5, ఏప్రిల్ 2022, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 12

మెల్లగా కుదురుకుంటున్న మా జీవితాలు -  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 12



అక్క రెండో పాప రత్నని అమ్మ దగ్గిర దింపేసి విజయవాడ వచ్చేశాను. కానీ నా దృష్టంతా అమ్మ మీదే వుంది. మళ్ళీ స్కూల్లో చేరాను. నాకు  ఆ స్కూల్లో చెయ్యాలనిపించలేదు. 


ఇంతలోనే హైదరాబాద్ లో డెర్కో కూలింగ్ కోయిల్స్ అనే ప్రైవేట్ కంపెనీలో చేస్తున్న మా రెండో అక్క "నువ్వు హైదరాబాద్ వచ్చెయ్యి ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది" అని ఉత్తరం రాసింది.  అప్పటి వరకూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన అనేదే లేదు. ఎవరు ఎలా చెప్తే అలా చెయ్యడమే. 


విజయవాడలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. ట్రెయిన్ లో రిజర్వేషన్ చేయించుకోవాలనే ఐడియా  లేదు. గబగబ ఎదురుగా వున్న కంపార్ట్ మెంట్ లో ఎక్కాను.  సీటు కోసం చూస్తుంటే.... "నాగలక్ష్మీ" అని వినిపించింది. అదే మొదటిసారి హైదరాబాద్ వెళ్ళడం. ఎవరిదో తెలిసిన గొంతు వినిపించేసరికి ఆనందంగా అనిపించింది. తలతిప్పి చూశాను. నా చిన్నప్పటి స్కూల్ మేట్ నాగమణి. దగ్గిరకి వెళ్ళాను. తనకి సైడ్ సీట్ వచ్చింది. రా ఇక్కడ కూచో... నేను మా ఫ్రెండ్ హైదరాబాద్ వెడుతున్నాం.  దిగేవరకూ మా దగ్గిరే కూచో అన్నారు. కొంచెం ధైర్యం అనిపించింది. ఇంటికి ఎలా వెడతావు అంది. "అక్క స్టేషన్ కి వస్తానంది" అన్నాను.  ఫోన్లు లేవు. ఉత్తరం ద్వారా  తెలిసిన విషయమే.  మొత్తానికి ఏవో కబుర్లు చెప్పుకుంటూ హైదరాబాద్ చేరిపోయాం.


నేను స్టేషన్ లో దిగాను. నాకు అక్క ఎక్కడ కనిపించలేదు. చాలా భయంగా అనిపించింది. ఇంతలోకే ఒకాయన "ఎక్కడికి వెళ్ళాలమ్మా..." అన్నారు.  "మా అక్క నారాయణగూడా స్టేట్ బ్యాంక్ లో చేస్తుంది" అన్నాను. "అయితే నేనూ అటే వెడతాను. స్టేషన్ బయట నెం.1 బస్ ఎక్కితే అటే వెడుతుంది. అక్కడ స్టాప్ వుంది. నేను ఎక్కేటప్పుడు నాతో ఎక్కమ్మా..." అన్నారు. చూడ్డానికి పెద్దమనిషి లాగే వున్నారు కదా అని ఆయనతో బాటు నెం.1 బస్ ఎక్కాను. నారాయణగూడాలో దిగాను. 


బస్ స్టాప్ దగ్గరలోనే వున్న స్టేట్ బ్యాంక్ కి వెళ్ళాను. "రమాసుందరి కావాల"ని అడిగాను.  అక్కడే ఉన్న ఒకాయన "నువ్వు స్టేషన్ నుంచి వస్తున్నావా... మీ అక్క స్టేషన్ కి వెళ్ళింది నీకోసం. సరే కూచో వస్తుంది" అన్నారు. ఒక అరగంటకి అక్క మొహం గాభరాగా పెట్టుకుని బ్యాంక్ కి వచ్చింది. ఎదురుగా వున్న నన్ను చూడగానే... "అలా ఎలా వచ్చేశావు. నేను నీకోసం స్టేషన్ అంతా తిరిగాను. సరేలే ముందు బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కుని ఫ్రెషప్ అయి రా... టీ తాగుదువుగాని"  అంది. 


నేను కాస్త రిలాక్స్ అయి రాగానే టీ తెప్పించింది. అది తాగి, నేను వచ్చేపోయే వాళ్ళని చూస్తూ కూచున్నాను.  ఐదుగంటలకి బ్యాంక్ అవగానే  మెహదీపట్నం లోపలకి ఉన్న గుడిమల్కాపూర్ లో తను ఉన్న రూంకి నన్ను తీసుకుని వెళ్ళింది.  నాకు అంతా వింతగా, కొత్తగా ఉంది.