25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -9

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -9



రెండు నెలల తేడాతో... ఇంట్లో రెండో పెళ్ళి


పెద్దక్కకి పెళ్ళయిన తర్వాత అమ్మ సొంత తల్లి (తాతగారు అమ్మావాళ్ళ అమ్మ సంవత్సరానికే చనిపోతే మళ్ళీ పెళ్ళిచేసుకున్నారు) అన్నగారు అంటే అమ్మకి పెద్ద మామయ్య మా ఇంటికి వచ్చారు. ఆయన శ్రీశైలంలో ప్రధాన అర్చకుడుగా పనిచేసేవారు. ఇవటూరి వాళ్ళు. ఆయనకి ఇద్దరు కూతుళ్ళు, 8 మంది కొడుకులు. అందరు పిల్లలూ ఏదో ఒక రకంగా సెటిల్ అయిపోయారు. 


నేను నా పై అక్కలిద్దరూ అమ్మ రెండో మామయ్య కూతురు పెళ్ళికి తణుకు దగ్గిర ఏలేటిపాడు వెళ్ళాం. అక్కడ అమ్మ బంధువర్గం అంతా వచ్చారు. ఆ పెళ్ళిలో మా మూడో అక్క ఉమని అమ్మావాళ్ళ పెద్ద మామయ్య చూశారు. ఆయన ఆ పెళ్ళి అయిపోయాక అమ్మ దగ్గిరకి వచ్చారన్నమాట. అమ్మతో "నా నాలుగో కొడుకు రాజు ఢిల్లీ లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. నీ మూడో కూతురిని నా కొడుకుకి ఇచ్చి పెళ్ళి చెయ్యి నీకు కొంత భారం తగ్గుతుంది" అని అడిగారు. అక్క ఉమ అప్పటికి హైదరాబాద్ లో ఒక్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తోంది. అమ్మ వాళ్ళ మామయ్యతో "మామయ్యా... నువ్వు ఇలా అడగడం నాకు చాలా సంతోషంగా వుంది. నేను మా పిల్లలతో మాట్లాడి ఉత్తరం రాస్తాను" అంది. ఆయన సరే అని శ్రీశైలం వెళ్ళిపోయారు. 


అమ్మ పెద్దక్కతో చెప్పింది. ఇద్దరూ కలిసి తాడేపల్లి గూడెం నుంచి హైదరాబాదు  ఉమ అక్క దగ్గిరకి వచ్చారు. ఒక పట్టాన ఉమ అక్క ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పట్లో తాడేపల్లిగూడెంకి హైదరాబాదే పెద్ద దూరం. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ అంటే దాదాపు 1600 కిలోమీటర్ల దూరం. 24 గంటలు ప్రయాణం. కానీ అబ్బాయికి మంచి ఉద్యోగం, చుట్టాలు కాబట్టి బెంగ వుండదని అమ్మ అనుకుంది. మొత్తానికి ఉమ అక్క ఒప్పుకుంది. బావగారు హైదరాబాద్ వచ్చి తనని చూసి వెళ్ళారు. పెళ్ళికి ముహూర్తం పెట్టకున్నారు. 


అమ్మ మామయ్య వీరభద్రంగారు శ్రీశైలంలో పెళ్ళి చెయ్యమన్నారు. గుళ్ళో కాబట్టి మాకు బావుంటుంది అన్నారు.  మా దగ్గిర కూడా డబ్బు అంతంత మాత్రమే. అమ్మావాళ్ళు కాదనలేక ఒప్పుకున్నారు. పెళ్ళి పీటల మీద అక్క, బావగారు కూచోవాలి. వాళ్ళు చేస్తున్న మొదటి పెళ్ళి. సంతోషంగా వున్నా... రెండో అక్క రమకి పెళ్ళి అవలేదనే బెంగ అమ్మకి వుంది. రమాక్క నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పింది. సరే పెళ్ళికి కావలసినవి సమకూర్చుకోవాలి. 


ఎలా చెయ్యాలి అనే విషయం చూస్తే సలహాలు చెప్పేవారే లేరు. అమ్మ మామయ్యే కదాని ఇంకో ధైర్యం. అప్పట్లో అంటే 1979లో  ఇప్పటిలాగా  ఎప్పుడు పడితే అప్పుడు శ్రీశైలంకి బస్సులు లేవు. ఒకటో రెండో వుండేవనుకుంట నాకు సరిగ్గా తెలియదు. అక్క, బావగారు అమ్మ, పెళ్ళికూతురు పెళ్ళికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మా మామయ్యలు కానీ, బాబాయిలు కానీ ఎవరూ ముందుకి రాలేదు. నేను పనిచేసే స్కూలు ఓనర్ సాయిరాం అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూవుండేవాడు. వాళ్ళిల్లు మా ఇల్లు దగ్గర దగ్గర. మాకు ఇంట్లో ఏ సాయం కావాలన్నా చేసేవాడు. అక్క అతన్ని అడిగింది. వస్తానని హామీ ఇచ్చాడు. 


నాన్నగారు  బట్టలు పెట్టుకునే పెద్ద ఇనప పెట్టెలో (అప్పట్లో సూట్ కేసులు అంతగా లేవు) పెళ్ళికి కావలసినవి అన్నీ పెట్టుకుని సాయిరాం గారి సాయంతో బయల్దేరారు.  ప్రతిచోటా ఆయన ఈ పెట్టె మోసుకుంటూ ఇంటి మగపిల్లవాడిలా తోడు వున్నాడు. 


(అమ్మకి పెద్దక్కకి ముందు ఒక అబ్బాయి, ఆరో అమ్మాయి తర్వాత ఒక అబ్బాయి పుట్టి చనిపోయారు. మా బామ్మ జాతకాలు చెప్పేదిట - "నీకు మగపిల్లలు పుట్టరు, పుట్టినా బతకరు" అని. అమ్మ తలుచుకుని బాధపడుతూ వుండేది.) 


మొత్తానికి నానా తిప్పలూ పడి శ్రీశైలం కొండకి చేరుకున్నారు. పెళ్ళి ఏర్పాట్లన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఉన్న కష్టమంతా కొండకి చేరుకోవడమే. పెళ్ళి బాగానే జరిగింది. పెళ్ళి కూతురుకి చీరలు కొనే తాహతు కూడా లేదు. అక్కకి పెళ్ళికి కొంతమంది పెట్టిన చీరలే మూడో అక్క పెళ్ళికి వాడారు. పెళ్ళయ్యి ఇంటికి వచ్చాక అక్క "సాయిరాం లేకపోతే అసలు పెళ్ళికి వెళ్ళగలిగేవాళ్ళం కాదు" అంది.  ఉమాక్క పెళ్ళి అలా జరిగిపోయింది. తర్వాత తను హైదరాబాద్ లో ఉద్యోగానికి రిజైన్ చేసి ఢిల్లీ వెళ్ళిపోయింది. అప్పుడు ఫోన్లు కూడా లేవు కాబట్టి అందరం తలో ఉత్తరం రాసి ఓ కవర్లో పెట్టి పోస్ట్ చేసేవాళ్ళం. 


రాజు బావగారు కోల్ ఇండియా లిమిటెడ్, ఢిల్లీ లో చేసేవారు. ఆయన నాటకాలు బాగా వేసేవారు. అప్పట్లో ఆయన్ని రజనీకాంత్ అని అనేవారు. వీళ్ళు వేసిన 'కుక్క' నాటకానికి చాలా పేరు వచ్చింది.  ఆయనకి ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వాళ్ళతో మంచి సంబంధాలు వుండేవి.  ఢిల్లీలో బాగా పలుకుబడి వుండేది. ఆ పలుకుబడితో అక్కకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించారు.  అలా మూడో అక్క సెటిల్ అయిపోయింది. 




17, ఫిబ్రవరి 2022, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -8

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -8


పెళ్ళి హడావుడి



అప్పటివరకూ ఇంటి పనులు అందరం కలిసి చేసుకోవడం అలవాటయింది. కానీ ఈ పెళ్ళి వ్యవహారాలు అన్నీ అలవాటు లేని పనులు. పెద్దక్క తన పెళ్ళి గురించి తనే మాట్లాడుకుని వచ్చింది. బావగారు రైల్వేలో పార్శిల్ ఆఫీసులో క్లర్క్. ఒకరోజు మా ఇంటికి వచ్చారు. పాత పరిచయాలే కాబట్టి అమ్మతో ఫ్రీగానే మాట్లాడారు. కానీ ఆయనకి ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు. బాడ్మింటన్ ఛాంపియన్.  ఆయనకి ఉద్యోగం ఆ కోటాలోనే వచ్చింది. చాలా ఊళ్ళకి పోటీలకి ఆఫీసు తరఫున వెళ్ళేవారు. మొత్తానికి ఈ సంబంధం అక్కకి సెటిల్ అయ్యింది. 

అక్క అత్తగారి బంధువులు తణుకు దగ్గిర రేలంగిలో కరణాలుగా వుండేవారు. వాళ్ళవన్నీ పెద్ద పెద్ద ఇళ్ళు, వాకిళ్ళు. మా బావగారికి ఒక అన్నయ్య ఐదుగురు అక్కలు. చాలా అందగత్తెలు. అందరికీ మంచి మంచి సంబంధాలు కలిసి వచ్చాయి.  బాగా సెటిల్ అయిపోయారు. 

ఇంక పెళ్ళి పనులు మొదలుపెట్టాలంటే తాడేపల్లిగూడెంలో మాకు ఆస్థాన పంతులుగారు విశ్వనాథం గారు ముహూర్తం పెట్టారు. ఆర్యవైశ్య సంఘం వాళ్ళ వాసవీ కన్యకాపరమేశ్వరి సత్రం పెళ్ళికి బుక్ చేశాం. వీళ్ళందరూ నాన్నగారికి బాగా తెలిసినవారు కావడంతో కొంచెం తక్కువ రేటుకి ఇచ్చారు.

ఇంక పాలు, పెరుగు, కావలసిన కూరగాయలు, అరటి ఆకులు అన్నీనాన్నగారి స్నేహితులు  రాజుగారు పక్కవూరిలో ఉన్న ఆయన పొలం నుంచి తెచ్చి ఇచ్చారు. ఒక క్వింటాలు బియ్యం పంపించారు. మాకు పెళ్ళి ఖర్చు చాలావరకు కలిసి వచ్చింది.  పెళ్ళి చాలా బాగా జరిగింది. భోజనాల టైముకి కూరలన్నీ అయిపోయాయి. అప్పటికప్పుడు వంకాయ అల్లం, పచ్చిమిర్చి వేసిన కూర గబగబా చేసి వడ్డించారు.  ఆ కూర రుచి నాకు ఇంకా గుర్తుంది. 

పట్టు చీరలు, నగలు లేకపోయినా బాధ్యత గల కుటుంబం నుంచి వచ్చిందని అందరూ సంతోషించారు. పెళ్ళివారందరికీ బస్సు మాట్లాడారు.  అక్కతోబాటు నేనూ రేలంగి వెళ్ళాను. అమ్మో ఎంతమంది బంధువులో... వాళ్ళందరూ కలిస్తే ఇల్లు అదిరిపోయేలాంటి నవ్వులతో సందడి సందడిగా వుంటుంది. మామయ్యలని, అత్తయ్యలని చిన్నా పెద్దా తారతమ్య లేకుండా పేర్లు పెట్టి పిలుచుకోవడం నేను అక్కడే చూశాను. దాంట్లో ఎంత ఆప్యాయతో...    పేద్ద ఇల్లేమో... ఎంతమంది వచ్చినా సరిపోయేది. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అదే ఇంట్లో చేశారు.  పల్లెటూరిలో పెళ్ళి సందడి. వంటవాళ్ళు, వడ్డనలు. అందరూ కాఫీగత ప్రాణులు కాబట్టి ఎప్పటికప్పుడు ఇత్తడి గ్లాసుల్లో చిక్కటి కాఫీ. ఎంత బాగా అనిపించిందో. అసలు ఇప్పటి రోజుల్లో ఎంతమంది బంధువులు వచ్చినా... ఎంత గొప్పహాలు తీసుకున్నా... ఎన్నిహంగులున్నా.... 100 రకాల వంటకాలు పెట్టినా.... ఆ అసలు సిసలైన సాంప్రదాయపు భోజనం, అలాంటి సందడి దొరకదేమో.. అనిపిస్తుంది. నాకయితే వాళ్ళందరి ఆనందం ఇంకా కళ్ళముందు కనిపిస్తుంది.  మూడు రోజులు చాలా సందడి సందడిగా గడిచిపోయింది.  ఇప్పటికీ కొన్ని కుటుంబాల వాళ్ళు అలా వున్నావాళ్ళు వున్నారు. 

మళ్ళీ అందరినీ తిరుగు బస్సులో మా వూరు పంపించారు. అమ్మ తను చేయగలిగినట్లు వంటలు చేసి అందరికీ పెట్టింది.  ఇంక పెళ్ళి హడావుడి అయిపోయింది. అక్క మామూలుగా బాంక్ కి వెడుతోంది. రెండో అక్క, మూడో అక్క హైదరాబాద్ వెళ్ళిపోయారు. 

నేను చదివే విమెన్స్ కాలేజీ,  పెద్దక్క చేసే ఆంధ్రాబ్యాంక్ దగ్గరగా వుండడంవల్ల ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం.  అలా నా డిగ్రీ చూస్తుండగా పూర్తయిపోయింది.   అక్కతో ఎక్కువ కలిసి వుండడం వల్ల నాకు ఎక్కువగా కుటుంబాన్ని పట్టించుకునే అవకాశం వచ్చింది. నేను, అక్క అన్ని పనులు కలిసి చేస్తూ వుండేవాళ్ళం. పెద్దక్క ఒకరోజు నన్ను పిలిచి నీకు డిగ్రీ పూర్తయింది కదా... ఎక్కడన్నా ఉద్యోగంలో చేరు అంది. 

మాకు తెలిసిన సాయిరాం గారు స్కూలు పెట్టారు. అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. తెలిసిన వాళ్ళమే కాబట్టి  డిగ్రీ చదివాను కాబట్టి వెంటనే తీసుకున్నారు. నెలకి 100 రూపాయలు జీతం. అది కాకుండా కొంతమంది పిల్లలకి ట్యూషన్లు చెప్పేదాన్ని. అక్కకి ఆర్థికపరమైన విషయాల్లో సహకరించాను. జీతం ఎంత ఎక్కువ తక్కువ అని కాదు. ఎలా వున్నా అందరం ఎప్పుడూ ఆనందంగానే వుండేవాళ్ళం. చాలామంది అడిగేవారు మీరెప్పుడూ సంతోషంగా ఎలా వుంటారు? అని. అది మాకు అమ్మ ఇచ్చిన ధైర్యమే అనిపిస్తుంది. అమ్మకి 36 సంవత్సరాలకి నాన్నగారు పోయిన తర్వాత కోపం పెరిగింది. కానీ ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంగా వుండడం అనేది నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. . 

అక్క, బావగారు విజయవాడ తాడేపల్లి గూడెం మధ్య తిరుగుతూ వుండేవారు.  గంటన్నర ప్రయాణమే అయినా తప్పదుమరి. అక్కకి ట్రాన్స్ ఫర్ అయ్యేవరకూ...






8, ఫిబ్రవరి 2022, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -7

 

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -7








పెద్దక్క పెళ్ళి


అమ్మమ్మ పెద్దక్కని చిన్నప్పటి నుంచీ మా చిన్న మేనమామ కృష్ణకి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని అనుకున్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగానే అందరూ అనుకునేవారు. మరి అమ్మకి ఇష్టమే కానీ, నాన్నగారు ఏమాలోచించేవారో తెలియదు. నాన్నగారికి ఎంతసేపూ పిల్లలని బాగా చదివించి ఉద్యోగస్తులని చెయ్యాలని అనుకునేవారు.

 

నాన్నగారు సడన్ గా రాత్రి పడుకున్న మనిషి పొద్దున్న లేవకపోయేసరికి పరిస్థితులు తారుమారయినట్టున్నాయి. ఎందుకంటే మేమింకా చిన్న పిల్లలం.

 

ఒకసారి తాతగారు ఆయన స్నేహితుడితో కలిసి తాడేపల్లిగూడెం వచ్చారు. అమ్మ ఇద్దరికీ భోజనం పెట్టింది.

అమ్మ ఏంటి నాన్నా ఇలా వచ్చావు అంది.

తాతగారు ఏమీలేదు కృష్ణని అన్నపూర్ణకి ఇచ్చి పెళ్ళి చేద్దామనుకున్నాం కదా.. ఇప్పుడు దానిమీద కుటుంబ బాధ్యత పడింది కదా... రెండోది రమాని ఇచ్చి చేస్తే బావుంటుంది కదా... ఏమంటావ్ అన్నారు. అమ్మ షాక్. అమ్మకి ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలోకే మూడో అక్క ఉమ బయటికి వచ్చి తాతయ్యగారూ... మీరు ఇలా అడగడం ఏమీ బాగాలేదు. అక్కని వద్దనుకున్నారు. రమాక్క ఇంకా చదువుకుంటోంది. ఉద్యోగం చెయ్యాలి. రమాక్కని మాత్రం మామయ్యకి ఇచ్చి చెయ్యడం మాకు ఇష్టం లేదు అని చెప్పింది.

 

అక్క అలా చెప్తుంటే పెద్దక్క అన్నపూర్ణ, అమ్మ షాకయ్యారు. ఇంకోరకంగా బాగానే చెప్పింది అనుకున్నారు. కాకపోతే చిన్నదానిచేత చెప్పించారు అనుకుంటారేమో అని మరో భయం. ఏమయితేనేం. తాతగారు సరే అని వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని రోజులు ఉత్తరప్రత్యుత్తరాలు లేవు.

 

మామయ్యకి తాతగారు ఎలక్ట్రికల్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పించారు. తణుకు దగ్గర కవిటం అనే ఊరికి సంబంధించిన అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేశారు. రెండో అక్క, మూడో అక్క పెళ్ళికి వెళ్ళారు. మొత్తానికి ఆ సమస్య అలా పరిష్కారం అయ్యింది.

 

ఇక పెద్దక్కకి సంబంధాలు వస్తున్నాయి. ఒకతను బొంబాయిలో ఉద్యోగం చేస్తాడు. బాగానే మాట్లాడారు. కానీ వాళ్ళన్నది ఏమిటంటే... పెళ్ళయ్యాక నాతోబాటు బొంబాయి వచ్చెయ్యాలి. కుటుంబ బాధ్యతలు కుదరవు అన్నారు. ఆ సంబంధం అలా తప్పిపోయింది.

 

అమ్మకి బెంగ వచ్చింది. ఏమిటో ఇలా... అని. 

మాచిన్నప్పుడు తాడేపల్లిగూడెంలో మొదట ఉన్న ఇంటి వెనకవైపున ఆ ఇల్లుగల వాళ్ళదే ఒక డాబా ఇల్లు వుండేది.  ఆ ఇంట్లో మాధవరావుగారని ఒకాయన వుండేవారు. ఆయనకి నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఆఖరి అబ్బాయి పెళ్ళికి ఉన్నాడు రైల్వేలో చేస్తున్నాడు. అబ్బాయిపేరు ప్రభాకర్. ఒకసారి మాట్లాడి చూడండి అని ఆ ఇల్లుగల వాళ్ళమ్మాయి కమల చెప్పింది.

 

ఇల్లుగలాయన ప్రకాశరావుగారితో అక్క అన్నపూర్ణ తన సంబంధం తనే మాట్లాడుకోవడానికి మాధవరావుగారు ఉన్న తణుకు దగ్గర రేలంగి వెళ్ళింది. చిన్నప్పటి నుంచీ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఆదరంగా మాట్లాడారు. వాళ్ళ చుట్టాలందరూ కలిసి కూచుని అక్కతో అన్నీ వివరంగా మాట్లాడి వాళ్ళబ్బాయికి చేసుకోవడానికి ఒప్పుకున్నారు.

 

అక్క వచ్చి అమ్మకి చెప్పగానే అమ్మ చాలా సంతోషించింది. అయితే ఒకసారి ప్రభాకరరావుని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాం. ఆయన వచ్చినప్పుడు అక్క అన్ని విషయాలు వివరంగా మాట్లాడి, నా తర్వాత చెల్లెళ్ళిద్దరూ సెటిల్ అయ్యే వరకూ నేను బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. దీనికి మీరు అంగీకరిస్తారా... అంది.

 

ప్రభాకరరావుగారు సరే అని ఒప్పుకున్నారు. అక్కకి మొత్తానికి అన్నీ తెలిసిన వాళ్ళ సంబంధం కుదిరింది.