9, మార్చి 2021, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు - 7

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు - 7


పిల్లలతో విహారయాత్రలో ** మా తాతగారి వూరు పెనుగొండ** .గో.జిల్లా




తాతగారూ - సినిమాహాలు


నాకు చాలా ఇష్టమయిన వూరు. ఇక్కడ నాకున్న జ్ఞాపకాలు చాలా ఎక్కువ. పిల్లలని మా తాతగారు పనిచేసే సినిమాహాలుకి తీసుకెళ్ళాను  వాళ్ళు అక్కడ సినిమా వేసే పద్ధతి అన్నీ చూసి ఆనందించారు. మా పాతరోజులు గుర్తుకు వచ్చాయి.

తాతాగారు మధ్యాహ్నం ఒక కునుకు తీసి సినిమా హాలుకి వెడుతూ పిల్లలూ మీకు సినిమా బండి పంపిస్తాను రెడీగా వుండండి అని వెళ్ళిపోయేవారు. ఇంక అందరం రెడీ అయి సినిమాబండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. మా అమ్మమ్మ మీకు బాగా షోకులెక్కువయ్యాయి అనేది. మాకేమో అది ఎక్కాలని సరదా.  మేమొక్కళ్ళమే కాకుండా చుట్టుపక్కల పిల్లలందరినీ పోగేసే వాళ్ళం.

అది రాగానే పరుగులు పెట్టుకుంటూ ఎక్కి కూచునే వాళ్ళం. ఇంటి నుంచి సినిమాహాలు అర కిలోమీటరు కూడా వుండేది కాదు. కానీ అదో సరదా.

హాలుకి వెళ్ళగానే  అక్కడ తాతగారు కూచునే రూంలోకి వెళ్ళి కాసేపు ఆడుకునేవాళ్ళం.  బయటంతా రంగురంగుల గుత్తిపువ్వుల చెట్లు బారుతీరి ఉండేవి. ఆ పక్కనే సిమెంటు బెంచీలు వుండేవి.

ఆ పువ్వులు కోసుకుని వాటిలో వుండే తేనె పీల్చేవాళ్ళం. వాటన్నిటినీ రంగు రంగుల దండలుగా తయారు చేసేవాళ్ళం. అదో అందమైన అనుభూతి.

సినిమా మొదలుపెట్టే టైమ్ అవగానే హాలులోకి పరుగెత్తి చూసేవాళ్ళం. గుమ్ నామ్ హిందీ సినిమా అయితే ఒకరోజు సగం ఒకరోజు సగం మొత్తం 32 సార్లు చూశాం. ఇప్పుడు తలుచుకుంటే ఆ పిల్ల చేష్టలకి ఆశ్చర్యం వేస్తుంది.

సాధారణంగా మా తాతగారు మార్నింగ్ షో టైముకి సినిమాహాలుకి వెళ్ళిపోయేవారు. ఒకోసారి ఆయనతో సైకిలు మీద వెళ్ళేవాళ్ళం. ఆయన సైకిలు మీద మొత్తం ఐదుగురు పిల్లల్ని ముందర ఇద్దరిని, వెనక ఇద్దరినీ, ఒక ఫెడల్ మీద ఒకళ్ళని ఎక్కించి తీసుకెళ్ళేవారు. రోడ్డు మీద అందరూ ఆయన ఆప్యాయతని ఆశ్చర్యంగా చూసేవారు.

ఒకవేళ ఆయనకి నైట్ షో టైముకి పని ఎక్కువగా వుంటే మాకు ఆఫీసు రూములో మడతమంచాలు వేయించి మమ్మల్ని పడుకోమనేవారు. సినిమా అయిపోయాక మమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళేవారు.

అమ్మ చెల్లాయి పుట్టినప్పుడు మామయ్య కొడుకుతో కొన్నాళ్ళు స్కూలుకి పంపించింది.  అప్పుడు సినిమాహాలుకి పులివేట అనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది. స్కూలు పిల్లలకి కన్సెషన్ ఇచ్చారు. నేనేమో నలుగు ఫ్రెండ్స్ వుంటే వాళ్ళని తీసుకుని హాలుకి వెళ్ళి మా తాతగారు సుబ్బారావుగారు అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళిపోయాను. పాపం హాలు వాళ్ళు ఏమీ అనలేకపోయారు.  తాతగారి వూళ్ళో ఎన్నెన్ని జ్ఞాపకాలో...

 

 

  

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి