21, జూన్ 2022, మంగళవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 24 *** కంప్యూటర్ రూంలో సంగీత ధ్వనులు ***

  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 24  *** కంప్యూటర్ రూంలో సంగీత ధ్వనులు ***


యథా ప్రకారం నేను కంప్యూటర్ దగ్గర కూచుని వర్కు చేసుకుంటున్నాను. లక్ష్మీ, రవీంద్రనాథ్ తెగ హడావిడి పడిపోతున్నారు. ఉన్నట్టుండి లైటు ఆర్పేశారు. రెడ్ లైట్ వేశారు. నాకు కనీసం చెప్పను కూడా చెప్పలేదు. వెనక్కి తిరిగి చూశాను. లక్ష్మి ఏదో నల్లటి బాక్స్ తీసుకుని వచ్చింది. దాన్ని లక్ష్మి కంప్యూటర్ పక్కన వున్న పెద్ద భోషాణం లాంటి (*** నేను పక్కన ఫోటోలో పెట్టాను చూడండి అంత పెద్దది ఉండేది ***) దానికి బయట ఫిట్ చేశారు. తర్వాత రవీంద్రనాథ్ ఆ భోషాణం లాంటి దాని మూత ఓపెన్ చేశాడు. అందులో ఒక వైట్ పేపర్ రోల్ తీసుకువచ్చి లోపల పెట్టాడు. దాని మూసేసి ఇద్దరూ ఇవతలికి వచ్చారు. రవీంద్రనాథ్ లైట్ వేశాడు. లక్ష్మి తన సీటులో కూచుంది. ఇంతలోకే చిన్న చిన్నగా, ఉన్నట్టుండి పెద్దగా అందమైన శబ్దాలు వినిపించడం మొదలు పెట్టింది. నాకు ఏమీ అర్థం కాక వెనక్కి తిరిగి చూశాను.

ఇప్పుడు మాత్రం రవీంద్రనాథ్ నా మొహంలో క్వశ్చన్ మార్కులు చూసి దీన్ని “ప్రింటర్” అంటారు. మనం టైప్ చేసిన మేటర్ ఇందులో ప్రింట్ అవుతుంది - “ఇందాక నేను లోపల ఒక పేపర్ పెట్టాను కదా.... అది బ్రోమైడ్ పేపర్. అది లైటు లేకుండానే లోపల పెట్టాలి. లేకపోతే ఎక్స్ పోజ్ అయిపోతుంది. అవతల పడెయ్యాల్సిందే. తర్వాత లోపల ఇదిగో ఇలాంటి నల్లంటి ఫాంట్ డిస్క్(*** నేను ఫోటోలో పెట్టిన నల్లటిది. నేనే ఫోటోషాప్ లో ఇలావుంటుందని చెప్పడానికి దాన్ని గీశాను***) వుంటుంది” అని నల్లగా, గ్లాస్ తో చేసిన గుండ్రటి దాన్ని చూపించాడు. దానిమీద ABCD లు ఉన్నాయి. అయితే ఆ బాక్స్ లోకి ప్రింట్ అయిన బ్రోమైడ్ పేపర్ వస్తుందని చెప్పాడు.


ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే – ఈ నల్లటి డిస్క్ లు రెండు ఉన్నాయి. ఒకటి తెలుగు అక్షరాలకి రెండోది, ఇంగ్లీషు అక్షరాలకి -

వీటిలో మనకి కావలసిన – Futura, Sovenir, Times New Roman ఇచ్చి *** ఇంగ్లీష్ ఫాంట్స్ ఉన్న గాజు డిస్క్*** జాగ్రత్తగా డార్క్ రూం లో లోపల ఫిట్ చెయ్యాలి. అలాగే తెలుగు ఫాంట్స్ కావాలంటే తెలుగు డిస్క్ పెట్టాలి. వాటిల్లో గీతలు రావడానికి కూడా సెట్ చేశారు. ప్రింటర్ లో లైటు పడుతూ వుంటే ఈ డిస్క్ తిరుగుతూ అక్షరాల్ని బ్రోమైడ్ పేపర్ మీద ప్రింట్ చేస్తుంది. అవి ప్రింట్ అయేటప్పుడు పెద్ద అక్షరాలకి ఒక శబ్దం, చిన్న అక్షరాలకి ఒక శబ్దం *** టిక్ టిక్ టక టక*** వస్తుంది. గీత గియ్యాల్సినప్పుడు చక్కగా *** మ్ మ్ మ్*** అంటూ సంగీతంలా శబ్దం వస్తుంది. ఇలా ప్రింట్ అయిన పేపర్ డైరెక్ట్ నల్లటి బాక్స్ (***నేనే గీశాను. అలావుంటుందని చెప్పడానికి***) లోకి వెళ్ళిపోతుంది.

*** అక్షరాలు కనపడాలంటే ఆదో ఆరాటం – పోరాటం - సస్పెన్స్ ***

నల్లటి బాక్స్ లోకి వెళ్ళిన పేపర్ ని మళ్ళీ ఒక రూం లోకి తీసుకుని వెళ్ళాలి. అక్కడ A B అనే రెండు కెమికల్స్ సమానంగా తీసుకుని ఒక ట్రేలో పొయ్యాలి. ఆ బాక్స్ లోంచి బ్రోమైడ్ పేపర్ తీసుకుని మెల్లిగా ఒకేలాగా ఆ చివర నుంచి ఈ చివర వరకూ తడుపుతూ వుండాలి. అయితే కొన్ని సెకండ్స్ టైమ్ లోనే దాన్ని బయటికి తీసి పంపుకింద నీళ్ళలో కడిగెయ్యాలి. దీన్ని బ్రోమైడ్ డెవలపింగ్ అంటారు. లేకపోతే అక్షరాలు షార్ప్ గా రావు. అలా రాకపోతే ప్రింటింగ్ దెబ్బతింటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని డెవలప్ చెయ్యాలి. నీళ్ళలో కడిగిన తర్వాత క్లిప్పులు పెట్టి ఫోటోస్టూడియో లాగా ఆరేవరకూ తాడుకి తగిలించాలి.
ఇదంతా ఇద్దరూ నాకు దగ్గరుండి చెప్పారు. అదొకటి మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఆ పని చెయ్యడానికి అందరూ ఇష్టపడరు. కెమికల్స్ తో పని కదా...

నా వరకూ వస్తే కానీ తెలియదన్నట్లు - మొదట్లో నాకు ఆ డెవలపింగ్ చేసేటప్పడు ఆ కెమికల్స్ బట్టల నిండా పడిపోయేవి. చేతులయితే సబ్బు పెట్టి కడుక్కునేవాళ్ళం. బట్టల మీద పడిన కెమికల్స్ వాసన పోయేది కాదు. నేను అంత పట్టించుకునేదాన్ని కాదు.

కానీ ఒకరోజు ఇలాగే డెవలపింగ్ చేసి సాయంత్రం బస్ ఎక్కి కూచున్నాను. నా పక్కన ఒకావిడ వచ్చి కూచుంది. ఆవిడ కూడా మెహదీపట్నం వెళ్ళాలి. ఉన్నట్టుండి లేచి వెనక సీటులో కూచుంది. మళ్ళీ ఇంకో ఆవిడ కూడా వచ్చి అలాగే పక్క సీటుకి వెళ్ళిపోయింది. ఇంకొక ఆవిడ మాత్రం పక్కన కూచుని, మీ దగ్గర ఏదో కెమికల్స్ వాసన వస్తోంది. మీరు ఎక్కడ పనిచేస్తారు అని అడిగింది. చెప్పాను. నేను చెప్పిన ప్రోసెస్ ఆవిడకి అర్థం కాలేదు. కాకపోతే ఏదో కెమికల్ తో వర్క్ చేశానని అర్థం చేసుకుని ఊరుకుంది.

అప్పుడు నా మైండ్ కి అర్థం అయ్యింది. ఇందాకటి నుంచి అందరూ పక్కనుంచి ఎందుకు లేచిపోతున్నారో... అబ్బా అనుకుని అప్పటి నుంచి డెవలప్ చెయ్యాలంటే వేరే డ్రస్ పెట్టుకునేవాళ్ళం.

ఇక ఒక పుస్తకం తయారు కావాలంటే ఎంత కష్టం వుండేదో....,
ఇవన్నీ చేయించుకోవడానికి ఎవరు వచ్చేవారు?
ఎంతమందితో పరిచయాలు అయ్యాయి?
ఎన్ని పాఠాలు నేర్చుకున్నామన్నది తర్వాత భాగంలో.

6 కామెంట్‌లు:

 1. మీ వివరణ చదువుతుంటేనే నీరసం వచ్చింది 😳. ఇంతకీ పేపర్ మీద ప్రింట్ ఎప్పుడు వస్తుంది?

  కెమికల్స్ వాడేముందు ఏప్రన్ కట్టుకుంటే సరిపోయేదేమో కదా? అయినా కూడా కెమికల్స్ వాసన దుస్తులకు పట్టేస్తుందంటారా?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అసలు సంగతి వర్క్ మాకు కొత్త. రెండో విషయం అప్పట్లో ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం ఏప్రన్ అనే మాటే తెలియదు. నేను ఆ వివరాలన్నీ ఎవరికీ తెలియవని రాసుకుంటూ వెళ్ళిపోయాను సర్. మేము తీసిన బ్రోమైడ్ ని డార్క్ రూం లో డెవలప్ చేసేటప్పుడు ట్రేలలోంచి కెమికల్ మీద పడకుండా చెయ్యడం మాకు చేతకాలేదు. బాగా చిందుతూ వుండేది. చాలా వాసన వుండేది. మెల్లిగా నీట్ చెయ్యడం నేర్చుకున్నాం. అదీ సంగతి సర్. ఆవిరాలన్నీ అలా రాయాలనిపించింది రాశాను. మీరు చదువుతున్నందుకు ధన్యవాదాలు.

   తొలగించు
  2. ఆరోజుల్లోనే ఒక్క ప్రింట్ కమాండ్ ఇస్తే దడదడా ప్రింటౌట్లు రావడం చూసున్నాం. కానీ మరి ఆనాటి మీ ఆఫీసులో ప్రింట్ తియ్యడానికి ఫొటో స్టూడియోలో చేసేటట్లున్న పద్ధతి లాంటి తతంగం గురించి మీరు వ్రాసినది చదివి అలా అన్నానన్నమాట ఇంతకు ముందు నా కామెంట్లో 🙂. నాకు తెలియదు గానీ దీన్నే ఆఫ్-సెట్ ప్రింటింగ్ అని గానీ అంటారా?

   // “ ఆవిరాలన్నీ అలా రాయాలనిపించింది రాశాను.” // ……
   వ్రాయండి, వ్రాయండి, తప్పకుండా వ్రాయండి. మాలాంటి వారికి ఆసక్తికరంగా ఉండడంతో బాటు మీ అనుభవాలను ఒకచోట వ్రాసుంచుకోవడానికి మీ బ్లాగు సరైన చోటు. 👍

   తొలగించు
  3. మీరు చెప్పిన ప్రింటర్స్ అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న టెక్నాలజీ ప్రగతిలోనూ... హైదరాబాద్ సెక్యూరిటీ అండ్ ఆఫ్ సెట్ ప్రింటర్స్ (అంటే మేము చేసిన ఆఫీసు)లోనూ, ఇంటర్నేషనల్ ప్రింటర్స్ బరకత్ పూరాలోను వుండేది సర్. మెల్లిమెల్లిగా రాఘవరావు అన్నాయన ఇంటర్నేషనల్ ప్రింటర్స్ అని పెట్టి ఆపిల్ కంప్యూర్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అప్పుడు మీరు చెప్పిన దడదడ ప్రింట్స్ వచ్చే ప్రింటర్స్ వచ్చాయి అందరూ సుఖపడేలా... మేము మొదలు పెట్టినప్పుడు తెలుగు చెయ్యడం వచ్చినవాళ్ళం సిటీలో నలుగురం మాత్రమే వుండేవాళ్ళం. మేమే కొంచెం కష్టపడ్డాం. ఇంకా నేను చెప్పాల్సింది చాలా వుంది సర్.

   తొలగించు
  4. మీరు పెట్టినప్పుడల్లా చదువుతున్నందుకు ధన్యవాదాలు సర్

   తొలగించు
 2. మీ ప్రయాణం చాలా బాగుంది . చాల రోజూ నుండి చదువుతున్నాను , ఇప్పుడు కామెంట్ పెడుతున్నాను.

  రిప్లయితొలగించు