22, మార్చి 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 10

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 10

 

పిల్లలతో విహారయాత్రలో ** మా తాతగారి వూరు పెనుగొండ** .గో.జిల్లా


మా తాతగారి వూళ్ళో మరిచిపోలేనిది జ్ఞాపకం తాతగారి పొలానికి వెళ్ళడం.

 

ప్రతి వేసవి శలవులకి తాడేపల్లిగూడెంలో నీళ్ళ ఇబ్బంది వుండేది. కాలవ కట్టేసేవారు. అమ్మమ్మ పెనుగొండ రమ్మని ఉత్తరం రాసేది. అమ్మమ్మకి అమ్మ చేసిన వంటలు అంటే ఇష్టంగా వుండేది. అమ్మంటే అమ్మమ్మ తాతగారు చాలా ప్రేమగా వుండేవారు.   

 

అమ్మ నన్ను, మా చెల్లెలు ప్రభావతిని తీసుకుని వెళ్ళేది.  మేమిద్దరం మా మామయ్య పిల్లలు బాబి, సాయి, శేఖర్  పొద్దున్నే చద్దన్నం తినేసి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మామిడితోట కూడా వుండేది.

 

మెయిన్ రోడ్డు మించి పొలానికి మలుపు తిరిగేటప్పుడు ఒక కాలవ పారుతుండేది. ఆ కాలవని నక్కల కాలవ అనేవారు.   దానికి ఒక వైపు స్మశానం వుండేది. రెండోవైపు పొలానికి దారి వుండేది.  అస్సలు భయం వుండేది కాదు. దారంతా తాతగారికి తెలిసిన వాళ్ళు పలకరిస్తుండేవారు.

 

దారంతా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ జాలీగా వెళ్ళేవాళ్ళం. మామయ్య ముగ్గురు కొడుకులూ పోటా పోటీగా జోక్స్ వేసేవాళ్ళు. పొట్టలు పట్టుకుని నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ ఆనందమే వేరు.  ఆ రోజులు చాలా బావుండేవి. మేము వాళ్ళూ కలిసి చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం.   వెళ్ళేటప్పుడు ఉప్పు, కారం పొట్లాలు కట్టుకుని తీసికెళ్ళేవాళ్ళం.   ఒక్కోసారి మా బాబాయి వాళ్ళు వచ్చేవారు. అక్కడ కొబ్బరి బొండాలు కొట్టించుకుని అందులో నిమ్మరసం పిండుకుని తాగేవాళ్ళం. అప్పుడు ఆ రుచి గొప్పగా వుండేది. మా బాబాయి పదిపైసల నాణెంతో లేత కొబ్బరి తీసి ఇచ్చేవాడు.

 

ఇక విరగకాసిన మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళి కాయలు కోద్దామనుకుంటే గుత్తులు గుత్తులుగా వుండేవి. ఒక కాయ కోసేసరికి నాలుగు కాయలు కింద పడేవి. అలా కోసినవి ఉప్పుకారం వేసుకుని తిన్నన్ని తిని మిగిలినవి ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం. అత్తయ్య అయ్యో అన్నికాయలూ కోసుకొచ్చేశారా... ఆవకాయకి ముదరాలి కదా... అనేది. మేము ఒక కాయ కోస్తుంటే ఇలా అన్నీ కింద పడ్డాయని చెప్తే పాపం ఏమీ అనేది కాదు.



 

అక్కడ సదాపనస అని పెద్ద పెద్ద ఆకులున్న పనస చెట్టు వుండేది. ఆ కాయలు వింతగా వుండేవి. అలాగే సీమమిరప చెట్లు వుండేవి. ఆ కాయలన్నీ కోసుకుని వచ్చేవాళ్ళం. శీకాయాకు చెట్టు అని వుండేది. ఆ ఆకు చింతాకులాగ పుల్లగా వుండేది.  అమ్మ దానిని వేయించి పొడి చేసేది. చాలా బావుండేది.  అరటి కాయలు, అరటి ఆకులు కోయించి తాతగారు పాలేరు చేత ఇంటికి పంపించేవారు.

 

చిన్నప్పుడు నేను ఒక్కదాన్నీ అమ్మమ్మతో పెనుగొండ వెళ్ళినప్పుడు తాతగారు నన్ను సైకిలు మీద పొలానికి తీసుకెళ్ళారు.  అక్కడ ఒక ముద్దమందార చెట్టు వుంది. నాకు పువ్వులంటే ఇష్టమని నా ఒడినిండా పువ్వులు కోసి ఇచ్చారు. పాలేరుని పిలిచి కొబ్బరి బొండాలు దింపించి ఒక కొబ్బరి బొండం కొట్టించి నీళ్ళు తాగించారు. అందులో మీగడలాంటి లేత కొబ్బరి రుచి ఇప్పటికీ గుర్తుంది.

 

ఒకసారి ఎడ్లబండి ఎక్కలేదంటే తాతగారు ఎవరినో అడిగి బండి కట్టించి ఎడ్లబండి మీద పొలానికి పంపించారు.  ఎక్కడానికి కొంచెం భయం వేసినా దానిమీద పొలానికి వెళ్ళడం చాలా ఆనందంగా అనిపించింది.

 






18, మార్చి 2021, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 9

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 9

 

పిల్లలతో విహారయాత్రలో ** మా తాతగారి వూరు పెనుగొండ** .గో.జిల్లా

 

ఇది ఒక జ్ఞాపకం

 

పెనుగొండలో మరొక ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఏడు అంతస్తులతో ఉన్న గాలిగోపురం. రంగు రంగులతో, చక్కటి శిల్పకళతో చూపరులకి ఆనందాశ్చర్యాలని కలిగిస్తుంది. దీన్ని వైశ్యుల కాశి అని పిలుస్తారు.  ఈ గుడి నిర్మాణానికి 11వ శతాబ్దం నాటి కథ ఒకటి వుంది.

 

ఈ గుడి మా తాతగారి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో వుండేది. సాయంత్రం అలా నడుచుకుంటూ వెళ్ళి కాసేపు అక్కడ ఉండి వచ్చేవాళ్ళం.

 

లోపల పెద్ద ప్రాకారంతో చాలా ప్రశాంతంగా వుండేది. గుడి వెనక వైపు గలగలా పెద్ద కాలవ ప్రవహిస్తూ వుంటుంది.  అక్కడి నుంచి వచ్చే చల్లటి గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.  

గుడి అరుగుల మీద సన్నాయి వాయిద్యకారులు చక్కని అన్నమాచార్య కీర్తనలు వాయించేవారు. అక్కడ కూచుని ఆ పాటలు వినేవాళ్ళం.  ఆ గుడిలో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వెడుతూ వుండేవాళ్ళం. 























అక్కడ గాలిగోపురం ఎక్కడానికి మెట్లు వుండేవి. అప్పట్లో టికెట్టు లేదనే గుర్తు.  ఏడంతస్తుల పైకి ఎక్కితే ఊరంతా పచ్చటి పొలాలలతో చాలా అందంగా కనిపించేది. 

 

ఇప్పుడు ఈ గుడిని బాగా అభివృద్ధి చేశారు.  ముందు వైపు ఎత్తైన అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు. లోపల ఆకర్షణీయమైన అద్దాల మహల్ వుంది.  దీనిని భవిష్యత్తులో స్వర్ణదేవాలయంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు.

 

మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక వింత జరిగింది. మా తాతగారి స్నేహితుడు ఒకాయన కనిపించారు. ఎక్కడ నుంచి వచ్చారు అని అడిగారు. మా వివరాలు చెప్పాము. అవునా... మీరు మల్లంపల్లి సుబ్బారావుగారి మనవలా... అని నా చేతిలో ఒక 15 రూపాయలు పెట్టారు. నాకు అర్థం కాలేదు. మీ తాతగారు చాలా సంవత్సరాల కిందట నాకు ఇబ్బందులలో వున్నప్పుడు 15 రూపాయలు ఇచ్చారు. అవి ఇవ్వలేక పోయాను. పోనీలే మీరు వారి మనవలు కదా... ఈ రకంగా రుణం తీర్చుకున్నాను అన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. దాదాపు 40 సంవత్సరా కిందట. అంటే 15 రూపాయలకి చాలా విలువ వుండేది.

 

12, మార్చి 2021, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు - 8

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు - 8

పిల్లలతో విహారయాత్రలో ** మా తాతగారి వూరు పెనుగొండ** .గో.జిల్లా

పిల్లలు తాతగారు పనిచేసిన సినిమాహాలు చూసి చాలా సంతోషించారు. తాతగారి ఇంటికి దగ్గరలో ఉన్న గుడులతో ఉన్న జ్ఞాపకాలని కూడా వాళ్ళతో పంచుకున్నాను.

మాయమైన పున్నాగ చెట్టు – శిథిలమైన రామాలయం

తాతగారూ వాళ్ళ ఇంటి రోడ్డు చివర ఒక పెద్ద పున్నాగ చెట్టు, చెట్టు పక్కన రామాలయం వుండేవి. పొద్దున్నే లేవగానే  అన్ని పనులూ అయిన తర్వాత, పిల్లలందరికీ చద్దన్నంలో (ఇంటి పాడి కాబట్టి) మంచి గడ్డ పెరుగు వేసి ఆవకాయ నంచిపెడుతూ,  కథలు చెప్తూ పిన్ని చేతిలో ముద్దలు వేసేది.  తిన్నతర్వాత నేను, మా చెల్లెలు, మామయ్య పిల్లలు కలిసి పున్నాగ చెట్టుకింద ఉండి ఉండి పడుతున్న పువ్వులు ఏరుకుని, పువ్వులతో జడలు అల్లి,  రామాలయం దగ్గిరికి వెళ్ళి  సీతారాముల విగ్రహాలకి ఆ పువ్వులజడలని మీద వేసి వచ్చేవాళ్ళం.  అక్కడ ఊరేగింపు పల్లకి, పెద్ద ఏనుగు బొమ్మ వుండేవి.  మేము వెళ్ళే సమయానికి అన్నీ శిథిలమైపోయాయి. పున్నాగ చెట్టు మాయమైపోయింది.

ఆటలకు నెలవు చెన్నకేశవ ఆలయ మంటపం









తాతగారింటికి కుడిచేతివైపున మూలగా చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది.  రోజూ పొద్దున్నే నేను అమ్మమ్మ పూజకి పువ్వులకోసం  ఆలయానికి వెళ్ళేదాన్ని పూజారి కొడుకు ముద్దమందారాలు, ఆకాశమల్లెపువ్వులు తను కొన్ని కోసుకుని, నాకు కొన్ని ఇచ్చేవాడు.  ఇంట్లో ఎన్ని పువ్వులు వున్నా అమ్మమ్మ పూజకి గుళ్ళో పువ్వులు కూడా తెచ్చేదాన్ని.

గుళ్ళో విష్ణుమూర్తికి అటూ ఇటూ జయ విజయుల విగ్రహాలు ఆకర్షణీయంగా వుండేవి.  వాటి చేతుల్లో ఉండే గదని ఆప్యాయంగా ముట్టుకునేవాళ్ళం.  గుడి చుట్టూ పరుగులు పెడుతూ ఆడుకునేవాళ్ళం. పూజారి పూజ చేసి దధ్దోజనమో, పులిహోరో ప్రసాదంగా పెట్టేవారు.

నేను, మా అక్క ఆలయంలో ఉన్న మంటపం మెట్లెక్కి పైన కూచుని రోజూ ఆడుకునేవాళ్ళం. పక్కనే వున్న పారిజాతం చెట్టుకి వున్న గుండ్రటి కాయలని కోసి పైసాలు అని లెక్కపెట్టుకుంటూ ఆడేవాళ్ళం. ఎవరు ఎక్కువ కోసి లెక్కపెడితే వాళ్ళకే ఎక్కువ పైసలున్నట్లు.

పిన్నీ వాళ్ళ పెళ్ళిళ్లు అయినప్పుడు ఒకరోజు రాత్రిపూట ఓడోమాస్ రాసుకుని గుడి ప్రాంగణంలో పడుకున్నాం. దోమలు భయంకరంగా కుట్టేశాయి.  అప్పుడు మా నాన్న కళ్ళలో కనిపించిన బాధ ఇప్పటికీ గుర్తుంది.  మర్నాడు పూజారిగారింట్లో ఒక రూము అడిగితీసుకున్నారు అందులో పడుకున్నాం. అప్పుడు నాకు నాలుగు సంవత్సరాలు.  

ఆనాటి జ్ఞాపకాలు చాలా మధురమైనవి.

 

 

 


9, మార్చి 2021, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు - 7

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు - 7


పిల్లలతో విహారయాత్రలో ** మా తాతగారి వూరు పెనుగొండ** .గో.జిల్లా




తాతగారూ - సినిమాహాలు


నాకు చాలా ఇష్టమయిన వూరు. ఇక్కడ నాకున్న జ్ఞాపకాలు చాలా ఎక్కువ. పిల్లలని మా తాతగారు పనిచేసే సినిమాహాలుకి తీసుకెళ్ళాను  వాళ్ళు అక్కడ సినిమా వేసే పద్ధతి అన్నీ చూసి ఆనందించారు. మా పాతరోజులు గుర్తుకు వచ్చాయి.

తాతాగారు మధ్యాహ్నం ఒక కునుకు తీసి సినిమా హాలుకి వెడుతూ పిల్లలూ మీకు సినిమా బండి పంపిస్తాను రెడీగా వుండండి అని వెళ్ళిపోయేవారు. ఇంక అందరం రెడీ అయి సినిమాబండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. మా అమ్మమ్మ మీకు బాగా షోకులెక్కువయ్యాయి అనేది. మాకేమో అది ఎక్కాలని సరదా.  మేమొక్కళ్ళమే కాకుండా చుట్టుపక్కల పిల్లలందరినీ పోగేసే వాళ్ళం.

అది రాగానే పరుగులు పెట్టుకుంటూ ఎక్కి కూచునే వాళ్ళం. ఇంటి నుంచి సినిమాహాలు అర కిలోమీటరు కూడా వుండేది కాదు. కానీ అదో సరదా.

హాలుకి వెళ్ళగానే  అక్కడ తాతగారు కూచునే రూంలోకి వెళ్ళి కాసేపు ఆడుకునేవాళ్ళం.  బయటంతా రంగురంగుల గుత్తిపువ్వుల చెట్లు బారుతీరి ఉండేవి. ఆ పక్కనే సిమెంటు బెంచీలు వుండేవి.

ఆ పువ్వులు కోసుకుని వాటిలో వుండే తేనె పీల్చేవాళ్ళం. వాటన్నిటినీ రంగు రంగుల దండలుగా తయారు చేసేవాళ్ళం. అదో అందమైన అనుభూతి.

సినిమా మొదలుపెట్టే టైమ్ అవగానే హాలులోకి పరుగెత్తి చూసేవాళ్ళం. గుమ్ నామ్ హిందీ సినిమా అయితే ఒకరోజు సగం ఒకరోజు సగం మొత్తం 32 సార్లు చూశాం. ఇప్పుడు తలుచుకుంటే ఆ పిల్ల చేష్టలకి ఆశ్చర్యం వేస్తుంది.

సాధారణంగా మా తాతగారు మార్నింగ్ షో టైముకి సినిమాహాలుకి వెళ్ళిపోయేవారు. ఒకోసారి ఆయనతో సైకిలు మీద వెళ్ళేవాళ్ళం. ఆయన సైకిలు మీద మొత్తం ఐదుగురు పిల్లల్ని ముందర ఇద్దరిని, వెనక ఇద్దరినీ, ఒక ఫెడల్ మీద ఒకళ్ళని ఎక్కించి తీసుకెళ్ళేవారు. రోడ్డు మీద అందరూ ఆయన ఆప్యాయతని ఆశ్చర్యంగా చూసేవారు.

ఒకవేళ ఆయనకి నైట్ షో టైముకి పని ఎక్కువగా వుంటే మాకు ఆఫీసు రూములో మడతమంచాలు వేయించి మమ్మల్ని పడుకోమనేవారు. సినిమా అయిపోయాక మమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళేవారు.

అమ్మ చెల్లాయి పుట్టినప్పుడు మామయ్య కొడుకుతో కొన్నాళ్ళు స్కూలుకి పంపించింది.  అప్పుడు సినిమాహాలుకి పులివేట అనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది. స్కూలు పిల్లలకి కన్సెషన్ ఇచ్చారు. నేనేమో నలుగు ఫ్రెండ్స్ వుంటే వాళ్ళని తీసుకుని హాలుకి వెళ్ళి మా తాతగారు సుబ్బారావుగారు అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళిపోయాను. పాపం హాలు వాళ్ళు ఏమీ అనలేకపోయారు.  తాతగారి వూళ్ళో ఎన్నెన్ని జ్ఞాపకాలో...

 

 

  

 

6, మార్చి 2021, శనివారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 17

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 17

అమ్మో.... చిన్నపాపతో క్వారంటైన్ ఘట్టం... 



మూడు రోజుల ప్రయాణం... ఎట్టకేలకు క్షేమంగా చేరిన గమ్యం.

గూటికి చేరేముందు దాటవలసిన మరో పెద్ద అగాధం క్వారంటైన్

అదో పంజరమా... అదో ఖైదా...

ఏమో... అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.

అదీ ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో... అన్నీ ఉచితంగానే ఇచ్చినా ఈ ప్రక్రియ కఠినంగానే వుంది కాబట్టే 400 మందీ ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళారు.

ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఫైవ్ స్టార్ హోటల్లో మెత్తటి పరుపులు, ఎ.సి., చలేస్తే హీటర్, వైయ్ ఫై, టీ.వీ. అన్ని హంగులూ ఉన్న అదోరకమైన ఖైదులో పెట్టేశారు.  క్షేమంగా ఆస్ట్రేలియా చేరినందుకు ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్ లు పంపించారు.



* * *

మూడురోజుల ప్రయాణంలో బాగా అలిసిపోయి మూడురోజులు బాగా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నారు. ఇక నాలుగో రోజునుంచి మా చిట్టిపాపాయితో మా అమ్మాయి ఒక్కత్తీ నాలుగు గోడల మధ్యన ఎలా మేనేజ్ చేసుకోగలిగిందో... నలిగిపోయిందో  చెప్పాలంటే ఓ పెద్ద కథ రాయచ్చు.

పాపకి 7వనెల వచ్చింది. ఇప్పుడిప్పుడే అన్నీ బాగా నడుస్తున్నాయి. 14 రోజుల ముందు వరకూ ఇంట్లో 5గురి మధ్య ఆనందంగా ఆడింది. ఎందుకు అక్కడుందో ఏమీ అర్థంకాలేదు. మా దగ్గరున్నప్పుడే పిల్లల పాటలు కంప్యూటర్ లో చూడ్డం అలవాటయ్యింది కాబట్టి. హోటల్ రూంలో టీవీలో కాసేపు అవి చూసేది. వాళ్ళ నాన్న - నానమ్మ, తాతయ్యలతో - మాతో నాలుగైదుసార్లు వీడియో కాల్స్, పేచీలు, ఏడుపులు, పలకరింపులు, ఆటలు, మేము చూస్తూ వుండడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. మేము మాట్లాడితే కొంత ఉపశమనం అంతే... ఎవరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారో ఆ చిన్న బుర్రకి అర్థం కాలేదు.

ఇక రోజులు గడుస్తున్నకొద్దీ తను, తన అమ్మ మాత్రమే ఎందుకున్నారో ఆ చిన్న మెదడులో ఆలోచనలు కావచ్చు. తెలియకుండానే వాళ్ళమ్మ బుగ్గలు కొరకడం, జుట్టు పీకడం, మీదపడి కుమ్మడం లాంటివి చేసింది. అమ్మ ఎక్కడికీ వెళ్ళకూడదు. కనీసం బాత్రూంకి వెళ్ళడానికి కూడా లేకపోయింది.  







కాకపోతే వాళ్ళమ్మ పాడిన పాటలకి నోరుమెదపడం, కూచోవడం, అన్నీ పట్టుకుని నుంచోవడం నేర్చుకుంది. వాళ్ళు ఇచ్చిన బేేబీ ఫుడ్ ఇష్టంగా తినేది. నిజంగా ఎవరూ లేకుండా నాలుగు గోడల మధ్యన 14 రోజులు గడపడం చాలా కష్టం.

* * *

స్వేచ్ఛా విహంగాలు

విజయవంతమైన క్వారంటైన్ ఘట్టం

క్వారంటైన్ వివరాల్లోకి వెడితే

400 మందికి రూములు ఏర్పాటు చేసి, తలుపు తీసుకుని బయటికి రావద్దని చెప్పి నాలుగు గోడల మధ్య బంధించేశారు. ఎవరైనా బయటి వస్తారేమోనని ఒక్కో ఫ్లోర్ కి సెక్యూరిటీ గార్డ్ ని పెట్టారు.

వాళ్ళు పొద్దున్న అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏ టైముకి అవి గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. వీళ్ళు మ్యూజియంలో బొమ్మ గడియారం కొట్టి డింగ్ మని లోపలికి వెళ్ళిపోయినట్లు అవి తీసుకుని వెంటనే లోపలికి వెళ్ళిపోవాలి. వీళ్ళు తినేసిన తర్వాత ఖాళీవన్నీ బయట పెట్టేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు.

వీళ్ళు రూంలోంచి మాత్రం బయటికి రాకూడదు. రోజూ మాత్రం మెడికల్ డిపార్ట్ మెంట్ వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే చెప్పమని ఫోన్ లో పలకరించేవారు, అవసరమైతే వచ్చి తగిన సేవలు అందించేవారు. వీడియోకాల్స్ లో మాట్లాడేవారు.

నాలుగు గోడల మధ్య పెద్ద వాళ్ళు అయితే ఫర్వాలేదు. పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం కష్టమే... మరి. ఒకరోజు ముందు కరోనా టెస్ట్ చేసి అందరినీ ఖైదులోంచి విడుదలచేశారు.

పాప ఒక్కసారి బయటికి వచ్చేసరికి ఏడ్చింది - వెలుతురు తట్టుకోలేకో, ఇన్నాళ్లూ నిశ్శబ్ద వాతావరణంలో వుండి బయట చప్పుళ్ళకో తెలియదు.   మెల్లగా బయటి వాతావరణానికి అలవాటు పడాలి.

మొత్తానికి  ఇంటికి వెళ్ళిపోయారు.

మొత్తానికి కథ సుఖాంతం.


5, మార్చి 2021, శుక్రవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 16

 మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 16

ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళేవాళ్ళు ఒక నూట యాభైమంది గ్రూప్ గా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు.  ఆస్ట్రేలియన్ హై కమీషన్ ఇండియాలో వుండిపోయిన ఉన్నవాళ్ళందరి సమాచారం సేకరించారు. మొత్తానికి 29 ఏప్రిల్, 2020 కి టికెట్లు బుక్కయ్యాయి. 

మా అమ్మాయి వాళ్ళతో మాట్లాడటం ఈ హడావుడి సరిపోయింది. మొత్తానికి ఇండియానుంచి ఫ్లైట్ ఏర్పాటు చేశారు. మా అందరికీ ఒకటే గుబులు. అంత పసిపిల్లని వేసుకుని ఎలా వెళ్తుందా అని. తన ధైర్యమే తనకి రక్ష అయ్యింది.  శేఖర్ కి తను వచ్చేస్తే బాగుండును అనే ఆరాటం. ఎలా వస్తుందో అని దిగులు.

 వీణాకి 6 నెలల పాపతో మూడురోజుల సాహస యాత్ర అయ్యింది.

హైదరాబాద్ నుంచి చెన్నై 17 గంటలు

చెన్నై నుంచి దోహా 5 గంటలు

దోహా నుంచి పెర్త్, ఆస్ట్రేలియా 11.5 గంటలు

అసలు హైదరాబాద్ నుంచి పెర్త్ కి ప్రయాణం 9.30 గంటలు మాత్రమే.

చెన్నై, కలకత్తా, ఢిల్లీ, బొంబాయిల నుంచి విమాన సర్వీసులు దోహా మీదుగా ఆస్ట్రేలియాలో వివిధ ప్రాంతాలకి ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలకి చేరడానికి దగ్గరలో వున్న ప్రాంతాల నుంచి ఇంక్రెడిబుల్ ఇండియా బస్ లు ఏర్పాటు చేశారు.





మా అమ్మాయి హైదరాబాద్ నాంపల్లిలో 28వ తేదీ ఉదయం బస్ ఎక్కింది. మా అబ్బాయి ఎక్కించడానికి వెళ్ళాడు. వాడు ఎక్కించాడన్నమాటే కానీ ఒకటే టెన్షన్ పడుతున్నాడు ఎలా వెడుతుందోనని. 

అంతా సవ్యంగానే జరుగుతోంది అనుకోగానే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఆటంకం. ఇంకేవో పర్మిషన్లు కావాలని నాలుగు గంటలు ఆపేశారు.

అక్కడ నుంచి వీళ్ళు చెన్నై చేరేసరికి అర్థరాత్రి అయ్యింది. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి హోటల్ రూం లో రెస్ట్ తీసుకోమన్నారు.

29 ఉదయం పది గంటల నుంచి అందరికీ టెంపరేచర్ చూసి, మధ్యాహ్నం చెన్నై నుంచి దోహా ఫ్లైట్ ఎక్కించారు. 5 గంటలు ప్రయాణం. ప్రయాణంలో పాప ఆటలతో బాగా సహకరించింది.

రాత్రి 8 గంటలకి దోహాలో ఫ్లైట్ దిగాక లాంజ్ లో 8 గంటలు బ్రేక్. అక్కడ మళ్ళీ 30 తెల్లవారుజామున 4 గంటలకి పెర్త్ విమానం ఎక్కారు. 11.5 గంటలు ప్రయాణం. పాప చాలాసేపు నిద్రపోవడం, ఆడుకోవడంతో ఎక్కువ ఇబ్బంది అవలేదు.

మొత్తానికి పెర్త్ చేరేసరికి 30వ తేదీ సాయంత్రం 8 గంటలు అయ్యింది. అక్కడ మళ్ళీ టెంపరేచర్ చూసి నోవాటెల్ హోటల్ లో రూంకి రాత్రి 11.30 కి క్వారంటైన్ కి పంపించారు.

మొత్తానికి ఆ గడ్డ మీద అడుగుపెట్టారు. ఇదీ ఇంతవరకు జరిగిన కథ. 

ఇక 14 రోజుల క్వారంటైన్ లో మరో సాహసం.

3, మార్చి 2021, బుధవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 15

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 15



రాత్రి పూట ఎగరేస్తూ... అరుస్తూ ఆటలు ఆడించేవాళ్ళం.  మా అబ్బాయికి పిల్లలంటే చాలా ఇష్టం. వాడు దాన్ని అస్సలు వదిలిపెట్టేవాడు కాదు. లాక్ డౌన్ టైం కాబట్టి అందరం ఇంట్లోనే వుండి పాపతో బాగా గడిపాం. 





మా చెల్లెలు కంప్యూటర్ మీద వర్క్ ఫ్రం హోం చేసుకుంటుంటే సోఫాలో మా ఒళ్ళో కూర్చున్నది కాస్తా గబగబా ఒళ్ళోంచి జారిపోయేది.  తను ఎత్తుకుని కంప్యూటర్లో పిల్లల పాటలు పెడితే చూస్తూ అగిపోతే కాలుతో ఒక తన్ను తన్నేది. 

అందర్ని చూసీ బాగా నవ్వడం నేర్చుకుంది. ఒళ్ళో కూచోపెట్టుకుంటే కూచునేది. పిల్లలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళవంకే చూసుకుంటూ అరుపులు మొదలు పెట్టేది.  తాతతో బాగా ఆడేది. 

ఒకరోజు బాగా ఏడుస్తూనే వుంది. ఎందుకో అర్థం కాలేదు. చేతిలో వాళ్ళ అత్తగారూ వాళ్ళ కారు వుంది కాబట్టి మా అబ్బాయి దగ్గరుండి రెయిన్ బౌ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాడు.  ఎందుకో హాస్పిటల్ నాలుగో నెలలోనే హాస్పిటల్ వాతావరణం గుర్తుపట్టి బాగా ఏడ్చింది.  అందరూ చిన్న డాక్టర్లు వున్నారు. వాళ్ళు ఎంతకీ ఏదీ చెప్పలేదు. నేను వెళ్ళి గట్టిగా అడిగితే ఎవరో పెద్ద డాక్టర్ ని పిలుచుకుని వచ్చారు. ఆవిడ చూసి తల్లిపాలు కదా మీరు తిన్నది ఏదైనా తేడా వస్తే కూడా ఏడుస్తారు అని ఏవో మందులు ఇచ్చింది. 

ఆ మందులు వేశాక కొంచెం ఫర్వాలేదు. ఏడుపు తగ్గింది. కానీ ఆర్ణ చాలా వరకు అన్ని పరిస్థితులకి తట్టుకుని వుండగలిగేది.  

ఆస్ట్రేలియాలో శేఖర్ ఒకటే టెన్షన్ పడుతూ వుండేవాడు. నేను ఇప్పుడప్పుడే నిన్నూ, పాపని చూస్తానో లేదో అని బెంగ పెట్టేసుకునేవాడు. అంత పెద్ద ఇంట్లో ఒక్కడూ వుండలేక వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో మధ్యమధ్యలో వుంటూ వుండేవాడు.  అతని బాధ చూడలేక మా అమ్మాయి ఏమయినా సరే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. 

మా అందరికీ బాగా అలవాటయిపోయింది. పాపని తీసుకుని ఎలా వెడతావు... అని మేము చెప్పాము. కానీ కూతురికి పెళ్ళయ్యాక వాళ్ల సంసారం వాళ్ళకి వచ్చాక మనం ఏమీ చెయ్యలేం. 


2, మార్చి 2021, మంగళవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 14

 మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 14


ఆర్ణ నిద్రపోయింది. ఎటువంటి ఇబ్బంది అవలేదు.  ఇంటికి వచ్చాం.  మూడు నెలల పాపకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా మేము ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయి, మా వారు  ఇల్లంతా నీట్ గా పెట్టారు. మనం ఎంత శుభ్రం అనుకున్నా ఫారిన్ లో వున్నట్లు ఇండియాలో కష్టమే.   మేము చంటిపాపకి వాతావరణం తేడా వస్తుందేమో అనుకున్నాం. ఫిబ్రవరిలో మరీ అంత వేడిగా అనిపించలేదు.  

మర్నాడు పొద్దుటి నుంచీ ఇంక ఇల్లంతా సందడి.  ఇంకోవైపు 15వ తేదీన మా అబ్బాయి ఎంగేజ్ మెంట్ హడావుడి.  ఆర్ణ లేచి వున్నంత సేపూ ఎత్తుకుని వుండాల్సి వచ్చేది.  రాత్రి ఒంటిగంట వరకూ పడుకునేది కాదు.  బాగా ఆడుతుండేది.  ఎంగేజ్ మెంట్ రోజు రానేవచ్చింది.  Film Nagar Cultural Center, Hyderabad లో ఎంగేజ్ మెంట్.  ఆర్ణకి ఆస్ట్రేలియాలో చిట్టి చిలకమ్మ, బుర్రుపిట్ట పాటలు టివిలో ( ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి) చూడ్డం అలవాటయింది.  మా అమ్మాయి రెడీ అయ్యేవరకు అవి పెట్టి చూపించాము. 

ఇంక ఎంగేజ్ మెంట్ మొదలయ్యింది. పాప అస్సలు ఎవరి దగ్గిరకీ రాలేదు. తన బుజం మీదే పడుకుని వుంది. ఇంతలో వాళ్ళ అత్తగారూ వాళ్ళు వచ్చారు.  వాళ్ళు చూడడం ఇది మొదటిసారి కాబట్టి అందరూ తన చేతుల్లోంచి లాక్కుని ఎత్తుకున్నారు. పాప ఏడుస్తూనే వుంది. పాపం మా అమ్మాయి ఎంగేజ్ మెంట్ ఎక్కువ ఎంజాయ్ చెయ్యలేకపోయింది.  మొత్తానికి ఫంక్షన్ బాగా జరిగింది. 

ఇంటికి వచ్చాం.  మెల్లి మెల్లిగా ఆర్ణ ఇండియా వాతావరణానికి అలవాటు పడింది. ఆస్ట్రేలియా పెర్త్ లో కూడా వాతావరణం ఇండియాలో లాగే వుంటుంది.  చలికాలం తప్ప.  మా అందరి దగ్గరకి రావడం అలవాటయ్యింది.  

నేను, మా చెల్లెలు కంప్యూటర్ మీద వర్క్ చేసుకుంటుంటే చిట్టి చిలకమ్మ, బుర్రుపిట్ట పాటలకోసం మా మీదకి దూకేది. మధ్యలో అడ్వర్ టైజ్ మెంట్లు రాకూడదు.  అవి వస్తుంటే చాలా అనీజీగా ఫీలయ్యేది.  పాటలు పెట్టినా ఏడవకుండా చూసేది.  ఒక పదినిమిషాలు కంప్యూటర్ వదిలెయ్యాల్సి వచ్చేది. 

మా అమ్మాయిని పాపని తీసుకుని వాళ్ళ అత్తగారూ వాళ్ళు నిజామాబాద్ వెళ్ళారు.  దారంతా ఏడుస్తుందేమో అనుకున్నాం కానీ ఎక్కువ పేచీ పెట్టలేదు. ఒక నాలుగు రోజులు వుంది. వాళ్ళు కోటీశ్వరులు. కానీ చాలా సింపుల్ గా వుంటారు.  

ఇంతలో కరోనా కారణంగా లాక్ డౌన్ పెడతారని న్యూస్ వచ్చింది. వెంటనే మేం వెళ్ళి అక్కడ పాపకి అన్నప్రాసన చేసి తీసుకువచ్చేశాము.  అంతే మర్నాటి నుంచీ లాక్ డౌన్ పెట్టారు. 

పాపం మా అమ్మాయి, అల్లుడు రకరకాల ప్లాన్ లు వేసుకుని ఇండియాలో ఎంజాయ్ చెయ్యాలనుకున్నారు.  ఏప్రిల్ 11న మా అబ్బాయి పెళ్ళి అనుకుంటే అదీ పోస్ట్ పోన్ అయ్యింది. ఆస్ట్రేలియాలో కూడా   మా అల్లుడు సరిగ్గా బయల్దేరాల్సిన ముందు రోజే లాక్ డౌన్ పెట్టారు.  రాలేకపోయాడు. 

ఈ లాక్ డౌన్ వల్ల ఎన్ని ఇబ్బందులయ్యాయో.... మా అమ్మాయి ధైర్యం చేసి ఈ పరిస్థితులో ఆస్టేలియా ఎలా వెళ్ళిపోయిందో  తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదంతా ఓ పెద్ద కథ.