18, డిసెంబర్ 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 33 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -4

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 33  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -4

ఒక్కసారి వెనక్కి

నేను, నా తర్వాత చెల్లెలు ప్రభావతి ఇంటి దగ్గరలో ఉన్న బోర్డు స్కూల్లో చదివేటప్పుడు నేను ఐదో క్లాస్ చదువుతుంటే, ప్రభావతి 3వ క్లాస్ చదివేది. నేను ఐదు చదవడం అయిపోగానే గర్ల్స్ హైస్కూలులో 6వ తరగతిలో చేరదామనుకున్నాను.  మా మూడో అక్క ఉమాదేవి ఒక శలవు రోజు నన్ను తీసుకుని స్కూలుకి వెళ్ళి అక్కడ వున్న సోమలింగం అనే ప్యూన్ అడిగి నాకు స్కూలంతా చూపించింది. వీళ్ళందరికీ నాన్నగారు బ్యాంక్ లో బాగా తెలుసు కాబట్టి మేము లోపలికి వెళ్ళడానికి అడ్డు పెట్టలేదు. ఇక నేను స్కూలు మారుతున్నందుకు చాలా సంతోషించాను. 

నాన్నగారు కూడా సరే అన్నారు. ఇక ఒకరోజు నేను టిసి తీసుకుని స్కూలు నుంచి మారదామనుకున్నాను. కానీ మా ఇంగ్లీషు మేష్టారు. మీ నాన్నగారు నిన్ను స్కూలు మార్చట్లేదు అని చెప్పారు.  నాకు చాలా ఏడుపొచ్చింది. ఇంటికి వెళ్ళి ఎందుకు మార్చట్లేదని అడిగాను - నిన్ను మార్చేస్తే ప్రభావతి చిన్నపిల్ల ఒక్కత్తే స్కూలుకి వెళ్ళలేదు. ఈ స్కూలులో 7వ తరగతి వరకూ వుంది కాబట్టి -  నీకు 7వ తరగతి అయిపోతుంది, దానికి 3వ తరగతి అయిపోతుంది. ఇద్దరూ కలిసి హైస్కూలుకి వెళ్ళచ్చు అన్నారు.  ఇంక నాన్నగారి ఆలోచనకి నేను అడ్డు చెప్పలేకపోయాను. 

మొత్తానికి అలా 8వ తరగతి నుంచీ గర్ల్స్ హైస్కూలులో చేరాను.  నేను 9వ తరగతిలోకి వస్తూండగానే నాన్నగారు మాకు దూరమయ్యారు. ఎలాగో మా నాన్నగారి బ్యాంక్ వాళ్ళ ధర్మమా మళ్ళీ మా వూళ్ళోనే చదువులు కొనసాగించాము. సంవత్సరానికి ఒకసారే స్కూల్ ఫీజు అయినా... అక్కకి కట్టడం కష్టంగానే వుండేది. కానీ అమ్మ నాన్నగారు మల్లంపల్లి సుబ్బారావుగారు స్వాతంత్ర్య సమరయోధులు కాబట్టి  మాకు వాళ్ళ మనవలుగా ప్రభుత్వం నుంచి స్కూలు ఫీజులు వచ్చేలా... అప్లికేషన్ పెట్టించారు. అలా స్కూలు వరకూ నాకూ మా చెల్లెలికి ఫీజులు వచ్చాయి. 

అక్కకి కొంత ఊరట. రెండో అక్కకి, మూడో అక్కకి కాలేజీ ఫీజులు కట్టాల్సి వచ్చేది. వాళ్ళు రోజూ మా వూరి పక్కనే 3 km. దూరంలో వున్న పెంటపాడు వెళ్ళడానికి బస్ కి రోజుకి రాను పోనూ 50 పైసలు. ఇద్దరికీ కలిపి రూపాయి. అంటే నెలకి సెలవులు పోనూ... 20 రూపాయలు అయ్యేది.  అందుకని అక్కలిద్దరూ అప్పుడప్పుడూ కాలేజీ నుంచి నడుచుకుంటూ వచ్చేవారు.  అక్కలిద్దరనీ రమా, ఉమా అని పిలిచేవారు. వీళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. క్లాసులో ఫస్ట్ సెకండ్.  వీళ్ళిద్దరూ వ్యాసరచన, ఉపన్యాసాల పోటీలకి వెడుతుంటే అమ్మో రమా, ఉమా వస్తున్నారుట. మనకేం ప్రైజ్ రాదులే అని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఇక ధైర్యం చేసి కొంతమంది వెెళ్ళేవారు కానీ, ప్రైజు మాత్రం వీళ్ళిద్దరికే వచ్చేది.  పరీక్షలకి చదువుకునేటప్పుడు ఇద్దరూ కలిసి చదువుకునేవాళ్ళు. చదువులో కూడా మంచి మార్కులు వచ్చేవి. 

***

పొట్టు పొయ్యి



పెంటపాడు నుంచి వచ్చేదారిలో  ఒక దుంగలని కట్ చేసే మిషను వుండేది. అవన్నీ కట్ చేసినప్పుడు వచ్చే సన్నటి రజనుని అమ్మ పొట్టు పొయ్యిలోకి వాడేది. పొట్టు  పొయ్యి వాడకం చాలామందికి తెలిసే వుంటుంది. కానీ ఆ పొయిలో పొట్టు కూరేటప్పుడు మధ్యలో పచ్చడి బండ పెట్టి దాని చుట్టూరా పొట్టు వేస్తూ, నీళ్ళు చల్లుతూ చేత్తో గట్టిగా అదుముతూ వుండాలి. అలా పొయ్యి నిండేవరకు అదిమిన పొట్టులోంచి బండని తీసేటప్పుడు అది ఫిట్ గా వుండాలి. ఏమాత్రం గట్టిగా అదమక పోయినా పొట్టంతా కుప్పలా అయిపోతుంది. చివరికి పొట్టు గట్టిగా నిలబడిన తర్వాత కిందనించీ కొంత పొట్టుని తీసెయ్యాలి. అప్పుడు అక్కడ కట్టెపుల్లలు పెడితే మంట బండ తీసినప్పుడు వచ్చిన హోల్ లోకి వెళ్ళి గిన్నెని వేడెక్కేలా చేస్తుంది. 


అమ్మ కుంపటి, పొట్టు పొయ్యి వాడేది. పొట్టు అయిపోయినప్పుడు అక్కలు ఆ మిల్లుకి వెళ్ళి బస్తా వేయించుకుని వచ్చేవారు. అది చాలా రోజులు వచ్చేది. రిక్షాలో బస్తా వేయించుకుని దాని మీద కూచుని వచ్చేవారు. ఏమిటో నామోషీ అసలు వుండేది కాదు. అలాగే బొగ్గులకి కూడా బస్తా వేయింకునేవాళ్లం. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి