18, మార్చి 2021, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 9

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 9

 

పిల్లలతో విహారయాత్రలో ** మా తాతగారి వూరు పెనుగొండ** .గో.జిల్లా

 

ఇది ఒక జ్ఞాపకం

 

పెనుగొండలో మరొక ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఏడు అంతస్తులతో ఉన్న గాలిగోపురం. రంగు రంగులతో, చక్కటి శిల్పకళతో చూపరులకి ఆనందాశ్చర్యాలని కలిగిస్తుంది. దీన్ని వైశ్యుల కాశి అని పిలుస్తారు.  ఈ గుడి నిర్మాణానికి 11వ శతాబ్దం నాటి కథ ఒకటి వుంది.

 

ఈ గుడి మా తాతగారి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో వుండేది. సాయంత్రం అలా నడుచుకుంటూ వెళ్ళి కాసేపు అక్కడ ఉండి వచ్చేవాళ్ళం.

 

లోపల పెద్ద ప్రాకారంతో చాలా ప్రశాంతంగా వుండేది. గుడి వెనక వైపు గలగలా పెద్ద కాలవ ప్రవహిస్తూ వుంటుంది.  అక్కడి నుంచి వచ్చే చల్లటి గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.  

గుడి అరుగుల మీద సన్నాయి వాయిద్యకారులు చక్కని అన్నమాచార్య కీర్తనలు వాయించేవారు. అక్కడ కూచుని ఆ పాటలు వినేవాళ్ళం.  ఆ గుడిలో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వెడుతూ వుండేవాళ్ళం. 























అక్కడ గాలిగోపురం ఎక్కడానికి మెట్లు వుండేవి. అప్పట్లో టికెట్టు లేదనే గుర్తు.  ఏడంతస్తుల పైకి ఎక్కితే ఊరంతా పచ్చటి పొలాలలతో చాలా అందంగా కనిపించేది. 

 

ఇప్పుడు ఈ గుడిని బాగా అభివృద్ధి చేశారు.  ముందు వైపు ఎత్తైన అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు. లోపల ఆకర్షణీయమైన అద్దాల మహల్ వుంది.  దీనిని భవిష్యత్తులో స్వర్ణదేవాలయంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు.

 

మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక వింత జరిగింది. మా తాతగారి స్నేహితుడు ఒకాయన కనిపించారు. ఎక్కడ నుంచి వచ్చారు అని అడిగారు. మా వివరాలు చెప్పాము. అవునా... మీరు మల్లంపల్లి సుబ్బారావుగారి మనవలా... అని నా చేతిలో ఒక 15 రూపాయలు పెట్టారు. నాకు అర్థం కాలేదు. మీ తాతగారు చాలా సంవత్సరాల కిందట నాకు ఇబ్బందులలో వున్నప్పుడు 15 రూపాయలు ఇచ్చారు. అవి ఇవ్వలేక పోయాను. పోనీలే మీరు వారి మనవలు కదా... ఈ రకంగా రుణం తీర్చుకున్నాను అన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. దాదాపు 40 సంవత్సరా కిందట. అంటే 15 రూపాయలకి చాలా విలువ వుండేది.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి