11, జూన్ 2023, ఆదివారం

***స్వేచ్ఛా విహంగాలు విజయవంతమైన క్వారంటైన్ ఘట్టం*** - 89

 


***స్వేచ్ఛా విహంగాలు

విజయవంతమైన క్వారంటైన్ ఘట్టం***   - 89


మూడు రోజుల ప్రయాణం... ఎట్టకేలకు క్షేమంగా చేరిన గమ్యం.

గూటికి చేరేముందు దాటవలసిన మరో పెద్ద అగాధం క్వారంటైన్

అదో పంజరమా... అదో ఖైదా...

ఏమో... అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.

 

అదీ ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో... అన్నీ ఉచితంగానే ఇచ్చినా ఈ ప్రక్రియ కఠినంగానే వుంది కాబట్టే 400 మందీ ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళారు.

ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఫైవ్ స్టార్ హోటల్లో మెత్తటి పరుపులు, ఎ.సి., చలేస్తే హీటర్, వైఫై టీ.వీ. అన్ని హంగులూ ఉన్న అదోరకమైన ఖైదులో పెట్టేశారు.

 

* * *

 

మూడురోజుల ప్రయాణంలో బాగా అలిసిపోయి మూడురోజులు బాగా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నారు. ఇక నాలుగో రోజునుంచి మా చిట్టిపాపాయితో మా అమ్మాయి ఒక్కత్తీ నాలుగు గోడల మధ్యన ఎలా మేనేజ్ చేసుకోగలిగిందో... చెప్పాలంటే ఓ పెద్ద కథ రాయచ్చు.

 

పాపకి 7వనెల వచ్చింది. ఇప్పుడిప్పుడే అన్నీ బాగా తెలుస్తున్నాయి. 14 రోజుల ముందు వరకూ ఇంట్లో 5గురి మధ్య ఆనందంగా ఆడింది. ఎందుకు అక్కడుందో ఏమీ అర్థంకాలేదు. మా దగ్గరున్నప్పుడే పిల్లల పాటలు కంప్యూటర్ లో చూడ్డం అలవాటయ్యింది కాబట్టి. కాసేపు అవి చూసేది.


వాళ్ళ నాన్న - నానమ్మ, తాతయ్యలతో - మాతో నాలుగైదుసార్లు వీడియో కాల్స్, పేచీలు, ఏడుపులు, పలకరింపులు, ఆటలు, మేము చూస్తూ వుండడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. మేము మాట్లాడితే కొంత ఉపశమనం అంతే...

 

ఇక రోజులు గడుస్తున్నకొద్దీ తను అమ్మే ఎందుకున్నారో ఆ చిన్న మెదడులో ఆలోచనలు కావచ్చు. తెలియకుండానే వాళ్ళమ్మ బుగ్గలు కొరకడం, జుట్టు పీకడం, మీదపడి కుమ్మడం లాంటివి చేసింది.




కాకపోతే వాళ్ళమ్మ పాడిన పాటలకి నోరుమెదపడం, కూచోవడం, అన్నీ పట్టుకుని నుంచోవడం నేర్చుకుంది. వాళ్ళు ఇచ్చిన బేబీ ఫుడ్ ఇష్టంగా తినేది. నిజంగా ఎవరూ లేకుండా నాలుగు గోడల మధ్యన 14 రోజులు గడపడం చాలా కష్టం.

 

* * *

 

క్వారంటైన్ వివరాల్లోకి వెడితే

 

400 మందికి రూములు ఏర్పాటు చేసి, తలుపు తీసుకుని బయటికి రావద్దని చెప్పి నాలుగు గోడల మధ్య బంధించేశారు. ఎవరైనా బయటి వస్తారేమోనని ఒక్కో ఫ్లోర్ కి సెక్యూరిటీ గార్డ్ ని పెట్టారు.

 


వాళ్ళు పొద్దున్న అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏ టైముకి అవి గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. వీళ్ళు మ్యూజియంలో బొమ్మ గడియారం కొట్టి డింగ్ మని లోపలికి వెళ్ళిపోయినట్లు అవి తీసుకుని వెంటనే లోపలికి వెళ్ళిపోవాలి. వీళ్ళు తినేసిన తర్వాత ఖాళీవన్నీ బయట పెట్టేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు.

 

వీళ్ళు రూంలోంచి మాత్రం బయటికి రాకూడదు. రోజూ మాత్రం మెడికల్ డిపార్ట్ మెంట్ వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే చెప్పమని ఫోన్ లో పలకరించేవారు, అవసరమైతే వచ్చి తగిన సేవలు అందించేవారు. వీడియోకాల్స్ లో మాట్లాడేవారు.

 

నాలుగు గోడల మధ్య పెద్ద వాళ్ళు అయితే ఫర్వాలేదు. పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం కష్టమే... మరి. ఒకరోజు ముందు కరోనా టెస్ట్ చేసి అందరినీ ఖైదులోంచి విడుదలచేశారు.

 



పాప ఒక్కసారి బయటికి వచ్చేసరికి బాగా  ఏడ్చింది.

మెల్లగా బయటి వాతావరణానికి అలవాటు పడాలి.

ఇంటికి వెళ్ళిపోయారు.

 

మొత్తానికి కథ సుఖాంతం.

 

2 కామెంట్‌లు:

  1. చిన్న పిల్లల్ని బంధించి ఉంచడం కష్టమే లెండి.

    // “ అన్నీ ఉచితంగానే ఇచ్చినా …… “ //
    ఆ టైములో మన దేశంలోనూ అమలు చేసారు ఈ హోటల్ క్వారంటైన్. తేడా ఏమిటంటే హోటల్ ఖర్చు క్వారంటైన్ చెయ్యబడ్డ వ్యక్తుల ముక్కు పిండి వసూలు చేసారట. సదరు వ్యక్తులు గగ్గోలు. విమాన ప్రయాణ ఖర్చు కూడా వసూలు చేసారట. ఆ టైములో మన దేశంలో దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నట్లు ఇష్టారాజ్యంగా సాగింది.

    క్రింది లింక్ లో వార్తాపత్రిక రిపోర్ట్ చూడండి 👇👇.

    https://www.hindustantimes.com/mumbai-news/we-were-made-to-pay-entire-amount-for-14-day-quarantine-period-at-hotels-say-vande-bharat-mission-fliers/story-wMSxnFz4G3Q6FAFzQmxAEI_amp.html

    రిప్లయితొలగించండి
  2. చదివాను సర్. చాలా దారుణంగా వుంది.

    రిప్లయితొలగించండి