25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -9

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -9



రెండు నెలల తేడాతో... ఇంట్లో రెండో పెళ్ళి


పెద్దక్కకి పెళ్ళయిన తర్వాత అమ్మ సొంత తల్లి (తాతగారు అమ్మావాళ్ళ అమ్మ సంవత్సరానికే చనిపోతే మళ్ళీ పెళ్ళిచేసుకున్నారు) అన్నగారు అంటే అమ్మకి పెద్ద మామయ్య మా ఇంటికి వచ్చారు. ఆయన శ్రీశైలంలో ప్రధాన అర్చకుడుగా పనిచేసేవారు. ఇవటూరి వాళ్ళు. ఆయనకి ఇద్దరు కూతుళ్ళు, 8 మంది కొడుకులు. అందరు పిల్లలూ ఏదో ఒక రకంగా సెటిల్ అయిపోయారు. 


నేను నా పై అక్కలిద్దరూ అమ్మ రెండో మామయ్య కూతురు పెళ్ళికి తణుకు దగ్గిర ఏలేటిపాడు వెళ్ళాం. అక్కడ అమ్మ బంధువర్గం అంతా వచ్చారు. ఆ పెళ్ళిలో మా మూడో అక్క ఉమని అమ్మావాళ్ళ పెద్ద మామయ్య చూశారు. ఆయన ఆ పెళ్ళి అయిపోయాక అమ్మ దగ్గిరకి వచ్చారన్నమాట. అమ్మతో "నా నాలుగో కొడుకు రాజు ఢిల్లీ లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. నీ మూడో కూతురిని నా కొడుకుకి ఇచ్చి పెళ్ళి చెయ్యి నీకు కొంత భారం తగ్గుతుంది" అని అడిగారు. అక్క ఉమ అప్పటికి హైదరాబాద్ లో ఒక్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తోంది. అమ్మ వాళ్ళ మామయ్యతో "మామయ్యా... నువ్వు ఇలా అడగడం నాకు చాలా సంతోషంగా వుంది. నేను మా పిల్లలతో మాట్లాడి ఉత్తరం రాస్తాను" అంది. ఆయన సరే అని శ్రీశైలం వెళ్ళిపోయారు. 


అమ్మ పెద్దక్కతో చెప్పింది. ఇద్దరూ కలిసి తాడేపల్లి గూడెం నుంచి హైదరాబాదు  ఉమ అక్క దగ్గిరకి వచ్చారు. ఒక పట్టాన ఉమ అక్క ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పట్లో తాడేపల్లిగూడెంకి హైదరాబాదే పెద్ద దూరం. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ అంటే దాదాపు 1600 కిలోమీటర్ల దూరం. 24 గంటలు ప్రయాణం. కానీ అబ్బాయికి మంచి ఉద్యోగం, చుట్టాలు కాబట్టి బెంగ వుండదని అమ్మ అనుకుంది. మొత్తానికి ఉమ అక్క ఒప్పుకుంది. బావగారు హైదరాబాద్ వచ్చి తనని చూసి వెళ్ళారు. పెళ్ళికి ముహూర్తం పెట్టకున్నారు. 


అమ్మ మామయ్య వీరభద్రంగారు శ్రీశైలంలో పెళ్ళి చెయ్యమన్నారు. గుళ్ళో కాబట్టి మాకు బావుంటుంది అన్నారు.  మా దగ్గిర కూడా డబ్బు అంతంత మాత్రమే. అమ్మావాళ్ళు కాదనలేక ఒప్పుకున్నారు. పెళ్ళి పీటల మీద అక్క, బావగారు కూచోవాలి. వాళ్ళు చేస్తున్న మొదటి పెళ్ళి. సంతోషంగా వున్నా... రెండో అక్క రమకి పెళ్ళి అవలేదనే బెంగ అమ్మకి వుంది. రమాక్క నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పింది. సరే పెళ్ళికి కావలసినవి సమకూర్చుకోవాలి. 


ఎలా చెయ్యాలి అనే విషయం చూస్తే సలహాలు చెప్పేవారే లేరు. అమ్మ మామయ్యే కదాని ఇంకో ధైర్యం. అప్పట్లో అంటే 1979లో  ఇప్పటిలాగా  ఎప్పుడు పడితే అప్పుడు శ్రీశైలంకి బస్సులు లేవు. ఒకటో రెండో వుండేవనుకుంట నాకు సరిగ్గా తెలియదు. అక్క, బావగారు అమ్మ, పెళ్ళికూతురు పెళ్ళికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మా మామయ్యలు కానీ, బాబాయిలు కానీ ఎవరూ ముందుకి రాలేదు. నేను పనిచేసే స్కూలు ఓనర్ సాయిరాం అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూవుండేవాడు. వాళ్ళిల్లు మా ఇల్లు దగ్గర దగ్గర. మాకు ఇంట్లో ఏ సాయం కావాలన్నా చేసేవాడు. అక్క అతన్ని అడిగింది. వస్తానని హామీ ఇచ్చాడు. 


నాన్నగారు  బట్టలు పెట్టుకునే పెద్ద ఇనప పెట్టెలో (అప్పట్లో సూట్ కేసులు అంతగా లేవు) పెళ్ళికి కావలసినవి అన్నీ పెట్టుకుని సాయిరాం గారి సాయంతో బయల్దేరారు.  ప్రతిచోటా ఆయన ఈ పెట్టె మోసుకుంటూ ఇంటి మగపిల్లవాడిలా తోడు వున్నాడు. 


(అమ్మకి పెద్దక్కకి ముందు ఒక అబ్బాయి, ఆరో అమ్మాయి తర్వాత ఒక అబ్బాయి పుట్టి చనిపోయారు. మా బామ్మ జాతకాలు చెప్పేదిట - "నీకు మగపిల్లలు పుట్టరు, పుట్టినా బతకరు" అని. అమ్మ తలుచుకుని బాధపడుతూ వుండేది.) 


మొత్తానికి నానా తిప్పలూ పడి శ్రీశైలం కొండకి చేరుకున్నారు. పెళ్ళి ఏర్పాట్లన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఉన్న కష్టమంతా కొండకి చేరుకోవడమే. పెళ్ళి బాగానే జరిగింది. పెళ్ళి కూతురుకి చీరలు కొనే తాహతు కూడా లేదు. అక్కకి పెళ్ళికి కొంతమంది పెట్టిన చీరలే మూడో అక్క పెళ్ళికి వాడారు. పెళ్ళయ్యి ఇంటికి వచ్చాక అక్క "సాయిరాం లేకపోతే అసలు పెళ్ళికి వెళ్ళగలిగేవాళ్ళం కాదు" అంది.  ఉమాక్క పెళ్ళి అలా జరిగిపోయింది. తర్వాత తను హైదరాబాద్ లో ఉద్యోగానికి రిజైన్ చేసి ఢిల్లీ వెళ్ళిపోయింది. అప్పుడు ఫోన్లు కూడా లేవు కాబట్టి అందరం తలో ఉత్తరం రాసి ఓ కవర్లో పెట్టి పోస్ట్ చేసేవాళ్ళం. 


రాజు బావగారు కోల్ ఇండియా లిమిటెడ్, ఢిల్లీ లో చేసేవారు. ఆయన నాటకాలు బాగా వేసేవారు. అప్పట్లో ఆయన్ని రజనీకాంత్ అని అనేవారు. వీళ్ళు వేసిన 'కుక్క' నాటకానికి చాలా పేరు వచ్చింది.  ఆయనకి ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వాళ్ళతో మంచి సంబంధాలు వుండేవి.  ఢిల్లీలో బాగా పలుకుబడి వుండేది. ఆ పలుకుబడితో అక్కకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించారు.  అలా మూడో అక్క సెటిల్ అయిపోయింది. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి