21, నవంబర్ 2020, శనివారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు -10


 అమ్మా...

నాకు, చిన్నుగాడికి ఇవాళ నీతో మాట్లాడాలని చాలా అనిపించింది. అలా అలా అనుకుంటూ ఇద్దరం మళ్ళీ చిన్నప్పటి విషయాల్లోకి వెళ్ళిపోయాం. నువ్వు నీ కంప్యూటర్ వర్క్సు పార్కు దగ్గిర ఇంట్లో మొదలు పెట్టావు కదా. మేమిద్దరం చాలా చిన్నపిల్లలం. నాకు ఐదేళ్ళు, చిన్నుగాడికి రెండే్ళ్ళు. అక్కడ పిల్లలు ఎక్కుమంది వుండేవాళ్ళు కాదు. మేమిద్దరమే. ఇద్దరం కలిసే ఆడుకుంటూ వుండేవాళ్ళం.
నీ దగ్గిర వర్కు చేయించుకోవడానికి చాలామంది వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో వీనస్ అంకుల్, మాస్టర్ మైండ్స్ బ్రహ్మం అంకుల్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఇంకా చాలామంది వచ్చి వర్క్ చేయించుకునేవాళ్ళు. అయితే వీనస్ అంకుల్ రాగానే మేమిద్దరం పరిగెత్తుకుంటూ వెళ్ళి వీనస్ అంకుల్, వీనస్ అంకుల్ అంటూ గంతులేస్తూ చుట్టూ తిరిగేవాళ్ళం. అసలు అలా ఎలా చేసేవాళ్ళం అమ్మా... అంకుల్ ని లోపలికి రానిచ్చేవాళ్ళం కాదు. ఆయన సరే సరే అని పక్కకి వెడదామంటే మేము దారిస్తే కదా...
మాస్టర్ మైండ్స్ బ్రహ్మం అంకుల్ వస్తుంటే కిలోమీటర్ దూరం నుంచీ బైక్ చప్పుడు వినిపిస్తూ వుండేది. అది వినగానే మాస్టర్ మైండ్స్ అని పరుగెత్తుకుని వెళ్ళేవాళ్ళం. ఏంటో ఇప్పుడు తలుచుకుంటే ఒకపక్క నవ్వు వస్తుంది. మరోపక్క చిరాకేస్తుంది.
ఇంకోసారైతే ఒక అబ్బాయి, ఒకమ్మాయి బైక్ మీద వచ్చారు. ఆ అబ్బాయి పెద్ద స్టైల్ గా పిలక వేసుకుని వచ్చారు. మాకు విచిత్రంగా అనిపించింది. నువ్వేమో సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నావ్. వాళ్లు నీదగ్గిరకి వచ్చి వర్క్ గురించి మాట్లాడి వెళ్ళిపోతుంటే... మేమిద్దరం పిలకంకుల్ పిలకంకుల్ అంటూ వాళ్ళవెనక పరిగెత్తాం.
నువ్వు మా ఇద్దరినీ పిిలిచి అలా అనద్దని, చాలా గట్టిగా చెప్పావు. ఎందుకు మమ్మల్ని నువ్వు అలా అన్నావో మాకు అర్థం కాలేదు. అలా ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని చెప్పావు. ఇవన్నీ తలుచుకుంటే ఇప్పుడు అవన్నీ తెలియక చేసిన చిలిపి పనులయినా అలా ఎలా పిచ్చిగా చేశామా అనుకున్నాం.
మా చిన్నప్పటివి ఎన్ని అనుభవాలు, అనుభూతులో కదమ్మా... తలుచుకున్న కొద్దీ వస్తూనే వున్నాయి.
మేమిద్దరం బాగానే వున్నాం.
వుంటానమ్మా...

14, నవంబర్ 2020, శనివారం

అమ్మకు ప్రేమతో... మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన 9వ ఉత్తరం

 

అమ్మా... 

ఏం చేస్తున్నారు... ?  

మా ఇంటికి ఇవాళ రోహిణీ వాళ్ళ అబ్బాయి అర్వి వచ్చాడు. వాడు ఎక్కువ అల్లరి చెయ్యకుండా కదలకుండా కూచుంటాడు కానీ, వాడికి నీళ్ళంటే చాలా పిచ్చి. శేఖర్ మొక్కలకి నీళ్ళు పోస్తుంటే వాడూ పోస్తానని తయారవుతాడు. నాకు చిన్నుగాడే గుర్తుకు వచ్చాడు.  వాడు ఇవాళ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎక్కడికో వెళ్ళాడు. 

వాడి చిన్నప్పుడు బలే జరిగింది కదా... నీకు గుర్తుందా... వాడి అల్లరి..?

నువ్వు వంటింట్లో పని చేసుకుంటున్నావు. గుమ్మంబయట నీళ్ళ బకెట్ వుంది. నేనూ వాడు ముందు రూములో  ఆడుకుంటున్నాము. ఎప్పుడు వెళ్లాడో తెలియదు.  వాడికి ఇంకా పూర్తిగా ఏడాది నిండలేదు.  పాక్కుంటూ వెళ్ళి బకెట్ పట్టుకుని నుంచుని నీళ్ళ మీద తపతపా కొట్టి ఆడుతున్నాడు. ఏంచేశాడో కానీ బకెట్ లో పడిపో



యాడు. నేను గబగబా వచ్చి నీకు చెప్పాను. నువ్వు పరిగెత్తుకుని వచ్చి వాడిని తీశావు. 

అమ్మో... ఇలా అయితే ఎలా అని చాలా భయపడ్డావు. నిన్ను చూస్తే నా చిన్ని బుర్రలో భయం వేసింది. ఓహో ఇది చాలా ప్రమాదం అనుకున్నాను. 

మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అలాగే బకెట్ లో పడ్డాడు. నేను వెంటనే వెళ్ళి బకెట్ ని పక్కకి పడేశాను. వాడు తడిసిపోయిన బట్టలతో పాక్కుంటూ బయటికి వచ్చేశాడు. నువ్వు చాలా మంచి పని చేశావని నన్ను మెచ్చుకున్నావు. 

ఇప్పటికీ అనుకుంటాను వాడిని బలే కాపాడానని. అమ్మో... అలా వదిలేస్తే ఇంకేమన్నా వుందా... అప్పటి నుంచీ చిన్న పిల్లలు ఎవరన్నా నీళ్ళ దగ్గిరకి వెడితే కనిపెట్టుకుని చూస్తుంటాను. 

వుంటానమ్మా.. నాన్నని అడిగినట్లు చెప్పు.    

10, నవంబర్ 2020, మంగళవారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు 8


 అమ్మా... చాలా రోజులైంది కదా...

నీతో నేను వీడియో ఛాట్ చేసి కూడా చాలా రోజులైంది. ఈమధ్య ఆఫీస్ లో పని ఎక్కువైంది. శనివారం, ఆదివారం కూడా వెళ్తున్నాను.

నిన్న మా ఫ్రెండ్ నేను కలిసి లంచ్ టైంలో ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాం. అక్కడ మజ్జిగ తీసుకున్నాం. చాలా బాగుంది. నాకు ఎందుకో సడన్ గా నా చిన్నప్పటి విషయం గుర్తుకు వచ్చింది. అమ్మా... నువ్వు చెప్పిన విషయమే.

నాకు సంవత్సరం అప్పుడు విజయవాడ పెద్దమ్మా వాళ్ళింటికి వెళ్ళామని, వాళ్ళింట్లో నువ్వు నాకు అన్నం కలిపి పెడుతుంటే అన్నీ పేచీ పెట్టకుండా తిన్నానని పెద్దమ్మ కూడా బాగా మెచ్చుకుందని చెప్పావు. కానీ, చివరలో నాకు పెరుగు వెయ్యకుండా మజ్జిగ పోస్తే - నేను పెరుగే కావాలని పేచీ పెట్టానని నువ్వేమో ఏం చెయ్యాలో తెలియక - నా పేచీ చూసి విజయవాడలో ఎండలు కదా... పెరుగు కరిగిపోయిందని చెప్పానన్నావు. నేను చిన్నపిల్లని కదా... పేచీ ఆపి తినేశాను కదా...

పెద్దమ్మ మాత్రం చాలా బాధపడి మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వరకు రోజూ నాకు పెరుకు వేసి పెట్టిందని చెప్పావు. చిన్నప్పుడు పేచీలు బలేవుంటాయి కదమ్మా...

చిన్నుగాడు మాత్రం చాలా పేచీలు పెట్టేవాడు కదా...

ఇద్దరం అన్నీ గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటూ వుంటాం. అమ్మా ఇవన్నీ ఒక పుస్తకం వేద్దాం. మేము అప్పుడప్పుడు చదువుకోవచ్చు.

4, నవంబర్ 2020, బుధవారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు - 7




 అమ్మా నీకు ఉత్తరం రాసి చాలా రోజులైపోయింది. ఎలా వున్నారు...


ఇవాళ పొద్దున్న శేఖర్ చెయ్యమంటే పూరి చేశాను. కానీ అది చూడగానే కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి.

సంజీవరెడ్డి నగర్ లో మనింటి దగ్గర పూరీషాపులో పూరీ బలే వుండేది కదమ్మా... అసలు ఆ కూర ఎలా చేసేవాడో తెలియదు. రోజూ తినాలనిపించేది. పూరీ కూర అంటే అదే మరి. నువ్వు ఆ షాపు మూసేశాడని. పాపం ఆయన పెద్దవాడయిపోయివుంటాడు.

నువ్వు అలా ట్రై చేస్తే బాగానే వచ్చిందని చెప్పావు. నేనెప్పుడు నీచేత చేయించుకుంటానో కదా...

నాకు ఇంకో విషయం గుర్తుకు వచ్చి బాగా నవ్వొచ్చింది. నువ్వేమో నేను జ్ఞానసరస్వతి స్కూల్లో చదువుతున్నప్పుడు ఒకరోజు బాక్స్ లోకి పూరీ చేసిచ్చావు. పిల్లలందరికీ ఇష్టం అని చెప్పి నాకు విడిగా ఒక బాక్స్ లో నాలుగు పూరీలు, బంగాళదుంప కూర. వేరే బాక్స్ లో 8 పూరీలు, కూర పెట్టి ఇచ్చావు. మా క్లాస్ లో తేజస్విని బాక్స్ లో అన్నం తెచ్చుకుంది. అది తింటూ పూరీలు చూసింది. దాని బాక్స్ తినేసింది. ఎనిమిది పూరీల బాక్స్ తినేసింది. నా బాక్స్ లో నాలుగు పూరీలు తినేసింది.

నేను ఇంటికి ఆకలిమీద వచ్చాను. నువ్వడిగావు. పూరీలు బాగున్నాయా... అని నేను తింటే కదా... నీకు కథంతా చెప్పాను. నన్ను బాగా తిట్టావు. రేపు స్కూలుకి వచ్చి టీచర్ తో చెప్తానుండు అన్నావు.

నువ్వెక్కడ చెప్తావో అలా చెప్తే నా ఫ్రెండ్స్ నవ్వుతారేమోనని నేను నిన్ను ఎంత బతిమాలానో కదా... అది పెద్ద తిండిపోతుది. ఎప్పుడూ నా బాక్సే తినేసేది. నువ్వేమో నన్ను తిట్టేదానివి.

శేఖర్ కి కూడా చెప్పాను. బాగా నవ్వాడు.

అమ్మా ఇక నుంచి లేట్ చెయ్యకుండా ఉత్తరాలు రాస్తాను.

ఉంటాను బై.