28, జూన్ 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 18 - తాడేపల్లిగూడెం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 2

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 18 -  తాడేపల్లిగూడెం  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు - 2

(గత భాగం తరువాత)



ఇదే ఆ పుస్తకాల అలమారు

ఆ ఇంట్లో  నేను పెట్టుకున్న పుస్తకాల అలమారు చూసి ఆనందపడిపోయాను. అది అలాగే వుంది. దాని దగ్గర నుంచుని ఫొటో తీసుకున్నాను.  అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను. నాన్నగారితో సుబ్బారాయుడు షష్ఠికి వెళ్ళి అక్కడ ఒక చక్కని కృష్ణుడి బొమ్మ కొనుక్కున్నాను. ఆ బొమ్మకి చక్కటి బట్టలు కట్టి, తలకి పింఛం పెట్టి అలంకరించేదాన్ని. 

 


నాకు కుడిచేతివైపున ఉన్నదే ఆ కిటికీ

కొంచెం ఇవతలగా ఇంకో మంచం వుండేది. దాని దగ్గర ఒక కిటికీ వుంది. మేడకి వెనక వైపున పెద్ద స్థలం వుండేది. ఆ స్థలంలో అమ్మ, నేను ఎన్నో పువ్వుల మొక్కలు వేశాం. శీతాకాలంలో  ఈ కిటికీలోనుంచి మంచు బిందువులు పడి మినుకు మినుకుమని మెరుస్తూ అరవిచ్చిన మందారాలు, సగం విచ్చిన గులాబిరంగు డిసెంబరు పువ్వులు, తెల్లపువ్వులు, ఇంకా ఎన్నో రకాల పువ్వులు చూసి ఆనందించేదాన్ని.  కింద మేము పాతిన చిక్కుడు గింజలు మొలకెత్తి అవి పైకి పాక్కుంటూ మేడమీద వరకూ వచ్చాయి. అక్కడ కాయలు కాసి మాకు అందుబాటులో ఉండేవి.   అబ్బ ఒక్కసారి అవి తలుచుకుని ఆ కాలంలోకి వెళ్ళిపోయా.

 


అక్కలిద్దరూ అదిగో నేను తిరిగి వున్న మూల కూచుని ట్యూషన్ చెప్పించుకునేవారు

నా పై అక్కలిద్దరూ పదవతరగతి ప్రైవేటు మాస్టారి చేత లెక్కలు చెప్పించుకుంటూ మధ్యమధ్యలో ఒకళ్ళని ఒకళ్ళు చూసి నవ్వుకుంటూ సైగలు చేసుకునేవారు.  నవ్వుకునేవారు. మాస్టారికి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థమయ్యేది కాదు. చాలా మంచాయన. అక్కలని ఏమీ అనేవారు కాదు. కానీ తర్వాత అమ్మ వాళ్ళిద్దరినీ బాగా తిట్టింది. నవ్వు నాలుగు విధాల చేటు. అలా ఊరికే నవ్వకూడదు అని చెప్పింది. 

 (ఇంకా వుంది)


19, జూన్ 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 17 - తాడేపల్లిగూడెం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 17 -  తాడేపల్లిగూడెం  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు


ఒక్కసారి బాల్యంలోకెడితే…......?

 

బాల్యంలో మనం గడిపిన ఇల్లు చూస్తే.... ఆనందమే... ఆనందం...

 

ఓ మేడ కథ.  రాస్తే పెద్ద పుస్తకమే....

 



జూలై 30న తణుకులో పెళ్ళి వుంది. అయితే నాతో వచ్చిన మా అబ్బాయికి, మా అక్క కోడలికి మేము పెరిగిన, చదివిన ఊరు తాడేపల్లిగూడెం చూపించాలని ముందు అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎన్ని జ్ఞాపకాలో..... ! ! !

 

నేను పుట్టింది వరంగలైనా ఆంధ్రా బ్యాంక్ లో చేసే నాన్నగారి ఉద్యోగరీత్యా తాడేపల్లి గూడెం వెళ్ళాము. అక్కడ ముందు కాలవకి అవతలి గట్టున బ్రాహ్మణ వీధిలో వుండేవాళ్ళం.

 

నేను 4వ తరగతి వరకూ అక్కడ గవర్నమెంట్ స్కూలు (పాకబడి)లో చదివాను. అయితే అక్కలు హైస్కూలు చదువుకి వచ్చారు. నాన్నగారి బ్యాంక్ కూడా కాలవ మీద ఉన్న చిన్నవంతెన దాటి, రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాల్సి వచ్చేది. ఒకవేళ గూడ్సు రైలు ఆగి వుంటే దానికింద నుంచి దూరి వెళ్ళేవాళ్ళు.

 

నాన్నగారు ఇదంతా పెద్ద రిస్క్ పిల్లలు ఇబ్బంది పడతారని బ్యాంకుకి, అక్కల స్కూలుకి దగ్గరలో ఒక మేడ అద్దెకి తీసుకున్నారు. అప్పట్లో బ్యాంకు ఉద్యోగస్తులన్నా, మేడ ఇంట్లో ఉండడం అన్నా చాలా గొప్పగా వుండేది.


నేను మూడుసార్లు తాడేపల్లిగూడెం వెళ్ళాను కానీ మా చిన్నప్పటి ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూడాలన్న కోరిక తీరలేదు.  ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నా కోరిక నెరవేరింది. ఇంటి తలుపులు తెరిచి వున్నాయి. లోపలికి వెళ్ళాము. అక్కడ కింద రూములలో అద్దెకున్నవారి అనుమతి తీసుకుని మెట్లెక్కి పైకి వెళ్ళాం. అబ్బా ఎంత సంతోషం వేసిందో.... ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోయాను.


నేను నా అధీనంలో లేను. నాకు 9 సంవత్సరాలప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాము. అక్కడ నాన్నగారు ఏ కిటికీ దగ్గర మంచం వేసుకుని పడుకునే వారో, ఆ కిటికీ దగ్గర నుంచుని వాళ్ళ స్నేహితులు రోడ్డుమీద వెడుతుంటే ఎలా మాట్లాడేవారో కళ్ళముందుకొచ్చింది

(ఇంకా వుంది)


9, జూన్ 2021, బుధవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 17 "ఆదుర్రు" - ఆదరణకి నోచుకోని 2,400 సంవత్సరాల కిందటి బౌద్ధ స్థూపం

 

ఆదరణకి నోచుకోని 2,400 సంవత్సరాల కిందటి బౌద్ధ స్థూపం - "ఆదుర్రు"

 ఆదుర్రుతూర్పు గోదావరి జిల్లామామిడికుదురు మండలానికి చెందిన ఈ గ్రామం గోదావరి ఉపనది - "వైనతేయ" నది ఒడ్డున ఉంది.



సిద్ధార్ధ బక్షి  గారు మా కుటుంబ మిత్రులు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో  ఉంటున్నారు.  ఆయన 70 సంవత్సరాల పుట్టినరోజు కార్యక్రమానికి నన్ను, మా వారిని ఆహ్వానించారు. మాతోబాటు సి. భాస్కర రావుగారు వచ్చారు. 

 

కార్యక్రమం మర్నాడు కాబట్టి,  ఇక్కడికి దగ్గరలో బౌద్ధ స్థూపం వుంది వెడదాం అన్నారు భాస్కరరావుగారు.  ఆయనతో కలిసి మేము  మండపేట నుంచి ఆటో మాట్లాడుకుని రావులపాలెం వరకు వెళ్ళాం. అక్కడ ఉన్నట్టుండి పెద్ద వర్షం. గబగబా షెల్టర్ లోకి వెళ్ళి, అక్కడే అమ్ముతున్న జామకాయలు కొనుక్కుని తిన్నాం.

 

వర్షం తగ్గాక అక్కడ ఏదో బ్రాహ్మణ హోటల్ ఫేమస్ అంటే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాం. ఆ ప్లేస్ లో అది లేదు కానీ, వేరే హోటల్ వుంది. నేను మాత్రం తినలేకపోయాను.  భోజనం అయ్యాక రావులపాలెం నుంచి రాజోలు చేరి మరో బస్ లో జగ్గన్నపేట చేరాం. అక్కడ ఆటో మాట్లాడుకుని మామిడి కుదురు వెళ్ళాం.  బౌద్ధస్థూపాలు చాలా లోపలికి వుంటాయని చెప్పారు అదే ఆటోలో లోపలికి వెళ్ళాం.

 

 చాలా కష్టపడి వెళ్ళినందుకు  అందమైన ప్రకృతి రమణీయత. అడవితల్లి ఒడిలో కాసేపు ఆనందం.

 

చుట్టూరా పచ్చదనం, కోనసీమ అందంమంతా అక్కడే ఉందేమో అనిపించింది. స్వాగతమిస్తున్న కొబ్బరి చెట్లు. అక్కడక్కడ గలగలా పారుతున్న పంట కాలవలు.

 

"నేలమీద ముగ్గులేసిన గడ్డి పువ్వులు, ఊడలు చాచిన అందమైన మర్రి చెట్టుకి దారంతా తివాచీ పరిచినట్లు వర్షానికి పట్టిన నాచు, నన్ను పరుగులు పెట్టించిన సీతాకోక చిలుక అలిసిపోయి ఒకచోట ఆగి ఫోటోకి పోజివ్వడం, మేమేం తక్కువని చిన్నచిన్న గడ్డిపూల సోయగాలు, ప్రేమగా పెనవేసుకుపోయిన అడవి లతలు అబ్బ ఒకటేమిటి అడవి అందాలు చూడాల్సిందే. వీటి మధ్యన బౌద్ధస్థూపాలు."

 

2,400 సంవత్సరాలకి ముందు బౌద్ధస్థూపాల్ని ఏర్పాటు చెయ్యవలసిందిగా అశోకుడి కుమారుడు మహేంద్ర - తన కవల సోదరియైన "సంఘమిత్ర, రాణి (అశోకుడి భార్య) దేవి"లను అదేశించాడు. వీరు ఆ కార్యక్రమంలో శ్రీలంక వెడుతూ మొట్టమొదటి బౌద్ధ స్థూపాన్ని "అదుర్రు"లో స్థాపించారట. అశోకుడు కట్టించిన 84 వేల స్థూపాలలో 64 మహాస్థూపాలు, అందులో మూడు దివ్యస్థూపాలు అని, ఆ మూడింటిలో ఆదుర్రు మొదటిది. ఈ స్థూపాల్ని స్థాపించి దానిని మొదటి గ్రామంగా ఏర్పాటుచేశారు. ఆది వూరు అది కాలక్రమేణా ఆదుర్రు అయింది.

 


 





































తెలియని కొత్త ప్రదేశం చూసుకున్నామని చాలా ఆనందంగా అనిపించింది.