోవాలి. వీళ్ళు తినేసిన తర్వాత ఖాళీవన్నీ బయట పెట్టేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు.

 

వీళ్ళు రూంలోంచి మాత్రం బయటికి రాకూడదు. రోజూ మాత్రం మెడికల్ డిపార్ట్ మెంట్ వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే చెప్పమని ఫోన్ లో పలకరించేవారు, అవసరమైతే వచ్చి తగిన సేవలు అందించేవారు. వీడియోకాల్స్ లో మాట్లాడేవారు.

 

నాలుగు గోడల మధ్య పెద్ద వాళ్ళు అయితే ఫర్వాలేదు. పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం కష్టమే... మరి. ఒకరోజు ముందు కరోనా టెస్ట్ చేసి అందరినీ ఖైదులోంచి విడుదలచేశారు.

 



పాప ఒక్కసారి బయటికి వచ్చేసరికి బాగా  ఏడ్చింది.

మెల్లగా బయటి వాతావరణానికి అలవాటు పడాలి.

ఇంటికి వెళ్ళిపోయారు.

 

మొత్తానికి కథ సుఖాంతం.

 

6, జూన్ 2023, మంగళవారం

*** మా అమ్మాయి వీణ 6 నెలల పాపతో మూడురోజుల సాహస యాత్ర *** - 88

 




*** మా అమ్మాయి వీణ 6 నెలల పాపతో మూడురోజుల సాహస యాత్ర ***  - 88


హైదరాబాద్ నుంచి చెన్నై 17 గంటలు


చెన్నై నుంచి దోహా 5 గంటలు

దోహా నుంచి పెర్త్, ఆస్ట్రేలియా 11.5 గంటలు

అసలు హైదరాబాద్ నుంచి పెర్త్ కి ప్రయాణం 9.30 గంటలు మాత్రమే.


పాపని తీసుకుని అందరితో ఆనందంగా గడపాలని ఇండియా వచ్చింది. రెండున్నర నెలలు తెలియకుండా రోజులు గడిచిపోయాయి. మధ్యలో వచ్చిన కరోనా లాక్ డౌన్ ఎన్ని రోజులు వుంటుందో తెలియదు. మళ్ళీ ఆస్ట్రేలియా తిరిగి వెళ్ళాలని గుబులు. అతలాకుతలం అవుతోంది.


పంపించాలంటే మాకూ టెన్షనే. వెళ్ళకపోతే అక్కడ జాబ్ పోతుందని భయం. అక్కడికి వెళ్ళిపోతే ఈ టైమ్ లో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంత ఆర్థిక సాయం వుంటుంది. సరే దూకాలా వద్దా... దూకాలా వద్దా... అనుకునే కన్నాదూకేస్తే తరవాత సంగతి తర్వాత. నేను మా పిల్లలకి అదే చెప్పేదాన్ని. అది ఇక్కడ మా అమ్మాయి ఉపయోగించుకుంది.


ఈలోపున ఆస్ట్రేలియన్ హై కమీషన్ ఇండియాలో వుండిపోయిన ఉన్నవాళ్ళందరి సమాచారం సేకరించారు.

చెన్నై, కలకత్తా, ఢిల్లీ, బొంబాయిల నుంచి విమాన సర్వీసులు దోహా మీదుగా ఆస్ట్రేలియాలో వివిధ ప్రాంతాలకి ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలకి చేరడానికి దగ్గరలో వున్న ప్రాంతాల నుంచి ఇంక్రెడిబుల్ ఇండియా బస్ లు ఏర్పాటు చేశారు.

మా అమ్మాయి హైదరాబాద్ నాంపల్లిలో 28వ తేదీ ఉదయం మా అబ్బాయి బస్ ఎక్కించి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచీ వాడు ఒకటే బాధపడిపోవడం. ఎలా వెడుతుందో అనే టెన్షన్ మరి.  

అంతా సవ్యంగానే జరుగుతోంది అని బస్సు బయల్దేరి ఆంధ్రప్రదేశ్ చేరింది.  ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఆటంకం. ఇంకేవో పర్మిషన్లు కావాలని నాలుగు గంటలు ఆపేశారు. పిల్లలతో ఉన్నారని జాలి కూడా చూపించకుండా ఆపేశారు.


అక్కడ నుంచి వీళ్ళు చెన్నై చేరేసరికి అర్థరాత్రి అయ్యింది. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి హోటల్ రూం లో రెస్ట్ తీసుకోమన్నారు. అయితే వీళ్ళగురించి ఎప్పటికప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కేర్ తీసుకోవడం మొదలుపెట్టింది.

29 ఉదయం పది గంటల నుంచి అందరికీ టెంపరేచర్ చూసి, మధ్యాహ్నం చెన్నై నుంచి దోహా ఫ్లైట్ ఎక్కించారు. 5 గంటలు ప్రయాణం. ప్రయాణంలో పాప ఆటలతో బాగా సహకరించింది.

 

రాత్రి 8 గంటలకి దోహాలో ఫ్లైట్ దిగాక లాంజ్ లో 8 గంటలు బ్రేక్. అక్కడ మళ్ళీ 30 తెల్లవారుజామున 4 గంటలకి పెర్త్ విమానం ఎక్కారు. 11.5 గంటలు ప్రయాణం. పాప చాలాసేపు నిద్రపోవడం, ఆడుకోవడంతో ఎక్కువ ఇబ్బంది అవలేదు.  అమ్మయ్య అనుకుంది పాపం.

 

మొత్తానికి పెర్త్ చేరేసరికి 30వ తేదీ సాయంత్రం 8 గంటలు అయ్యింది. అక్కడ మళ్ళీ టెంపరేచర్ చూసి నోవాటెల్ హోటల్ లో రూంకి రాత్రి 11.30 కి క్వారంటైన్ కి పంపించారు. మొత్తానికి మా అల్లుడు శేఖర్ ఊపిరి పీల్చుకున్నాడు.


మొత్తానికి ఆ గడ్డ మీద అడుగుపెట్టారు. ఇదీ కథ.

 

15 రోజులు 6 నెలల పాపతో రూంలోంచి బయటికి వెళ్ళకుండా క్వారంటైన్ లో ఎలా వుందో మళ్ళీ చెప్తాను.