22, మార్చి 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 10

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 10

 

పిల్లలతో విహారయాత్రలో ** మా తాతగారి వూరు పెనుగొండ** .గో.జిల్లా


మా తాతగారి వూళ్ళో మరిచిపోలేనిది జ్ఞాపకం తాతగారి పొలానికి వెళ్ళడం.

 

ప్రతి వేసవి శలవులకి తాడేపల్లిగూడెంలో నీళ్ళ ఇబ్బంది వుండేది. కాలవ కట్టేసేవారు. అమ్మమ్మ పెనుగొండ రమ్మని ఉత్తరం రాసేది. అమ్మమ్మకి అమ్మ చేసిన వంటలు అంటే ఇష్టంగా వుండేది. అమ్మంటే అమ్మమ్మ తాతగారు చాలా ప్రేమగా వుండేవారు.   

 

అమ్మ నన్ను, మా చెల్లెలు ప్రభావతిని తీసుకుని వెళ్ళేది.  మేమిద్దరం మా మామయ్య పిల్లలు బాబి, సాయి, శేఖర్  పొద్దున్నే చద్దన్నం తినేసి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మామిడితోట కూడా వుండేది.

 

మెయిన్ రోడ్డు మించి పొలానికి మలుపు తిరిగేటప్పుడు ఒక కాలవ పారుతుండేది. ఆ కాలవని నక్కల కాలవ అనేవారు.   దానికి ఒక వైపు స్మశానం వుండేది. రెండోవైపు పొలానికి దారి వుండేది.  అస్సలు భయం వుండేది కాదు. దారంతా తాతగారికి తెలిసిన వాళ్ళు పలకరిస్తుండేవారు.

 

దారంతా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ జాలీగా వెళ్ళేవాళ్ళం. మామయ్య ముగ్గురు కొడుకులూ పోటా పోటీగా జోక్స్ వేసేవాళ్ళు. పొట్టలు పట్టుకుని నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ ఆనందమే వేరు.  ఆ రోజులు చాలా బావుండేవి. మేము వాళ్ళూ కలిసి చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం.   వెళ్ళేటప్పుడు ఉప్పు, కారం పొట్లాలు కట్టుకుని తీసికెళ్ళేవాళ్ళం.   ఒక్కోసారి మా బాబాయి వాళ్ళు వచ్చేవారు. అక్కడ కొబ్బరి బొండాలు కొట్టించుకుని అందులో నిమ్మరసం పిండుకుని తాగేవాళ్ళం. అప్పుడు ఆ రుచి గొప్పగా వుండేది. మా బాబాయి పదిపైసల నాణెంతో లేత కొబ్బరి తీసి ఇచ్చేవాడు.

 

ఇక విరగకాసిన మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళి కాయలు కోద్దామనుకుంటే గుత్తులు గుత్తులుగా వుండేవి. ఒక కాయ కోసేసరికి నాలుగు కాయలు కింద పడేవి. అలా కోసినవి ఉప్పుకారం వేసుకుని తిన్నన్ని తిని మిగిలినవి ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం. అత్తయ్య అయ్యో అన్నికాయలూ కోసుకొచ్చేశారా... ఆవకాయకి ముదరాలి కదా... అనేది. మేము ఒక కాయ కోస్తుంటే ఇలా అన్నీ కింద పడ్డాయని చెప్తే పాపం ఏమీ అనేది కాదు.



 

అక్కడ సదాపనస అని పెద్ద పెద్ద ఆకులున్న పనస చెట్టు వుండేది. ఆ కాయలు వింతగా వుండేవి. అలాగే సీమమిరప చెట్లు వుండేవి. ఆ కాయలన్నీ కోసుకుని వచ్చేవాళ్ళం. శీకాయాకు చెట్టు అని వుండేది. ఆ ఆకు చింతాకులాగ పుల్లగా వుండేది.  అమ్మ దానిని వేయించి పొడి చేసేది. చాలా బావుండేది.  అరటి కాయలు, అరటి ఆకులు కోయించి తాతగారు పాలేరు చేత ఇంటికి పంపించేవారు.

 

చిన్నప్పుడు నేను ఒక్కదాన్నీ అమ్మమ్మతో పెనుగొండ వెళ్ళినప్పుడు తాతగారు నన్ను సైకిలు మీద పొలానికి తీసుకెళ్ళారు.  అక్కడ ఒక ముద్దమందార చెట్టు వుంది. నాకు పువ్వులంటే ఇష్టమని నా ఒడినిండా పువ్వులు కోసి ఇచ్చారు. పాలేరుని పిలిచి కొబ్బరి బొండాలు దింపించి ఒక కొబ్బరి బొండం కొట్టించి నీళ్ళు తాగించారు. అందులో మీగడలాంటి లేత కొబ్బరి రుచి ఇప్పటికీ గుర్తుంది.

 

ఒకసారి ఎడ్లబండి ఎక్కలేదంటే తాతగారు ఎవరినో అడిగి బండి కట్టించి ఎడ్లబండి మీద పొలానికి పంపించారు.  ఎక్కడానికి కొంచెం భయం వేసినా దానిమీద పొలానికి వెళ్ళడం చాలా ఆనందంగా అనిపించింది.

 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి