11, జనవరి 2022, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 34 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -5

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 34  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -5

అమ్మ అప్పుడప్పుడు నాన్నగారు లేని లోటు గురించి బాధపడుతూ వుండేది. అప్పుడప్పుడు అమ్మకి చాలా కోపం వచ్చేది. ఇప్పుడు ఆలోచిస్తే  - 33 సంవత్సరాలకి భర్తని పోగొట్టుకున్న అమ్మ మానసిక స్థితి ఎంత గందరగోళంగా వుండేదో అనిపిస్తుంది. మాతో నవ్వుతూ కబుర్లు చెబుతూనే వుండేది. కానీ ఏదైనా చిన్న తప్పు చేస్తే ఇంక మేము చుక్కలు చూసేవాళ్ళం. చాలా విషయాల్లో మిలటరీ డిసిప్లిన్ వుండేది. కానీ ఒకోసారి శిక్ష చాలా దారుణంగా వుండేది. 

ఒకసారి అమ్మ కంది పొడి చేద్దామని కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు అన్నీ కుంపటి దగ్గర పెట్టి మూకుడు కుంపటి మీద పెట్టింది. ఇంతలోకే అమ్మకి సాయం చేద్దామని మూడోఅక్క అక్కడున్న పప్పులన్నీ కలిపి మూకుడులో వేసేసింది. అప్పుడే అక్కడి వచ్చిన అమ్మ కోపంగా ఒక్క అరుపు అరిచింది. కర్ర పట్టుకుని తిడుతూ అక్క వెనక పరుగెత్తింది. అక్క అమ్మనుంచి తప్పించుకోవడానికి ఇల్లంతా పరుగు పెడుతూనే వుంది. 

చివరికి పరుగెత్తి పక్కింటి వాళ్ళ బావి పక్కన వున్న బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. అమ్మ అంతా చూసి తనకి భయపడి నూతిలో దూకిందేమో... అనుకుని కర్ర అక్కడ పడేసి నూతివైపు చూస్తూ కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. ఎటువంటి చప్పుడూ లేకపోవడంతో అక్క బాత్రూం తలుపు తీసుకుని బయటికి వచ్చింది. ఇక్కడున్నావా... ఎంత కంగారు పెట్టావు... అని ఇంకెప్పుడూ అలా పప్పులన్నీ కలిపెయ్యకు. అన్నీ ఒకేసారి వేగవు అని చెప్పింది. అక్క అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్ళింది. ఆ టైములో అమ్మ నరసింహావతారం ఎత్తినట్లనిపించింది.


***


అప్పుడప్పుడూ నాన్నగారి బ్యాంక్ వాళ్ళు నాన్నగారి మీద అభిమానంతో ఇంటికి వచ్చి పలకరిస్తూ వుండేవారు. అక్క బ్యాంక్ లోనే చెయ్యడంతో ఇంకా అభిమానం ఎక్కువ.  ఈ సందర్భంలో... 



మాకు ఎవరో తెలిసినవాళ్ళు - ఛార్టు మీద గ్లాసు పెట్టి సున్నాలు గీసి, మొత్తం ఎబిసిడిలు రాసి, ఎస్, నో, స్టార్ట్ కూడా రాసి, స్టార్ట్ అనే సున్నామీద గ్లాసు బోర్లించి  "స్పిరిట్ ఈజ్ కమింగ్"  అనాలని చెప్పారు. అటొకళ్ళు ఇటొకళ్ళు కూచుని  ఆ గ్లాసు మీద  చూపుడు వేళ్ళు పెట్టి రెడీగా కూచోవాలి. మనకి ఇష్టమైన వారి ఆత్మని తలుచుకోవాలి. ఆ ఆత్మ వచ్చినప్పుడు గ్లాసు కదుల్తుంది అని చెప్పారు. 

సరే నేర్చుకున్నాం. మాకు అదో సరదాగా వుండేది. ఆత్మ వచ్చిందనన్నప్పుడు మాత్రం ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానంగా గ్లాసు రయ్ మంటూ ఎబిసిడిల మీదకి వెళ్ళిపోయేది. అది అన్వయించుకునే వాళ్ళం. 

అయితే ఈ విషయం అక్క బ్యాంక్ వాళ్ళకి చెప్పింది. వాళ్ళలో నారాయణమూర్తి అన్నాయన  వాళ్ళ స్నేహితుణ్ణి తీసుకువచ్చి వీళ్ళ పాపకి జ్వరం తగ్గట్లేదు ఏం చెయ్యాలో స్పిరిట్  ని అడగండి అన్నారు. 

మేము అంతకన్నా... మమ్మల్నే అడిగారు కదా అని ఒక స్పిరిట్ ని పిలిచాము. వాళ్ళు పాప జ్వరం గురించి అడిగితే 5 కోడిగుడ్లు దిష్టి తీసి పడెయ్యమని చెప్పింది. వాళ్ళు ఇంటికి వెళ్ళి అలా చెయ్యగానే జ్వరం తగ్గిపోయిందిట.  ఇంక ఎవరెవరినో వెంటపెట్టుకుని రావడం మొదలు పెట్టారు. అక్క బ్యాంకికి వెడుతుంది. మేము చదువుకుంటున్నాము. మాకు చాలా చిరాగ్గా అనిపించింది. దెబ్బతో మేము పెట్టడం మానేశాం అని చెప్పాం.  ఇంక అందరూ రావడం మానేశారు.  అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం.

ఇంతకీ మనలో అంతర్గతంగా ఉన్న కొన్ని ఆలోచనలే అలా వస్తాయని అనుకున్నాం. కాకపోతే నాకు ఇప్పటికీ అర్థంకానిది ఆ గ్లాసు మీద అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూచుని వేళ్ళు పెడితే ఆ గ్లాసు ఎలా కదిలేదో అర్థం కాలేదు. ఇది కూడా మనలో వున్న శక్తేనేమో.... మరి. 

ఇప్పుడు మూఢనమ్మకాలు వేటినీ పట్టించుకోము. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి