17, ఆగస్టు 2022, బుధవారం

కొత్త జీవితానికి నాంది - 41 *** పెళ్ళి హాలుకి తరలి వెళ్ళాం ***

కొత్త జీవితానికి నాంది - 41   *** పెళ్ళి హాలుకి తరలి వెళ్ళాం ***


19వ తేదీ వచ్చేసింది. పొద్దున్న పురోహితుడు వచ్చి, పెళ్ళికి కావలసినవి అన్నీ ఉన్నాయో లేదో చూసుకున్నాడు. ఓ సమస్య తీరింది. సాయంత్రం 6 గం.లకి వచ్చేస్తానని చెప్పాడు. అందరం మధ్యాహ్నం ఇంట్లోనే భోజనాలు కానిచ్చుకున్నాం. హాలు వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల నుంచీ ఇస్తానన్నాడు, ఇంటికి 2 కి.మీ. దూరం కాబట్టి అంత హడావుడి లేకపోయింది. (ఆ హాలు దగ్గర ఓ ఫోటో తీసుకుందామంటే పడగొట్టి అపార్ట్ మెంట్ కట్టారు).






మూడు గంటలకి రాములు ఆఫీసు van, వేరే డ్రైవర్ తో ఒక కారు తీసుకుని వచ్చాడు. సామానంతా van లో తరలించి, వెనక మేమందరం వెళ్ళాం. అప్పటికీ వంటవాళ్ళ ఆచూకీ లేదు. అప్పటికప్పుడు భోజనాల ఏర్పాటు ఎలా చెయ్యాలనే తర్జనభర్జన. అసలు సంగతి వాళ్ళు చాలా తొందరగా చెయ్యగలరుట. సాయంత్రం 5 గంటలకి రావచ్చని వాళ్ళే తీర్మానించుకున్నారుట. ఏం విన్నారో ఏమో.... మొత్తానికి 5 గంటలకి వచ్చారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. ఎక్కువ డబ్బు వ్యవహారాలు చూసుకున్నది నేను, పెద్దక్క కాబట్టే ఈ హడావుడి మాకు ఎక్కువయింది.

మాకు ఇచ్చిన రూమ్ లో అంతా సద్దేసుకుని, ఇంక కార్యక్రమాలకి రెడీ అవుతున్నాం. ఇంతలోకే నా పెళ్ళికి అసలు పెద్ద, నాకు కాబోయే ఆడబడుచు (నండూరి రామమోహనరావుగారి కోడలు ఇందిర) కుటుంబం స్టేషన్ నుంచి డైరెక్ట్ వచ్చారు. చంటిపిల్లలతో వచ్చిన వాళ్ళకి కాఫీ, టిఫిను కూడా వెంటనే అందించలేకపోయాం. ఎటువంటి కోపతాపాలు లేకుండా వాళ్ళు మాకు బాగా సహకరించారు.

సాయంత్రం 6.30 గంటలకి పురోహితుడు వచ్చాడు. మంగళ స్నానాలు అయ్యాక నన్ను గౌరీ పూజ దగ్గర కూర్చోపెట్టే కార్యక్రమానికి హడావుడి పడుతున్నాడు.

మగపెళ్ళివారు 6 గంటలకే వస్తామన్నవాళ్ళు 7 గంటలయినా రాకపోతే ఏమయ్యిందో అర్థం కాలేదు. మళ్ళీ ఇదో టెన్షనా అనుకున్నా. ఎవ్వరికీ సెల్ ఫోన్ లు లేవు. *** పురోహితుడు రాకపోతే దండలు మార్చకుందాం అనుకున్నాం. మరి పెళ్ళికొడుకు రాకపోతేనో...*** నాకే నవ్వొచ్చింది. అదేంటో అసలు భయమే లేదు. నేను ఆ సిట్యుయేషన్ ఊహించుకుంటూ... మా అమ్మ వంక చూశాను. అమ్మ చాలా రోజులకి చూసిన తన వాళ్ళని హడావుడిగా పలకరించుకుంటూ సంబరపడిపోతోంది. ఈ విషయమే పట్టినట్టు లేదు. పెద్దమ్మాయి అన్నీ చూసుకుంటుందిలే అని ధీమా... నా మొహాన్ని చూసి చదివినట్టు పురోహితుడు “అమ్మా నాగలక్ష్మీ... అవన్నీ వాళ్ళు చూసుకుంటారు నువ్వు ఇటువైపు తిరుగు” పెళ్ళి బ్రహ్మాండగా అవుతుంది అన్నాడు. జరుగుతున్న కథ నా వైపు చూసి వెక్కిరింతగా నవ్వింది.

వాళ్ళకి దిల్ సుక్ నగర్ నుంచి విద్యానగర్ కి దగ్గర దారి వుంది. వాళ్ళు పావుగంటలో చేరిపోవచ్చు. అందరూ హడావుడి పడుతున్నారు - *** పెళ్ళికొడుకు వచ్చాడు, వచ్చాడు అని.*** అందరినీ లోపలకి ఆహ్వానించారు. ఇంతకీ అసలు సంగతి ఏంటయ్యా అంటే పెళ్ళికొడుకుకి అప్పటి వరకూ వడుగు అవలేదు కాబట్టి, పొద్దున్న వడుగు కార్యక్రమం చేసుకుని, భోజనాలు చేసి, విశ్రాంతి తీసుకుని వచ్చారు.

***
*** మళ్ళీ కథకి హుషారొచ్చింది. నవ్వుకుంటూ రంగంలోకి దిగిపోయింది. పెళ్ళి హడావుడిలో పడిపోయింది***
***

కాశీయాత్ర హడావుడిగా పూర్తి చేశారు. వాళ్ళు లేటుగా వచ్చారు కదా... మొత్తానికి పెళ్ళికొడుకుని పీటల మీద కూర్చోపెట్టారు. ఇంక పెళ్ళి కార్యక్రమం మొదలైంది.

మెల్లిమెల్లిగా హాలంతా జనాలతో నిండిపోయింది. మేము ప్రింట్ చేయించిన కార్డులు ఇద్దరివీ కలిపి 200. వచ్చినవాళ్ళు 300 పైనే. పెద్దక్క వైపు బంధువులు, అమ్మ వైపు బంధువులు, పెళ్ళికొడుకు బంధువులు, రెండో అక్క స్టేట్ బ్యాంక్ స్టాఫ్, మాకు తెలిసిన స్నేహితులు – వీళ్ళందరూ కాకుండా మా ఆఫీసు వాళ్ళు. ఆఫీసు వాళ్ళే కాకుండా, నేను పిలిచిన విజయపాల్ గారి కుటుంబం, బంధువర్గమంతా పెళ్ళికి వచ్చారు. విజయపాల్ (మా బాస్) గారి అమ్మగారు, శ్రీమతి కృష్ణగారు నాకు బట్టలు స్వీట్స్ ఇచ్చి వెళ్ళారు.

ముహూర్తం దగ్గరపడుతుండగా మేనమామలు నన్ను బుట్టలో కూర్చోపెట్టి పెళ్ళి మంటపంలోకి తీసుకెళ్ళారు.

పక్కగా నిలబడిన జానకిరాం గారి స్నేహితులు మీదకి వంగి - “జానకిరాం అమ్మాయిని బాగా సెలక్ట్ చేసుకున్నావ్. లవ్ మేరేజ్ బాగానే చేసుకుంటున్నావుగా....” అన్నారు. అందరి ఎదురుగా అలా అనేసరికి ఒక్కసారి గాభరాపడిన ఆయన - అసలే అన్నలంటే గౌరవం, భయం వింటే ఏమనుకుంటారో... వాళ్ళు కుదిర్చిన పెళ్ళే అయినా కూడా... ఫ్రెండ్స్ ని వెనక్కి పొమ్మని మళ్ళీ కార్యక్రమాల్లోకి వచ్చారు.

జీలకర్ర బెల్లం సరిగ్గా 9.20 ని.లకి పెట్టించారు. తర్వాత మంగళసూత్రధారణ, కన్యాదానం, తలంబ్రాలు అన్నీ యథావిధిగా జరిగిపోయాయి. *** అమ్మ మొహంలో అమ్మయ్య పెళ్ళయిపోయిందని ఆనందం.*** ఒక పక్కన భోజనాల కార్యక్రమం మొదలుపెట్టేశారు. లేటయిపోతుందని. ఒక్కొక్కళ్ళూ మమ్మల్ని పలకరించి వాళ్ళివ్వవలసినవి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు.

బ్రాహ్మడు నాగవల్లి కార్యక్రమం కానిచ్చేసరికి రాత్రి 11 అయ్యింది. అప్పుడు మా ఇద్దరికీ భోజనాలు పెట్టారు. ఇంకా భోజనాలకి వచ్చేవాళ్ళు వస్తుానే వున్నారు. తరవాత చెప్పారు ఒక్కోళ్ళకి వడ్డించేసరికి నడుములు పడిపోయాయని. వంటవాళ్ళు వండినవాళ్ళు వండినట్టున్నారని. 300ల పైన వచ్చిన వాళ్ళకి భోజనాలు అంటే మామూలా.. బహుశ హాలు రోడ్డు మీద వుండడంతో రోడ్డు మీద వాళ్ళు కూడా వచ్చి వుండచ్చు. అసలు హైలైట్ ఏమిటంటే విజయపాల్ గారి కుటుంబం, బంధువర్గం కూడా అందరితోబాటు కింద కూచుని, వడ్డిస్తుంటే భోజనం చేసి వెళ్ళారు.

ఆ రోజు శుక్రవారం కావడంతో 12 గంటలవరకు కూచుని అప్పగింత కార్యక్రమం పూర్తిచేశారు. ఏమిటో ఏడుపే రాలేదు. నాకు ఏడుపు రావడం చాలా తక్కువ. పెళ్ళయ్యింది చాలనుకున్న అమ్మ కూడా ఏడవలేదు. (నాకు మా అమ్మాయి పెళ్ళిలో మాత్రం కళ్ళనీళ్ళు బొటబొటా వచ్చేశాయి.)

మొత్తానికి పెళ్ళి కార్యక్రమం సుఖాంతం అయ్యింది. నాకు సముద్రమంటే ఇష్టం. అది చూడాలంటే మద్రాసు వాళ్ళని పెళ్లి చేసుకుంటే సరి అనుకున్నాను. ఏంటో ఆ ఆలోచన. మొత్తానికి మా అత్తగారూ వాళ్ళు మద్రాసులో సెటిల్ అయిన తెలుగువాళ్ళు.

***

వాటర్ వర్క్స్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేస్తున్న మా బావగారు రాజేశ్వరరావుగారు అందరినీ ఆఫీసు జీపులో అలకాపురిలో ఉన్న వాళ్ళింటికి తీసుకుని వెళ్ళారు. రాత్రి 1.30 అయ్యింది. మర్నాడు సత్యనారాయణ వ్రతం.

పొద్దున్న వ్రతం అయి, భోజనాలు అయ్యాక అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం.

11 కామెంట్‌లు:

  1. పెళ్ళి బాగా జరిగినట్లుంది, గుడ్ 👌.
    పెళ్ళి లాంటి పెద్ద కార్యక్రమంలో చిన్న చిన్న టెన్షన్లు వస్తూనే ఉంటాయి కదా.

    // “ (ఆ హాలు దగ్గర ఓ ఫోటో తీసుకుందామంటే పడగొట్టి అపార్ట్ మెంట్ కట్టారు). “ // ……. ఆధునిక కాలానికి పట్టిన జాడ్యాల్లో ఈ అపార్ట్ మెంట్ వేలంవెర్రి ముఖ్యమైనది. పాత జ్ఞాపకాలు, గుర్తులు ఎన్నిటినో చెరిపేస్తోంది. పురోగతి అనుకోవాలేమో 😔?

    రిప్లయితొలగించండి
  2. అవును సర్ పెళ్ళి బాగా జరిగింది. సిటీలో ఫస్ట్ టైం నా పెళ్ళి అనేసరికి కొంచెం టెన్షన్ పడ్డాం. "పాత జ్ఞాపకాలు, గుర్తులు ఎన్నిటినో చెరిపేస్తోంది" ఇది మాత్రం కరెక్ట్ సర్. మీకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సర్ మీ ఇ మెయిల్ అడ్రస్ నాకు కనిపించట్లేదు.

      తొలగించండి
    2. అలాగా?
      సరే నా సెల్ నెం. 9440751471 కు మెసేజ్ పంపవచ్చు మీకు అభ్యంతరం లేకపోతే.

      తొలగించండి
    3. తప్పకుండా సర్. ధన్యవాదాలు మీకు.

      తొలగించండి
  3. ఆ విధంగా మీ “పెళ్ళిపుస్తకం” మొదలయిందన్నమాట, గుడ్ 👍🙂.

    ఇంతకు ముందు నా కామెంట్లలో చెబుదామనుకునే మరిచాను. నండూరి రామమోహనరావుగారికి మా తండ్రిగారికి కాస్త పరిచయం ఉండేది. మరొకటి విజయవాడలో రామమోహనరావు గారి అపార్ట్ మెంట్లలోనే ఓ నాలుగు గుమ్మాలివతల మా పెదనాన్నగారి కూతురు నాగమణి గారు ఉంటున్నారు (ఇప్పటికీ కూడా). మా బావగారు కృష్ణారావు గారు రైల్వేలో ఉద్యోగం చేసేవారు. ఆ రెండు కుటుంబాలకు బాగా పరస్పర పరిచయం. బహుశః మీ ఆడపడుచు ఇందిర గారికి, ఆవిడ అత్తగారికి (మిసెస్ రామమోహనరావు గారి) గుర్తుండే ఉండవచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ విజయవాడ జ్ఞాపకాలు బావున్నాయి సర్. మీరన్నట్టు మా ఆడబడుచు ఇందిరకి తెలిసే వుండచ్చు. నేను కనుక్కుంటాను. రామ్మోహనరావుగారి శ్రీమతి రాజేశ్వరి గారు చనిపోయి కూడా మూడు సంవత్సరాలు అవుతున్నట్టుంది. చివరి రోజుల్లో ఆవిడ స్మైల్ (హైదరాబాద్) అనే ఓల్డేజ్ హోంలో వారి స్నేహితురాలి దగ్గర గడిపారు.

      తొలగించండి
    2. అయ్యో, ఆవిడ కూడా కాలం చేశారా ? 🙏

      మీ ఆడపడుచు గారు వివరాలు చెబితే …. ఇక్కడ బ్లాగులో ఎందుకు లెండి ….. నాకు ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తే బెటర్. మీరు బ్లాగ్ ఓనర్ కాబట్టి వ్యాఖ్యాతల ఇ-మెయిల్ ఐడి మీకు కనిపిస్తుందనుకుంటాను.

      ఈ ఆపాతమధురంతో 👇 మీకు, మీ కుటుంబానికి కృష్టాష్టమి శుభాకాంక్షలు.

      https://m.youtube.com/watch?v=EiKHGO3nZoc

      తొలగించండి
    3. ధన్యవాదాలు సర్. నేను ఇ-మెయిల్ లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

      తొలగించండి
  4. చాలా బాగా వ్రాస్తున్నారు.

    ఏరచనకైనా చదివించగలగటం ముఖ్యలక్షణం. మీరచన కోసం ఎదురుచూస్తున్నానంటే ఆలక్షణం పుష్కలం అని వేరే చెప్పాలా?

    నాక్కొంచెం చాదస్తం అనుకోండి. ఫరవాలేదు. చిన్నచిన్న దోషాలు కొన్నిటిని మీరు సరిచేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు "కూర్చుని" అన్నమాటను "కూచుని" అని వ్రాస్తున్నారు. వీలైతే మార్చండి.

    ఈరోజున పెళ్ళిచేయించే వారిని "బ్రాహ్మడు" అన్నారు. తప్పుకాదు కాని "పురోహితుడు" అనటం సమంజసమూ సంప్రదాయమూను.

    భారతీయకాలమానంలో సూర్యోదయం నుండి మళ్ళా సూర్యోదయందాకా ఒకరోజు. పాశ్చాత్యులకు అర్ధరాత్రి నుండి మరుచటి అర్ధరాత్రి దాకా ఒకరోజు.

    అందుచేత, మనకు సూర్యోదయం ఐనప్పటి నుండి వారం పేరు మారుతుంది కాని అర్ధరాత్రి 12గంటలకు కాదు. అది పాశ్చాత్యులు పాటించే విధానం కాని మనది కాదు. ఈమధ్యన ఈపొరపాటును చాలామందే చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ.. మీరు చెప్పిన విషయాలు తప్పకుండా పాటిస్తాను. ఏ విషయంలోనైనా తప్పులు తెలుసుకుని సరిదిద్దుకోవడానికే ప్రయత్నిస్తాను. మీరు ఇలా చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలు. ఎవరైనా చెప్తేనే ఆవిషయానికి మరోవైపు అర్థమవుతుంది.

      తొలగించండి