17, ఫిబ్రవరి 2022, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -8

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -8


పెళ్ళి హడావుడి



అప్పటివరకూ ఇంటి పనులు అందరం కలిసి చేసుకోవడం అలవాటయింది. కానీ ఈ పెళ్ళి వ్యవహారాలు అన్నీ అలవాటు లేని పనులు. పెద్దక్క తన పెళ్ళి గురించి తనే మాట్లాడుకుని వచ్చింది. బావగారు రైల్వేలో పార్శిల్ ఆఫీసులో క్లర్క్. ఒకరోజు మా ఇంటికి వచ్చారు. పాత పరిచయాలే కాబట్టి అమ్మతో ఫ్రీగానే మాట్లాడారు. కానీ ఆయనకి ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు. బాడ్మింటన్ ఛాంపియన్.  ఆయనకి ఉద్యోగం ఆ కోటాలోనే వచ్చింది. చాలా ఊళ్ళకి పోటీలకి ఆఫీసు తరఫున వెళ్ళేవారు. మొత్తానికి ఈ సంబంధం అక్కకి సెటిల్ అయ్యింది. 

అక్క అత్తగారి బంధువులు తణుకు దగ్గిర రేలంగిలో కరణాలుగా వుండేవారు. వాళ్ళవన్నీ పెద్ద పెద్ద ఇళ్ళు, వాకిళ్ళు. మా బావగారికి ఒక అన్నయ్య ఐదుగురు అక్కలు. చాలా అందగత్తెలు. అందరికీ మంచి మంచి సంబంధాలు కలిసి వచ్చాయి.  బాగా సెటిల్ అయిపోయారు. 

ఇంక పెళ్ళి పనులు మొదలుపెట్టాలంటే తాడేపల్లిగూడెంలో మాకు ఆస్థాన పంతులుగారు విశ్వనాథం గారు ముహూర్తం పెట్టారు. ఆర్యవైశ్య సంఘం వాళ్ళ వాసవీ కన్యకాపరమేశ్వరి సత్రం పెళ్ళికి బుక్ చేశాం. వీళ్ళందరూ నాన్నగారికి బాగా తెలిసినవారు కావడంతో కొంచెం తక్కువ రేటుకి ఇచ్చారు.

ఇంక పాలు, పెరుగు, కావలసిన కూరగాయలు, అరటి ఆకులు అన్నీనాన్నగారి స్నేహితులు  రాజుగారు పక్కవూరిలో ఉన్న ఆయన పొలం నుంచి తెచ్చి ఇచ్చారు. ఒక క్వింటాలు బియ్యం పంపించారు. మాకు పెళ్ళి ఖర్చు చాలావరకు కలిసి వచ్చింది.  పెళ్ళి చాలా బాగా జరిగింది. భోజనాల టైముకి కూరలన్నీ అయిపోయాయి. అప్పటికప్పుడు వంకాయ అల్లం, పచ్చిమిర్చి వేసిన కూర గబగబా చేసి వడ్డించారు.  ఆ కూర రుచి నాకు ఇంకా గుర్తుంది. 

పట్టు చీరలు, నగలు లేకపోయినా బాధ్యత గల కుటుంబం నుంచి వచ్చిందని అందరూ సంతోషించారు. పెళ్ళివారందరికీ బస్సు మాట్లాడారు.  అక్కతోబాటు నేనూ రేలంగి వెళ్ళాను. అమ్మో ఎంతమంది బంధువులో... వాళ్ళందరూ కలిస్తే ఇల్లు అదిరిపోయేలాంటి నవ్వులతో సందడి సందడిగా వుంటుంది. మామయ్యలని, అత్తయ్యలని చిన్నా పెద్దా తారతమ్య లేకుండా పేర్లు పెట్టి పిలుచుకోవడం నేను అక్కడే చూశాను. దాంట్లో ఎంత ఆప్యాయతో...    పేద్ద ఇల్లేమో... ఎంతమంది వచ్చినా సరిపోయేది. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అదే ఇంట్లో చేశారు.  పల్లెటూరిలో పెళ్ళి సందడి. వంటవాళ్ళు, వడ్డనలు. అందరూ కాఫీగత ప్రాణులు కాబట్టి ఎప్పటికప్పుడు ఇత్తడి గ్లాసుల్లో చిక్కటి కాఫీ. ఎంత బాగా అనిపించిందో. అసలు ఇప్పటి రోజుల్లో ఎంతమంది బంధువులు వచ్చినా... ఎంత గొప్పహాలు తీసుకున్నా... ఎన్నిహంగులున్నా.... 100 రకాల వంటకాలు పెట్టినా.... ఆ అసలు సిసలైన సాంప్రదాయపు భోజనం, అలాంటి సందడి దొరకదేమో.. అనిపిస్తుంది. నాకయితే వాళ్ళందరి ఆనందం ఇంకా కళ్ళముందు కనిపిస్తుంది.  మూడు రోజులు చాలా సందడి సందడిగా గడిచిపోయింది.  ఇప్పటికీ కొన్ని కుటుంబాల వాళ్ళు అలా వున్నావాళ్ళు వున్నారు. 

మళ్ళీ అందరినీ తిరుగు బస్సులో మా వూరు పంపించారు. అమ్మ తను చేయగలిగినట్లు వంటలు చేసి అందరికీ పెట్టింది.  ఇంక పెళ్ళి హడావుడి అయిపోయింది. అక్క మామూలుగా బాంక్ కి వెడుతోంది. రెండో అక్క, మూడో అక్క హైదరాబాద్ వెళ్ళిపోయారు. 

నేను చదివే విమెన్స్ కాలేజీ,  పెద్దక్క చేసే ఆంధ్రాబ్యాంక్ దగ్గరగా వుండడంవల్ల ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం.  అలా నా డిగ్రీ చూస్తుండగా పూర్తయిపోయింది.   అక్కతో ఎక్కువ కలిసి వుండడం వల్ల నాకు ఎక్కువగా కుటుంబాన్ని పట్టించుకునే అవకాశం వచ్చింది. నేను, అక్క అన్ని పనులు కలిసి చేస్తూ వుండేవాళ్ళం. పెద్దక్క ఒకరోజు నన్ను పిలిచి నీకు డిగ్రీ పూర్తయింది కదా... ఎక్కడన్నా ఉద్యోగంలో చేరు అంది. 

మాకు తెలిసిన సాయిరాం గారు స్కూలు పెట్టారు. అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. తెలిసిన వాళ్ళమే కాబట్టి  డిగ్రీ చదివాను కాబట్టి వెంటనే తీసుకున్నారు. నెలకి 100 రూపాయలు జీతం. అది కాకుండా కొంతమంది పిల్లలకి ట్యూషన్లు చెప్పేదాన్ని. అక్కకి ఆర్థికపరమైన విషయాల్లో సహకరించాను. జీతం ఎంత ఎక్కువ తక్కువ అని కాదు. ఎలా వున్నా అందరం ఎప్పుడూ ఆనందంగానే వుండేవాళ్ళం. చాలామంది అడిగేవారు మీరెప్పుడూ సంతోషంగా ఎలా వుంటారు? అని. అది మాకు అమ్మ ఇచ్చిన ధైర్యమే అనిపిస్తుంది. అమ్మకి 36 సంవత్సరాలకి నాన్నగారు పోయిన తర్వాత కోపం పెరిగింది. కానీ ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంగా వుండడం అనేది నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. . 

అక్క, బావగారు విజయవాడ తాడేపల్లి గూడెం మధ్య తిరుగుతూ వుండేవారు.  గంటన్నర ప్రయాణమే అయినా తప్పదుమరి. అక్కకి ట్రాన్స్ ఫర్ అయ్యేవరకూ...






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి