12, మార్చి 2021, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు - 8

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు - 8

పిల్లలతో విహారయాత్రలో ** మా తాతగారి వూరు పెనుగొండ** .గో.జిల్లా

పిల్లలు తాతగారు పనిచేసిన సినిమాహాలు చూసి చాలా సంతోషించారు. తాతగారి ఇంటికి దగ్గరలో ఉన్న గుడులతో ఉన్న జ్ఞాపకాలని కూడా వాళ్ళతో పంచుకున్నాను.

మాయమైన పున్నాగ చెట్టు – శిథిలమైన రామాలయం

తాతగారూ వాళ్ళ ఇంటి రోడ్డు చివర ఒక పెద్ద పున్నాగ చెట్టు, చెట్టు పక్కన రామాలయం వుండేవి. పొద్దున్నే లేవగానే  అన్ని పనులూ అయిన తర్వాత, పిల్లలందరికీ చద్దన్నంలో (ఇంటి పాడి కాబట్టి) మంచి గడ్డ పెరుగు వేసి ఆవకాయ నంచిపెడుతూ,  కథలు చెప్తూ పిన్ని చేతిలో ముద్దలు వేసేది.  తిన్నతర్వాత నేను, మా చెల్లెలు, మామయ్య పిల్లలు కలిసి పున్నాగ చెట్టుకింద ఉండి ఉండి పడుతున్న పువ్వులు ఏరుకుని, పువ్వులతో జడలు అల్లి,  రామాలయం దగ్గిరికి వెళ్ళి  సీతారాముల విగ్రహాలకి ఆ పువ్వులజడలని మీద వేసి వచ్చేవాళ్ళం.  అక్కడ ఊరేగింపు పల్లకి, పెద్ద ఏనుగు బొమ్మ వుండేవి.  మేము వెళ్ళే సమయానికి అన్నీ శిథిలమైపోయాయి. పున్నాగ చెట్టు మాయమైపోయింది.

ఆటలకు నెలవు చెన్నకేశవ ఆలయ మంటపం









తాతగారింటికి కుడిచేతివైపున మూలగా చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది.  రోజూ పొద్దున్నే నేను అమ్మమ్మ పూజకి పువ్వులకోసం  ఆలయానికి వెళ్ళేదాన్ని పూజారి కొడుకు ముద్దమందారాలు, ఆకాశమల్లెపువ్వులు తను కొన్ని కోసుకుని, నాకు కొన్ని ఇచ్చేవాడు.  ఇంట్లో ఎన్ని పువ్వులు వున్నా అమ్మమ్మ పూజకి గుళ్ళో పువ్వులు కూడా తెచ్చేదాన్ని.

గుళ్ళో విష్ణుమూర్తికి అటూ ఇటూ జయ విజయుల విగ్రహాలు ఆకర్షణీయంగా వుండేవి.  వాటి చేతుల్లో ఉండే గదని ఆప్యాయంగా ముట్టుకునేవాళ్ళం.  గుడి చుట్టూ పరుగులు పెడుతూ ఆడుకునేవాళ్ళం. పూజారి పూజ చేసి దధ్దోజనమో, పులిహోరో ప్రసాదంగా పెట్టేవారు.

నేను, మా అక్క ఆలయంలో ఉన్న మంటపం మెట్లెక్కి పైన కూచుని రోజూ ఆడుకునేవాళ్ళం. పక్కనే వున్న పారిజాతం చెట్టుకి వున్న గుండ్రటి కాయలని కోసి పైసాలు అని లెక్కపెట్టుకుంటూ ఆడేవాళ్ళం. ఎవరు ఎక్కువ కోసి లెక్కపెడితే వాళ్ళకే ఎక్కువ పైసలున్నట్లు.

పిన్నీ వాళ్ళ పెళ్ళిళ్లు అయినప్పుడు ఒకరోజు రాత్రిపూట ఓడోమాస్ రాసుకుని గుడి ప్రాంగణంలో పడుకున్నాం. దోమలు భయంకరంగా కుట్టేశాయి.  అప్పుడు మా నాన్న కళ్ళలో కనిపించిన బాధ ఇప్పటికీ గుర్తుంది.  మర్నాడు పూజారిగారింట్లో ఒక రూము అడిగితీసుకున్నారు అందులో పడుకున్నాం. అప్పుడు నాకు నాలుగు సంవత్సరాలు.  

ఆనాటి జ్ఞాపకాలు చాలా మధురమైనవి.

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి