18, డిసెంబర్ 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 33 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -4

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 33  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -4

ఒక్కసారి వెనక్కి

నేను, నా తర్వాత చెల్లెలు ప్రభావతి ఇంటి దగ్గరలో ఉన్న బోర్డు స్కూల్లో చదివేటప్పుడు నేను ఐదో క్లాస్ చదువుతుంటే, ప్రభావతి 3వ క్లాస్ చదివేది. నేను ఐదు చదవడం అయిపోగానే గర్ల్స్ హైస్కూలులో 6వ తరగతిలో చేరదామనుకున్నాను.  మా మూడో అక్క ఉమాదేవి ఒక శలవు రోజు నన్ను తీసుకుని స్కూలుకి వెళ్ళి అక్కడ వున్న సోమలింగం అనే ప్యూన్ అడిగి నాకు స్కూలంతా చూపించింది. వీళ్ళందరికీ నాన్నగారు బ్యాంక్ లో బాగా తెలుసు కాబట్టి మేము లోపలికి వెళ్ళడానికి అడ్డు పెట్టలేదు. ఇక నేను స్కూలు మారుతున్నందుకు చాలా సంతోషించాను. 

నాన్నగారు కూడా సరే అన్నారు. ఇక ఒకరోజు నేను టిసి తీసుకుని స్కూలు నుంచి మారదామనుకున్నాను. కానీ మా ఇంగ్లీషు మేష్టారు. మీ నాన్నగారు నిన్ను స్కూలు మార్చట్లేదు అని చెప్పారు.  నాకు చాలా ఏడుపొచ్చింది. ఇంటికి వెళ్ళి ఎందుకు మార్చట్లేదని అడిగాను - నిన్ను మార్చేస్తే ప్రభావతి చిన్నపిల్ల ఒక్కత్తే స్కూలుకి వెళ్ళలేదు. ఈ స్కూలులో 7వ తరగతి వరకూ వుంది కాబట్టి -  నీకు 7వ తరగతి అయిపోతుంది, దానికి 3వ తరగతి అయిపోతుంది. ఇద్దరూ కలిసి హైస్కూలుకి వెళ్ళచ్చు అన్నారు.  ఇంక నాన్నగారి ఆలోచనకి నేను అడ్డు చెప్పలేకపోయాను. 

మొత్తానికి అలా 8వ తరగతి నుంచీ గర్ల్స్ హైస్కూలులో చేరాను.  నేను 9వ తరగతిలోకి వస్తూండగానే నాన్నగారు మాకు దూరమయ్యారు. ఎలాగో మా నాన్నగారి బ్యాంక్ వాళ్ళ ధర్మమా మళ్ళీ మా వూళ్ళోనే చదువులు కొనసాగించాము. సంవత్సరానికి ఒకసారే స్కూల్ ఫీజు అయినా... అక్కకి కట్టడం కష్టంగానే వుండేది. కానీ అమ్మ నాన్నగారు మల్లంపల్లి సుబ్బారావుగారు స్వాతంత్ర్య సమరయోధులు కాబట్టి  మాకు వాళ్ళ మనవలుగా ప్రభుత్వం నుంచి స్కూలు ఫీజులు వచ్చేలా... అప్లికేషన్ పెట్టించారు. అలా స్కూలు వరకూ నాకూ మా చెల్లెలికి ఫీజులు వచ్చాయి. 

అక్కకి కొంత ఊరట. రెండో అక్కకి, మూడో అక్కకి కాలేజీ ఫీజులు కట్టాల్సి వచ్చేది. వాళ్ళు రోజూ మా వూరి పక్కనే 3 km. దూరంలో వున్న పెంటపాడు వెళ్ళడానికి బస్ కి రోజుకి రాను పోనూ 50 పైసలు. ఇద్దరికీ కలిపి రూపాయి. అంటే నెలకి సెలవులు పోనూ... 20 రూపాయలు అయ్యేది.  అందుకని అక్కలిద్దరూ అప్పుడప్పుడూ కాలేజీ నుంచి నడుచుకుంటూ వచ్చేవారు.  అక్కలిద్దరనీ రమా, ఉమా అని పిలిచేవారు. వీళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. క్లాసులో ఫస్ట్ సెకండ్.  వీళ్ళిద్దరూ వ్యాసరచన, ఉపన్యాసాల పోటీలకి వెడుతుంటే అమ్మో రమా, ఉమా వస్తున్నారుట. మనకేం ప్రైజ్ రాదులే అని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఇక ధైర్యం చేసి కొంతమంది వెెళ్ళేవారు కానీ, ప్రైజు మాత్రం వీళ్ళిద్దరికే వచ్చేది.  పరీక్షలకి చదువుకునేటప్పుడు ఇద్దరూ కలిసి చదువుకునేవాళ్ళు. చదువులో కూడా మంచి మార్కులు వచ్చేవి. 

***

పొట్టు పొయ్యి



పెంటపాడు నుంచి వచ్చేదారిలో  ఒక దుంగలని కట్ చేసే మిషను వుండేది. అవన్నీ కట్ చేసినప్పుడు వచ్చే సన్నటి రజనుని అమ్మ పొట్టు పొయ్యిలోకి వాడేది. పొట్టు  పొయ్యి వాడకం చాలామందికి తెలిసే వుంటుంది. కానీ ఆ పొయిలో పొట్టు కూరేటప్పుడు మధ్యలో పచ్చడి బండ పెట్టి దాని చుట్టూరా పొట్టు వేస్తూ, నీళ్ళు చల్లుతూ చేత్తో గట్టిగా అదుముతూ వుండాలి. అలా పొయ్యి నిండేవరకు అదిమిన పొట్టులోంచి బండని తీసేటప్పుడు అది ఫిట్ గా వుండాలి. ఏమాత్రం గట్టిగా అదమక పోయినా పొట్టంతా కుప్పలా అయిపోతుంది. చివరికి పొట్టు గట్టిగా నిలబడిన తర్వాత కిందనించీ కొంత పొట్టుని తీసెయ్యాలి. అప్పుడు అక్కడ కట్టెపుల్లలు పెడితే మంట బండ తీసినప్పుడు వచ్చిన హోల్ లోకి వెళ్ళి గిన్నెని వేడెక్కేలా చేస్తుంది. 


అమ్మ కుంపటి, పొట్టు పొయ్యి వాడేది. పొట్టు అయిపోయినప్పుడు అక్కలు ఆ మిల్లుకి వెళ్ళి బస్తా వేయించుకుని వచ్చేవారు. అది చాలా రోజులు వచ్చేది. రిక్షాలో బస్తా వేయించుకుని దాని మీద కూచుని వచ్చేవారు. ఏమిటో నామోషీ అసలు వుండేది కాదు. అలాగే బొగ్గులకి కూడా బస్తా వేయింకునేవాళ్లం. 




4, డిసెంబర్ 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 32 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -3

 

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 32  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -3



చిన్నపాప గీతాని మేడ మీద తిప్పుతూ, గోడమీద నడిపిస్తూ అన్నం పెట్టేవాళ్ళం. ఒకరోజు మేమందరం కూచుని మాట్లాడుకుంటుంటే... అటూ ఇటూ పరుగులు పెడుతోంది. ఉన్నట్టుండి అమ్మ మీద పడింది. నవ్వుతున్న అమ్మ పన్ను తలకి  గుచ్చుకుని ఉన్నట్టుండి బిగుసుకుపోయింది. నల్లగా అయిపోయింది. చాలా భయం వేసింది. నేను పెద్దక్క భుజం మీద వేసుకుని రోడ్డు మీద పరుగులు పెట్టుకుంటూ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గిరకి బయల్దేరాం. రాత్రి ఏడు గంటలు కావడంతో లైట్ల వెలుతురులో ఉన్నట్టుండి భుజం మీంచి లేచి "లైట్లు లైట్లు" అని అరిచింది. మాకు అమ్మయ్య అనిపించింది. అసలే నాన్నగారు పోయిన కొత్తలు పాప ఇలా కంగారు పెట్టేసరికి చాలా దిగులు వచ్చేసింది. మొత్తానికి చాలా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాం. 


నాన్నగారు ఉన్నప్పటి నుంచీ జోగిరాజు అని ఆయుర్వేదం డాక్టరు, మూర్తి గారని ఆర్ ఎమ్ పి డాక్టరు. వీళ్ళిద్దరే మా కుటుంబ వైద్యులు. 

నాన్న లేని జీవితానికి అలవాటు పడుతున్నాం. ఇంతలోనే సుబ్బారాయుడి షష్ఠి రోజు  తాతగారు పెనుగొండ (పశ్చిమగోదావరి జిల్లా) నుంచి అంబాసీడర్ కారు పంపించారు -  అమ్మమ్మ చనిపోయింది. అందరూ కారులో వచ్చెయ్యండి అని డ్రైవరుతో కబురు చేశారు. నాన్నగారి రెండో అక్క సతీదేవిగారు. మా అమ్మకి మారుటి తల్లి. కానీ పెళ్ళయ్యాక మా అమ్మని బాగా చూసుకునేది తమ్ముడి భార్యగా.  సతీదేవిగారికి, మా నాన్నగారికి విడదీయరాని అనుబంధం. అక్క, తమ్ముడు ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ. ఆవిడకి తోచనప్పుడల్లా తమ్ముడి దగ్గరికి వచ్చేసేది. మా అమ్మ వంట అంటే ఆవిడకి చాలా ఇష్టం. అక్కలు ముగ్గురూ అంటే కూడా ఇష్టం. అక్కలతో కబుర్లు బాగా చెప్పేది. ఇంత అనుబంధం ఉన్న అమ్మమ్మ మా నాన్నగారు చనిపోయేసరికి బెంగ పెట్టుకుంది. అసలే మధుమేహవ్యాధిగ్రస్తురాలు. నాన్న గారి పుట్టిన రోజునే ఆవిడ కూచున్నావిడ కూచున్నట్టు ప్రాణాలు విడిచింది.    

అప్పుడు మా బామ్మ (అంటే సతీదేవిగారి తల్లి) మా దగ్గిరే వుంది. ఆవిడకి చెప్పదన్నారు. అందరం చిన్న పిల్లలమే కాబట్టి అంబాసీడర్ కారులో సరిపోయాం. తాడేపల్లి గూడెం నుంచి పెనుగొండ గంట ప్రయాణం. దారిలో బామ్మ ఇంకెవరో పోయారనుకుని వాళ్ళగురించి మాట్లాడుతూ కూచుంది. 

పెనుగొండ వెళ్ళాం. అసలే పల్లెటూరు, అమ్మమ్మ కౌన్సిలర్ గా చేసింది. తాతగారు సినిమాహాలు మేనేజర్, ఒక చిన్న సైజు జమీందారులులా వుండేవారు. ఇక ఊరు ఊరంతా అక్కడే వుంది. ఇంటి నిండా బంధువులు. 

అమ్మమ్మా వాళ్ళు లింగధారులు కాబట్టి అమ్మమ్మని గోడకి ఆనుకోపెట్టి కూచోపెట్టారు. నోట్లో బెల్లం ముక్క పెట్టారు. మాకు ఒక పక్క భయం, ఇంకోపక్క వింతగానూ అనిపించింది. నాన్నగారి తర్వాత మరో మరణం. మాకు తెలిసీ తెలియని వయసులు.  బాగా ఏడుపు వచ్చింది. బామ్మ అస్సలు తట్టుకోలేకపోయింది. ఒకపక్క కొడుకుపోయి కోలుకుంటుంటే, ఇంకోపక్క కూతురు. ఆవిడ బాధ వర్ణనాతీతం. 

చెయ్యవలసిన కార్యక్రమాలు చేశారు. లింగధారులు ఖననం చేస్తారు. అలా అమ్మమ్మ మాకు దూరమయ్యింది. 

పదిరోజులు అక్కడే వుండి మళ్ళీ తాడేపల్లి గూడెం వచ్చేశాం. 

మళ్ళీ మా కార్యక్రమాలలో పడ్డాం. నేను 9వ తరగతి చదువుతున్నాను. అక్కలిద్దరూ మాకు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంటపాడులో ఉన్న ఏకైక గవర్నమెంటు కాలేజీలో ఇంటరులో చేరారు. ఇద్దరూ చదువులో ముందు వుండేవారు. ఫీజు సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఎలా తిప్పలు పడి కట్టిందో అక్క తెలియదు. 

తాతగారు స్వాతంత్ర్య సమరయోధులు కాబట్టి, అప్పట్లో స్వాతంత్ర్యసమరయోధుల మనవలకి సంవత్సరానికి ఒకసారి స్కూలు ఫీజులు ప్రభుత్వం నుంచి ఇచ్చేవారు. అది అక్కకి కొంత ఊరటగా వుండేది. కానీ బియ్యం ఒక బస్తా  వేయించుకుంటే, టిఫిన్లు వుండేవి కాదుకాబట్టి, ఒక రెండు నెలలు వచ్చేది.  బస్తా 70 రూపాయలు ఒకోసారి ఆ డబ్బులు ఇవ్వడం కష్టంగానే వుండేది. అమ్మ బియ్యంలో వచ్చిన నూకలతో రవ్వ, పిండి చేసేది. అది వాడుకునేవాళ్ళం. ఒకోసారి నూకలు తక్కువని అవీ కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం. అప్పట్లో చపాతీ తినడం తక్కువ. నాన్నగారు బంగాళదుంప వాడనిచ్చేవారు కాదు. ఎప్పుడైనా అమ్మ శనివారం టిఫినుగా చపాతీ చేసి, బంగాళదుంప కూర చేసేది. అదేదో అపురూపంగా వుండేది. ఏది తిన్నా అందరం ఆనందంగానే తినేవాళ్ళం. 

అమ్మ నేను ఇంటి ముందు ఉన్న ఖాళీస్థలంలో కాకరపాదు, దొండపాదు, బచ్చలిలాంటి మొక్కలు పెంచేవాళ్ళం. వంకాయ కూడా చాలా బాగా కాసేది. ఆ కూరలు బాగా ఆదుకునేవి. అప్పట్లో ఫ్రిజ్ లేదు కాబట్టి వారానికి ఒకసారి కూరలు తెచ్చుకునేవాళ్ళం. 

మాకు స్కూలు యూనీఫాం వుండేది కాబట్టి రోజూ బట్టలకి ఇబ్బంది వుండేది కాదు. కానీ అక్కలకి కాలేజీకి, పెద్దక్కకి బ్యాంక్ కి వెళ్ళడానికి బట్టలు కావాలి కాబట్టి. రోడ్డు చివర వున్న షాపులో నెలకి కొంత కొంత ఇచ్చి అక్క బట్టలు తీసుకునేది. జాకెట్లు మొదలైనవన్నీ అమ్మ ఇంట్లోనే కుట్టేది. ఆదివారం రోజు మాత్రం పెద్దక్క అమ్మకి కుట్టడం విషయంలో సాయం చేసేది. మాకు పండగ పేరుతో కొన్ని బట్టలు కుట్టించేవారు. ఏదైనా కుడా ఆడ పిల్లలం కాబట్టి బట్టల అవసరం బాగానే వుండేది.